సాదా సీదా ‘క- 34’

సాహిత్యం

వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్ ల సారథ్యంలో క్రమం తప్పకుండా వెలువడుతున్న కథా వార్షిక సంకలనం ‘క-34’ లేదా కథ 2023. అక్టోబర్ 6 వ తేదీన ఖమ్మంలో ఆవిష్కరణ జరుపుకుని సాహిత్య లోకంలోకి ప్రవేశించి నెల రోజులపైనే అయింది. ఇప్పటికే ఈ సంకలనం మీద చాలా సమీక్షలు వచ్చాయి. సంపాదకులు ఇద్దరూ స్వయంగా కథా కథన చక్రవర్తులే కనుక వారి ఎంపికలో వంక పెట్టడానికి ఏమీ ఉండదు. సాధ్యమైనంత వరకు మంచి కథలను మాత్రమే ఎంపిక చేస్తారు. కనుక సంకలన నాణ్యత విషయంలో వేలెత్తి చూపించడానికి ఏమీ లేదు. ఈ సంకలనాన్ని కథ 2023 అనడానికంటే ‘క -34’ అనడానికే నేను ఇష్టపడతాను.

‘క -34’ వెలువడిన సమయానికి మాత్రం కాస్త ప్రాముఖ్యం ఉన్నది. సరిగ్గా నెలరోజులు ముందు అనుకుంటాను తెలంగాణా నుండి “మాది మాదే మీది మీదే” అని కొంతమంది కవులు రచయితలు తమకు జరుగుతున్న అన్యాయం గురించి వ్యాసాలు రాసి సామాజిక మాధ్యమాలలో పంచుకున్నారు. అది తెలుగు సమాజంలో కొంత చర్చను రేకెత్తించింది. ఈ కథా సంకలనం వెలువడిన తరువాత రాయలసీమకు చెందిన ప్రముఖ కథకుడు వెంకటకృష్ణ ఒక ఇంటర్వ్యూలో “నవీన్ కు రాయలసీమలో నచ్చే ఒకరిద్దరు రచయితలు వున్నారు. వాళ్ళు కథ రాస్తే వాటిని తీసుకుని తన మిషన్ సంపూర్ణమైనది అనుకుంటాడు” అని కామెంట్ చేశాడు. అది కథా సంకలనాలు మీదే అని ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు.

కథా సంకలనాలు మీద ఈ విమర్శ కొత్తగా వస్తున్నదేమీ కాదు. ఈ సంకలనాలు వెలువడటం మొదలు పెట్టినప్పటి నుండీ వున్నదే. అప్పుడు కాస్త సణుగుడు, గొణుగుడు రూపంలో వున్నది కాస్తా ఇప్పుడు అక్షర రూపంలోకి వచ్చింది.

ఈ విమర్శ వున్నది అన్న విషయం సంకలనకర్తలకు కూడా తెలుసు. అయినా దాన్ని సరిచేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేసినట్టు ఎక్కడా కనపడదు. ‘క-34’ కి రాసిన ముందుమాటలో “సాధారణంగా కథా సంకలనాలు వస్తు, ప్రాంత, కాల ప్రాతిపదికన మూడు రకాలుగా ఉంటాయి. కాల ప్రాతిపదికన వచ్చే సంకలనాలు ఆ కాలంలో జరిగిన సామాజిక పరిణామాలను, మానవ జీవితంలో కాలానుగుణంగా వచ్చే మార్పులను కచ్చితంగా నమోదు చేయగలుగుతాయి. సామాజిక అధ్యయనాలకు ఇవి కూడా ఒక సాధనం” అని చెప్పారు. కథ -2023 అని సంకలనానికి కాల ప్రాతిపదికను తీసుకున్నప్పుడు 2023లో ఉన్న తెలుగు సమాజాన్ని ఇవి ప్రతిఫలిస్తున్నాయా అన్నది ఒక ప్రశ్న. ఆ దృష్టితో చూసినప్పుడు ఈ సంకలనంలోని 15 కథలు కాస్త నిరాశనే మిగిల్చాయి. ఆ సంగతి సంకలనకర్తలకు కూడా తెలుసు. కనుకనే “ఆ సంవత్సరపు సంఘటనలు ప్రతిఫలనాలను వార్షిక సంకలనాల కథల్లో ఎక్కువగా ఆశించడం అత్యాశే అవుతుంది. పైగా కేవలం వస్తు ప్రాధాన్యతతోనే కథల ఎన్నిక జరగదు కదా! శైలీ, నిర్మాణపరంగా అవి మంచి కథలయి ఉండాలి. కథ చెప్పే పద్దతిలో కొత్తదనం కనపడాలి. వాటికి చదివించే గుణమూ ఉండాలి. అయినా వార్షిక సంకలనాల ప్రాధాన్యత ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అందుకు కారణం సమాజ గమనాన్ని క్రమానుగతంగా అర్ధం చేసుకోవడానికి, కథా నిర్మాణంలో నెమ్మదిగా ప్రవేశిస్తున్న మార్పులను, శిల్ప పరిణామాలను అంచనా వేయడానికి ఈ సంకలనాలే మార్గదర్శకాలు” అని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యల ఆధారంగా ఈ సంకలనం కథలను చేర్చుకోవడానికి వాళ్ళు ఏర్పరచుకున్న ప్రాతిపదికలు 1) వస్తు ప్రాధాన్యత 2) శైలి నిర్మాణ పరంగా కొత్తదనం 3)చదివించే గుణం అని పాఠకుడు అర్ధం చేసుకోవచ్చు.

దాదాపు 2500 కథలను చదివి అనేక వడపోతల అనంతరం ఎంపిక చేసిన ఈ 15 కథలు సమాజంలోని వివిధ పార్శ్వాలను వెంటాడుతున్న అభద్రతా భావాన్ని అనేక పరాన్ముఖ కోణాలలో చర్చించిన మంచి కథలు ఇవి అని చెప్పుకున్నారు. కానీ నాకు అయితే సమాజంలోని వివిధ పార్శ్వాలలో అనేక పరాన్ముఖ కోణాలు చేర్చినట్టు అనిపించడం లేదు.

15 కథలలో ముగ్గురు తెలంగాణా కథకులు ఉంటే, రాయలసీమ కథకుడు ఒకే ఒక్కడు (వేంపల్లి షరీఫ్ ) ముగ్గురు ప్రవాసాంధ్రులు. (పాణిని జన్నాభట్ల, అఫ్సర్, యాజి ) ఈ ముగ్గురు ప్రవాసాంధ్రులలో ఒకరు తెలంగాణ వారు. అంటే మొత్తంగా చూసుకుంటే తెలంగాణను రెప్రసెంట్ చేస్తున్నది ఇద్దరే అన్న మాట. బావుంది రాయలసీమ నుండి ఒక్కరు, తెలంగాణ నుండి ఇద్దరు. మా సంకలనం మా ఇష్టం అంటే ఏమీ చెప్పలేము కానీ, గత ముప్పయ్ ఐదేళ్లుగా ఈ సిరీస్ నిరాటంకంగా వస్తున్నది అంటే తెలుగు ప్రజలు ప్రాంతాలకు అతీతంగా ఈ సంకలనాలకు ఇస్తున్న విలువ, ఆ విలువ చేకూర్చిన లెజిటిమసీ సంపాదకులు గుర్తుంచుకోవాలి కదా! ఈ సంకలనాలు వెలువడటం మొదలయిన తరువాత, తెలంగాణా వరంగల్ నుండి వచ్చిన కథా వార్షికలు, రాయలసీమ నుండి వచ్చిన కథా వార్షికలు దశాబ్ద కాలం కూడా రాకుండా కనుమరుగైన విషయం గుర్తుంచుకుంటే సంపాదకుల మీద ఉన్న బాధ్యత ఏమిటో అర్ధం అవుతుంది.

ప్రవాసాంధ్రులలో యాజి రాసిన కథ ‘ప్యారడైజ్’ తెలుగు భాషలో రాసిన కథ తప్పిస్తే అది తెలుగు కథ కాదు. పాణిని జన్నాభట్ల కథ ‘చెయ్యాల్సిన పని’, వేంపల్లి షరీఫ్ ‘అన్ షెడ్యూల్డ్’ ఒకే అంశం మీద రెండు రకాలుగా రాసిన కథలు.

_____________

కుప్పిలి పద్మ ‘మెట్రో కావల’ ఆర్ధిక స్వాతంత్య్రమా? మాతృత్వమా ? అన్న ప్రశ్న వేసుకుని మాతృత్వానికి ప్రాధాన్యం ఇచ్చి వెనక్కు వెళ్లిన మంగ కథ. మంగ నిర్ణయం సరి అయినది అని కానీ సరి కానిది అని కానీ సందిగ్దస్థితిలో పాఠకుడిని నెట్టేసి పాఠకుడిని చివరకు ఒప్పించే కథ. ఆమె తనకు అలవాటైన రీతిలో అలవోకగా అల్లేసిన కథ. వేగంగా చదివిస్తుంది.
_____________

కత్తి పద్మ ‘పులస’ కథ, భాషలో భావంలో మిగతా కథల కంటే కొన్ని యోజనాల ముందు వున్న కథ. అర్బన్ ప్రాంత స్త్రీ ఉద్యోగంతో ఎలా మమేకం అవుతుందో గ్రామీణ రవణమ్మ తన భూమితో అలాగే మమేకం అవుతుంది. ఉద్యోగం భరోసా ఇచ్చినట్టే భూమీ భరోసా ఇస్తుంది. ఉద్యోగానికి రిటైర్మెంట్ ఉంటుంది కానీ భూమితో బంధానికి రిటైర్మెంట్ ఉండదు.

సుజాత వేల్పూరి ‘మనిషిని నేను’ తనను తాను వంచించుకోవడంలో మనిషి ఎంతటి నిష్ణాతుడో పర్ఫెక్ట్ గా వంక పెట్టడానికి వీలు లేకుండా చెప్పిన కథ. బెజ్జారపు రవీందర్ ‘సుశీత’ అవడానికి ఒక అత్యాచారానికి గురి అయిన ఆడపిల్లను అక్కున చేర్చుకున్న సంస్థ కథే అయినా అది చర్చకి పెట్టిన విషయం మాత్రం విస్మరించలేనిది. చాలా కాలం క్రితం రాసిన ఒక కవితలో “స్త్రీ శత సహస్ర దళ వికసిత పద్మమై విప్పారితే ఆ పరిమళోజ్జ్వల కాంతికి పురుషుడు మూర్ఛ పోతాడు ” అని రాసాను నేను. రవీందర్.. ‘తొందరపడకు చిట్టి తల్లీ, ఎందుకంటే స్త్రీత్వాన్ని స్వీకరించగల అర్హుడైన పురుషుడే లేడు ఈ లోకంలో. అందరూ అరకొర మగాళ్లే’ అంటాడు.

మొత్తం 15 కథలలో స్త్రీలు ప్రధాన పాత్రలుగా, స్త్రీల భావోద్వేగాలు, సమస్యలు కేంద్రంగా ఉన్న కథలు ఆరు వున్నాయి. మనిషిలోని భయాన్ని, బతుకు మీది బెంగను చెప్పే కథలు నాలుగు. యాజి ‘ప్యారడైజ్’ బతుకు మీద ఆశను పెంచే కథ. ఈ వైవిధ్యాన్ని చూసే సంపాదకులు వివిధ పార్శ్వాలు అన్నారేమో. ఛాయా మోహన్ బాబు ‘చప్పుడు చెయ్యని శబ్దాలు’ హిందీ పాటల నేపథ్యంలో చక్కగా చిక్కగా అల్లుకున్న కథ. చదవడానికి హాయిగా , ఆహ్లాదంగా వుంది.

అఫ్సర్ ‘రకూన్’ కథ బావుంది. తను తెలుగు భాషలో రాసాడు కనుక తెలుగు కథ అయింది, కానీ మరే ఇతర భాషలో రాసిన అది ఆ భాషా కథగానే గుర్తింపు పొందేది. ఎందుకంటే అమెరికాలో నివసించే ప్రవాసీల బాధ వాళ్ళు ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా ఒకటే కనుక. దేశరాజు కథ ‘ఆలీబాబా అనేక దొంగలు’ ను కాస్త ఎడిట్ చేసుకోవాల్సింది. రీడబిలిటీ లేదు.చాలా పాత కథలను కొత్తగా చెప్పడం బావుంది కానీ శిల్ప పరంగా, నిర్మాణపరంగా కొత్తగా చెప్పిన కథలు ఏవీ లేవు.

_____________

చివర శారద శత జయంతి సందర్భంగా తన గురించి చిన్న రైటప్, ఒక కథ ప్రచురించడం బావుంది. ఈ సంకలనం చివర 2023లో వచ్చిన మరికొన్ని కథలు అని ఒక లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్ లో వున్న శ్రీ ఊహ ‘లడాయి’ కథ ఈ సంకలనంలో ఉండి ఉండవలసింది. తెలుగు సమాజంలో పెచ్చు పెరిగిపోతున్న మతతత్వం ధూల్ పేట్ లాంటి అధోజగత్ ప్రపంచం నుండి బయటపడి కొత్త జీవితం ప్రారంభించాలి అనుకున్న ఒక ముస్లిం యువకుడి కలలు ఎలా కల్లలు చేసిందో ప్రతిభావంతంగా చెప్పిన కథ. అది చదివినప్పుడే కథ 2023లో ఉంటుంది అనుకున్నా.
_____________

ఒక సాధారణ పాఠకుడిగా ఈ కథా సంకలనంలో ఎందుకు లేదు? అని అడిగే అవకాశం కానీ హక్కు కానీ నాకు లేదు. రూ.140/- పెట్టి సంకలనం కొని చదివిన వినియోగదారుడుగా అసంతృప్తి వెల్లడించే సౌలభ్యం నాకుందనే అనుకుంటాను.మొత్తంగా ‘క -34’ అసంతృప్తిని మిగిల్చింది. నాకే కాదు సంపాదకులకు కూడా.

ఎంత అసంతృప్తి లేకుంటే : “గాలికి పండుటాకులు రాలినట్టు జ్ఞాపకాలు రాలుతూనే ఉంటాయి. మీద పడ్డ ఒక్కొక్క వర్షం బొట్టు దేహంలోకి ఇంకిపోతుంది. తలలోకి ఇంకిన నీళ్లు యుగయుగాల మురికినంతటినీ కడుగుతున్నట్లుంది” (చప్పుడు చేసే నిశ్శబ్దాలు).ఇలాంటి భావస్పోరక అద్భుత వాక్యాలు ఈ సంకలనం అంతా పరచుకుని ఉంటే ఎంత బాగుండును? అని ముగించారు సంపాదకులు తమ ముందు మాటను. ఈ ఒక్క మాట చాలదా ఈ కథా సంకలనాన్ని అంచనా వేయటానికి.

 

 

-వంశీకృష్ణ
95734 27422

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *