తోవ ఎక్కడ సోనియా?

సాహిత్యం హోమ్

బైరాగి అనే ఆలూరి బైరాగి చౌదరి నాకెప్పుడు పరిచయం అయ్యాడో ఖచ్చితంగా చెప్పలేను. బహుశా ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు ఆంధ్రప్రభ సంపాదకుడిగా ‘పాప పోయింది’ నవల సీరియలైజ్ చేస్తునప్పుడో, అఫ్సర్ ఆధునికత-అత్యాధునికత వ్యాసాలలోనో.! సరిగ్గా చెప్పలేను.

నా సంశయాత్మక స్వభావానికి బైరాగి సరిగ్గా సరిపోయాడు. ఒక దశలో బైరాగిలో నన్ను నేను చూసుకున్నాను. ఇంతకూ బైరాగిలో ఏముంది? కృష్ణుడు నరకాసురురుడిని చంపేసిన సందర్భంగా దీపావళి జరుపుకుంటాము. కేవలం నరకాసురుడు మాత్రమే ఎందుకు? ప్రపంచ నరకాన్నే మసి చేద్దాము అనే తీవ్రమైన అభివ్యక్తి అతనిది.

__________________

బైరాగి పేరు చెప్పగానే ‘నూతిలో గొంతుకలు’ గుర్తుకువస్తాయి కానీ బైరాగి బహుభాషాకోవిదుడు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, బంగ్లా భాషల్లో నిష్ణాతుడు. మూడు భాషల్లో అలవోకగా కవిత్వం రాశాడు. ‘చీకటి నీడలు’ అతడి మొదటి కవితా సంపుటి. తరువాత ‘ఆగమగీతి, నూతిలో గొంతుకలు, సంశయ్ కి సంధ్యా, వసుధా కా సుహాగ్, పెయిన్ అఫ్ బీయింగ్’ అనే కవిత్వ సంపుటులు, ‘దివ్యభవనం’ అనే కథల సంపుటి, ‘పాప పోయింది’ అనే నవల, ‘కాంచనమృగం’ అనే రూపకం రాశారు.
___________________

1980ల తరువాత తెలుగు కవిత్వంలో వచ్చిన కొత్త ధోరణులకు వేళ్ళు శ్రీ రంగం నారాయణ బాబు, బైరాగి లలో ఉన్నాయని అఫ్సర్ సరిగానే గుర్తించి తన ‘ఆధునికత అత్యాధునికత’ లో బైరాగి ని పిన్ పాయింట్ చేశాడు. అయితే సుప్రసిద్ధ విమర్శకుడు బి. తిరుపతిరావు అదే వ్యాస సంపుటికి రాసిన పొయెట్ క్రిటిక్ -క్రిటిక్ పొయెట్ అనే ముందు మాటలో అఫ్సర్ ప్రతిపాదనని పూర్వపక్షం చేశాడు. అభ్యుదయం కానిదేదీ కవిత్వం కాదు అని శ్రీశ్రీ, ఆరుద్ర, లాంటి పెద్దపెద్ద కవులు పీఠం వేసుకుని కూర్చున్నప్పుడు ఆత్మాశ్రయము, అంతర్ముఖీనతకి బైరాగి పెద్ద పీట వేశాడు. లోలోపలి కల్లోలాలను వ్యక్తం చేయడం కూడా కవిత్వ లక్షణమే అని ఆ తరహా కవిత్వం రాసే వాళ్లకు బైరాగి బలాన్ని ఇచ్చాడు. విప్లవ కవిత్వం కేవలం నినాద ప్రాయం అయినప్పుడు అంతరంగ చీకటిని కవిత్వ వెలుగులో సమాజంలో అధ్యయనానికి ఆధునికాంతర కవి ప్రయత్నించడానికి కావలసిన ధైర్యాన్ని బైరాగి ఇచ్చాడు అని అఫ్సర్ లాగే ఖచ్చితంగా చెప్పవచ్చు.

నిజానికి ఇదేమీ కొత్తది కూడా కాదు. ప్రధాన స్రవంతి కవిత్వానికి భిన్నంగా ఆత్మాశ్రయంతో తనను తాను దహించుకుంటూ కవిత్వం చెప్పడం కృష్ణశాస్త్రి నుండి, ఇస్మాయిల్ నుండి, బైరాగి అజంతా, వజీర్ రెహమాన్ ల మీదుగా నేటి సీతారాం దాకా ప్రవహించిన ఒక అవిచ్ఛిన్న ధార. అయితే ఇందులో కూడా ఎవరి తాత్విక భూమికలు వారివే. ఎవరూ ఎవరి ఛత్రఛాయలో నిలబడలేదు.

‘నూతిలో గొంతుకలు’ కవిత్వ సంపుటికి తానే రెండు మాటలు రాస్తూ బైరాగి “గొంతుకలు వస్తున్న నూతిలో నీళ్లు లేవు. అదొక పాడు నుయ్యి. పాడు నుయ్యి పతనానికి, మరణానికీ సంకేతం. అందులో జీవనం ఉండదు. అందులో వున్న వారికి వెలుగు గోచరించదు. పైకి పాకటానికి ఆధారం కనిపించదు. వారు కేకలు వేస్తారు. కానీ వారి గొంతుకలు బయటి వారికి స్పష్టంగా వినిపించవు. భూగర్భపు లోతులు వారిని బాహ్య ప్రపంచం నుండి వేరు పరుస్తాయి. వారు యాత్రీకులు కాదు. వారికొక గమ్యం లేదు. చీకటి తప్ప వారికి తోడు లేదు. వారు గర్వాంధత వాళ్ళ అభిశప్తులైన నహుషులు. కానీ ఆ పాపం వారిదే కాదు. అందరిదీ. అది సమస్త మానవ కోటికీ వర్తిస్తుంది.” అన్నాడు బైరాగి. దాన్ని ఇంకా విస్తరిస్తూ “ఈ కావ్యంలో నేను అంటే కవి కాదు. నేటి మానవుని అనుభూతిలో కవి తాదాత్మ్యం చెందటం నేను. స్వీయ బాధ వెలువరించడం కవి పరమావధి కాదు. ప్రపంచంతో ఏకమైననాడే కవికంఠం సరిగా పలకగలుగుతుందని నా నమ్మకం. ప్రపంచానుభూతిలో స్వీయ అనుభూతి పరమైనప్పుడే ఉత్తమ కవిత ఆవిర్భవిస్తుందని నా విశ్వాసం” అన్నాడు.

మొదటి ప్రపంచ యుద్ధానంతరం యూరప్ లో నెలకొన్న స్థితికి ప్రతీకగా టి.ఎస్. ఇలియట్ వేస్ట్ లాండ్ ను ప్రతీకగా తీసుకుంటే బైరాగి రెండవ ప్రపంచ యుద్ధానంతర స్థితికి ప్రతీకగా చీకటిని తీసుకున్నాడు. ఈ విషయాన్ని మరింత బలంగా..ఆలూరి బైరాగి సంస్మరణ సంచిక 1979లో బి. రామచంద్ర రావు ఇలా చెపుతున్నాడు “ఇలియట్ కావ్యంలో దైనందిన జీవిత దృశ్యాలు, పాత్రల వెనుక నాగరిక జీవిత వంధ్యత్వం ధ్వనిస్తుండగా బైరాగి సామానీకృత మానవుని నల్ల కుబుసాన్ని చిత్రించాడు.

‘And voices singing out of empty
cisterns
And exhausted wells’ అని అన్నట్టుగానే
‘రాత్రి అయింది/శబ్దం లేదు/గాలి లేదు/చీకటికి జాలి లేదు/ ఈ పెనుచీకటి/ నిముషం బ్రతుకుల నల్లని కుబుసం/ కాలమనే భయంకర సర్పం/మన్ను మిన్ను ఒకటి చేసి పొరలుతోంది’ అని చెపుతాడు.

భౌతికంగా దగ్గర అయినా మనిషి మానసికంగా ఎంతో దూరం అయినాడు, ఈ దూరం చీకటిలా వేల, వేల యోజనాల దూరం ఆవహించుకుని వుంది. చీకటి ఒక్కటే శాశ్వతం. మిగతా అన్నీ అశాశ్వతం. అయినా ప్రతి మనిషీ మార్పు కొరకే వేచి యున్నాడు.

“ప్రతి మనిషీ ఒక గదిలో/చెద పురుగులు ప్రతి మదిలో/ప్రతి మనిషీ ఒక నదిలో/ సుడిగుండం ప్రతి ఎదలో/ప్రతి మనిషీ ఒక చెరలో/ ఉరికంబం ప్రతి హృదిలో” అని ప్రవాహ సదృశంగా జీవన అవ్యవస్థను కవిత్వమయం చేస్తాడు బైరాగి.

జీవితాన్ని కాక జీవన బీభత్సాన్ని ఎలా వర్ణిస్తున్నాడో చూడండి:

“జీవితమిచట నిరావరణ నిరాభరణ నగ్నచ్చవి/జీవితమిచట కామాతుర కంకాళ కరాళ కేళి/ప్రేమేతర మృతి కాటూరు కాపాలాల్ కృపాణ ధూళి/జీవితమిచట బీభత్స ఉత్సాహ ప్రేత హేల/జీవితమిచట ఒక అవిరత నీరవ రౌరవ యాతన/జీవితమిచట కటు మృత్యువు/జీవితమిచట అకృత్యం/జీవితమిచట ఒక దుస్తర ప్రసార హస్తపు సత్యం” అన్న బైరాగి ఆత్మలు అనేవి ఉంటే అవి కాగితం పూల లాగా ఎప్పటికీ వాడిపోవు

అంటాడు. మన జ్ఞానం పగిలి విరిగి చెరిగి ముక్కలు చెక్కలు అయినట్టివి కనుక వాస్తవిక ప్రపంచంలో మనం ఆధారపడ తగిన ధ్రువతార ఎక్కడ వున్నది అని ప్రశ్నిస్తాడు.

ముందే చెప్పినట్టు పాడు నుయ్యి మరణానికి సంకేతం కాబట్టి అనుక్షణం మరణ యాతన అనడం అస్తిత్వ వాదుల బార్డర్ లైఫ్ సిట్యుయేషన్ కు కవి ఇచ్చిన మూర్త రూపం.

‘నూతిలోని గొంతుకలు’ లో కవిలో మూడు పార్శ్వాలు కనిపిస్తాయి. నిజానికి ఏ పార్శంలో కవి తనను తాను నిక్షిప్తం చేసుకున్నాడో కనుగొనడం ఒక పెద్ద ప్రశ్న. ఈ మూడు పార్శ్వాలు ఒక దాని మీద మరొకటి ఓవర్ లాప్ అయి కనిపిస్తాయి. మెల్లమెల్లగా పొరలను ఒలిచి చూడాలి.

జీవిత రంగస్థలంలో అతడు ఒక్కొక్కసారి చావు బతుకుల మధ్య సంశయాత్మతో to be or not to be అని కొన ఊపిరితో బ్రతుకుతూ ఉంటాడు. మరొకసారి అన్ని పాపాలని, శాపాలని అకారణంగా తనకు తానూ ఆరోపించుకుని తనను తాను

ధ్వంసించుకుంటాడు. ఒక్కొక్కసారి యుద్ధం చేయాలా? వద్దా? అనే సంశయగ్రస్తుడై యుద్ధంలోంచి పారిపోయే అర్జున విషాద యోగంలో కూరుకుని పోతాడు.

“ముందు వెనుక చీకటి గల రెండు ప్రపంచాల మధ్య/ముందు వెనుకలాడుతున్న ఒక సన్నని చీలు బాట/ఇరుల కురుల పాపటిలా, రెండు సైకతాల మధ్య/కృశకాయలా అస్తిత్వపు పాకులాట” ఈ అస్తిత్వపు పాకులాటలో బైరాగి ఎటు చేరుతున్నాడు?

“పిలుపు మృత దుర్గతిలోంచి/నవ జీవిత సద్గతిలోకి/ధ్వాన్తం నుంచి కాంతిలోకి/

భ్రాంతి నుంచి శాంతిలోకి/సోనియా త్రోవచూపు/వెలుగు చూపు త్రోవ చూపు” అని నిస్సహాయంగా ప్రాధేయపడి వేడుకోవడంలో బైరాగి వున్నాడా?

2

బైరాగి తెలుగు కవిత్వం ఆయనను తెలుగులో ఏ ఎత్తులకు తీసుకుపోయిందో చెప్పలేము, కానీ ఆయనకు హిందీ సాహిత్య సీమలో మాత్రం చెరగని స్థానం వుంది.

‘బడా విరూప్ మనుజ్ కా ప్యార్’ అనే కవిత చూడండి:

“మనిషి ప్రేమ బహు విరూపం/అర్ధం కుంకుమ అర్ధం కాటుక/అర్ధం బురదమయం అర్ధం నిర్మలం/మరి బురద నుంచే వికసిస్తుంది కమలం.” ‘నూతిలో గొంతుకలు’ లో నిరాశకు ఈ కవితలో ఆశావహ దృక్పధానికీ ఎంతెంత దూరం ?

‘రీతా ఆజ్ హృదయ్ కా కోష్’ అనే ఈ క్రింది కవిత చూడండి:

“హృదయ ధనాగారం/ఈ నాడు ఖాళీ అయింది/మిగిలినాయి ఎలుకలు/ పోగొట్టుకోవలసినవి పోగట్టుకున్నాను/ ఇవ్వాల్సిందంతా ఇచ్చేశాను/ కావాల్సిందంతా అయింది/నీకెలా స్వాగతం చెప్పను?/నేను దరిద్రుణ్ణి/ నాగరికతను ఎలా ప్రకటించుకోను?”

“ప్రేమ లేదు ఇప్పుడు ద్వేషం లేదు/ఆరిన బూడిద లో రోషం లేదు/మనస్సులో ఏదీ మిగల లేదు/రుణ విముక్తుణ్ణి అయ్యాను/ఖాళీ అయ్యాను/ఇచ్చేందుకు లేశ మాత్రం కూడా మిగలలేదు/హృదయ నగరం రిక్తమైంది”

ఈ కవితను చదివితే రవీంద్రుడు గుర్తుకు రావడం లేదా?

‘జుగునూ – సే తారోమ్ సే ఊబా/మం కా గగన్ తిమిర్ మే డూబా/కాల్ – కలుష్ కా తనా చందోబా/కిస్ కా ప్యార్ జలే/ ఉల్ కా బున్ చీర్ చరం తమ్ కా నీహార్’

మిణుగురు పురుగుల్లాంటి తారకలతో విసిగిపోయా. మనసనే గగనం అంధకారంలో మునిగిపోయింది. కాల కాలుష్యపు చాందినీ బిగుసుకు పోయింది. కారు చీకటిలో మంచును చీల్చే ఉల్కలా ఎవరి ప్రేమ వెలుగుతుంది?. ఎంత అద్భుతమైన భావన నిజమైన బైరాగిని తెలుసుకోవాలంటే అతడి హిందీ కవిత్వం చదవాలేమో?

3

‘Pain of being’ బైరాగి ఇంగ్లీష్ లో రాసిన కవిత్వ సంపుటి. ఇందులో దాదాపు 80 కవితలు వున్నాయి. ఇవన్నీ బైరాగి లోని విభిన్న కొనాలని మనకు పరిచయం చేస్తాయి

మీకోసం ఒక పోయెమ్-’The Smile’

“The smile which outlasts a million light years/The smile which sweetens the sadness of tears/The smile which launches “Myriad” sparking stars/The smile illumines the silken milky way/ The smile Which rings and ripples across the universe/The smile which gladdens feeling of graciously sorry/ The celestial moon beam in the body’s presence/The smile so gracefully bleaches the mirrored sky

Painting the whole world with an electrical charm/kissing the aged suffering with elixir of joy/Melting the ice of death/Shall we pain the sky with a million smiles”

ఒక చిరు దరహాసం లక్షల కాంతి సంవత్సరాల కంటే ఎక్కువ కాలమే బతుకుతుంది.ఎటువంటిదా చిరునవ్వు? కన్నీటిని విషాదమయం చేసే చిరునవ్వు. మృదువైన పాలపుంతను వెలుగులతో నింపే చిరునవ్వు. దినమంతా సబీడించే తరంగాయుతమైన చిరునవ్వు. విషాదాన్ని ఆనందానుభూతిగా మార్చే చిరునవ్వు.

అది స్వర్గ చంద్రిక. ఆకాశాన్ని అందంగా అద్దంలా శుభ్రం చేసే నవ్వు. సమస్త ప్రపంచాన్నీ విద్యుత్ కాంతితో వెలిగించే చిరునవ్వు, మృత్యు సీతలాన్ని కరిగించే చిరునవ్వు, బహుకాలపు బాధను సంతోషంగా మార్చే చిరునవ్వు.ఆ ఆకాశాన్ని ఓ లక్ష నవ్వులతో చిత్రీకరిద్దామా?

4

బైరాగిలోని విభిన్న కోణాలు అర్ధం చేసుకోవాలంటే ఆయన వచన రచనలు కూడా చదవాలి. ముఖ్యముగా పాప పోయింది నవల.నాకు ఒక పాప పుట్టి పోయినప్పుడు నన్ను ఓదార్చిన నవల అది

(సెప్టెంబర్ 5 బైరాగి శత జయంతి)

(ఈ వ్యాసంలో ఇంగ్లీష్, హిందీ కవితల అనువాదాలు తక్కోలు మార్చిరెడ్డి గారివి. ఆయన సాహిత్య అకాడెమీ కోసం భారతీయ సాహిత్య నిర్మాతలు శీర్షికన బైరాగి మోనోగ్రాఫ్ రాశారు. ఆయనకు కృతజ్ఞతలు)

 

 

-వంశీకృష్ణ