తెలుగు నాట అస్తిత్వ ఉద్యమాలు అందించిన చైతన్యం మామూలుది కాదు. ఆధిపత్య కుటుంబాల కనుసన్నల్లోంచి అట్టడుగు బతుకుల్లోకి, అవమానాల వీధుల్లోకి, ఆత్మగౌరవపు వాకిట్లోకి సాహిత్య సృజన విరివిగా సాగింది. ఆ చైతన్యంతో ఎవరి జీవితాలను వారు, ఎవరి గాథల్ని వారు రాసుకోవడం ఒక ఎత్తు అయితే, అట్టడుగు బతుకులు పట్ల సానుకూల వైఖరితో, సానుభూతి, సహానుభూతితో రాసిన సాహిత్యం మరో చేర్పు.
__________
అనాదిగా అభివృద్ధికి దూరమైన ఆదివాసీల, గిరిజన జీవితాల నేపథ్యంలో ఆదివాసీలు, గిరిజనులు రాసిన సాహిత్యం రావాల్సినంత విరివిగా రాలేదు. ఇక గిరిజనేతరులు, గిరిజనులు గురించి రాసిన సాహిత్య కృషి కూడా చాలా తక్కువనే అనిపిస్తుంది. అయితే ఇటీవల సాహిత్యంలో ఈ ఖాళీలను పూరించే ప్రయత్నం చేస్తున్న యువతరంలో చిత్తూరు జిల్లా, పలమనేరు తాలూకా, కాలువపల్లెకి చెందిన కె.వి. మేఘనాథ్ రెడ్డి తనదైన అవగాహనతో, స్పష్టతతో రచనలు చేస్తున్నారు.
__________
అట్టడుగు జీవితాలతో, ముఖ్యంగా యానాదుల జీవితాలతో దగ్గరగా జీవించిన అనుబంధంతో, నేస్తరికం నెరిపిన అనుభవాలతో ‘పాయిదరువులు’ నవలా రచనకు పూనుకోవడం అభినందనీయం. తెలుగులో యువతరం చేస్తున్న ఈ కృషిని విస్మరిస్తే సాహిత్యానికి ద్రోహం చేసినట్టే.
ఇప్పటిదాకా తెలుగులో స్త్రీలు ప్రధాన పాత్రలుగా, స్త్రీ పోరాటాల నేపథ్యంగా వచ్చిన నవలలు తక్కువే అని చెప్పవచ్చు అందునా అనేక దాస్టీకాలకు, ఆధిపత్యాలకు, వివక్షలకు, అవమానాలకు గురవుతున్న అట్టడుగు కుటుంబాల తల్లుల జీవితాల ఆధారగంగా వచ్చిన నవలలు తెలుగులోనే కాదు భారతీయ సాహిత్యంలోనూ తక్కువేనేమో!?
అడవిబిడ్డల, ఆదివాసీల అవస్థలు, ఆవేదనలు,ఎదుర్కొంటున్న అన్యాయాలు ఈ నాగరిక సమాజానికి అర్ధం కావాలంటే అటుగా కృషి చేయాల్సిన అవసరం చాలా ఉంది. అందులోనూ ఆదివాసీ కుటుంబాల, గిరిజన స్త్రీల ఆత్మాభిమానాన్ని చిత్రించిన నవలలు ఏవీ అంటే ఎతుకులాడుకునే పరిస్థితి ఇప్పటికీ ఉంది.
ఈ పరిస్థితుల్లో వర్తమాన కథకుడు, యువ రచయిత మేఘనాథ్ మొరసునాడు ప్రాంతపు యానాది స్త్రీ బతుకుపోరును వస్తువుగా తీసుకుని నవలను వెలువరించడం తెలుగు సాహిత్యానికే కాదు భారతీయ గిరిజన సాహిత్యానికీ విలువైన చేర్పుగా భావించాలి.
నవల పేరులోనే ప్రత్యేకత ఉంది. ఇది అచ్చమైన మొరసునాడు ప్రాంతపు పలుకుబడి. నవలలో కథా కథనం, పాత్రచిత్రణ, సంభాషణలు రచయిత జీవితాలతో ఎంత మమేకమయ్యాడో, ఆ జీవన సౌందర్యాన్ని ఎంతలా సొంతం చేసుకున్నాడో ఆయా సన్నివేశాలు చదువరులకు ఎత్తి చూపుతాయి.
మొరసునాడు ప్రాంతపు ప్రజల ఆచారాలు, ఆహారపు అలవాట్లు, జీవాలు మేపడంలో, వాటికి వైద్యం చేయడంలో సహజమైన ప్రాకృతిక పరిజ్ఞానం, నేర్పితనం, మొదలైన విషయాలను నవలలో రచయిత, పాఠకులకు వివరించడంలో చాకచక్యత మనల్ని సమ్మోహితుల్ని చేస్తూ కథ వెంట నడిపిస్తాయి.
ఈ దేశంలో గిరిజన ఆదివాసీలకు ఉన్న ప్రాదేశిక పరిజ్ఞానం, వైద్య పరిజ్ఞానం ఎంతో విలువైనది. మానవ సంబంధాలను, మనిషితనం నిలుపుకోవడంలో వనవాసుల తరువాతే ఎవరైనా అన్న వాస్తవానికి ఈ నవల అద్దం పడుతుంది.
‘పాయిదరువులు’ అచ్చంగా అడవి బిడ్డల కథ. మూగజీవాల కథ. తల్లిని, బిడ్డని వేరుచేసి వేడుకచూసే పాయ దరువుల కథ. ఇది మూలవాసుల కథ. మట్టిమనుషుల కథ.. నేలతో ముడిపెట్టుకున్న బొడ్డుపేగును తెంపిన వాడి దుర్మార్గాన్ని నిరసించిన ప్రేమ కథ.
ప్రేమా, ఆప్యాయతలు తప్ప ఆ స్తీ, అంతస్తుల గురించి భ్రమలు లేని భగ్న ప్రేమికుల కథ. అడవి, అడవిలో చెట్టూ చేమా, వాగు వంక సాక్షిగా చెప్పుకున్న ఊసులు,చేసుకున్నబాసలు నడుమ మనసుని మెలిపెట్టే దొమ్మదాయికాలు ఈ నవలలో మనల్ని కదిలిస్తాయి. మనిషికి-గొడ్డుకి, మనిషికి-అడవికి, మనిషికి-మూగజీవాలకు ఉన్న అలివిమాలిన అనుబంధాల్ని వివరించే నవల ఇది.
గిరిజన ఆడబిడ్డ ఆధిపత్యంపై అహంకారంపై సాగించిన పోరాటం, ఆత్మాభిమానం ఈ నవలలో మనల్ని ఉగ్గబట్టి చదివిస్తాయి. నవలాకారుడికి వస్తువు పట్ల శ్రద్ధను, నిబద్ధతకు అద్దం పడతాయి.
రచయిత ఇప్పటికే ‘కలుంకూరి గుట్ట’ కతల పుస్తకంతో తెలుగు సాహిత్యంలో తనదైన ముద్ర వేశాడు. రచయితగా తన ప్రాంతపు ప్రజల భాష పట్ల, పలుకు బడుల పట్ల, జనజీవితపు సాంస్కృతిక, సామాజిక అంశాల పట్ల బాధ్యత,గౌరవం వున్నవాడు. కనుకనే అచ్చమైన మొరసునాడు ప్రాంతపు భాషలో, చిత్తూరు జిల్లా భాషలో, రాయలసీమ భాషలో తన రచనల్ని సంపన్నం చేస్తున్నాడు. కనుమరుగై పోతున్న అనేక మట్టి మాటలకు జీవం పోస్తున్నాడు. ఆ రకంగా భాషను బతికించే బృహత్తర కార్యానికి పూనుకున్నాడనిపిస్తుంది.
తన కథల్లో లాగే ఈ ‘పాయిదరువులు’ నవల్లోనూ అట్టడుగు జీవితాల భాషకు పట్టం గట్టాడు ఈ రచయిత. ఇది ఈ నవలకు మరింత అందాన్ని, ఆకర్షణీయతను చేకూర్చింది. కేవలం పాత్రల సంభాషణలు మాత్రమే కాకుండా నవల మొత్తం కథ నడుస్తున్న ప్రాంతపు జీవద్భాషలో ఉండటం విశేషంగా చెప్పవచ్చు.
__________
నవలను చదువుతున్నంత సేపూ మనమూ ఆ కాలంలోకి, ఆ ప్రదేశాల్లోకి, ఆ జీవితాల్లోకి, ఆ యానాది గుడిసెల్లోకి, వారి కులదైవం కన్నియమ్మ ఉత్సవాల్లోకి వెళ్తాము. వారి దరువులకి పూనకమొచ్చి చిన్నమ్మితో కలిసి చిందులేస్తాము. చిన్నమ్మి ఆనందుడికి ప్రేమగా పెట్టిన బండగొజ్జురుచికి లొట్టలేసుకుంటాము. స్యాలమానొంకలోనో, వడెసెట్ల గుంటలోనో, గుంపుగా నీళ్లు తాగుతున్న మేకల్ని “కుయోవ్.. కుయోవ్..” అంటూ పిలుస్తున్న పిలుపులు చెవుల్లో మొగుతుంటాయి.
__________
పసికందు లింగాలుగోడు కోసం కన్నతల్లిలా తపించే చినమ్మి కనిపిస్తాది. చిన్నమ్మి కోసం అడవిదారి పట్టిన ఆనందుడు.. తల్లిలేని బిడ్డని కంటికి రెప్పలా కాపాడిన పాపులమ్మ. దిగులుగా నిలబడ్డ యానాది గుడిసెలు కనిపిస్తాయి. ఆధిపత్యపు కనుబొమ్మలు ఎగరేస్తూ మన మధ్య తిరుగాడుతున్న ఎందరో రాజయ్యలు ఈ నవలలో మనకు ఎదురవుతారు.
రాజయ్య ఏమయ్యాడు? ఆనందుడు ఏమయ్యాడు? కడాకు చిన్నమ్మి ఏ నిర్ణయం తీసుకుంది? నవల పూర్తిచేయందే మనం నిమ్మళంగా ఉండలేం.
“యానాదు ల్యానాదులేడబోయిరో.. చెట్టుగొగురు పుట్టకొగురు చెదిరిపూడ్సిరో. గసికకర్ర యిరిగిందో.. బతుకు చక్రమాగిందో..చిక్కమే..చిందుబొందులైయ్యిందో…చెప్పెటోళ్లేవురు మా యానాదుల్ని చేరదీసేటోళ్లేవురు? వొప్పేటోళ్లేవురు మేముకూడా మీ మాదిర్తో మనుసులమేనని” ఆనేసి గెట్టిగెట్టింగా పాట పాడుకుంటా.. కండ్లు నిండకా నీళ్లు పెట్టుకుంటా.. గసిక కర్రని పైకి ఎగరేస్తా అడుగేసే పెద్దబ్బి మన ముందు నిలబడితే ప్రేమగా ఆలింగనం చేసుకుంటాం.
అట్టడుగు కుటుంబాల ఆడబిడ్డల్లోని ఆత్మవిశ్వాసాన్ని, పట్టుదలను, పోరాట పటిమను కాలం ఏవిధంగా మింగేసిందో కళ్ళకు కట్టిన ‘పాయిదరువులు’ నవల ఒక దృశ్యకావ్యాన్ని చూసిన అనుభవాన్ని ఇస్తుంది.
తెలుగు నవలా చరిత్రలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోగల శక్తి ఉన్న ఈ రచనకు స్వాగతం.
-పల్లిపట్టు నాగరాజు.
99894 00881