జాను తెనుగుపదాల ఆనుపానులు ‘మనలో మాట’

సాహిత్యం

డా॥ వై. రామకృష్ణారావుగారు “కడలిగుండె” కవిగా లబ్ధప్రతిష్ఠులు. ఆ కవితా సంపుటికి చాలా పురస్కారాలు లభించాయి. అలాగే, ‘మనసు చిత్రాలు’ నానీలుగా బాగా ప్రతిష్ఠగొన్నది. రామకృష్ణారావు గారు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ప్రతిభాపురస్కార స్వీకర్త. డా॥ రామకృష్ణా రావు గారి నుండి నవంనవంగా వచ్చిన వ్యాస సంపుటి ‘మనలోమాట’ పుస్తకంపేరు చూడగానే ఇదేదో కాలక్షేపం కథాకమామీషూ, పత్రికలో కాలమ్ కింద పడక్కుర్చీ కబుర్లు బాపతు అనే అభిప్రాయం కలిగే అవకాశం వుంది. కానీ, ఇది కోటికొక్క వెలుగుదివ్వెగా, తెలుగు, తెలుగులో ఆంగ్ల నుడుల గురించి రాసిన అపూర్వ గ్రంథం.

పుస్తకంలో మొదటి భాగం తెలుగు నుడులు, నానుడులు, పలుకుబడుల గురించిన 32 సంక్షిప్త వ్యాసాలూ,రెండవ భాగంలో ఆంగ్లపదాల గురించిన 40 వ్యాసాలూ ఉన్నాయి. ఈ రెండు విభాగాల్లోనూ తెలుగు, తెలుగులో ఇంగ్లీషు రచయిత స్వీకరించినవన్నీ ప్రాచుర్యం పొందినవే. ఆయా పదాల పుట్టు పూర్వోత్తరాలూ, వాడుకలో విరిగిన వంకరలూ, తరిగిన వన్నెలూ, వెలిసిపోయిన చిన్నెలూ-అన్నీ సరళమైన, అలతి హాస్యం తళుకుతో వచ్చాయి.

మొదటి భాగంలో ‘పాపాయి’తో మొదలు! నాము మొదలైన గణాలకు చెందిన ‘పాము’ నుండే పాపవచ్చింది! పాపతేడు ప్రసిద్ధి – శివుడిపేరు! అలాగే ఈ పాప జననం నుండీ సాగే వివిధ దశల్లో ఆ’పాప’ చలనం, గమనం,

పయనం వరుస కూడా వివిధ భంగిమలతో ఉదాహరణ పూర్వకంగా వివరించారు రచయిత. ఇలా గొంతెమ్మ కోరికలు, ఒట్లు, పైరవీ, శంకనార్తి, చామన (చాయ), ససేమిరా, పిడకలవేట, బస్తీ, ఫలానా, జంబక్, ఎక్కాలు, జులాయి, పటారం-లొటారం… వంటివి అన్నీ రచయిత వివరణలో కొత్త పద ప్రపంచాన్నీ, నేపథ్యాన్నీ దృశ్యీకరించి చూపేయి.

రెండవవిభాగంలో – అరికాల్లో అసువులు, ఆడపెత్తనం, కో అంటే కో, కత్తి కాన్పులు – కడుపు కోతలు, వ్రేలాడేకాలం, స్కోరు, వంద, పవిత్రప్రమాణం… వంటి శీర్షికలతో అలరించాయి. పెళ్ళికొడుకు Groom’ ని అద్భుతంగా వివరిస్తూ ఇలా అన్నారు- ‘Bride ఇంగ్లీషులో ‘Bride’ అంటే పెళ్ళికూతురు, పెళ్ళికొడుకును ‘Bride Groom’ అంటున్నారు. అయితే ప్రాచీనమైన ఇంగ్లీషులో ఈ పదం ‘Bride Guma’ అనే విధంగా ఉండేది. ‘గుమా’ (Guma) అంటే పురుషుడు Man అని అర్థం. అంటే పెళ్ళికూతురుకు సంబంధించిన పురుషుడు అంటే ‘వరుడు’ అన్నమాట. ఇక్కడ కొడుకు. కూతురు అనే పదాలకు పుత్రుడు Son పుత్రిక (Daughter ) అనే అర్థాలు కాదు. ‘గుమా’ స్థానంలో కాలక్రమంలో గ్రూమ్ (Groom) వచ్చి చేరింది.

‘గుమా’ అనే ప్రాచీన ఆంగ్లశబ్దం వ్యవహారంలో మరుగున పడిపోయింది. అపుడు ‘గుమా’ స్థానంలో శబ్దసామ్యంవల్ల ‘గ్రూమ్’ చేరింది. అప్పుడు Bride Guma అనేది Bride Groomగా స్థిరపడింది. వ్యస్తంగా Groom అనే పదానికి ఉన్న అర్థం Bride Groom లోని Groomకి వర్తించదు. అది కేవలం శబ్దసామ్యంవల్ల వచ్చి చేరింది మాత్రమే. భాషా వ్యవహర్తలు అపరిచితమైన పదాల స్థానంలో తమకు బాగా పరిచయమైన పదాలను చేర్చి వ్యవహరించడం, అవి భాషలో స్థిరపడిపోవడం అనే అర్థం విపరిణామం అన్ని భాషలకూ సహజమే. దీన్నే ‘Folk Etymology’ (లోక నిరుక్తి లేక జానపద వ్యుత్పత్తి) అంటారు.

ఇలాగే, ‘డజన్’ కథ చెప్పారు. ‘అది సంఖ్యాపరంగా బహువచనం, సామూహిక సంఖ్యాపరంగా ఏకవచనం’ అంటూ- ‘ఈ Dozen కు ఆంగ్ల-ఫ్రెంచి మూలం Dozeyne/ Duzeine అనేది. దీనికి మూలం లాటికన్ లోని Duo Decim అనేది. Duo అంటే ద్వి-రెండు Decom అంటే దశ, పది, రెండు, పది కలిసి పన్నెండు.సంస్కృతంలో ద్వాదశి, ఇది మూలరూపం ఇంగ్లీషులో పాతకాలంలో వ్యాపారస్తులు బేకర్స్ డజన్ (Bakers dozen), డెవిల్స్ డజన్ (Devils Dozen) అనే పద్ధతిలో 13 వస్తువులు ఇచ్చేవారు. ఎందుకంటే రొట్టెల బరువులో గానీ, సంఖ్యలోగానీ కొంత నష్టం ఏర్పడితే దానిని పూరించడానికి ఒక రొట్టెను, బ్రెడ్ ముక్కను అదనంగా వేసేవాళ్ళు అందుకని. Bakers Dozen అంటే 13 అన్నమాట.

తూకం, కొలత మొదలైన వాటిలో ఏదైనా పొరపాటుగా తక్కువ అయితే, అమ్మకందారుపై జరిమానా విధింపబడేది. అందుకని ఎందుకైనా మంచిదని ఒకటి అదనంగా ఇచ్చే వారన్నమాట. ఆ ఒకటి Devils Dozen అన్నారు. ‘దేవుడి లెక్క’ అని కొలుస్తుండటం మనకీ ఉండేది.

నాచన సోముడు జాత్యముగాని తెనుగు రాయనన్నాడు. రామకృష్ణారావు గారు ఆ జాత్యమైన తెనుగు ఏమిటో రుచి చూపించారు.ఈ పుస్తకం ఒక అసాధారణ రచన.వ్యాసాలన్నీ మన ఆలోచనల్లో ‘మూస’ దనాన్ని మార్చి పసదనాన్ని కూర్చుకోవలసిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారన్నట్లు మన కతలన్నీ ‘జాతి కతలు!’ మన తెనుగు అంతా సుందరంగా, సరళంగా, సులభ గ్రాహ్యంగా వుంది. వారి భాషా శాస్త్ర ప్రావీణ్యతకు ప్రతివ్యాసమూ అద్దంపడుతుంది. వస్తుపరంగా, ప్రయోజనపరంగా మంచి సాహిత్య ఆకరాన్ని అందించిన రచయితకు అభినందనలు. తెలుగు భాషాప్రియులంతా తప్పక (కొని) చదవవలసిన పుస్తకం. (రచయిత సెల్. 8985743964)

-విహారి
98480 25600

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *