సాహిత్య ప్రక్రియలలో నిగూఢతను కలిగి, సాధారణంగా నడిచే వాక్యాలకు భిన్నంగా మనసును రంజింపజేయటమే కాకుండా ఆలోచింపజేసే శక్తివంతమైన పదాల మోహరింపునే ‘కవిత’ అంటూ ఒక నిర్వచనం తన గొంతును సవరించుకుంటోంది. కవిత్వం ఒక సృజనాత్మక సాహితీ ప్రక్రియ. కవిత్వం ఒక నిరంతర సాధన. కవిత్వమంటే అక్షర హింస కాదు,అది అక్షర తాండవం. కవిత్వమంటే ఒక అన్వేషణ, ఒక తీరని వేదన, ఒక ఆవేశం, ఒక ఆశయం. ఈ సమ్మేళనంలోని తాత్వికతకు హారతుల్లా నిలిచిన అతి కొద్దిమంది కవుల్లో బిగ్గరగా వినిపించే పేరు ‘ఏటూరి నాగేంద్ర రావు’. నెల్లూరు జిల్లా రేబాల గ్రామంలో జన్మించిన నాగేంద్రరావు సమాజాన్ని నిశితంగా పరిశీలించడాన్ని ఒక దినచర్యగా మార్చుకున్న కవి. తనదైన దృష్టికోణంలో కవిత్వం రాస్తూ ముందుకు సాగిపోతున్న వీరి కలంనుంచి వెలువడిన ఒక సాహిత్య ఆణిముత్యమే ‘అలా ఆగు కాసేపు…’ కవితా సంపుటి.
సంబరపడి తనను తాను అర్పించుకున్న రంగస్థలం ఓ రాత్రి భయాన్ని పరిచయం చేశాక దిగాలుగా నిలబడ్డ మనిషిని చూస్తూ ‘అనంతమైన దరిద్రాన్ని / భరించడానికి / నీ పంచేంద్రియాల శక్తి / చాలుతుందో లేదో!…’ అంటూ కవి వ్యక్తపరచిన సందేహాలకు మెల్లగా కళ్లు తెరిచిన మనిషికి అతని వ్యక్తిత్వంపై బూటు కాలి ముద్రల్ని చూపించి, కాటిసీన్ ల పద్యాల నాటకం వినిపించిన దృశ్యాలు ‘రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్’ రాసిన ‘ల్యాండ్ ఆఫ్ నోడ్’ వాక్యాలను గుర్తు చేస్తున్నాయి. ఎవరికీ అవసరంలేని త్యాగాలతో విసిగిపోయిన మనిషి నిస్తేజంగా పరుగులు తీస్తున్న సమయంలో ‘అలా ఆగు కాసేపు…’ అంటూ అరిచిన కవి కేకకు మనిషి ఆగిపోయాడు. ప్రాణం చివుక్కుమన్నా కిమ్మనటం లేదు. ఎదురుగా పూలను చూస్తూ వుండిపోయాక మనిషిలోని చప్పుడు చాలా స్పష్టంగా తనకు వినిపిస్తోంది. సర్వస్వాన్ని ఆకాశానికి ఇచ్చేశాక ఏ ఇసుకలోనూ అతడి అడుగులు కనిపించడం లేదు. ‘ఈ రాత్రంతా మనసారా నిన్ను కౌగిలించుకోనీ…’ అంటూ ఒక స్వరం అదృశ్యంగా అనుమతి అడుగుతోంది. అక్షరాల నిండా అనేక అర్థాల తలపాగాలు కనిపించడం అభివ్యక్తీకరణలోని ఒక చాతుర్యం మాత్రమే.
‘ఆమె నిర్జీవంగా వుంది / మనిషి ఎదురుగా / మరో చావును చూస్తూ…’ ఇది ‘వన్ మినిట్ ప్లీజ్’ కవితలో పలకరిస్తున్న దృశ్యం. ఈ దృశ్యాన్ని కవిత్వీకరించడంలో అవలీలగా కవి ప్రయోగించిన పదాల మోహరింపు మనల్ని ఒక నిమిషం పాటు వినేలా, చూసేలా చేస్తూ రోగాలు లేని నవ్వును శరీరాలుగా మార్చి అందిస్తోంది. ‘ఒక కవి ఎంత ఎక్కువ కవిత్వాన్ని చదివితే అంత మెరుగ్గా రాయగలడు…’ అంటూ పలికిన కవి శామ్యూల్ జాన్సన్ సత్యానికి నిలువెత్తు సంతకం చేస్తున్న కవిత ఇది. ‘రాబర్ట్ బ్లయి’ కవిత్వాన్ని గుర్తు చేసిన ఈ సంపుటిలోని ‘కవాతు’ కవితలో ‘ఉరమటమే గానీ కురవటం తెలియనివాళ్లు / అతి సామాన్య జీవితాలు / చావుకూడా భయపడి / తాకలేని వాతావరణం…’ అంటూ ఈ కవిత కవాతునిండా దేశం శవాల వాసన, మనుషుల కన్నీళ్లకు కదలని శిలాతత్వం, వెరసి దేశం గుర్తుకు వచ్చి, ఆ చుట్టుప్రక్కలే వున్న వాడి ఆచూకికోసం పాఠకుల వెతుకులాట ప్రారంభమవుతాయి.
____________
విడవకుండా మన వెంటపడి మరోసారి పలకరించే కవిత ‘కవాతు’. 19వ శతాబ్దపు జపనీస్ కవిత్వాన్ని అధ్యయనం చేస్తే అక్కడ కవిత్వం భాషయొక్క ఉలి ‘పాలరాయి’ గా మనం గుర్తించగలుగుతాం. ఏటూరి నాగేంద్రరావు ‘దుఃఖపు మజిలీ’ కవితను చదివాక, ఈ కవి వాడిన భాష ఉలి, కన్నీళ్ల కొలిమిలో దుఃఖపు లోహంతో చాలా పదునుగా తయారు చేసిన నిజాలు మనతో కరచాలనం చేయడం ఈ పుస్తక పఠనంలో ఒక చెదరని అనుభూతి, కదిలే జీవమున్న శిల్పంలా మారిపోతోంది.
____________
‘డిలాన్ థామస్’ తన కవిత్వాన్ని ప్రారంభిస్తూ… ‘కవిత్వం రాసేటప్పుడు సాహిత్యాన్ని మించిన అంతర్లీనత మరియు విస్తృతమైన ఉద్దేశ్యాన్ని కలిగివుంటే ఆ కవితలోని జీవం ఒక ప్రామాణిక స్థాయిలో సంతకం పెడుతుంది…’ అంటారాయన. అలాంటి ప్రమాణాలతో జీవం కలిగిన కవిత ‘అద్దెలేని లాడ్జి ఆ ఇల్లు’. ఇందులో వృద్ధాప్యానికి చేరిన చాలామంది నీడలు మనకు కనిపిస్తాయి. మరింతగా లోతుల్లోకి వెళ్లితే మన నీడలు కూడా అక్కడ హాజరుపట్టీలో తమ పేర్లను సైతం నమోదు చేసుకుంటూ వుండటం గమనించవచ్చు. తన మరణాన్ని కొనుక్కోవడానికి కూడా అనుమతి కోసం ఎదురుచూసేలా చేస్తున్న కఠోర వాస్తవాలు ఈ కవితలో వాక్యాలై పలకరించినప్పుడు, ‘ఈ నేలపై తిష్టవేసిన బంధాల్ని / చూసి గర్వపడాలా?…’ అన్న భావం భయంకరంగా జవాబులేని ప్రశ్నగా మిగిలిపోతోంది. ఈ కవితలో వర్ణించినట్లు ప్రతిదీ వాణిజ్యమయ్యాక మానవ సంబంధాలు ఏ టెలిస్కోపుకో అందని రహస్యాలుగా మిగిలిపోతున్నాయి. ఇది ప్రపంచంలోని సమస్త మానవజాతికి వర్తిస్తుంది. ఈ సార్వత్రిక భావసంపద మనల్ని కాసేపు ఆగమని, ఆలోచించేలా చేస్తోంది.
జీవితానుభవాన్ని ప్రత్యక్షంగా, సజీవంగా అనుభూతికి అందివ్వటమే తన కవిత్వ ధ్యేయంగా ప్రకటించుకున్న ఈ కవి ‘ఆఖరి చరణం’ కవితలో ‘బతుకంతా సుషుప్త మహా యజ్ఞమే / అవశేషాల్లో తిరుగాడే మనుషుల మధ్య / చెల్లా చెదురైన జీవితాన్ని / పిచ్చిగా వెతుకుతున్నాం / సముద్రమూ మేమూ ఒక్కటే…’ అంటూ ఈ పద్యంలో జీవితాన్ని సముద్రంతో పోల్చిన సందర్భం, అద్దేపల్లి రామమోహనరావు గారి ఒక కవితను గుర్తు చేస్తోంది. ‘గుండె వెనకనుంచి ఒక సముద్రం పిలిచినట్లుగా వుంటుంది / నా కవితా జీవిత యాత్రలో / సముద్రం నేపథ్యమై నిలిచిపోయింది…’ అంటారు అద్దేపల్లి. వీరిరువురు రాసిన పై రెండు కవితల్లోని సముద్రం ఒకటి కాదు. నాగేంద్రరావు రాసిన కవితలోని సముద్రంలో అలల పోటు ఎక్కువగా వుంది. ఈ సముద్రపు నురుగును చేత్తో తాకితే కన్నీళ్లు అరచేతుల్లోకి రాలుతున్నాయి. మంచి కవితగా తన ముద్రను అభిరుచి పలకలమీద చెదరని రాతల్లా దిద్దుకుంటున్న సందర్భమిది.
ఈ సంపుటిలోని కొన్ని వాక్యాలు అనంతమైన వ్యాఖ్యానానికి అర్హత పత్రాలను ప్రదర్శిస్తున్నాయి. ‘గానం చేసేవన్నీ పాటలు కావు / రాసేదంతా కవిత్వం కానట్టు..’ అంటూ స్వచ్ఛమైన సత్యాలు ఇందులో తొంగి చూస్తున్నాయి. మరోసారి కవి తన మనసు మైదానాల మీద వాస్తవాల పంటల్ని పండిస్తూ… ‘శూన్యతను, కన్నీళ్లను పంచుకుంటూ / ఒక సామాజిక జీవన స్వరూపాన్ని చిత్రిస్తుంటాను / ఒంటరి యుద్ధంలో / అద్భుత ప్రపంచాన్ని / కలకంటుంటాను / ఇస్త్రీ చొక్కా గాంభీర్యంతో /ఇరుకు మనుషుల మధ్య / నాదైన స్వరాన్ని వినిపిస్తుంటాను / నా దేశంలో చనిపోతున్నది / మనుషులు కాదు / పోరాటానికి ప్రతిబంధకాలైన / మనిషి ఆలోచనల కణాలు..’ అంటూ ‘కణాలు’ కవితానిండా ఆకాశం ఎత్తున ఎగిరే జెండాలతో కదంత్రొక్కిన ఏటూరి నాగేంద్రరావు భావాలు, ఆయన స్వరాన్ని, ఆయన ఉద్దేశ్యాన్ని సుస్పష్టం చేస్తూ ముందుకు సాగిన వైనం ఒక రంగుల చిత్రంగా నిలిచిపోతోంది. ‘నన్ను నేను ప్రశ్నించుకోవడం మొదలుపెట్టాక / మౌనం మనసుతో మాట్లాడుకుంటుంది …’ అంటూ కవితలకు ప్రాణం పోసే విధానాన్ని కవితాత్మకంగా తెలియజేసిన శైలి, పోలెండ్ కవయిత్రి ‘విస్లావా సింబొర్కా’ కవితలను గుర్తుచేయడం ఈ సంపుటికి అదనపు తాయిలాన్ని అందించినట్లుగా వుంది. ‘ఎవరు ఎందుకొచ్చేరో / ఏమో తెలియదు / అప్పుడప్పుడు వచ్చి వెళ్లి పోయే వాళ్లు /ఆఖరి రైలు కోసం / నడుస్తుంటారు..’ అంటూ ఒక తాత్వికత తన తత్వాలను పాడుకుంటూ ‘ప్రవహించాల్సిందే’ కవితలో తన తంబూర తీగల్ని సరిగమల స్పర్శతో తాకుతున్న దృశ్యం అద్భుతంగా వుంది. మానవజీవితాన్ని పెనవేసుకుని శాసించే సమస్త అంశాలను కవితా చట్రాలలో సమర్థవంతంగా బిగించిన బిగువు విస్తారంగా పండిన పంటలా ఊగుతోంది ఈ సంపుటిలో.
రాజమండ్రికి వెళ్లి గోదావరి నదిలోకి ఏ కవులు తొంగిచూసినా అక్కడ వాళ్ల ముఖాలు కనిపించవు, నేరుగా వీరేశలింగంగారి ముఖం కనిపిస్తుంది. ‘అలా ఆగు కాసేపు…’ కవితా సంపుటిలోకి తొంగిచూస్తే అక్షరాలు కనిపించడం లేదు. అన్నీ మనిషి తాలూకు జీవిత సత్యాలు గాజు పెంకుల మీద నిలబడి రక్తం కారే కాళ్లతో తపస్సు చేయటం స్పష్టంగా కనపడుతున్న దృశ్యం.
_____________
ఏటూరి నాగేంద్రరావు తన కవిత్వంలో చెప్పిదంతా బలంగానే వుంది. ఒక మంచి కవిత సృజన కావటానికి అవసరమైన కసరత్తులన్నీ ఆయన చేస్తున్నారు. కవిత పాఠకుడిని కదిలించటానికి ముందు, ఆ కవితా వస్తువుకు, ఆ భావానికి తాను కదిలిపోతున్నాడు. రసమయ ఘడియల్లో సృజనకాబడిన కవితను తడి ఆరకుండానే వెంటనే ఆయన బహిర్గతం చేయడం లేదు. కొన్నాళ్లు ఆగి మళ్లీ చదివినప్పుడు ఆ కవిత తనను మానసిక స్థితిలోకి తీసుకెళ్తుందో లేదోనని నిర్ధారణ చేసుకున్నాకే పత్రికల్లో ప్రకటిస్తున్నారు.
_____________
ఈ ప్రయత్నాన్ని ఆయన ఒక క్రమశిక్షణలో భాగం చేయబట్టే నిత్యం రాస్తున్న కవితలకు తాను మాత్రమే అనుభూతి చెందడం కాదు, కవితను చదివే పాఠకుల్ని ఆ అనుభూతి రహదారుల్లో నడిచే స్థాయిని కల్పిస్తున్నారు. ఈ సరిహద్దు రేఖల మధ్యన సురక్షితంగా వెలిసిన ఒక కవిత్వ సామ్రాజ్యమే ఏటూరి నాగేంద్రరావు కవిత్వం ‘అలా ఆగు కాసేపు…’. భవిష్యత్తులో మరిన్ని ఉత్తమ కవితా గ్రంథాల ఉత్పత్తి కర్మాగారంగా ఆయన సాహిత్య కృషి కలకాలం నిలవాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం.

-సాహిత్య ప్రపూర్ణ డాక్టర్ కె.జి. వేణు
98480 70084











