యన్.టి.ఆర్.శాసనసభ ప్రసంగాలు- విహంగ వీక్షణం

సాహిత్యం

‘నందమూరి తారక రామారావు గారి శాసనసభ ప్రసంగాలు’.. అందమైన రామారావు గారి చిరు దరహాసపు ముఖచిత్రంతో ప్రచురితమైన మహోద్గ్రంథం.
మంచి లామినేటేడ్ పేపర్ తో తయారైనటువంటి పుస్తకం ఇది. శాసనసభలో వివిధ సమస్యలపై చేసిన ప్రసంగాలను పుస్తక రూపంలో వెలువరించడం వలన నేటితరం,భావితరం తెలుగు జాతిపట్ల యన్.టి.ఆర్ కు ఉన్న ప్రత్యేక శ్రద్ధ ఎటువంటిదో తెలుస్తుంది.
‘సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు’ అని ‘పేదవాడికి పట్టెడన్నం పెట్టడమే తన విధాన’మని నిర్వచించిన ఎన్టీఆర్ తప్ప,సగటు జనం ఆకాంక్షలను పట్టించుకున్న రాజకీయ నాయకుడు ప్రపంచంలో ఎవరైనా కన్పిస్తారా! అందుకే ఆయన పేదల పెన్నిధి,గొప్ప మానవతావాది, అందరికీ ఆరాధ్యుడు, నిత్య చైతన్య స్రవంతి. ఆయన ఒక సంచలనం. సంస్కరణల అభిలాషి. సంక్షేమ బాటకు వారధి. సాహసం, సంకల్పం, నైతిక బలం ప్రజల సంక్షేమం, అభివృద్ధి ఆయన నైజం.
ఈ సంకలనంలోని ప్రసంగాలను చదివినప్పుడు ప్రతి ఒక్కరికీ ఆయన అందించిన మర్యాద, మన్ననతో కూడిన పలకరింపు ఆశ్చర్యం కలుగుతుంది.రైతుల పక్షపాతిగా ఆయన చేసిన సేవ, వ్యవసాయ పంటలకు మద్దతు ధర నిర్ణయం మనకు అవగతమౌతుంది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఒక తాటిపై తీసుకొని వచ్చి చేసిన ప్రసంగం, ప్రజాధనం ఒక్కపైసా దుర్వినియోగం అయినా అది ఆమోదయోగ్యం కాదని, తాను ఆచరించి చూపిన వైనం గురించి చదువుతుంటే యన్.టి.ఆర్. నిబద్ధత ముందు మనం చేతులు కట్టుకొని నిలబడాల్సిందే!.

ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు.. ఉద్యోగం పొందే వయోపరిమితిపై వివరణల్లో చేసిన ప్రసంగం, చేనేత కార్మికుల సంక్షేమంపై, వరద బాధితులను ఆదుకున్న చర్యలను వివరిస్తూ చేసిన ప్రసంగం, అభివృద్ధి నిరోధక చర్యలను ప్రశ్నిస్తూ చేసిన అనేక ప్రసంగాలు ఈనాటి రాజకీయ నాయకులకు కనువిప్పుగా అర్ధం చేసుకోవచ్చు.
పరిశ్రమలను గ్రామాలకు తీసుకొని వెళ్లడం వలన లాభాలు, ‘తుపాకీ చూపిస్తే శాంతి ఏర్పడుతుందంటే నాకు నమ్మకం లేదం’టూ పోలీసు శాఖ పనితీరుపై ప్రసంగం, ఉద్యోగులపై సోదర భావం, అవినీతిపై వేటు వేస్తూ చేసిన ప్రసంగం, వివిధ పథకాలలో రాయితీ విధానం, రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం, సంక్షేమ పథకాలపై ప్రసంగం, మాతృభూమి రుణం తీర్చుకోమని ప్రవాసాంద్రులను కోరడం, విదేశీ యాత్రలకు ఆయన పెట్టిన ఖర్చు వివరాలు గురించి చదువుతుంటే ఎంతో రమ్యంగా ఉంటుంది.
వృత్తిపరమైన విద్యా బోధనలో అనుసరించాల్సిన పద్ధతులు, నిరుద్యోగ సమస్యకు పరిష్కారాలు, అధికార వికేంద్రీకరణపై తీసుకున్న నిర్ణయాలు,వాటిపై తీర్మానాలు, చర్యలు, ప్రస్తావనలు, కరువు కాటకాలు, నూతనత్వపు పోకడలతో మాతృ భాష తెలుగులో జారీ చేసిన ఆదేశాలు, తీర్మానాలు,మతసామరస్యంపై నిర్మొహమాట తీర్మానాలు, వివరణలు చదువుతుంటే సగటు మానవుడి జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి యన్.టి.ఆర్.పడిన తపన ఎలాంటిదో అర్ధమవుతుంది.

ప్రభుత్వాలు తీసుకునే ఏ చర్య అయినా ప్రజల పక్షాన ఉండి, ప్రజలకు వివరించాలనే ప్రతిపాదనకు, వివరణలు – ప్రశ్నలు, సలహాలు-సూచనలు, చర్యలు ప్రతి విషయం పైన అనర్గళంగా శాసనసభలో చేసిన ప్రసంగాలు ఈ పుస్తకం చదివినప్పుడు మనకు దృగ్గోచరమౌతుంది.
ఆనాటి పరిస్థితులకు తక్షణమే స్పందించి ఎంత చక్కటి పరిపాలన అందించారో.. అలాంటి పరిపాలన ఈనాటి వరకు అందించినవారు లేరనే చెప్పాలి. ఆయన మాటల్లో ఖచ్చితత్వం,నిబద్దత, ఏ విషయమైనా సునిశిత పరిశీలన, నిర్మొహమాటం, నిరాడంబరత, సేవాగుణం అన్నీ ఈ పుస్తకం చదువుతుంటే మనకు బోధపడతాయి.
ఈ ప్రసంగాలను చదువుతుంటే..ఈనాటి సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో నేటి రాజకీయ నాయకులకు ఒక మార్గదర్శకత్వంగా ఉన్నాయనడంలో సందేహం కలుగదు. చదువరులకు మంచి విషయ పరిజ్ఞానం అందిస్తుంది ఈ గ్రంథం. ఇందులో ఉన్న చిత్రాలను చూస్తుంటే.. తారక రామారావు గారు మన కళ్ళ ముందు ప్రత్యక్షమైనట్లుగా మన అనుభవంలోకి వస్తుంది.
_________
నందమూరి తారక రామారావు గారి ఉపన్యాసాలు వింటుంటే.. మన మనసు ఆనందంతో నాట్యం చేస్తుంది. ‘మనిషి అంటే ఆయనలా ఉండాలి. మానవత్వంతో పరిమళించాలి. మమకారాన్ని అందించాలి. మూర్తిమత్వం కలిగి ఉండాలి. ఎప్పటికీ అందరి మదిలో ఆదర్శనీయుడుగా, పేదల గుండెల్లో దేవుడిగా కొలువై ఉండాలి’ అనే కాంక్ష ప్రతి ఒక్కరిలో కలగటం సహజం. కానీ అది మన నందమూరి గారికి మాత్రమే సాధ్యం.
_________

అధికారంలో వున్నప్పుడు మాత్రమే గాక, ప్రతిపక్ష నేతగా వున్నప్పుడు కూడా చేసిన చాలా ప్రసంగాలు ఇందులో కూర్చి సమగ్రంగా సమాచారం అందించారు ముద్రాపకులు.
విలువలతో కూడిన మహోన్నతుడి ప్రసంగాలను గ్రంథస్థం చేసి,యన్.టి.ఆర్ ను తెలుగుజాతి స్మరించుకునే అవకాశం కలిగించిన పబ్లిషర్స్- జయప్రద ఫౌండేషన్ వారు, పుస్తక ప్రచురణకు సహకరించిన వదాన్యులు తొండెపు దశరథ జనార్దన్ గారు ధన్యులు.

 

-డా. రాధా కుసుమ
ఫోన్: 99892 41319
అధ్యక్షులు, కుసుమ ధర్మన్న కళాపీఠం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *