పదేళ్ల నియంతృత్వ సంకెళ్లు తెంచాం

తెలంగాణ

ప్రజాపాలనోత్సవంలో సిఎం రేవంతరెడ్డి
అమరుల స్థూపం వద్ద నివాళి..
పరేడ్‌ గ్రౌండ్స్‌లో జెండా ఆవిష్కరణ

హైదరాబాద్‌ : గడిచిన పదేళ్లు నియంత పాలనలో తెలంగాణ మగ్గిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విమర్శించారు. తెలంగాణ అస్థిత్వం అంటే.. కుటుంబ పాలన కాదన్న రేవంత్‌ రెడ్డి, తెలంగాణలో పాలన బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. కాలు కదపకుండా ఇంట్లో సేదదీరడానికి తాను ఫాంహౌస్‌ సీఎంను కాదు.. పనిచేసే ముఖ్యమంత్రిని అని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఐక్యత, సమైక్యతను దెబ్బతీసేందుకు కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. లోతైన ఆలోచన చేసి సెప్టెంబర్‌ 17ను ప్రజాపాలన దినోత్సవంగా జరపాలని నిర్వహించామని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఇందులో రాజకీయం లేదని, ఇందులో రాజకీయ ప్రయోజన కోణంలో సెప్టెంబర్‌ 17ను చూడటం అవివేకమవుతుందని తెలిపారు. ఇక తన ఢిల్లీ పర్యటనపై విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. తన స్వార్థం కోసమో, వ్యక్తిగత పనుల కోసమో ఢిల్లీ వెళ్లడం లేదని తెలిపారు. తెలంగాణ హక్కుల సాధన కోసం ఎన్నిసార్లయినా ఢిల్లీ వెళ్తానని రేవంత్‌ ప్రకటించారు. ఢిల్లీ భారతదేశంలోనే ఉందని, మరో దేశంలో లేదన్నారు. కేంద్రం నుంచి రావలసిన ప్రతి పైసా తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంటానని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్‌లో నిర్వహించిన ప్రజాపాలనదిన వేడుకల్లో సీఎం రేవంత్‌ పాల్గొన్నారు. అక్షరవీరులు ఒకవైపు, సాయుధ యోధులు మరో వైపు సాగించిన పోరాటంలో 76 ఏళ్ల క్రితం హైదరాబాద్‌ రాజ్యం స్వేచ్ఛ పొందిందని సీఎం రేవంత్‌ గుర్తు చేసుకున్నారు. ఒక ప్రాంతానికో.. ఒక కులానికో, ఒక మతానికో వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదన్న సీఎం.. సెప్టెంబర్‌ 17 ను కొంతమంది వివాదాస్పదం చేస్తున్నారన్నారు. లేక్‌సిటీగా ఉన్న హైదరాబాద్‌ ప్లడ్‌ సిటీగా దిగజారడానికి గత పాలకుల నిర్లక్ష్యమే కారణమని సీఎం రేవంత్‌ ఆరోపించారు. కేరళలాంటి దుస్థితి హైదరాబాద్‌కు రాకుండా చూసేందుకు హైడ్రా ఏర్పాటు చేశామని ప్రకటించారు. హైడ్రా ఒక పవిత్ర కార్యమని, ఇందులో ఎటువంటి స్వార్థమూ లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ భవిష్యత్‌కు హైడ్రా గ్యారెంటీ ఇస్తుందని, ఇది తన భరోసా అని సీఎం రేవంత్‌ వెల్లడిరచారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ’ప్రజాపాలన’ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహిస్తున్నారు. తొలుత సీఎం రేవంత్‌ రెడ్డి గన్‌ పార్క్‌ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం పబ్లిక్‌ గార్డెన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత ’ఓ నిజాము పిశాచమా… కానరాడు నిన్నుబోలిన రాజు మాకెన్నడేని..’ అన్న దాశరథీ కవితతో తన ప్రసంగం ప్రారంభించారు. తెలంగాణ అంటేనే త్యాగం, బలిదానం అని.. రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు పోరాడారని అన్నారు. ’4 కోట్ల తెలంగాణ ప్రజలకు ప్రజాపాలన దినోత్సవం శుభాకాంక్షలు. నిజాం నిరంకుశ రాజును, ఆనాటి రాచరిక వ్యవస్థను మట్టి కరిపించి తెలంగాణ బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం 1948 సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ గడ్డపై ఆవిష్కృతమైంది. ఇది ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదు. ఒక జాతి తన స్వేచ్ఛ కోసం, ఆత్మగౌరవం కోసం రాచరిక పోకడపై చేసిన తిరుగుబాటు. నాటి సాయుధ పోరాటంలో ఎందరో ప్రాణ త్యాగాలు చేశారు. ఆనాటి పోరాటంలో ప్రాణాలు వదిలిన అమరవీరులకు ఈ సందర్భంగా ఘన నివాళి.’ అని సీఎం పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *