ఊరు భాషే నాకు శ్వాస-అన్నవరం దేవేందర్

సాహిత్యం హోమ్
రూపం సాధారణం, కవిత్వం అమోఘం కలిస్తే అన్నవరం దేవేందర్. సామాజిక సమస్యలనే తన చింతనగా, సమాజంలో బాధ్యతాయుత పౌరుడుగా, ప్రభుత్వ ఉద్యోగిగా, పాత్రికేయుడుగా బహుముఖీయతను కలిగిన వ్యక్తి. ఆ బహుముఖీయతనే తన రచనల్లో కూడా ప్రతిబింబింప చేసాడు. దేశానికి అన్నం పెట్టి, తాను మాత్రం ఉరితాళ్ళను ఎక్కిన రైతుల బాధలను, అట్టడుగు వర్గాల ప్రజల సమస్యలను, దొరల దౌర్జన్యాలను, దళిత బహుజనుల అస్తిత్వ విధానాలను, భూస్వాములపై విప్లవ నినాదాలను తన కలం గళంతో అక్షరీకరించాడు. తాను చిన్నప్పటి నుండి మమకారం పెంచుకున్న భాషలోనే కవిత్వాన్ని సమాజానికి దగ్గర చేసాడు. తన భాష స్వచ్ఛమైన తెలంగాణ భాష. వస్తువులోను, శిల్పంలోను వైవిధ్యం తన కవితల్లో కనిపిస్తుంది. నిత్యం సమాజంలోని సమస్యల పట్ల పరితపించే దేవేందర్ తోటి మనుషుల పట్ల ప్రేమ, ఆప్యాయతలకు ప్రతీకగా నిలుస్తాడు. నిరంతరం సృజనాత్మకత కొనసాగుతూనే ఉంటుందని, అది సమాజంలోని ప్రజల కోసం ఆరాటపడుతూనే ఉంటుందని చెప్పే అన్నవరం దేవేందర్ తో పరిశోధక విద్యార్థి మునుగూరి పురుషోత్తం ముఖాముఖి సృజన క్రాంతి పాఠకులకు ప్రత్యేకం.

 

మీ బాల్యం గురించి.
మాది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని పోతారం (ఎస్) అనే గ్రామం. మా నాన్న దశరథం. అమ్మ కేదారమ్మ. నాన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఒక తమ్ముడు. ఇద్దరు చెల్లెండ్లు. నా అక్షరాభ్యాసం పోతారంలనే ప్రారంభమైంది. మూడవ తరగతి వరకు పోతారంలనే చదివిన. ఆ తరువాత నాలుగు నుండి ఎనిమిదవ తరగతి వరకు అంతక్కపేట అనే గ్రామంలో చదువుకున్న. ఆ తరువాత మళ్ళీ నాన్న బదిలీ అయి మా పోతారం గ్రామానికి వచ్చిన తరువాత హుస్నాబాద్ ఉన్నత పాఠశాలలో తొమ్మిది నుండి పదవ తరగతి వరకు చదువుకున్న. నాన్న ఉపాధ్యాయుడు కావడం వల్ల తాను ఎక్కడికి బదిలీ అయితే మేము అందరం అక్కడనే నివసించేది. అంతక్కపేటలో, హుస్నాబాద్ లో చదవడం ఈ రెండు సందర్భాలు నా జీవితంపై కొంత ప్రభావాన్ని చూపించాయి. అప్పటివరకు నాకు తెలుగు భాషలో ఇన్ని మాండలికాలుంటాయని తెలువదు. ప్రామాణిక భాష గురించి, మాండలిక భాష గురించి అవగాహన లేదు. కానీ మా నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగి కావడం వల్ల ఆయన మాట్లాడే భాష ఒకలా ఉండేది ఇంట్లో మా నాయనమ్మ, తాత మాట్లాడే భాష మరొకలా ఉండేది. నాకు కొంత ఆశ్చర్యం అనిపించేది. కానీ నేను నాయనమ్మ కనకవ్వ మాట్లాడే భాష పైననే ఎక్కువ ఇష్టం చూపించేవాన్ని. మా నాయినమ్మ మాట్లాడే ఆకిలి, ఎవుసం, బడి లాంటి పదాలు నాలో తెలియని ఆసక్తిని పెంచాయి. అలాగే నా బాల్యం చదువంత పల్లెటూర్లలోనే జరగడం వల్ల ఆ పల్లెటూరు పదాలను బాగా మాట్లాడడం, రాయడం అలవాటై పోయింది.
ఆ క్రమంలో మా తాతతో కలిసి ప్రతిరోజు వాకిట్లో గడెంచలో పడుకునే వాడిని. అప్పుడు మా తాతయ్య నాకు శాత్రాలు చెప్పేది. కొన్ని కథలు కూడా చెప్పేది. బేతిరెడ్డి లాంటి మౌఖిక కథలు అని, రాజుల కథలని చెప్పేది. అవి నన్ను ఊహాలోకంలోకి తీసుకువెళ్ళేట్టుగా ఆసక్తికరంగా ఉండేవి ఆ కథలు, నేను, మా చెల్లెండ్లు, తమ్ముడు అందరం కలిసి వినేది. నాకు తెలియకుండానే భాష వైపు, అలాంటి కథల వైపు, అలాంటి ఊహల వైపు, సృజన వైపు నా మనసు ఆకర్షించబడినట్లు నాకు ఇప్పుడు అనిపిస్తుంది.

మీ పాఠశాలలో లేదా కళాశాలలో మరచిపోలేని సంఘటనలు ఉన్నాయా
నా పదవ తరగతి పూర్తి అయినంక వరంగల్లో సాంకేతిక విద్యా సంస్థలో చేరిన. తరువాత, హుజురాబాద్ లో ఇంటర్ పూర్తి చేసిన. అనంతరం హైదరాబాద్ BHEL లో అప్రెంటిస్ పూర్తి చేసిన. మధురై కామరాజ్ యూనివర్సిటీలో దూరవిద్య ద్వారా ఎమ్.ఏ. సోషియాలజీ చేసిన. ఈ క్రమంలోనే నాకు పుస్తకాలు చదవడం, దినపత్రికలు చదవడం అలవాటుగా మారింది. పాఠశాలలో చదువుతున్నపుడు మరచిపోలేని సంఘటన అంటే, నేను హుస్నాబాద్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నపుడు ‘చంద్రిక’ అనే పేరుతో ఒక పాఠశాల వార్షిక సంచిక వచ్చేది. కథలను, కవితలను మా సార్లు ఆహ్వానించేటోళ్ళు. అపుడు ఒక గల్పిక రాసి ఇచ్చిన. అపుడే మొదటిసారి నా పేరు ఆ ‘చంద్రిక సంచిక’లో అచ్చయింది. పాఠశాలలో చదువుతున్నపుడు అది నాకు ఆనందం కలిగించింది.

సాహిత్యం వైపు ఏ విధంగా వచ్చారు
నా విద్యాభ్యాసం పూర్తయిన నుండే నాకు దినపత్రికలు, వారపత్రికలు, సాహిత్యం పుస్తకాలు చదవడం అలవాటుగా మారింది. కళాశాల విద్య నుండి ఉద్యోగం చేస్తున్న క్రమంలో ఎక్కువగా సాహితీ పత్రికలు చదివే వాడిని. స్వాతి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, చతుర, విపుల, ఎన్ కౌంటర్, కమెండో లాంటి పత్రికల్లో వచ్చే కవితలు, కథలు, వ్యాసాలు చాలా ఇష్టంతో చదివేవాడిని. హైద్రాబాద్ లో ఉద్యోగం చేస్తున్న క్రమంలో విరసం, ఇతర ప్రగతిశీల, సాహిత్య, రాజకీయ సమావేశాలకు ప్రేక్షకునిగా హాజరయ్యే వాడిని. అటువంటి సమావేశాలకు వెళ్ళడం అంటే అక్కడి ఉపన్యాసాలు వినడం ఒక అధ్యయనమే. ఆ సమావేశాల్లో అమ్మే పుస్తకాలను తీసుకొచ్చుకొని చదవడం వలన సమాజంలో జరిగే సంఘటనల పట్ల నాకు ఆసక్తి ఏర్పడింది. ఎక్కువగా శ్రీశ్రీ, చెరబండరాజు, శివసాగర్, సినారె, శివారెడ్డి పుస్తకాలు చదివేది. నేను పాఠశాలలో చదువుతున్నపుడు ఎండాకాలం సెలవులిచ్చారు. ఆ పాఠశాల చివరి రోజు పి.నారాయణరెడ్డి అనే మా సారు, ఎండకాలం సెలవులలో మీరు ఏం చేస్తారని అడిగి, తనే గుఱ్ఱం జాషువ ‘గబ్బిలం’ పుస్తకం, శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ పుస్తకం చదవండని మాకు సలహా ఇచ్చాడు. అలా చెప్పగానే నేను ఆ రెండు పుస్తకాలు తీసుకువచ్చుకొని ఎండాకాలం సెలవులలో చదివిన. ముఖ్యంగా శ్రీశ్రీ మహాప్రస్థానంలోని ఆ ధ్వని, ఆలంకారికత, ప్రాస, విప్లవ ధోరణి నన్ను ఆకర్షించాయి. ఈ ప్రేరణనే నన్ను హైద్రాబాద్ లో సాహితీ సమావేశాలకు వెళ్ళడానికి, పుస్తకాలు చదవడానికి స్ఫూర్తినిచ్చింది. కవిత్వం అంటే ఇంత బాగుంటుందా అనే ఒక ఆకర్షణ కూడా ఆ పుస్తకం వల్ల కలిగింది. ఆ మహాప్రస్థాన దృక్పథమే మిగతా సాహిత్య పుస్తకాలను చదివేలా చేసింది.

జర్నలిస్ట్గా మరియు ఉద్యోగిగా మీ జీవిత విశేషాలు వివరిస్తారా?
హైదరాబాద్ లో అప్రెంటిస్ షిప్ తర్వాత ఉద్యోగం పర్మనెంట్ కాలేదు. నాకు కొంత ఇబ్బందికరంగా అనిపించింది. ఆ 1984లోనే రాజేశ్వరితో వివాహం కాగానే, నేను పోతారంకు తిరిగి వచ్చాను. ఆ క్రమంలోనే ‘జీవగడ్డ’ అనే దినపత్రికలో ‘విలేకరులు కావలెను’ అనే ప్రకటన చూసి, ఆ పత్రికలో హుస్నాబాద్ విలేకరిగా చేరాను. జీవగడ్డలో పాత్రికేయ జీవితం ప్రారంభంలో కె.యన్.చారి న్యూస్ ఎడిటర్గా ఉండేవారు. అతను నాకు తరచూ కవిత్వ పుస్తకాలు ఇచ్చేది. డెస్క్ లో అల్లం నారాయణ కూడా అందులో పని చేసేది. వారి స్నేహ సాంగత్యం వల్ల కూడా నాకు సాహిత్యం పట్ల జర్నలిజం పట్ల ఎక్కువ అవగాహన కలగడానికి తోడ్పడింది. జీవగడ్డ సంపాదకులు బి.విజయ్ కుమార్ గారు అంతకుముందు ‘విద్యుల్లత’ అనే సాహిత్య పత్రిక నడిపేవారు. వీరందరి ప్రభావం వల్ల కూడా నాకు సాహిత్యంపై మక్కువ మరింత పెరిగింది.
హుస్నాబాద్ లో జర్నలిస్ట్ గా చేస్తూనే 1986లో స్వాతి బుక్ స్టాల్ పేరుతో ఒక పుస్తకాల దుకాణాన్ని హుస్నాబాద్ లో పెట్టిన. అక్కడ ‘నలుపు’ అనే పత్రికకు ఏజెంట్ గా కూడా కొనసాగిన. దళిత, బహుజన అస్తిత్వానికి సంబంధించిన విషయాలు మొదటగా వెలుగు చూసింది ఈ నలుపు పత్రిక ద్వారానే. ఆ తరువాత కొంతకాలానికి నేను 1994లో పంచాయితీరాజ్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన. ప్రభుత్వ ఉద్యోగంలో 2020లో ఉద్యోగ విరమణ పొందేవరకు కవిత్వం చదవడం, రాయడం, పుస్తకాలు వేయడం నిరంతరం సాగింది.

మీ మొదటి రచన ఎప్పుడు చేశారు? దాని ప్రచురణ ఎప్పుడు జరిగింది? దాని నేపథ్యం ఏమిటి?
నేను ‘జీవగడ్డ’ పత్రికలో ఉన్నప్పుడే మొదటి రచన చేసిన. అంతకుముందే కవితలు రాయడం, వ్యాసాలు రాయడం చేసిన కానీ అవి ప్రచురితం కాలేదు. తరువాత రాసిన కవితలన్ని కలుపుకొని ‘తొవ్వ’ పేరుతో నా మొదటి కవితా సంపుటిని ఆవిష్కరించడం జరిగింది. అసలయితే నా మొదటి కవిత ‘రగులుతున్న అక్షరాలు’. ఇది 1990లో రాసిన. జీవగడ్డ పత్రికలో కూడా అచ్చయింది. అలాగే ‘నాగేటి సాల్లల్లో కన్నీరు’, ‘నా తెలంగాణ పల్లె’ అనే కవితలు వరుసగా రాయడం జరిగింది.
తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని అసువులు బాసిన మేర మల్లేశం అనే పోరాట వీరుని పాటలు సేకరించి నా సంపాదకత్వంలో 1997లో పుస్తకంగా తీసుకువచ్చిన. 1998లో నేను రాసిన ‘నా తెలంగాణ పల్లె’ అనే కవితను, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారు తెలంగాణ పల్లెకు ఉదాహరణగా కొన్ని కవితా పంక్తులను ఎమ్.ఏ. తెలుగు విద్యార్థుల సౌలభ్యార్థం వారి పాఠ్య పుస్తకాలలో చేర్చారు. అలాగే నా ‘మంకమ్మతోట లేబర్ అడ్డా’ అనే కవితను కాకతీయ విశ్వవిద్యాలయం – వరంగల్లు వారు బి.ఏ. తెలుగు లిటరేచర్ పాఠ్యాంశాలలో చేర్చారు. ‘తొవ్వ’ కవితా సంపుటి 2001లో ప్రచురించినం. అసలు ఈ కవితా సంపుటిని ప్రచురించడానికి దారి తీసిన పరిస్థితుల గురించి ఒకసారి చెప్తాను. 1992 ప్రాంతంలో నాకు బి.యస్. రాములు గారితో పరిచయం ఏర్పడింది. ఆయన తెలుగు నేల మీద దళిత బహుజన తాత్వికతను విస్తరించిన నలుగురైదుగురుల్లో ఒకరు. ‘దళిత రచయితల మేధావుల కళాకారుల ఐక్య వేదిక’ అనే సంస్థ వ్యవస్థాపకులు వారు. ఈ సందర్భాల ఫలితంగా నేను కూడా అప్పుడప్పుడు రాసుకున్న కవితలన్నీ పుస్తకంగా ముద్రించుకోవాలి, అనే ఆలోచన కలిగి పుస్తకంగా ‘తొవ్వ’ను ముద్రించడం జరిగింది. తెలంగాణ ప్రజల సమస్యలను తెలంగాణ మాండలికంలోనే కవిత్వంగా చెప్పడం వలన ‘తొవ్వ’ కవితా సంపుటి 2001లో ఒక సంచలనమే రేపిందనవచ్చు. ‘తొవ్వ’ చిన్న పుస్తకమైనా.. సమీక్షలు ఆనాటి పత్రికల్లో బాగా వచ్చాయి. అప్పట్లోనే ‘ఇండియా టుడే’ లాంటి పత్రికలలో వ్యాసం ప్రచురితం అయిందంటే దానిని ప్రజలు ఏవిధంగా ఆదరించారో అర్థమవుతుంది.

మీ కవిత్వ దృక్పథం ఏమిటి?
సామాజిక చింతన, సామాజిక ఆలోచన, మానవత్వపు విలువలు, అన్యాయాన్ని సహించని తనం, వివక్షను సహించని తనం, అగ్రకుల అహంకారాన్ని వ్యతిరేకించడం మొదలైన ప్రగతిశీల దృక్పథం నేపథ్యంగా తీసుకొని నా కవిత్వంలో చూపించిన. సమాజంలోని వ్యక్తులకు ఎక్కడ అన్యాయం జరిగినా, ఏ సమస్యలు వచ్చినా ఆ సమస్యల పట్ల స్పందన నా కవిత్వంలో చూడవచ్చు. తెలంగాణను అహంకార పూరితంగా పరిపాలించి, ప్రజలను బానిసలుగా చేసి, దోపిడీ విధానానికి పాల్పడిన పాలకుల పట్ల తీవ్ర వ్యతిరేకత నా కవితల్లో కనిపిస్తుంది. స్త్రీ, పురుష సమానత్వం కోసం ఆరాటపడిన విధానాన్ని కూడా గమనించవచ్చు. దళిత బహుజనుల పట్ల అగ్రవర్ణాల వారు చూపించిన వివక్ష పట్ల నా నిరసననీ వ్యక్తపరిచిన. నేపథ్యం అంతా విప్లవ బహుజన ధోరణితోనే ఉంటుంది. అంతిమంగా నా కవిత్వం మానవత్వమే.

మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన సాహితీవేత్తలు మరియు పుస్తకాల గురించి చెప్పండి?
ఇంతకుముందే చెప్పినట్టుగా మొదటగా నేను పుస్తకాలతోనే ప్రభావితున్నైన. అవి కూడా విప్లవ రచనలే. అందులో శ్రీశ్రీ మహాప్రస్థానం ప్రధానమైనది. ఆ తరువాత చెరబండ రాజు, శివసాగర్ మొదలైన వారి పుస్తకాలు నన్ను ఎక్కువగా ప్రభావితం చేసినై. ఆ తరువాత ఈ నేల మీద సాగుతున్న ఉద్యమాలు, అస్తిత్వ పోరాటాలు, త్యాగాలు, అన్యాయాలు, రాజ్యహింసలు, రక్తపాతాలు నన్ను కవిత్వం వైపు మలచడానికి ఎక్కువగా దోహదం చేసాయి. ఆ 1985-1995 ప్రాంతంలో నందిని సిధారెడ్డి, శివారెడ్డి, సి.నారాయణ రెడ్డి, ఎన్.గోపీ, జూకంటి, కొండేపూడి నిర్మల, బి.నర్సింగరావు, విమల, హెచ్చార్కే, శివకుమార్, ఎండ్లూరి సుధాకర్, శిఖామణి, దేవీప్రియ, దర్భశయనం శ్రీనివాసాచార్య, పాపినేని శివశంకర్, ఆశారాజు లాంటి ప్రముఖుల కవిత్వ పుస్తకాలనన్నింటిని చదువుతుంటిని. వీటితో పాటు కథలు, కవిత్వం, విమర్శ, నవలలు నాకు స్ఫూర్తినిచ్చాయి. అనంతరం గుడిపాటి వెంకటేశ్వర్లు గారి ప్రోత్సాహం, నలిమెల భాస్కర్ గారి లాంటి పెద్దల సహచర్యం నా కవిత్వ కార్యాచరణకు దోహద పడుతున్నాయి.

మీ ఆధ్వర్యంలో లేదా మీరు వ్యవస్థాపకులుగా ఏవైనా సాహితీ సంస్థలను ఏర్పాటు చేయడం జరిగిందా?
1986లో నేను, రిక్కల సహదేవ రెడ్డి, కోహెడ కొమురయ్య, అప్సర్ శంషుద్దీన్ మరికొందరం కలిసి హుస్నాబాద్ లో ‘నూతన సాహితీ’ అనే ఒక సాహితీ సంస్థను ఏర్పాటు చేసినం. ఆ తరువాత కరీంనగర్ జిల్లా సాహితీ సంస్థల సమాఖ్యగా పేరుపొందిన ‘సాహితీ గౌతమి’ అనే సంస్థకు మొట్టమొదటి వ్యవస్థాపక ఉపాధ్యక్షునిగా పని చేసిన. అలాగే ‘తెలంగాణ రచయితల వేదిక’ సంస్థకు కూడా మొట్టమొదటి వ్యవస్థాపక ఉపాధ్యకక్షునిగా కొనసాగిన. 2010లో ‘సాహితీ సోపతి’ అనే సంస్థను నేను, నలిమెల భాస్కర్ సార్, నగునూరి శేఖర్, ఎమ్. నారాయణ శర్మ, గాజోజు నాగభూషణం, బూర్ల వేంకటేశ్వర్లు కలిసి స్థాపించినం. ఈ సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ కరీంనగర్ కవిత్వం ‘వల్లుబండ’ అనే పుస్తకాన్ని మొట్టమొదటగా నా సంపాదకత్వంలో తీసుకచ్చిన. స్థానికంగా ఏవైన సాహిత్య సమావేశాలు జరపడానికోసం, పుస్తకావిష్కరణలు జరపడం కోసం ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రచయితల పుస్తకాలను ఎక్కువగా ఈ సంస్థ ఆధ్వర్యంలోనే ముద్రించడం జరిగింది. అలాగే కరీంనగర్ లో మేమందరం కలిసి ‘తెలంగాణ రచయితల వేదిక’ ఆధ్వర్యంలో కొత్త కవులను, సాహిత్యంలో అడుగుపెట్టి మధ్యలో ఆగిపోయిన వారిని ప్రోత్సహించడం కోసం 2013లో ‘ఎన్నీల ముచ్చట్లు’ అనే పేరుతో ప్రతి పౌర్ణమి నాడు కవుల సమావేశాలను ఒక కవి ఇంటి డాబాపైన నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా వచ్చే పుస్తకాలను కూడా ‘సాహితీ సోపతి’ ఆధ్వర్యంలో ముద్రిస్తున్నాం.

తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏమిటి?
ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో భాగంగానే తెలంగాణ రచయితల వేదిక ఆరంభమైంది. ఈ సంస్థకు సంబంధించిన సన్నాహక సమావేశం కరీంనగర్ లో జరిగినపుడు నేను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. తెలంగాణ రచయితల వేదిక జరిపిన అన్ని జిల్లాల్లో సభలు, సమావేశాల్లో పాల్గొన్నాను, ప్రసంగించాను. కరీంనగర్ ప్రాంతంలోనే కాకుండా వివిధ జిల్లాలలో జరిగే ర్యాలీలలో, సభలలో పాల్గొన్న. వరంగల్లు, నిజామాబాదు, హైద్రాబాదు ఇలా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి నిరసనలలో ధర్నాలలో కూడా పాల్గొన్న. సకల జనుల సమ్మెలో పాల్గొనడం కూడా ఒక ఆనందాన్నిచ్చింది. కరీంనగర్ లోని కవులందరం కలిసి సమైక్య ఆంధ్రకు వ్యతిరేకంగా ‘కరీంనగర్ కవుల కవాతు’ పేరుతో ర్యాలీని తీసినం. తెలంగాణ ఉద్యమానికోసం ప్రధానంగా జరిగిన అన్ని సమావేశాలలో, నిరసనలలో పాల్గొన్న. ఉద్యమ నేపథ్యంగా తెలంగాణలోని ప్రముఖ ఉత్తమ కవితలను కలిపి యస్.ఆర్.శ్యాం హిందీలోకి అనువాదం చేసిండు. ఆ అనువాద కవితలనన్నింటిని కలిపి నేను, నలిమెల భాస్కర్, మచ్చ ప్రభాకర్ సంపాదకత్వంలో ‘ఉడాన్’ అనే పేరుతో 2013లో పుస్తకంగా తీసుకువచ్చినం. తెలంగాణ ఉద్యమ నేపథ్యంగా హిందీలోకి అనువాదమైన కవితలు దేశవ్యాప్తంగా ప్రచారం అయినయి. ఇది అఖిల భారత తెలంగాణ రచయితల వేదిక ప్రచురించింది.
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగిగా మా పంచాయితీరాజ్ మినిస్ట్రీరియల్ ఉద్యోగుల సంఘం పక్షాన జరిగిన తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ నుండి వేములవాడకు జరిపిన పాదయాత్రలో, నిరాహార దీక్షలో పాల్గొన్నాను. తెలంగాణ విద్యావంతుల వేదిక సభల్లోనూ పాల్గొన్నాను.

మీ రచనల్లో లేదా మీ కవితా సంపుటాల్లో మీకు ప్రియమైన కవితా సంపుటి ఏది?
నా కవిత్వం అంతా ఇష్టమై రాసుకున్నదే, కావున అన్ని ఇష్టమైనవే కాని, ప్రియమైనది ఏది అని అడుగుతున్నందున ‘మంకమ్మతోట లేబర్ అడ్డా’ సంపుటిని చెప్పుకోవచ్చు. ఇందులో కరువు, వలసలు, తెలంగాణ ఉద్యమం, సంఘర్షణ, స్థానీయత అన్నీ చిత్రించిన కవిత్వం ఉంది. ఈ సంపుటికి రంగినేని ఎల్లమ్మ పురస్కారం, మారసం రుద్ర రవి పురస్కారాలు వచ్చాయి. మంకమ్మతోట లేబర్ అడ్డా కవితకు రంజని-కుందుర్తి పురస్కారం వచ్చింది.

మీరు పొందిన ప్రశంసలు, పురస్కారాల గురించి చెప్పండి
నా కవిత్వం సమాజ హితాన్ని ఆశించి రాసాను. అవార్డులు రావాలని, పేరు ప్రఖ్యాతులు రావాలని నేనెప్పుడు ఆశించలేదు.సమాజంలోని అన్యాయాలను, అక్రమాలను, దోపిడీని, బానిసత్వాన్ని చూడలేక నా కలం ఆవేశంతో పరుగులు తీసిందే కానీ, ఎవరు ఏమనుకుంటున్నారో అనే విషయాన్ని ప్రక్కకు పెట్టాను. సామాజిక చింతనతో, ప్రజల సమస్యలను ప్రజలకు దగ్గరగా ఉండే భాషలోనే రాయడం మూలంగా ప్రజలందరికీ నా కవిత్వం సులువుగా అర్థమవుతూ వచ్చింది. అందుకేనేమో నాకు ఇతర కవుల నుంచి గానీ మరే ఇతర వ్యక్తుల నుంచి గానీ కువిమర్శలు పొందలేదు. ఆంధ్రా ప్రాంతం పాలకులు తెలంగాణను అన్ని విధాలుగా మోసం చేయడం వలన వారి విధానాలను తప్పు పడుతూ ప్రశ్నించానే కానీ ఆ ప్రజలను నేను ఎక్కడా వ్యతిరేకించలేదు. విడిపోయి కలిసుందామనే భావాన్ని వ్యక్తపరిచాను. నేను సమాజం కోసం కవిత్వం రాస్తున్న. కొంతమంది వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని రాయడం లేదు. నేను సృజనకారున్ని. ఈ సృజనాత్మకత నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అవార్డులు ప్రోత్సాహాన్ని ఇస్తాయి కానీ క్రొత్త సృజననైతే సృష్టించలేవు కదా! నాకు ఇప్పటివరకు తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం, తెలంగాణ ఆవిర్భావ కరీంనగర్ జిల్లా పురస్కారం, తెలంగాణ సారస్వత పరిషత్ పురస్కారం, సినారె పురస్కారం, అలిశెట్టి ప్రభాకర్ పురస్కారం, మలయశ్రీ పురస్కారం, వానమామలై జగన్నాథాచార్యులు పురస్కారం, తత్వకవి ఉదారి నాగదాసు స్మారక సాహిత్య పురస్కారం, ఉమ్మడిశెట్టి సాహితీ ప్రతిభా పురస్కారం లాంటివెన్నో రావలసినవన్నీ వచ్చాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా ప్రతి సంవత్సరం విడుదల చేసే వివిధ వార్షిక సంచికల్లో ప్రకటించే ఉత్తమ కవితా సంకలనాల్లో నా కవిత కూడా దాదాపుగా ఉంటుంది. ఇప్పటికీ ఆ గౌరవం కొనసాగుతుంది. అంతకుమించిన సంతోషం ఇంకేం కావాలి.

మీ కవితల్లో తెలంగాణ నుడికారపు పదాలు, మాండలిక పదాలు ఎక్కువగా ఉండడానికి గల కారణాలు?
నాకు ఊహ తెలిసినప్పటి నుండి నా ఇంట్లో మాట్లాడే భాష, మా వాడలో, మా ఊరులో మాట్లాడే భాష, మా పొలాల్లో మాట్లాడే రైతుల భాష, వీరందరి భాష నా భాష. వీటన్నింటితో కలిసే నా జీవితం నడిచింది కాబట్టి అది నా భాష అనుకున్న. అందుకే అదే భాషలో కవిత్వం రాసిన. ఖచ్చితంగా పుస్తకాలలోని భాషనే రాయాలని నేను అనుకోలేదు. నా ఊరు భాషనే నేను ప్రామాణికం అనుకొని ఊరు భాషలోనే రాసిన. అది నాకు ప్రకృతి ప్రసాదించిన వరం. నేను కృత్రిమంగా సృష్టించుకున్నది కాదు. పండితుల భాషలోనే రాయాలని, రాయలేక పోతున్నాననే భయం కూడా నాకు ఎప్పుడూ కలగలేదు. నేను రాసిన కొన్ని పదాలు పతాకస్థాయిలో ప్రామాణికత కలిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. మొదటి నుంచి నా తెలంగాణ భాష ప్రజలలో కొనసాగుతూనే ఉంది. కానీ వేరే ప్రాంతం సావాసం వలన అది కొంత వెనకకు నెట్టివేయబడింది. అస్తిత్వ నినాదం మళ్ళీ నా భాషను తిరిగి సంపాదించుకుంది. ఇప్పుడు అదే అత్యంత గౌరవ మర్యాదను సంతరించుకుంటుంది.

ఈ తరం కొత్త రచయితలకు మీరిచ్చే సందేశం ఏమిటి?
మన భారతదేశం విభిన్న మతాలకు, కులాలకు, జాతులకు, సంస్కృతులకు, ఆలోచనలకు నిలయం. గొప్ప విలువలను, సమాదరణను కలిగి కొనసాగుతుంది మన దేశం. భారత దేశంలోని బహుళ సంస్కృతుల సాహిత్యం కొనసాగాలి. అందుకే సామాజిక అణచివేత, వివక్ష, పీడన, బానిసత్వం లేకుండా, అందరూ సమానత్వమనే దృక్పథంలో సాహిత్యం సృజించబడాలి. ఇది ప్రజాస్వామ్య రాజ్యం. ఆ కోణంలో సాహిత్యం అద్దంగా మెరుగుపడాలని నేను కోరుకుంటున్న. ఇందుకోసం కొత్త రచయితలు ప్రాచీన సాహిత్య గతాన్ని, ప్రస్తుతాన్ని అధ్యయనం చేయాలి. ఎన్నో మార్పులు, ఉద్యమాలు వచ్చాయి, వస్తున్నాయి. వాటన్నింటినీ తెలుసుకోవాలి. దోపిడీ పీడన లేకుండా అంతిమంగా మనిషే లక్ష్యంగా అధ్యయనం కొనసాగాలి.

-మునుగూరి పురుషోత్తం
( ”అన్నవరం దేవేందర్ కవిత్వం – సమగ్ర అధ్యయనం” అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిశోధన విద్యార్థి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *