కవిగా, రచయితగా,సంగీతజ్ఞునిగా, పద్య ప్రయోగకర్తగా,ప్రహేళికా రూపకర్తగా, తెలుగుభాషా విశేషజ్ఞునిగా పలు పుస్తకాలు వెలువరించిన ఎలనాగ.. అనువాద రంగంలో కూడా లబ్ధప్రతిష్ఠుడు. ఆంగ్లం నుండి తెలుగులోకి, తెలుగునుండి ఆంగ్లంలోకి కథలు,కవితలు అనువదించి పుస్తకాలు వెలువరించారు.సోమర్సెట్ మామ్ నవలిక The Alien corn ను ‘కలుపు మొక్క’ అనే పేరుతో అనువదించారు.
Contemporary Latin American Short stories నుండి కొన్ని ఉత్తమ కథలను ఆంగ్లంలోకి అనువదించి ‘ఉత్తమ లాటిన్ అమెరికన్ కథలు’ అనే పేరుతో సంకలనం వెలువరించారు. అలాగే వివిధ దేశాల కథానువాదాలను కథాతోరణంగా తెచ్చారు. ఉత్తమ ఆఫ్రికన్ కథలు, సోమర్సెట్ మామ్ కథలు పుస్తకాలుగా వచ్చాయి.
అలాగే ‘పొరుగు వెన్నెల ,‘ఊహల వాహిని’ వీరి వివిధ భారతీయ భాషల మూల కవితలకు తెలుగు అనువాద కవితల సంపుటాలు.
వీరి కవిత్వానువాదం పొంకంగా మాతృకలోని భావ సౌకుమార్యాలను ప్రస్ఫుటంగా తెలియబరచేదిగా ఉంటుంది.వీరి అనేకానేక సమకాలీన తెలుగు కవితల కవిత్వానువాదాలు పలు సంకలనాల్లో చోటు చేసుకున్నాయి.
ఎలనాగ అనువాద ప్రక్రియలో సవ్యసాచి అనవచ్చు.ఆంగ్లం నుండి తెలుగులోనికి చేసినట్లే తెలుగు నుండి ఇటు కవిత్వాన్ని, అటు కథల్నీ కూడా ఆంగ్లీకరించారు.
Faded leaves and fireflies అనేది డా.అమ్మంగి వేణుగోపాల్ గారి కొన్ని తెలుగు కవితలకు ఆంగ్లానువాదం. Impressions -Images అనే పుస్తకం 64 మంది తెలుగు కవుల కవితలకు ఆంగ్లానువాదం.ముందే చెప్పినట్లుగా వీరికి సంగీతం మీద అపారమైన పట్టు కలిగి ఉండటం వల్ల శాస్త్రీయ సంగీతంపై, కళాకారుల మీద రాసిన కవితలు, వాక్చిత్రాలను ఆంగ్లంలో Memorable Melody Makers and Other Poems on Music గా వెలువరించారు.
అలాగే వట్టికోట ఆళ్వారు స్వామి కథల సంపుటి ‘జైలులోపల’ ను ఆంగ్లంలోకి అనువదించి Inside the Prison శీర్షికతో ప్రచురించారు. తెలంగాణకు చెందిన ప్రముఖ రచయితలు కాళోజీ, దాశరథి కథలను ఆంగ్లంలోకి అనువదించారు.Short Stories of Kaloji Narayan Rao ను కాళోజీ ఫౌండేషన్ వారు ప్రచురించగా ,Fire Flowers And Other Stories of Dasharathi Krishnamacharya ను తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురించింది.
కేంద్ర సాహిత్య అకాడమీ 11 మార్చి 2024 నాడు అనువాద ప్రక్రియకు సంబంధించిన పలు భారతీయ భాషల అనువాద గ్రంథాలకు 2023 సంవత్సరానికి గాను పురస్కారాల జాబితాను ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా తెలుగు భాషానువాదకుడిగా ‘ఎలనాగ’ కలం పేరుతో సుప్రసిద్ధులైన డా. నాగరాజు సురేంద్ర గారికి పురస్కారం లభించడం తెలుగు వారందరికీ సంతోషదాయకమైన విషయం.
ఎలనాగ గతంలో కేంద్ర సాహిత్య అకాడమీ వారికోసం పవన్ కె.వర్మ ఆంగ్లంలో రచించిన Ghalib:The Man,The Time ను ఎలనాగ తెలుగులో ‘గాలిబ్ -నాటికాలం’గా అనువాదం చేశారు. భారత విదేశాంగ శాఖలో ప్రభుత్వోద్యోగిగా పనిచేస్తున్న మూలగ్రంథ కర్త పవన్.కె.వర్మ, పేరున్న రచయిత. నాటి కాలం అంటే గాలిబ్ కాలంలోకి ప్రవేశించి, తాను చూసినట్టుగా ఈ పుస్తకం రాశారు.గాలిబ్ గొప్పతనమే కాకుండా ఆయన బలహీనతలను ఈ గ్రంథంలో పొందుపరచడం జరిగింది.1857వ సంవత్సరంలో జరిగిన సిపాయిల తిరుగుబాటు ఒక చారిత్రక సంఘటనగా పెనవేసుకున్న విషయం, అదే సమయంలో జీవించిన మీర్జా గాలిబ్ జీవిత విశేషాలు ఇందులో ఉటంకించబడ్డాయి. గాలిబ్ రాసిన ఉత్తరాలు, కవితలు, సమకాలీన గ్రంథాలను పరిశీలించి రాసిన గ్రంథం “Ghalib:The Man,The Time”. దీనికి 2023 సంవత్సరానికి కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం లభించడం ఒక మంచి సాహితీవేత్తకు తగిన గుర్తింపు కలగడమే గాక పురస్కారానికి వన్నె తెచ్చే విషయంగా కూడా భావించవచ్చు.
ఒక గాలిబ్ కవితను మచ్చుకి చూడండి.
“ఆహ్లాద మైదానం వంటి
ఆనంద నికుంజం వంటి
బనారస్ పట్టణ వైభవాన్ని
భగవంతుడు రక్షించు గాక
………
కాలపు సుడిగుండం నుండి
రక్షణ పొందే బనారస్
ఎల్లవేళలా వసంతమే
అక్కడ ఆకు రాలే రుతువులు
తెల్లని నుదురు మీద….
గంధమై వెలుస్తాయి..!
గాలిబ్ కాశీ గురించి రాసిన “చిరాగ్..ఏ..దాయర్” అనే ఫారసీ కవిత అతని సర్వమత సమానత్వ భావనకు తార్కాణంగా ఉంది.
ఈ గ్రంథ అనువాదం కోసం రోజుకు ఐదారుగంటల చొప్పున దాదాపు ఆరునెలల పాటు సమయం పట్టిందని,ఆంగ్లంలో చాలా కఠినంగా ఉన్న కొంత విషయం అనువదించడానికి చాల పరిశ్రమించాల్సి వచ్చిందనీ, ఈ పుస్తకం తనకు ఎంతో తృప్తిని కలిగించిందని, తన కృషికి ఫలితంగా ఈ పుస్తకానికి పురస్కారం లభించడం తనకు సంతోషంగా ఉందని ఎలనాగ అనడం వారి సంస్కారానికి నిదర్శనం.
ఇదే కాకుండా సైరస్ మిస్త్రీ రాసిన Chronicle of a Corpse Bearer అనే పుస్తకానికి ఎలనాగ అనువాదం ‘శవాలను మోసేవాడి కథ’. అసాధారణమైన ఇతివృత్తం, అద్భుతమైన కథనం, విశిష్టమైన రచనా విధానం,వెరసి ఇదొక గొప్ప నవల. అందుకే మూలగ్రంథం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును, డి.ఎస్.సి. దక్షిణ ఆసియా సాహిత్య పురస్కారాన్ని గెలుచుకుంది. ఈ అనువాద గ్రంథాన్ని కూడా కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించిందంటే వీరి ప్రతిభ ఎంతటిదో తెలుస్తున్నది.
ఒడియా కవి ప్రదీప్ బిస్వాల్ రాసిన A House Within, Pilgrimage to Ayodhya అనే రెండు ఆంగ్ల కవితా సంపుటులకు ఎలనాగ చేసిన అనువాదం ‘ఆత్మగానం’(కవిత్వం). మూలకవి కోరిక మేరకు ఒకే పుస్తకంగా అచ్చయింది.
_____
ఎలనాగ జన్మ స్థలం కరీంనగర్ జిల్లాలోని చారిత్రక గ్రామమైన ఎలగందుల. హైదరాబాదులో యం.బి.బి.ఎస్. చదివిన తరువాత 1980 నుండి 1986 వరకు నైజీరియాలో ప్రభుత్వోద్యోగిగా పనిచేశారు. నైజీరియా నుండి తిరిగి వచ్చి 1989 నుండి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో చేరి పలుజిల్లాలలో వివిధ హోదాలలో వైద్య సేవలందించి, చివరి మజిలీలో ఆంధ్రప్రదేశ్ వైద్య విద్యా విధాన పరిషత్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ గా పదవీ విరమణ పొందారు.ప్రస్తుతం పూర్తిగా సాహిత్యైకజీవిగా హైదరాబాదులో నివసిస్తున్నారు. వీరి జననీ జనకులు నాగరాజు రంగమ్మ,తిరుమలయ్య గారలు.వీరి అగ్రజులు ప్రసిద్ధ కవి నాగరాజు రామస్వామి గారు.
___
ఎలనాగ చేపట్టిన ప్రతి ప్రక్రియలోనూ ఒక విలక్షణత ఉంటుంది. నిర్దిష్టంగా, నిర్దుష్టంగా రాయటంలో నేర్పరి.పద్యాన్ని ఎంత పటిష్టంగా రాయగలరో వచన కవిత్వాన్ని అంత విశిష్టంగా రాయగలరు.
వృత్త పద్యాన్ని వచన కవిత్వ వాక్యాలుగా కత్తిరించి ‘మోర్సింగ్ మీద మాల్కౌఁస్ రాగం’, ’కొత్తబాణీ’ అనే పేర్లతో వెలువరించి,ఎవరూ చేయని ఒక ప్రయోగాన్ని చేసి రెండు పుస్తకాలు వేసిన ఘనత ఎలనాగకు ఉంది.ఆ పుస్తకాల పేర్లే చెబుతున్నాయి యీయన ప్రయోగశీలత్వాన్ని. మోర్సింగ్ అనేది నాలుకతో మ్రోగించే ఒక వాద్య పరికరం. ప్రకంపనలతో కూడుకున్న లయాత్మక నాదం వెలువరిస్తుందది. దానిమీద మాల్కౌఁస్ రాగం పలుకించడమంటేనే అదో ప్రయోగం.
పద్యం నడక వేరు,వచనకవిత్వ ధోరణి వేరు.ఆ పంక్తులను విడిగా చదివితే వచన కవిత్వంలాగానూ, సమన్వయ పరచి నాలుగు పంక్తులుగా చదివితే వృత్తపద్యమో,సీసమో ఏదైనా పద్య రూపంలో ఉంటుంది.ఉత్పలమాల, చంపకమాల, శార్దూల మత్తేభాలు. ఇలా చాలా కాలం పద్యాలపై ప్రయోగం చేశారు. గణ, యతి, ప్రాసలు చక్కగా పాటించబడతాయి. విడివిడిగా చదివితే వచన కవిత,కలిపి చదివితే వృత్తపద్యం అవుతుంది.
ఇటీవల కలకత్తాలో జరిగిన Kolkata Literary Carnival లో రెండవ రోజున, ఉకియోటో వారి Poet of the Year – 2023 అవార్డును స్వీకరించారు ఎలనాగ. ఉకియోటో ఒక ప్రపంచస్థాయి ప్రచురణ సంస్థ. అది తాను అచ్చు వేసిన పుస్తకాలను 70 కి పైగా దేశాలకు పంపుతుంది. అందులో భాగంగా ఎలనాగ ఆంగ్లకవితల సంపుటి, Dazzlers ను టర్కిష్, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, చైనీస్, రష్యన్, జపనీస్ భాషలలోకి అనువదింపజేయటం జరిగింది.
ముగించే ముందు ఒక విషయం చెప్పాలి.చాలా మంది ప్రచ్ఛన్న నామాలతో ప్రసిద్ధులుగా ఉండటం మనకు తెలిసిందే. అలాగే డా.నాగరాజు సురేంద్ర తన కలం పేరు ‘ఎలనాగ’ అనిపెట్టుకున్నారు. నాకు తెలిసి ఇంత అందమైన అర్థవంతమైన కలంపేరు అరుదనిపిస్తుంది. ఊరి పేరులోని మొదటి రెండక్షరాలు ‘ఎల’ ఇంటి పేరులోని మొదటి రెండక్షరాలు ‘నాగ’ కలిపి ఏర్పడిన అందమైన తెలుగు పదం ‘ఎలనాగ’. వీరు కలంపేరుతోనే సాహిత్య లోకంలో బాగా ప్రసిద్ధికెక్కారు.
అంతర్ముఖుడు,సౌజన్య మూర్తి, మితభాషి, ఊసుపోకకు కాకుండా సంగీత సాహిత్యాలను తపనతో అత్యంత శ్రద్ధాసక్తులతో మమేకం చేసుకున్న ఎలనాగ ఉరఫ్ డాక్టర్ నాగరాజు సురేంద్ర గారు ఇంకా ఎన్నో మంచి మంచి పుస్తకాలు వెలువరించాల్సి ఉంది.ఇంతటి సాహితీ సంపన్నుని కృషికి తగిన గుర్తింపుగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం ఆనందదాయకం. ముఖ్యంగా పోతన శిష్యుడు వెలిగందల నారయ జన్మస్థలమైన మా ఊరు ఎలగందులకు జాతీయస్థాయి గుర్తింపు కలిగించి ఎలగందుల కీర్తి కిరీటంగా నిలచిన ఎలనాగకు అభినందనలు.
( కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద ప్రక్రియలో పురస్కారం లభించిన సందర్భంగా)
-వాధూలస,
97015 22234