కొత్త కాంతికీ, సామరస్యాలకీ చిరునామా ‘ఆమెకు మిగలని ఆమె’

సాహిత్యం

“Someday, somewhere – anywhere, unfailingly, you’ll find yourself, and that, and only that, can be the happiest or bitterest hour of your life”– Pablo Neruda.

స్త్రీ పురుషులు వొకరినొకరు యెందుకు అర్థం చేసుకోవాలి?యెలా అర్థం చేసుకోవాలి? యెలా అర్థం చేసుకుంటే జీవితం జీవనం అవుతుంది? యిదో నిరంతర అన్వేషణ. నిజానికి స్త్రీ పురుషులు వొకరికొకరు తోడు. వొకరికొకరు స్నేహితులు. వొకరికొకరు శత్రువులు.జీవితం.జీవనం.వొకరికి వొకరు వూపిరి.కానీ పురుషులు తమ ఆధిపత్యంతో స్త్రీ జీవితంలో మానసిక శారీరక నొప్పిని యిప్పటికీ యెందుకు కుమ్మరిస్తున్నారు? యీ ప్రశ్నలు ఆలోచనలూ మళ్ళీమళ్ళీ మెదిలాయి సాంబమూర్తి గారి కొత్త కవితా సంపుటి ‘ఆమెకు మిగలని ఆమె’ చదివినపుడు.

“ఆరంభం నుండీ నువ్వు వెలుగువే
నీ ముఖం మీద ఎన్ని చీకట్లును పూసారో
అన్ని స్థలకాలాల్లోనూ నువ్వు జీవనదివి
ఎన్నెన్ని పేర్లతో దోచుకోబడ్డావో బిలియన్ల బిలియన్ల కాంతి రేణువుల నిర్మాణానివి నీ చుట్టూ ఎన్ని గోడలు కట్టాలని చూస్తారో”

స్త్రీ పురుషులు వొకరినొకరు యే పెడస్ట్రియల్ మీద నిలబడి అర్థం చేసుకుంటున్నారు. యెన్ని డిగ్రీల్లో వొకరి వైపు వొకరు చూసుకుంటున్నారన్నది యెంతో ముఖ్యమైనది. యెందుకంటే చాలాకాలం స్త్రీని పురుషులు దేవతగానో లేదా బానిసగానో తలపోసేవారు. కాలక్రమేణ యీ భావం మారుతూ స్త్రీని తమ సాటి మానవురాలిలా చూసే మానవీయ కోణం స్పురించింది.కానీ కొంతమంది పురుషుల ఆలోచనలు,చేష్టలూ ఆమె జీవితాన్ని దుఃఖంలోకి యెందుకు నెడుతున్నారనే విచారం కుదిపేస్తుంటే ఆ దుఃఖాన్ని యీ కవి ఆలపించారు.

“స్త్రీకి కూడా శరీరం వుంది; దానికి వ్యాయామం యివ్వాలి.ఆమెకి మెదడు వుంది; దానికి జ్ఞానం యివ్వాలి.ఆమెకి హృదయం వుంది; దానికి అనుభవం యివ్వాలి” అనే సంగతిని చలం గారు చెప్పి వందేళ్ళు పైగా అయిపోయినా యిప్పటికీ మన సమాజానికి ఆ విషయం పూర్తిగా అర్థం కాలేదని యీ కవిత్వం చెపుతుంది.

“అతడు ఎండ
ఆమె నీడ
ఇద్దర్నీ కలిపి భూమిని చేసేవాళ్ళు లేరు”

స్త్రీపురుషుల నడుమనున్న సమస్యలకి మూలం సమాజంలో యెంత వుందో అంతకు మించి వారి వారి మనసుల్లోనూ వుంటుంది. యిటువంటి యెరుక యీ కవిత్వంలో పరుచుకుంది.

“కత్తికి ఒక్కరూపం అంటూ వుండదు
నాన్నగా అన్నదమ్ముడిగా భర్తగా
ప్రేమికుడిగా బంధువుగా అపరిచితుడుగా
అనేక శరీరాలుగా ఎదురవుతూ”

స్త్రీ వేదనకి వారి హృదయం దుఃఖమై స్త్రీల చుట్టూ వేలాడే బాంధవ్యాల చురకత్తుల్ని వారు పాఠకుని ముందు వేలాడదీసారు.

పురుషవాక్యం వేరు. స్త్రీ వాక్యం వేరు. కవులందరూ స్త్రీపురుషులని వొక్కలాగే అర్థం చేసుకున్నారని చెప్పలేను. స్త్రీ కేంద్రంగా యేక వస్తువుతో వచ్చిన కవితా సంపుటి ‘ఆమెకు మిగలని ఆమె’ లోని కవిత్వం అంత స్త్రీమయం.స్త్రీని అర్థం చేసుకోవడం, వ్యక్తపరచడంలో వొక లోతు, సున్నితత్వం వుందీ కవిలో. అన్నిటికంటే ప్రధానంగా సమభావం అనే యెరుక వుంది. స్త్రీని అతను వో యెత్తులో నిలబడో ముందు నడుస్తూనో అంచనా వేయలేదు. ఆమె పక్కనే అడుగేస్తూ ఆమె వూపిరిని, హృదయాన్ని,మెదడుని అతను అర్థం చేసుకోవడానికి చేసిన ప్రయత్నం అత్యంత మృధువైనది. ప్రజాస్వామికమైనది.
_____________

స్త్రీ పురుషులు వొకరిని వొకరు అర్థం చేసుకోవడానికి ప్రధానంగా కావలసింది మానసిక పరిపక్వత. యిరువురం వొకే గాలిని శ్వాసిస్తున్నాం. వొకే సూర్యుడు చంద్రుడిని చూస్తున్నవాళ్లమని తలపోసినప్పుడు ఖచ్చితంగా వొక ప్రజాస్వామికమైన అర్థవంతమైన జీవనం సాధ్యమవుతుంది. స్త్రీ తన జీవితాన్ని వికసింపచేసుకోడానికి పురుషుడు యెలాంటి దృక్పథంతో వుండాలో తెలిసిన సాంబమూర్తి గారు తనని కల్లోల పరిచిన అనేక విషయాలని కవిత్వీకరించారు. స్త్రీ పురుషులు నడుమ నిజమైన గౌరవభావం రావాలంటే యిరువురకీ సంపూర్ణమైన స్వేచ్ఛ వుండటం అత్యంత కీలకం. పురుషుడు తనకే అధికారం వుందని భావించటం వల్ల కవి చెపుతున్న హింసకు స్త్రీ లోనవుతుంది. సుమనోహరమైన రంగుల్ని జీవితాంతం నింపుకోటానికి వెదజల్లుకోటానికి యీ కవి ప్రయత్నిస్తూనే వున్నారు.
_____________

“ఎప్పుడోసారి
నేన్నిన్ను ప్రేమించే వుంటాను
ఎడారినై
నేను ప్రవహిస్తున్నప్పుడు
నదిలాంటి నిన్ను
నాలోకి ఆహ్వానించే వుంటాను”

స్త్రీల జీవన జీవిత స్థితిగతులకు గురించి రాస్తున్నప్పుడు వారు స్త్రీని మనిషిగా చూడాల్సిన ఆవశ్యకతని వ్యక్తపరిచారు.స్త్రీని అర్థం చేసుకోడానికి వారిని వారు నిరంతరం చిత్రిక పట్టుకుంటూ.. వో సువిశాల మానవునిగా తనని తాను మలుచుకుంటూ సాగిస్తున్న జీవన ప్రయాణంలో అతని జీవితంలో విరబూసిన ‘రెల్లపూల చెట్టు’ అతని దీపధారి.

దశాబ్దాలుగా స్త్రీ పురుషుల మధ్య సాగిన.. రచించిన అనేక రాజకీయాల వల్ల గొప్ప స్నేహితులు అవ్వాల్సిన వారి నడుమ అగాధం.సహజంగా జరగాల్సిన వొక ప్రక్రియ జరగలేదు.స్త్రీలు పురుషులతో సమానంగా అన్ని రంగాలలోనూ తమ వునికిని ప్రతిష్టించాక కూడా స్త్రీ తన యింట్లో తన సొంత మనుషుల మధ్య తన అస్తిత్వం కోసం పెనుగులాడుతూనే వుండటం చూస్తున్నాం. అంటే యింకా శుభ్రం చేయాల్సిన పురుషుల ఆలోచనలు అనేకం వున్నాయి. అందుకే యిటువంటి కవిత్వం కావాలి. యీ కవిత్వం నువ్వెందుకు యిలా వున్నావని పురుషున్ని ప్రశ్నిస్తుంది. యెలా వుండాలో కూడా నిక్కచ్చిగా చెప్తుంది.ఈ కవి స్త్రీ జీవితాన్ని ప్రేమైక నదిలా ప్రవహించాలని కోరుకుంటారు. పుస్తకంలో దాచుకున్న నెమలియీకల మనసు పొరల్లో వొకరి స్నేహాన్ని మరొకరు సున్నితంగా దాచుకోవాలంటారు.

“One is not born, but rather becomes,a woman” –Simone De Beauvoir

‘ఆమెకు మిగలని ఆమె’ ప్రపంచ స్త్రీ. విశ్వమంతా స్త్రీల సంతోషాలు, దుఃఖాలు దాదాపుగా వొక్కటే. కవిత్వమనే మనసు దారంతో అల్లి వొక విశ్వ మానవిని కవితా అట్లాస్ మీద ఆవిష్కరించారు.

స్త్రీ కేంద్రంగా కవిత్వం రాయటానికి కేవలం స్త్రీ పట్ల గౌరవం మాత్రమే వుంటే చాలదు. సునిశితమైన రాజకీయ దృక్పథం, సౌందర్యవంతమైన లోచూపూ కూడా స్పష్టంగా వుండాలి. అప్పుడే స్త్రీ వస్తువుగా కవిత్వం రాసే ప్రయత్నానికి వొక అర్థం, పరమార్థం వస్తాయి. సాంబమూర్తి గారిలో యివన్నీ వుండటం వల్ల యీ కవితా సంపుటి పాఠకుల మనోద్వారాల్ని తెరుస్తుంది. సుమధుర పవనమొకటి హృదయ కవాటాల్లో నిండుకుని అర్థవంతమైన యెరుకనిస్తుంది. కవికీ కవిత్వప్రపంచానికి అవసరమైన విలువైన చేర్పు ‘ఆమెకు మిగలని ఆమె’.

స్త్రీలు యెదురుక్కుంటున్న వివక్ష, అసమానత, అశాంతి యిలా అనేక విషయాలను చేదు పాటగా మధుర గానంగా పాఠకులకు అందించి వారి భయాలను, బాధలను, నిరాశలను, నిరుత్సాహాలనూ పోగొట్టే చికిత్సగా ‘ఆమెకు మిగలని ఆమె’ రూపొందింది. లోతుగా చూసే కొద్దీ స్త్రీ పురుషులని వేరు చెయ్యడానికి వీలులేని యేకత్వం తోస్తుంది యీ కవిత్వంలో. యిరుకు లోంచి ఆత్మవికాసం వైపుకి ప్రయాణం చేయిస్తుంది ‘ఆమెకు మిగలని ఆమె’. యీ కవికి కవిత్వం జీవితానికి ప్రేరణనివ్వటమే కాదు. జీవనం కూడా అయినందున యిందులోని కవితల్లో స్త్రీ విశిష్టతను, ప్రత్యేకతనూ తెలియజెప్పటం మాత్రమే కాకుండా తన వ్యక్తిగత అభిప్రాయాన్ని కూడా స్పష్టంగా చెప్పారు. ఆ సమభావపు దృష్టి కోణానికి అభినందనలు. కొత్త కాంతికీ, సామరస్యాలకీ చిరునామా ‘ఆమెకు మిగలని ఆమె’.

-కుప్పిలి పద్మ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *