ప్రతి ప్రశ్నకు సమాధానం చూపించిన ‘జాషువా’ పద్యాలు

సాహిత్యం

నవయుగ కవి చక్రవర్తిగా కీర్తించబడిన గుర్రం జాషువా తెలుగు సాహిత్యంలో ఒక సుప్రసిద్ధ కవివరేణ్యులు. ఆయన దళితులకు ఎదురైన వివక్షను, సామాజిక అసమానతలను తన కవిత్వం ద్వారా బలంగా ప్రశ్నించారు. ఆయన రచనలను సామాజిక స్పృహకు తార్కాణాలుగా పరిగణింపవచ్చు. బాల్యం నుంచే పేదరికం, కుల వివక్ష, అవమానాలు, అవహేళనలు, ఎదుర్కొన్నారు. ఈ అనుభవాలే ఆయన కవిత్వానికి ప్రధాన ప్రేరణగా నిలిచాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు. ఆయన సంస్కృతం, తెలుగు భాషలపై మంచి పట్టు సాధించి అగ్రకుల దిగ్గజ సాహితీవేత్తలచే ‘భళా’ అనిపించిన సాహితీ దిగ్గజం జాషువా.

ఆయన రచనల్లో, ముఖ్యంగా గబ్బిలం వంటి కావ్యాలలో, సమాజంలో అణగారిన వర్గాల పట్ల ప్రగాఢమైన కరుణ, సానుభూతి కనిపిస్తాయి. యుద్ధాలు అనేవి కరుణ, సానుభూతిని నాశనం చేసి, ద్వేషం, విధ్వంసానికి దారితీస్తాయని అభిప్రాయపడినారు.

సరైన నాయకత్వం కొరవడినప్పుడు, పాలన ఎలా వుంటుందో, దాని వలన జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో జాషువా గారి పద్యాలలో మనకు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఉదా: జాషువా గారు.. ’ఇతర ఖండకావ్యములు’లో బ్రహ్మనాయుడు చేత పలికించిన ఉత్పలమాల పద్యం చూడండి.

ఉ. “ఎక్కడ జూచినంబ్రజల యేడుపులుం బెడబొబ్బలుల్లమున్/ ముక్కలుసేయ రాచరికముం వెలిగించెడు వారు దుష్టులుం/ కంచయెచేను మేసినటుగా పరిపాలకులే ప్రజాళివే/ధించెడు బందెపోటయి ప్రతిక్షణ హత్యలు చేయుచున్న మీ/ పంచ వసింప మీ రొసగు స్వార్థపరాయణమైన కూడు భ/క్షించి మనస్సు చంపుకొని చేయగజాలను మంత్రి వృత్తి మ/న్నించి యొసంగుడీ సెలవు నేనిక పోయెద లాతి చోటికిన్”

ఈ కవిత రాజకీయం, అధికారం, స్వార్థం, అణచివేత, మరియు నమ్మదగిన నాయకత్వం లేకపోవడం వంటి వాటిని గురించిన మేలిమి వ్యాఖ్యానంగా భావింపవచ్చు.

“పరిపాలకులే ప్రజాళి వేధించెడు బందెపోటయి ప్రతిక్షణ హత్యలు చేయుచున్న మీ” అనే పంక్తి పాలనలో భయం, హింస, మరియు నిరంతరం జరిగే హత్యలను తెలియజేస్తుంది. ఇది ప్రజలు భయంతో బ్రతుకుతున్నారని, వారికి రక్షణ లేదని స్పష్టం చేస్తుంది.

“స్వార్థపరాయణమైన కూడు భ/క్షించి మనస్సు చంపుకొని చేయగజాలను మంత్రి వృత్తి మ/న్నించి యొసంగుడీ సెలవు నేనిక పోయెద” అనే పంక్తులు నిజాయితీ లేని నాయకుల గురించి లేదా వారి సొంత స్వార్థం కోసం ప్రజల ప్రయోజనాలను విస్మరించే వారి గురించి తెలియజేస్తున్నాయి. మంత్రి తన మనసు చంపుకొని పని చేయలేనని, తనకు సెలవు కావాలని అడగడం ద్వారా, ప్రస్తుత పరిస్థితులతో నిస్సహాయంగా ఉన్నాడని లేదా ఆ పరిస్థితులకు అంగీకరించలేడని తెలియజేస్తున్నారు.

ఈ పద్యం పల్నాటి యుద్ధము నాటి రోజులలో జరిగిన ఒక అణచివేత, దౌర్జన్యపూరితమైన పాలనను, మరియు ప్రజలు పడే కష్టాలను, భయాలను వివరిస్తుంది. స్వార్థం, అవినీతి, మరియు నిజమైన నాయకత్వం లేకపోవడం వల్ల సమాజంలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో తెలియజేసే పద్యమిది. ఇది సామాజిక మరియు రాజకీయ విశ్లేషణతో కూడిన ఒక లోతైన రచనగా మనం చెప్పుకోవడమే గాక నేటి రాజకీయ స్థితికి కూడా అద్దం పడుతుందని చెప్పవచ్చు.

2

జాషువా గారు ‘కాందిశీకుడు’ కావ్యంలో రాసిన ఈ క్రింది పద్యంలో హింసాత్మక లోకాన్ని గురించి ప్రస్తావించి, దానిని మార్చడం సాధ్యమేనా అని ప్రశ్నిస్తోంది. మానవత్వం లేని హింసాపరులకు జాలి, దయ వంటి మానవతా విలువలు నేర్పడం ఎంత కష్టమో ఈ పద్యంలో చెబుతారు జాషువా. అంటే, హింసతో నిండిన ప్రపంచాన్ని మార్చడానికి హింసాపరులలో మార్పు తీసుకురావడం చాలా పెద్ద సవాలు అని ఎప్పుడో చెప్పకనే చెప్పారు మహాకవి.

ఆ పద్యం చూడండి:

కం. “హింసాత్మకమగు లోక మ/హింసాత్మక మగుట సాధ్యమే మిత్రమ? యీ/ మాంసాశనులకు మానవ/ హింసకులకు జాలిమందు లెట్లు రుచించున్”.

ఇలా..ప్రపంచంలో జరిగే ఏ విషయంపైనైనా జాషువా గారు ఏదో ఒక కావ్యంలో చెప్పారనిపిస్తుంది.

3

జాషువా తన సిద్ధాంతాలకు కట్టుబడి జీవించారు. తమ రచనల్లో చెప్పిన విలువలను స్వయంగా ఆచరించారు.ఉదా: తన కుమార్తె ‘హేమలత’ ను బ్రాహ్మణ కులస్తుడు ‘లవణం’ కు ఇచ్చి వివాహం చేయడం. ఇది ప్రజల్లో ఆయన పట్ల విశ్వాసాన్ని పెంచింది.

జాషువా గారు అణగారిన వర్గాల గొంతుకగా నిలిచి, వారి ఆవేదనను, ఆకాంక్షలను ఉన్నత స్థాయికి చేర్చారు. ఆ కోణంలో చూస్తే, ఆయన ఒక సామాజిక నాయకుడి పాత్రను సమర్థవంతంగా పోషించారనిపిస్తుంది.

జాషువా గారు సమానత్వం, సామాజిక న్యాయంతో కూడిన సమాజాన్ని కలలు కన్నారు. ఇది ఒక గొప్ప దార్శనికత. ఆయన కవిత్వం ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక సాధనంగా ఉపయోగపడింది.

జాషువా గారి సాహిత్య కృషికి అనేక బిరుదులు, సత్కారాలు లభించాయి.వాటిలో కవి చక్రవర్తి, కవి కోకిల,కవితా విశారద,కవి దిగ్గజ,మధుర శ్రీనాథ, నవయుగ కవిచక్రవర్తి, విశ్వకవి సామ్రాట్,కళా ప్రపూర్ణ. మొ. బిరుదులతో పాటు అనేక పురస్కారాలు, సత్కారాలు పొందారు. 1964లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ తోపాటు ‘కళా ప్రపూర్ణ’ బిరుదును అందుకున్నారు.

జాషువా కవిత్వం సరళంగా ఉండి, సామాన్యులకు సైతం అర్థమయ్యేలా ఉండేది. సమాజంలోని దురాచారాలపై ఆయన కలం నిర్భయంగా పోరాడింది.

జాషువా గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా వారు అందించిన అపారమైన, అమూల్యమైన సాహితీ సంపద ద్వారా తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు.

టాపిక్ చెప్పినప్పుడు పద్యాలను సూచించి సహకరించిన డా.బీరం సుందర రావు గారికి, జాషువా గారి చిత్రాన్ని అద్భుతంగా చిత్రించి ఇచ్చిన కూరెళ్ళ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు.

(జూలై 24 గుఱ్ఱం జాషువా వర్ధంతి నివాళులతో)

-విల్సన్ రావు కొమ్మవరపు