తొక్కిసలాటల్లో.. దారుణ విషాదాలు..

ఎడిటోరియల్ హోమ్

~~~~~~
*శాస్త్ర సాంకేతికంగా దూసుకెళ్తున్నా.. పాత రాతి యుగం నాటి మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాల మరణాలు అమానుషం.. *పార్లమెంటులో “తొక్కిసలాటల్లో దారుణ విషాదాలు” పునరావృతం కాకుండా చర్చ( చర్య)లు అనివార్యం.. *ఇలాంటి దుర్ఘటనలకు బాధ్యులు ఎంత పెద్ద వారైనా కఠిన శిక్షలు విధించాలి..
*సమాజంలో చైతన్యం, వైజ్ఞానిక దృక్పథం పెంచాల్సిన బాధ్యత పాలకులదే..
~~~~~~~

అదృష్టాలు, అద్భుతాలు అనతి కాలంలో అధికంగా సంపాదించుకోవాలనే దురాశే మానవాళిని మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాల వైపు దారి మళ్ళిస్తుంది. నేనే సర్వజ్ఞుడను అనే భ్రమలు కల్పిస్తూ మోసగిస్తున్న బాబాలు, మోసగాళ్లను వారి అహంకారం అల్పజ్ఞున్ని చేస్తుందనే వాస్తవాన్ని విస్మరిస్తూ ప్రవర్తిస్తున్నారు. ప్రజల ఆశలు, భయాలు పెట్టుబడిగా మార్చుకొని ఆధ్యాత్మికత ముసుగులో అరాచకాలకు పాల్పడే మోస(కేటు)గాళ్లకు మనదేశంలో కొదవ లేదు. గుర్మీత్ రామ్ రహీం సింగ్, ఆశారాం బాపు, రామ్ పాల్, సురా బాబాల బాగోతం చూస్తిమి. అలాంటిదే ఈ మధ్య మనదేశంలోని ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఎటా జిల్లా వాసి అయిన సూరజ్ పాల్ అనే వ్యక్తి 28 ఏళ్ల క్రితం పోలీసు ఉద్యోగం చేసేవాడు. మంత్ర తంత్రాలు, లైంగిక దోపిడీలకు సంబంధించిన కేసులలో ఇతడు ఉద్యోగం తొలగించబడినాడు. ఆ తరువాత జైలు జీవితం నుంచి బయటకు వచ్చి నారాయణ్ హరి అలియాస్ సాకార్ విశ్వహంగా పేరు మార్చుకొని సూరజ్ పాల్ గా కొనసాగుతున్నాడు. ఆయన స్వయం ప్రకటిత దేవుడిగా తన ప్రస్తానాన్ని కొనసాగిస్తూ, 30 ఎకరాల్లో ఆశ్రమాన్ని, “సేవాదార్” పేరిట సొంత సైన్యాన్ని ఏర్పరచుకున్నాడు. తన మహిమలతో మంచినీళ్ళతో సర్వ రోగాలను నయం చేయగలిగే మహిమాన్విత “బోలే బాబా”గా సూరజ్ పాల్ ను కొలుస్తున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ తదితర ప్రాంతాల ప్రజలు అతని మాయలో పడ్డారు. అంతే కాదు? ఈయనపై పలు రకాలైన లైంగిక వేధింపులు, భూకబ్జాల కేసులు ఉన్నప్పటికీ “బోలే బాబా” సేవ(మాయ)లో ఉత్తరప్రదేశ్ బడా రాజకీయ నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎందరో తరించిపోతుంటారంటా!. కోవిడ్ కాలంలో వేల మందితో సభలు, సమావేశాలు పెట్టినప్పటికీ ఈయనపై ఈగైనా వాలలేదంటే? ఇతగాడి రాజకీయ ప్రభావం ఎంతటి ఘనమైనదో ఇట్టే తెలిసిపోతుంది. ఓట్ల రాజకీయాల కోసం ఇలాంటి నకిలీ బాబాలకు పొర్లు దండాలు పెడుతున్నందువల్లే “సత్సంగ్” పేరుతో తనే దేవుడు, సర్వజ్ఞుడనే అసత్య ప్రచార మాయలో పడి “బోలే బాబా” పాద ధూళికై ఎగబడిన 122 మంది ప్రాణాలు హథ్రస్ తొక్కిసలాటలో గాలి(మట్టి)లో కలిసిపోయాయి. 200 మంది క్షతగాత్రులు అయ్యారు. ఇంతటి విషాద దుర్ఘటనకు కారణమైన ఆ ప్రదేశంలో ఆ వ్యక్తి సభకు సరైన ఏర్పాటు చేశారా! అధికారులు పర్మిషన్ ఇచ్చారా! అనే విషయాలతో నిమిత్తం లేకుండా హాజరైన అమాయక, అజ్ఞాన భక్త జనాల భావోద్వేగాలతో మృత్యు క్రీడలాడిన వారికి శిక్ష పడుతుందా అనేది తేలాల్సి ఉంది. కానీ ఈమధ్య అదే బాబా నాపై కుట్ర చేశారనే ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పాలకులు హడావుడి చేయడం ఆ తర్వాత చేతులు దులుపుకోవడం పాలకులకు, పాలితలకు పరిపాటిగా మారింది. ఇలాంటి ఘటనలు మానావాభివృద్ధికి విఘాతం కలిగిస్తూ సామాజిక విష రుగ్మతులను పెంచి పోషిస్తున్న తీరు మారాలి. గతంలో ఇలాంటి సంఘటనలెన్నో జరిగినప్పటికీ సమాజంలో గాని, పాలకుల్లో గాని మార్పు రాలేదనదానికి తాజా ఘటనే నిదర్శనం. ఇలా అనేక నయవంచకుల బాగోతాలు తరచూ పునరావృతం అవుతున్నా ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. పాలకులు, పాలితులు ఎందుకు చైతన్యవంతులు కాలేకపోతున్నారు?. సామాన్యుల అజ్ఞానాన్ని మూఢత్వంలోకి మళ్లించి స్వార్ధ ప్రయోజనాలు నెరవేర్చుకుంటున్న పాలకులు, నాయకుల తీరు వల్ల జనాభాకి జరుగుతున్న నష్టం వెలకట్టలేనిది. సామాన్య ప్రజలు అంటే అంత చులకన భావమా! అదృష్టం, అద్భుతాల కోసం వెంపర్లాడుతూ స్వీయ విచక్షణ కోల్పోతున్న తీరు మారాలి. స్వామి వివేకానందుడి నుండి స్ఫూర్తిని పొంది అంధవిశ్వాసాల నుండి బయటపడాలి. మనిషి తన మూలాలను మరిచి మానవాతీత శక్తుల మీద గుడ్డి నమ్మకంతో ప్రగతికి విఘాతం కలిగించే ఈ మూఢనమ్మకాలను మనుస్సు(మనుషు)ల నుంచి వదిలించుకోవాలి. రాజ్యాంగ స్ఫూర్తి, శాస్త్రీయ దృక్పథం, ప్రగతిశీల భావజాలాలతో పౌరులందరూ ప్రజాస్వామ్య విలువలను నెలకొల్పాల్సి ఉంది. భారతీయ సమాజంలో తరతరాలుగా పాతుకుపోయిన ఇలాంటి అజ్ఞాన, అమానవీయ సామాజిక రుగ్మతలను తొలగిస్తూ విజ్ఞాన దీపాలు వెలిగించాలి. జన చైతన్యాన్ని రగిలించే బాధ్యత పాలకుల పైన ఉంది. అదేవిధంగా పాలితులు అందుకు అతీతులు కాదనేది గమనించండి. వన్య మృగాలు సరదా కోసమైనా సాటి మృగాలను వేటాడవు. అదేంటో మనిషి ఒక్కడే సాటి మనిషిని హింసించి చంపుతాడు. ఇదేం విడ్డూరమో..

ఇలా తొక్కిసలాటల్లో.. దారుణ విషాదాలు.. మన దేశంలో మతపరమైన కార్యక్రమాలు, ఇతర సందర్భాల్లో పలుమార్లు చోటుచేసుకున్నాయి. అలాంటి ఘటనల్లో భారీ ఎత్తున భక్తులు, సామాన్యులు దుర్మరణం పాలయ్యారు. అటువంటి విషాద దుర్ఘటన వివరాలు.. * 2005లో మహారాష్ట్రలోని మదర్ దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 340 మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు. * 2008లో రాజస్థాన్ లోని చాముండా దేవి దేవాలయంలో 250 మంది మృతి చెందారు. * 2008లో హిమాచల్ ప్రదేశ్ లోని నైనా దేవి కోవెలలో162మంది అసువులు బాశారు.2010 మార్చి4న,ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్ ఘాడ్ జిల్లాలో కృపాల్ మహారాజ్ కు చెందిన సీతారాముల మందిరం వద్ద ఉచితంగా అందించే దుస్తులు, ఆహారం తీసుకోవడానికి జనం ఒక్కసారిగా వచ్చిన సందర్భంగా జరిగిన తోపులాటలో 63 మంది మృతి చెందారు. * 2011 జనవరి 14న కేరళలోని ఇడుక్కి జిల్లా ఫుల్ మేడ వద్ద ఓ జీపు ప్రమాదానికి గురైన సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో 104 మంది అయ్యప్ప స్వామి భక్తులు దుర్మరణం పాలయ్యారు. * 2013 అక్టోబర్ 13న, మధ్యప్రదేశ్లోని దతియ జిల్లాలో రత్నగడాలయంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జరిగిన తోపులాటలో 115 మంది అసువులు బాశారు. * 2014 అక్టోబర్ 3న బీహార్ లోని పాట్నాలో గల గాంధీ మైదానంలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 32 మంది మరణించారు. * 2022 జనవరి 1న జమ్ము కాశ్మీర్ లోని మాత వైష్ణో దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 12 మంది భక్తులు చనిపోయారు. * 2023, మార్చి 31న, మధ్యప్రదేశ్లోని ఇందౌరులో బావి కూలి 36 మంది మృతి చెందారు. * 2024 జూలై 3న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హథ్రస్ లో బోలే బాబా సత్సంగ్ తొక్కిసలాట దారుణ విషాదంలో 122 మంది మరణించారు. 200 మందికి పైగా క్షతగాత్రులై ఆసుపత్రిలో చేరారు…
ఇలా దేశంలో తొక్కిసలాట లాంటి విషాద దారుణ సంఘటనల నుండి పాలకులు, పాలితులు గుణపాఠం నేర్చుకుని అంధ విశ్వాసాలు, మూఢనమ్మకాల మాయాజాలంలో తమ విలువైన ప్రాణాలను కోల్పోకుండా చైతన్యవంతులై జాగరూకతతో ఉండాలి. మరో సంఘటన జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రాణం పోసే శక్తి లేని ఏ బాబాలు, మోసగాళ్లకు మూఢభక్తి విశ్వాసంలో ప్రాణాలు తీసే హక్కు ముమ్మాటికి లేదు!. తక్షణమే ప్రభుత్వాలు ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది.

మేకిరి దామోదర్,
సోషల్ ఎనలిస్ట్, వరంగల్,
ఫోన్: 9573666650

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *