అంతరంగ తరంగాల్లో భిన్నకోణాలు

సాహిత్యం హోమ్

     పత్రికా రచయితలు రోజువారీ సంఘటనల గురించి వార్తలు, విశ్లేషణలు రాయడం సర్వసాధారణం. వర్తమాన ఘటనలపై వ్యాఖ్యానాలు, విశ్లేషణలు చేయడం, సంపాదకీయాలు రాయడం సామాన్యమైన అంశం. దీనికి భిన్నంగా సంఘటనలతో, సంచలనాలతో నిమిత్తం లేకుండా జీవితంలోని అనుభవాలను, అనుభూతులను గురించి రాయడం సృజనాత్మక ప్రతిభకు తార్కాణం.

     మామూలు మనుషులకు సాదాసీదాగా అనిపించే అంశాల గురించి ఆసక్తికరంగా రాయడం సునిశిత దృష్టి, సృజనాత్మక యోచనలు వున్న వారికే సాధ్యం. ఇలాంటి దృష్టి, ఆలోచన ఉన్నవారు కనుకనే కటుకోజ్వల ఆనందాచారి.. సామాన్యమైన విషయాలను తీసుకొని అసాధారణ రీతిన రాశారు. ‘సోపతి’ ఆదివారం సంచిక, అంతరంగ తరంగాలలో వారం వారం వారు రాసిన చిరు వ్యాసాల సమాహారం ‘మాటలో మనసునై’.

     కవిగా, కథకునిగా, వ్యాస రచయితగా ప్రసిద్ధులయిన ఆనందాచారి వచన రచనల్లోని వైవిధ్యాన్ని ప్రతిఫలించే వ్యాస పరంపర ఇది. వారంలో జరిగిన సంఘటనలతో సంబంధం లేకుండా ఏదైనా ప్రత్యేక అంశాన్ని ఆకట్టుకునేలా రాయడం ఈ కాలమ్ ప్రత్యేకత. ముఖ్యంగా అంశాన్ని ఎంచుకోవడం, దానిని క్లుప్తంగా, చదివించేలా రాయడం ప్రధానం. ఇది ఒక సాధన, సృజనాత్మక విన్యాసం. ముఖ్యంగా ఒక వారం చదివినవారు మరో వారం ఆ కాలమ్ చదవాలని అనుకునేలా రాయాలి. అపుడే ఆ రచయిత కృషికి సాఫల్యం.

     ఇలాంటి సందర్భాల్లోనే పత్రికా రచయిత సామర్థ్యం బయట పడుతుందంటారు ప్రముఖ జర్నలిస్టు జి. కృష్ణ. ఆయన కొన్ని దశాబ్దాల కిందట ఆంధ్రప్రభ దినపత్రికలో ‘అవీ… ఇవీ’ అనే కాలమ్ నిర్వహించారు. రిపోర్టర్లయితే ఆ వారంలోని రాజకీయ సంఘటనల మీద రౌండప్ రాస్తారు. కానీ రాజకీయాలతో సంబంధం లేకుండా సామాజిక జీవితంలోని, మానవ ప్రవర్తనలోని వైవిధ్య రీతులను తీసుకొని రాస్తూ జి. కృష్ణ ఈ కాలమ్ రాశారు. ఆ రోజుల్లో ఆదివారం వచ్చిందంటే ఆ కాలమ్ ను ఆసక్తిగా చదివేవారు. ఆ విధంగా ఆయనకు ఒక ప్రత్యేక పాఠక వర్గం ఏర్పడింది. సీనియర్ రిపోర్టర్, సంపాదకునిగా ప్రసిద్ధి చెందిన జి.కృష్ణకు తను రాసిన ‘అవీ… ఇవీ’ కాలమ్ కు వచ్చిన అనూహ్య స్పందన గురించి జర్నలిస్టు విద్యార్థులతో పంచుకున్నారు ఓ సందర్భంలో.

     వార్తలతో, సంఘటనలతో సంబంధం లేకుండా రోజువారీ జీవితంలోని, తమ చుట్టూ ఉన్న మనుషుల స్వభావాల్లోని సామాన్య అంశాల్ని తీసుకొని రాయడం ఒక కళ అని చెప్పేవారు. గంభీరమైన శైలిలో కాకుండా పక్కనున్న మనిషితో మాట్లాడుతున్నట్టు రాయడం అలవరుచుకోవాలని జర్నలిస్టు విద్యార్థులకు బోధించేవారు జి.కృష్ణ.

     ఇపుడు ఆనందాచారి రాసిన కాలమ్ చదువుతుంటే జి.కృష్ణ చెప్పిన మాటలే స్ఫురించాయి. నాన్న, వాన, తోబుట్టువు, స్నేహం, కన్నీళ్ళు, నెమరు, తలపోత వంటి శీర్షికలతో తన ఆలోచన పరంపరను అందంగా వ్యక్తం చేశారు ఆనందాచారి. వాన శీర్షికన రాసిన వ్యాసం పిల్లల్ని సైతం ఆకట్టుకుంటుంది. ఈ చిన్న టాపిక్ మీద వానా వానా వల్లప్ప,రెయిన్ రెయిన్ గో అవే వంటి పాటల నేపథ్యాన్ని, మూలాల్ని ప్రస్తావించారు. వాన మనకు ఒక ఉత్సవం. వానని ఆహ్వానిస్తూ మన వాళ్ళు పాటలు రాశారు. నిరంతరం వానలు కురుస్తుండటం వల్ల వానలని వెళ్ళిపొమ్మని పాశ్చాత్య దేశాల పిల్లలు చదువుకుంటారు. పాడుతుంటారు. భౌగోళికంగా భిన్నమైన వాతావరణాల నేపథ్యం కారణంగా ‘వాన’ని స్వీకరించే దృష్టికోణాలు వేరుగా ఉంటాయి. ఇదే అంశాన్ని తీసుకొని కొన్నేళ్ళ కిందట గోవర్థనం కిరణ్ కుమార్ చక్కటి కథ రాశారు. ఇప్పుడు ‘వాన’ శీర్షికన ఆనందాచారి రాసిన కాలమ్ అనేకానేక అంశాల్ని చర్చించింది.

     వానాకాలంలో కాగితంతో పడవలు చేసి ఆడే ఆటల్ని గుర్తు చేశారు. వాన తుఫాన్లుగా మారితే వరదలు వెల్లువెత్తితే వాటిల్లే పర్యావరణ ఉపద్రవాల్ని ప్రస్తావించారు. ఈవిధంగా ‘వాన’కు ఉన్న విభిన్నపార్శ్వాల్ని సాక్షాత్కరింపజేశారు. ఇన్ని విషయాల్ని చిన్న వ్యాసంలో, ఓ నాలుగు పేరాల్లో చెప్పడమే విశేషం. ఏదయినా నిర్దేశించుకున్న పరిధిలోనే వారం వారం రాయడం గమనార్హం.

     సమాజంలో కొన్ని అంశాలు పాతుకుపోయి వుంటాయి. వాటిని మరో కోణంలో వివరించి ఆలోచింపజేయడం ఆనందాచారి వచనరచనలోని మేలిమి సుగుణం. ఉదాహరణకు ‘గెలుపు’ అనే భావన గురించి ఆలోచనాత్మకమైన రీతిన అందంగా రాశారు. గెలుపును విజయానికి కొలమానంగా భావిస్తారు చాలామంది. ఎలాగైనా గెలిచి తీరాలన్నట్టు మాట్లాడుతారు. ముఖ్యంగా ఎన్నికలలో గెలుపు కోసం విలువల్ని పణంగా పెడతారు. అధికారం కోసం అడ్డదారుల్లో గెలిచే వారి ధూర్తత్వాన్ని రచయిత ప్రశ్నిస్తారు. 

     బెదిరింపులతో, ప్రలోభాలతో గెలవటమనేది నిలువెత్తు ఓటమిలా కనబడుతుందంటారు. ఎన్నికలలోనే కాదు, ఆటల్లో మ్యాచ్ ఫిక్సింగ్ ద్వారా గెలుస్తారు కొందరు. పక్కవాడిని అసలు పోటీలోకి రాకుండా చేసి గెలిచే ప్రబుద్ధులు ఎందరో! కనుకనే ఇలాంటి ‘గెలుపు’ ఓటమితో సమానమని చెబుతారు ఆనందాచారి. ఈవిధంగా ‘గెలుపు’ భావన చుట్టూ అల్లుకొని వున్న భ్రమల్ని చెదరగొడతారు.

     పరీక్షలంటే పిల్లలకే కాదు పెద్దలకు సైతం భయం. ‘పరీక్ష’ శీర్షికన పరీక్షలకు సంబంధించిన బహుముఖ కోణాల్ని రూపు గట్టించారు. విద్యావిధానంలోని లోపాల్ని ఎత్తి చూపారు, విద్యా వ్యాపారీకరణ వలన పరీక్షలు సైతం వాణిజ్యమయం కావడం వెనుక గల దుర్మార్గాన్ని ప్రశ్నించారు. విద్యార్థులను ఒత్తిడికి లోను చేసే పరీక్షా వ్యవస్థను చక్కదిద్దాల్సిన అవసరం ఏమిటో ఈ కాలమ్ చదివితే బోధపడుతుంది. విద్యార్థిగా పరీక్షలలో గెలిచినప్పటికీ జీవితం పెట్టే పరీక్షల ముందు చతికిలపడేవారు ఎందరో. అసలుసిసలు పరీక్షలు విద్యార్థి దశ ముగిసాకనే ఎదురవుతాయి. వాటి గురించి కూడా యోచించాలి. అంతేగాక విద్యార్థులు రాసే పరీక్షలు సృజనాత్మకంగా ఉండేలా చూడాలని నొక్కి చెబుతారు. పరీక్షలు జ్ఞాపకశక్తికి పరీక్షగా కాకుండా అవగాహన శక్తిని తెలుసుకొనేలా ఉండాలన్న మాట శిరోధార్యం.

     ఒక కాలమ్… దైనందిన జీవితంలో మనం ఉపయోగించే సైకిలు గురించి రాసిన విధానం ఆకర్షణీయం. ప్రయాణాలకు ఉపయోగపడే సులభమైన వాహనం సైకిలు. ఎక్కువ ఖర్చుండదు. ఎంత దూరమైనా ప్రయాణించవచ్చు. పెట్రోల్, డీజిల్ అక్కర్లేదు. పర్యావరణాన్ని కాలుష్యం చేయదు. రిపేర్లకు పెద్దగా ఖర్చుండదు… సైకిలు తరువాత స్కూటర్లు, మోటారు సైకిళ్ళు, రేసింగ్ బైకులు ఎన్ని వచ్చినా అవన్నీ సైకిలు ముందు బలాదూర్. చరిత్ర క్రమంలో సైకిల్ నిర్వహించిన గొప్ప పాత్రను సోదాహరణంగా వివరించడం ఆకట్టుకుంటుంది. సైకిల్ అనే అంశాన్ని తీసుకొని ఇన్ని విషయాలు చెప్పవచ్చా అని పాఠకులు విస్మయం చెందుతారు. ఈ విధంగా పాఠకుల్ని ఆశ్చర్యానికి లోను చేయడం ఆనందాచారి వచన రచన సాధించిన విజయం.

     ఈ పుస్తకంలో ఇలాంటి చిన్న చిన్న శీర్షికలు అరవై వున్నాయి. ఏదయినా ‘సోపతి’లో పేజీకి మించకుండా ఉండటం విశేషం. ఒక్కొక్క అంశం మీద నాలుగు అయిదు పేజీలయినా రాయవచ్చు. కానీ నిర్దేశించుకున్న కాలమ్ పరిధిలోనే ఏదయినా చెప్పాలి. ఎన్ని ఉదాహరణలు ఇచ్చినా, ఎంత సమాచారం అందించినా, కోటబుల్ కోట్స్ వంటి మాటలు ఎన్ని ఇమిడ్చినా పరిమితి దాటకూడదు. ఈ విధంగా వారం వారం రాయడం రచయితకు పరీక్ష. ఈ పరీక్షలో విజయవంతమయ్యారు ఆనందాచారి.

     క్లుప్తత, సంక్షిప్తత పాటిస్తూ ఎన్నో అంశాల మీద రాసిన చిరు సంపాదకీయాలు ఇవి. చిన్న చిన్న వాక్యాలతో చక్కగా రచించారు. వారం వారం కొత్త అంశాల్ని తీసుకుంటూ తన దృక్పథాన్ని, సైద్ధాంతిక దృష్టిని పైకి కనిపించకుండా వాటిలో రంగరించి అందించడం సైతం చెప్పుకోదగిన కసరత్తు. వచన రచనలలో కౌశలం సాధించడానికి ఇలాంటి కసరత్తులు ఉపయోగపడతాయి. రచనా సంవిధానంలో సారళ్యం సాధించడానికి తోడ్పడతాయి. ఈ రకంగా ఈ కాలమ్ నిర్వహణ ఆనందాచారి రచనా ప్రావీణ్యం మెరుగుదలకు ఉపయోగపడింది. అదే సమయాన పాఠకులని ఆలోచింపజేసింది. భిన్నంగా ఆలోచించే దృష్టిని అలవరిచింది.

     అందువల్లనే పుస్తకంగా రూపు దాల్చి నాలుగు కాలాల పాటు నిలిచే శక్తివంతమైన రచనలు ఆనందాచారి అంతరంగ తరంగాలు. స్థిరపడిపోయిన ప్రమాణాలతో, కొలమానాలతో కాకుండా మరో కోణంలో ఆలోచించే వీలుందని స్ఫురణ కలిగించే ఈ వ్యాసాల సమాహారం పాఠకులకు ఎంతో ఉపయుక్తం.

-గుడిపాటి
94900 99327

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *