కాలుష్యం మీద ఖడ్గాలు విసిరిన కలాలు

సాహిత్యం

భూతలాన్ని మొత్తం శ్మశానంగా మార్చటానికి సిద్ధపడుతున్న అంశం కాలుష్యం. అణుబాంబులను మించిన విధ్యంసానికి ‘సై’ అంటూ కాలుదువ్వుతున్న కాలుష్యానికి తీర్థ ప్రసాదాలను నిత్యం అందిస్తున్నది మన మానవజాతి మాత్రమే. తీవ్రమైన ప్రమాదాలు పొంచి ఉన్నాయని తెలిసి కూడా, ప్రమోదంగా దాని ఉన్నతిని బలోపేతం చేస్తున్న మనిషి స్వార్థం, కాలుష్యానికి శ్వాసగా మారటం ఈ ప్రపంచం చేసుకున్న దురదృష్టాలలో అత్యంత హీనమైనది.

     ప్రతి దేశానికి ఉమ్మడి శతృవుగా మారిన పర్యావరణ కాలుష్యాన్ని ఎండగట్టటానికి, ఈ సమస్యపట్ల ప్రజలను జాగృతం చేయటానికి, ప్రకృతి పరిరక్షణ ఆవశ్యకత పాఠాలు బోధించటానికి, జరగబోయే భయంకరమైన వినాశనానికి అంతిమగీతం పాడటానికి సాహితీవేత్తలు తమ రచనల ద్వారా చేసిన, చేస్తున్న కృషి అభినందనపూర్వకంగా వుంది.

            మానవాళి మనుగడకు అత్యంత అవసరమైన అంశాలు వృక్షాలు. ‘వృక్షో రక్షతి రక్షితః’ సూక్తిని సంకీర్తనంలా గానం చేస్తూ, 2000వ సంవత్సరంలో దుద్దేల పుల్లయ్య “వృక్ష విలాపం” కావ్య సంపుటిని వెలువరించారు. చెట్టులో నేరుగా త్రిమూర్తులను దర్శించుకుంటూ గెడ్డాపు సత్యం “చెట్టు” కవితా ఖండికను విలువైన సాహిత్యంతో అందించారు. “చెట్లే ప్రగతికి తొలిమెట్టు…” అంటూ వడ్డేపల్లి కృష్ణ, “చెట్ల త్యాగం గణన చేయలేనిదంటూ…” జయంపు కృష్ణ, తమ కవితల్లో చెట్ల రుణం మానవాళి తీర్చుకోలేనిదంటూ ప్రబోధించారు.

     ఇంతలో నరులకు తరువులే గురువులని ప్రబోధిస్తూ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పద్యం, తన గొంతును సవరించుకుంటోంది. “కురుక్షేత్రంలో సైన్యం ప్రవహించినట్లు/ కాలుష్యం భల్లూక దాడి చేస్తోంది / ప్రాణవాయువు కరువైపోతున్న ప్రపంచంలో / మహా వృక్షాలను కూకటి వ్రేళ్ళతో కూల్చేస్తూ వుంటే/ స్వప్న వనాలను కోల్పోయిన దేశం / శ్మశానాల ముందు మోకరిల్లుతోంది…’ అంటూ ఈతకోట సుబ్బారావు తన ‘విశాలనయనం’ కవితా సంపుటిలో ఒక వాస్తవ చిత్రాన్ని బలమైన పదజాలంతో అందించారు. “చినుకులు రాలుతూ / గాలిలో ఆగిపోయాయి / ఎగిరి అందుకున్నాను / నా చేతులనిండా రక్తం / కత్తులతో కాలుష్యం…” అంటూ సాగిన గంగాధర్ మినీకవిత కాలుష్య గాఢత గురించి హెచ్చరిస్తోంది.

    “నిజానికి నాగావళి నది ఒక నిరంతర ప్రవాహగీతం…” అంటూ ప్రబోధించిన గంటేడు గౌరునాయుడు, వెన్నెల్లో మల్లెదండలా మెరిసిన నది, కాలుష్య కారణాలవల్ల నల్లవాగై భయపెడుతోందని, ప్రస్తుతం అది కరాళ కంఠానికి గాయమై చీములా ప్రవహిస్తోందని… తన వేదనను సాహిత్య వేదికనుంచి అందించారు.

     “మేరా భారత్ మహాన్ / ఈ మాట నాకిపుడు మహా భయంకరంగా వినిపిస్తోంది / నదిని నేను… ఆకాశం బ్రద్దలైపోయేలా ఏడ్వాలని వుంది / నాకిప్పుడు నీళ్లు కాదు కావలసింది / ఏడ్వటానికి కన్నీళ్లు కావాలి / దయచేసి ఎవరైనా ఇన్ని కన్నీళ్లు నాకు దానం చేయండి…” అంటూ కాలుష్యానికి చిక్కిశల్యమైపోయి, గొంతారిపోయిన ఓ నది ఆవేదనను “కన్నీళ్లు కావాలి” కవితలో డా. కొత్తపల్లి అందించారు.

     “మనిషి తన వికృత చేష్టలతో / ధరణీమాత నుదుటిపై మరణశాసనాన్ని లిఖిస్తున్నాడు…” అంటూ జనంమధ్య నిలబడి గొంతెత్తి అరిచిన కవి డా. నెమిలేటి కిట్టన్న. “భూమి చెత్త డబ్బా కాదు / ఓజోన్ పొర చిత్తు కాగితం కాదు / ప్రకృతికి పొగబెడితే / అది నీ మరణానికి ఘంటికలను మ్రోగిస్తుంది…” అంటూ హెచ్చరిస్తున్నారు కవి రొక్కం కామేశ్వరరావు.

     క్షణాలమీద రూపురేఖలే మారిపోయి నిర్జీవ ఎడారుల్లో దుఃఖం పాదముద్రల్లో కనిపిస్తున్న గ్రామాల స్వరూపాలను కలవరిస్తూ డా. చిల్లర భవానీదేవి “అన్నల్లారా! అక్కల్లారా! / ఈ రాళ్ల కుప్పల క్రింద ఈ మట్టి దిబ్బల మాటున / కంచెలు మేసిన చేలల్లో / మా ఊరు కూడా వుందేమో / కాస్త వెతికిపెట్టండి / గుప్పెడు మట్టిని దాచుకొని / గుట్టుగా వలసపోతాను…” అంటూ గుండెలోని బాధ మనల్ని కదిలించి, ఆలోచించేలా తన కవితను అందించారు.

     గ్రామాల అస్తిత్వం సర్వనాశనమైన వైనాన్ని పలమనేరు బాలాజీగారు ఇలా వ్యక్తం చేస్తున్నారు… “అలా వీధిలోకి అడుగుపెడితే చాలు / ఊరు మొత్తం ఆవిష్కరించబడేది/ ఉదయం ఉదయంలాగా / మధ్యాహ్నం మధ్యాహ్నంలాగా / రాత్రి రాత్రిలాగా / కనిపించే రోజులు పోయాయ్…” అంటూ, అదే సమయంలో నగరాల దైన్యాన్ని సైతం తన అక్షరాలలో పలమనేరు బాలాజీ ఇలా బంధిస్తున్నారు… “నగరాలనిండా హెూళీ పండగ రంగుల్లా / మృతదేహాలు చల్లబడుతున్నాయి / చివరకు రంగులు, శవాలు కలిసిపోయి / ఉమ్మడిగా సమసిపోతాయి…” అంటూ.. ” నేల గుండెకు పెట్టిన నిప్పును ఆర్పేందుకు / టెక్నాలజీ కాదు కావల్సింది / మనకు మన సహజత్వం కావాలి / బ్రతికేందుకు ఇంత స్వేచ్ఛ కావాలి…” అంటూ, తన కవితల పత్రాలను ప్రపంచానికి నిత్యం పంచుతున్నారు.

     పర్యావరణ పరిరక్షణ కోసం కోట్లు ఖర్చుపెడుతున్న ప్రభుత్వ పథకాలలోని డొల్లతనాన్ని బహిర్గతం చేస్తూ, కవి, రచయిత సడ్లపల్లె చిదంబరరెడ్డి తన గళాన్ని సవరించుకుని “పిచ్చుకలు కనుమరుగయ్యాయని / ఊర పిచ్చుక లేహ్యం చప్పరిస్తూ / వన్యప్రాణులు మాయమయ్యాయని / భోజనంలో జింక మాంసం నంజుకుంటూ / కపట వరిశోధనలతో / ఉద్యమ దగుల్భాజీ దండుతో / మీరు ఖజానాను ఖాళీ చేయనక్కరలేదు / బడుగు రైతన్నను సహజంగా సజీవంగా బ్రతకనిస్తే చాలు / అతడే / సమస్త జీవావరణ సంరక్షణా దీక్షల సైనికుడవుతాడు…” అంటూ దిక్కులు పిక్కటిల్లేలా ‘మహాభినిష్క్రమణం’ కవితా సంపుటిలో గానం చేస్తున్నారు.

     ప్రకృతిని నాశనం చేసే చర్యలను తీవ్రంగా వ్యతిరేకించిన రవీంద్ర త్రివిక్రమ్ తన ‘జీవన వసంతం’ కవితలో ఇలా అంటున్నారు… “మనిషి మృత్యువై / అపురూప పక్షి, జంతు జాతుల్ని / ప్రకృతినుంచి కర్కశంగా చెరిపివేస్తే / ప్రకృతి ప్రళయాంతకమౌతుంది…’ అంటూ హ్చెరిస్తున్నారు.

     కాలుష్యం దండయాత్రలో అవయవాలు తెగిన ఈ లోకం స్థితిని అందిస్తూ… ” నీలినీడలు పరచుకున్న ప్రపంచం / అంతా ఒక శవాగారమై సాక్షాత్కరిస్తున్న వేళ/ ఇక్కడ పలకరించుకునేవన్నీ శవాలే / ఇదో శవాల జాతర / ఇంతకంటే ప్రపంచానికి / మరణం మరొకటుంటుందా ?…” అంటూ తన భావాలను జనంముందు ఉంచుతున్నారు కవి చిన్ని నారాయణరావు.

     ప్రమాదకర కాలుష్యానికి కారణమైన ప్లాస్టిక్ ను నిరసిస్తూ బద్ది నాగేశ్వరరావు తన కవితలో “మట్టిలో ఎప్పటికీ కలవని ప్లాస్టిక్ పాపాయిని / భుజాన మనం మోస్తూ / మట్టికొట్టుకు పోతున్నాం…” అంటూ ఆవేదనను వ్యక్తం చేస్తే, “బ్రతుకు చెట్టు పుష్పించాలంటే / ప్లాస్టిక్ పొదల్ని నరికేసి / నేలతల్లికి కొత్త అంటు కట్టాలి / కొత్తతరం మనుషుల్ని నిలబెట్టాలి…’ అంటూ డా. బీరం సుందరరావు వర్తమాన మనుషులకు మార్గనిర్దేశం చేస్తున్నారు.

     కాలుష్యం కారణంగా రోగపీడితుడైన మనిషిని చూసి “దేహం దేవాలయం కాదిప్పుడు / దయ్యాల కొంప / కోటాను కోట్ల బ్యాక్టీరియాలు, వైరస్ లు, ప్రోటోజోవాలు / గబ్బిలాల్లా దేహకణాల చూర్లు పట్టుకుని / వ్రేలాడుతున్నాయి / గుండె రహదారులమీద ట్రాఫిక్ జామ్ లు / నీ దేహం బాంబుల కర్మాగారమవుతోంది / నీ అవయవాలన్నీ మందుపాత్రల్లా ప్రేలిపోతాయి / కాలుష్యం మీద పోరాటం వదిలేశావా / నీ ప్రాణాలిక దక్కవు…” అంటూ ప్రపంచ మానవాళిని, తీవ్రంగా కవి సలీం హెచ్చరిస్తున్నారు.

     ఆకాశంలో ప్రయాణించే వాహన కాలుష్యంవల్ల చిద్రమవుతున్న ఓజోన్ పొర గురించి డా. పి. విజయలక్ష్మీ పండిట్ తన “ధరిత్రీ విలాసం” కవితా సంపుటిలో ప్రస్తావిస్తూ ఓజోన్ పొర రక్షణ బాధ్యత ప్రపంచ ప్రజలందరిదంటూ గుర్తుచేశారు.

     రాజకీయ నాయకులు తమ పదవులను అడ్డుపెట్టుకొని అడవులను నాశనం చేస్తున్న దుర్మార్గాన్ని ఎం. సత్యవతి “కిటికీ” అనే కవితలో తూర్పారపట్టారు.

     ప్రకృతికి ద్రోహం తలపెట్టగానే మానవజాతి నాశనం మొదలు అవుతుందంటూ దాశరథి రంగాచార్యులు ‘జీవనయానం’ అన్న కవితలో తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఈ సందర్భంలో అద్దేపల్లి ప్రభు ‘పిట్ట లేని లోకం’ దీర్ఘకవిత గుర్తుకొస్తోంది. అందులో ఆయన పిట్టల గురించి చెప్పుతూ “కళ్లకొక పిచ్చుక కనపడదు / చెవులకొక కోయిల గొంతు వినపడదు/ మనిషి చుట్టూ డబ్బు గడ్డకట్టి / చివరికి మనిషి వొంటరి శిలాజంలా మిగులుతాడు…” అంటూ వెల్లడించిన మాటలు వాస్తవాలకు హారతులు పడుతున్నాయి.

     మితిమీరిన సెల్ టవర్లనుంచి వెలువడే రేడియోతరంగాలు పిచ్చుకల పాలిట ఎలా మృత్యుతరంగాలుగా మారుతున్నాయో ఎస్.ఆర్. భల్లం ‘పిచ్చి (క) ప్రేమ’ కవితలో వివరిస్తూ, మానవజాతి బాధ్యతను కూడా గుర్తుచేస్తున్నారు. ‘పండే భూముల్ని త్రవ్వి పరిశ్రమలు పెడుతున్నావ్… కూడెవడు పండిస్తాడు?…’ అంటూ తన కవితలో లేవనెత్తిన ఛాయారాజ్ ప్రశ్నకు ఇప్పటిదాకా జవాబు దొరకలేదు. “ఓ కవులారా! ఓ మేథావులారా! ఓ పౌరులారా! / మీ కలాలకు ప్రాణం పోసి / మీ మెదడుకు బూజు దులిపి / పచ్చదనం కోసం ఉద్యమించండి…’ అంటూ కొమ్మవరపు విల్సన్ రావు తన ‘ఉద్యమించోయ్’ కవితలో పిలుపునిస్తున్నారు. “నాగరికతను నిలబెట్టిన నదులు / అనాగరికంగా హింసించబడ్డాయి..”

అంటూ ‘జల కాలుష్యం’ కవితలో తన ఆవేదనను అక్షరాల రూపంలో వ్యక్తం చేస్తున్నారు కవి కె.వి. రామానాయుడు. రసాయనాల విషాల వల్ల నేల సత్తువకు జరుగుతున్న నష్టాన్ని గుర్తుచేస్తూ… “తల్లి వాసన వేసే పల్లె మట్టి ఇప్పుడు / టర్మినేటర్

విత్తుమింగి / ఆత్మహత్యకు సిద్ధపడుతోంది…” అంటున్నారు కవి పెరుగు రామకృష్ణ.

       ఈ విధంగా సామాజిక బాధ్యతలో భాగంగా వందలాదిమంది కవులు తమ కలాలను ఖడ్గాలుగా మార్చి కాలుష్య భూతంమీద యుద్ధం సాగించిన సందర్భాలు కోకొల్లలు. సృష్టిలోని అనంతకోటి ప్రాణరక్షణ కోసం, సహజ వనరుల సంరక్షణ కోసం, జలసంపద క్షేమం కోసం, నేల మట్టికణాల గొంతులకు బిగించిన కాలుష్య ఉరిత్రాళ్ల క్షేధన కోసం, సస్యశ్యామలంగా సాగే పచ్చదనం పరవళ్ళ కోసం, కాలుష్యమనే పదాల ఉనికిని మానవ నిఘంటవుల నుంచి మాయం చేయటం కోసం, కవులు సాగిస్తున్న ఈ సాహిత్య ఉద్యమం విజయవంతం కావాలని, పర్యావరణ పరిరక్షణ బాధ్యత, ప్రతి మనిషికి పుట్టుకతోనే ఒక శ్వాసలా మారాలని ఈ సందర్భంగా అశిద్దాం.

 

-డాక్టర్ కె.జి. వేణు,

 98480 7008

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *