సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్
న బ్రూయాత్ సత్యమప్రియం
ప్రియం చ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ స్సనాతన:
మానవ జీవితంలో మాటకు (వాక్కుకు) ఉన్న మహిమ మహత్తరమైనది.. ఎల్లప్పుడూ సత్యమే పలకాలి.. ప్రియమైన మాటలనే పలకాలి.. అయితే, ఎదుటివారిని బాధపెట్టే మాటలు ఎంత సత్యమైనప్పటికీ వాటిని పలుకరాదు. అలా అని, ప్రియం చేకూర్చే మాట అనుకుంటూ అబద్ధం కూడా చెప్పకూడదు.. ధర్మం చాలా సూక్ష్మమైనది.. దానినెరిగి ప్రవర్తించవలెను…. అంతేగానీ ఒకరిపై ఒకరు ఎదురుదాడులకు దిగుతూ రెచ్చగొట్టేలా మాట్లాడటం, అసభ్య పదజాలంతో దూషించడం ప్రజలు హర్షించరు. అది స్వపక్షమైనా, ప్రతిపక్షమైనా సరే. భాష విషయంలో సంయమనం పాటించాల్సిందే. హుందాగా ఉండాల్సిందే. మాటలు పరుషంగా వాడినా.. అసభ్యత లేకుండా చూసుకోవాలి. సంయమనంగా ఉండగలగాలి. కానీ ఇప్పుడు పాలకులు… రాజకీయ నాయకులు… మాటలతో కట్టు తప్పుతున్నారు. దారుణమైన భాషతో విరుచుకుపడుతున్నారు. ఇంద్రవెల్లిలో నిర్వహించిన తెలంగాణ పునర్ నిర్మాణ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని పడగొడతామన్న వారిని పండబెట్టి తొక్కుతామని, కట్టేసికొడతామని హెచ్చరికలు జారీ చేశారు. అయితే రెచ్చగొట్టేందుకు బిఆర్ఎస్ సిద్దంగా ఉంది. వారి ట్రాప్‌లో పడి రెచ్చిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత సిఎంగా రేంవత్ రెడ్డిపై ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది ఎప్పుడూ ప్రభుత్వాలను ఇరుకున పెట్టడానికే ప్రయత్నిస్తుంది. కెసిఆర్ అధికారంలో ఉండగా ప్రతిపక్షాలకు మాట్లాడనిచ్చే అవకాశం ఇవ్వలేదు. కానీ ఇప్పుడు రేవంత్‌రెడ్డి సర్కార్ స్వేచ్ఛనిచ్చింది. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ అవకాశాన్ని వదులుకోరు. అలాగని మాటలు జారి ప్రతిపక్షానికి దొరికిపోకుండా ముఖ్యమంత్రి సంయమనంతో వ్యవహరించాల్సిన సందర్భమిది. సిఎం స్థానానికి ఓ గౌరవం ఉంది. దానిని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉంది. నాడు కెసిఆర్ అలా చేశారని, ఈ రోజు రేవంత్ రెడ్డి అంతకు మించి చేస్తే ఇప్పుడు బిఆర్ఎస్కు వచ్చిన పరిసిత్థి మళ్లీ కాంగ్రెస్‌కు రావచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు కక్ష సాధింపులకు పాల్పడతారని అందరూ అనుకున్నారు. కానీ ఆయన అలాంటి కక్ష సాధింపులకు ఇంకా పాల్పడలేదు. అలాంటివేవిూ ఉండవని ఆయన చెప్పారు. రెండు నెలలపాటు అలాగే పరిపాలనచేశారు. చాలా సున్నితంగా వ్యవహారాలను చక్కదిద్దుకుంటూ వెళ్తున్నారు. ఐఎఎస్, ఐపిఎస్, దిగువ స్ధాయి పోలీసు అధికారుల పోస్టింగ్‌లు, పదోన్నతులు, భూముల వివాదాలు వంటి విషయంలో ఎక్కడా పార్టీ నేతల్ని కూడా నొప్పించకుండా, పైరవీలకు తలొగ్గకుండా పని చేసుకుంటూ పోతున్నారు. విధాన పరమైన నిర్ణయాల విషయాల్లో కూడా తొందరపాటు ప్రదర్శించడంలేదు. పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉద్యోగులకు ఒకటో తేదీ జీతాలిస్తున్నారు. నిధుల అందుబాటును బట్టి రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. నామినేటెడ్ పదవుల విషయంలోనూ లౌక్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను గవర్నర్ తమిళిసై అంగీకరించేలా చేయడంలో ఆయన అంతులేని లౌక్యాన్ని ప్రదర్శించారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కేంద్రంతో కూడా ఘర్షణ పూరిత వైఖరి కాకుండా సయోధ్యతో వ్యవహరిస్తూ ముందుకెళ్తున్నారు. లోక్‌సభ ఎన్నికలు జరిగే ఏప్రిల్‌లోపు, ఎన్నికల కోడ్ వచ్చేలోపు మరికొన్ని హావిూలు అమలు చేయడం ద్వారా ప్రజల విశ్వాసం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అయిన్పటికీ, ఇప్పటికే శ్వేతపత్రాలతో గత కెసిఆర్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎండగట్టింది. ఇప్పుడు మరోమారు కాళేశ్వరం సహా అనేక ప్రాజెక్టుల్లో అవినీతి, ధరణి వంటి సమస్యలను ప్రస్తావించడం ద్వారా బిఆర్ఎస్ను ఎండగట్టడానికి సిద్ధం అవుతుండగా, కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడంపై ఎదురుదాడికి బిఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం గత బిఆర్ఎస్ ప్రభుత్వం తప్పులను ప్రజల ముందు పెట్టేందుకు అసెంబ్లీని వేదికగా చేసుకుంటోంది. తప్పు ఎవరిది ఒప్పు ఎవరిది అనేది నేటి నుంచి జరుగనున్న అసెంబ్లీ సమావేశాలలో చర్చకు రానుంది. నిజాలన్నీ ప్రజల ముందు పెడితే వారే అర్థంచేసుకుంటారు. గత ప్రభుత్వ తప్పిదాలను ఎండగట్టాల్సిందే. అప్పులపై నిలదీయాల్సిందే. అభివృద్ధి ముసుగులో అప్పులు చేసి అవినీతికి పాల్పడిన వారు ఎవరైనా సరే ప్రజలముందు దోషిగా నిలబడాల్సిందే. వాస్తవాలు వెల్లడి కావాల్సిందే.