అనిశెట్టి రజిత ఇక లేరా!

వరంగల్లు: కవి, గాయకురాలు, ఉద్యమోపజీవి, ఉపన్యాసకురాలు, వ్యాస రచయిత్రి, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఆవిర్భావ సభ్యురాలు, ప్రస్తుత జాతీయ అధ్యక్షురాలు అనిశెట్టి రజిత వరంగల్లులో నిన్న రాత్రి గం.10.22 లకు (ఆగస్టు 11వ తేదీ) గుండెపోటుతో మరణించారు.

హైస్కూల్ విద్యార్థిగా 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది. ఇంటర్ విద్యార్థిగా ప్రగతిశీల మహిళా సంఘం(pow) పిలుపుకు ప్రతిస్పందించింది. సమకాలపు సామాజిక చలనాలకు కదిలిపోతూ కవిత్వమైంది. 1982లో కాకతీయ అధ్యాపక బృందం విద్యార్థులు కలిసి ఏర్పాటు చేసిన స్త్రీజనాభ్యుదయ అధ్యయన సంస్థలో భాగస్వామి అయింది. 1984లో ‘గులాబీలు జ్వలిస్తున్నాయి’ అనే చిన్న కవితా సంపుటిని ప్రచురించింది. అందులో ఒకటి రెండు మినహాయిస్తే అన్నీ స్త్రీల సమస్య కేంద్రంగా వచ్చిన కవితలే. స్త్రీ సమస్యపై అధ్యయనం, ఆచరణ కార్యక్రమాలు- ఇవే రజిత కవితా వస్తువులు. అంతేకాదు, ఆనాటి మహిళా ఉద్యమ అవసరాల నుండి రజిత జానపద గాయకురాలు అయింది. శబ్దలయను గురించిన స్పృహ ఆమె రచనలోనూ ధిక్కారం ఆమె గానంలోనూ స్వభావమై ఒదిగిపోయాయి. సారా వ్యతిరేక ఉద్యమం, మలిదశ తెలంగాణ ఉద్యమం, పోలవరం ప్రాజెక్ట్ వ్యతిరేక ఉద్యమం, మల్లన్న సాగర్ వ్యతిరేక ఉద్యమం, ముజఫర్ నగర్ మారణకాండ నిరసన ఉద్యమం, ఏదైనా కానీ ఆనాటి నుండి మరణించే వరకు ఒకచేత్తో ఉద్యమ జండా ఒకచేత్తో కవితా పతాక ఎగరేస్తూ నినాదమై ప్రవహించిన పాట అనిశెట్టి రజిత.

రజిత కవితా సంపుటాలు నాలుగు- ‘నేనొకనల్ల మబ్బునవుతా(1997), చెమట చెట్టు (1998), ఉసురు (2002), అనగా అనగా కాలం (2005), దస్తఖత్ 2005, నానీలు గోరంతదీపాలు 2005, నన్హే ఓ నన్హే 2007) ఆమె వ్రాసిన హైకూలు. ఓ లచ్చవ్వ 2005, మార్కెట్ స్మార్ట్ శ్రీమతి’ (2010) ఆమె వ్రాసిన దీర్ఘ కవితలు. సామాజిక ఉద్యమ సందర్భాలకు స్పందిస్తూ, ఉద్యమాలలో ఊరేగింపులలో భాగమవుతూ వ్రాసిన కవిత్వాన్ని తన కవితా సంపుటాల నుండి ఏర్చి కూర్చి ’నిర్భయాకాశం కింద’ అనే కవితా సంపుటిని 2016 లో ప్రచురించింది. మరికొన్ని కథలు, అనేక సాహిత్య సంపుటాలకి సంపాదకత్వం వహించారు. అది అసలైన ఆమె సాహిత్య వ్యక్తిత్వం.

తెలంగాణ ఉద్యమకాలంలో తెలంగాణ రచయితల వేదిక నిర్మాణంలో చురుకైన పాత్ర పోషించింది. మహిళా ఉద్యమ అస్తిత్వ చైతన్యం నుండి విస్తరించిన బహుళ అస్తిత్వాల సమభావన నుండి ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక నిర్మాణంలో భాగమైంది. ఈ పదహారేళ్ళుగా ప్రరవే జాతీయ కార్యవర్గంలో బాధ్యతాయుతమైన స్థానాలలో ఉండి పనిచేసింది. ఒక పనిని పెట్టుకొంటే పూర్తయ్యేవరకు మనుషుల వెంట హెచ్చరికగా నిత్య సంభాషణలు, సత్యశోధనకు, సామాజిక సంఘర్షణల వైరుధ్యాలను అర్ధం చేసుకొనటానికి ఎంతదూరమైనా ప్రయాణం రజిత కార్యాచరణ వ్యక్తిత్వంలో కీలకమైనవి. అటువంటి రజిత హఠాన్మరణం ప్రరవేకి తీరని దుఃఖం, తీరని లోటు. ఆమె సంస్థకి అందించిన స్ఫూర్తి కొనసాగించడానికి శక్తిని కూడగట్టుకుంటూ నివాళులు తెలుపుతున్నాము.

ఆగస్ట్ 12 వ తేదీ ఉదయం 11 గంటల వరకూ కాకతీయ విశ్వవిద్యాలయం మొదటి గేటుకి ఎదురుగా ఉన్న ప్రొ. కాత్యాయనీ విద్మహే ఇంటివద్ద అనిశెట్టి రజిత పార్థివ దేహం ఉంటుంది. ఆమె శరీరదానం చేసినందువల్ల తరువాత కాకతీయ వైద్య కళాశాలకి అప్పగిస్తాము.

-ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక

What do you feel about this post?

0%
like

Like

0%
love

Love

0%
happy

Happy

0%
haha

Haha

0%
sad

Sad

0%
angry

Angry