మల్లాది వసుంధర గారి ‘నరమేధము’, ఆచార్య ముదిగొండ శివప్రసాద్ గారి ‘శ్రావణి’, ‘చంద్రకళ’ వంటి నవలలు, ఇక విశ్వనాథ సత్యనారాయణ గారి నవలా సర్వస్వం చదువుతూ పెరిగిన తరం మాది. కథకు చారిత్రక సత్యాలు జోడించి ప్రత్యక్ష పరోక్ష రీతిలో ప్రతిబింబించేట్టు వ్రాయడం ఒక ప్రత్యేక లక్షణం. పుస్తకం తెరిస్తే చాలు, ఆనాటి లోకంలోకి వెళ్ళిపోతాం.ఆ మధ్య ‘శప్త భూమి’ నవల చారిత్రక నేపథ్యంలో సామాజిక అసమానతల స్వభావ స్వరూప చిత్రణ ఎలా చేయవచ్చో తెలిపింది. ‘మనోధర్మ పరాగం’ నవల ఒక సమూహం జీవించిన విధానాన్ని సవివరంగా శోధించింది.
______________
మారుతీ పౌరోహితం గారు రచించిన ‘ప్రణయ హంపీ’ నవల కూడా చారిత్రక ప్రాధాన్యత గల కథతో ఎంతో ఆసక్తికరంగా నడిచింది.సుందర హంపీ నగరం పండుగకెలా ముస్తాబైందో చెబుతూ మొదటి పేజీలోనే ‘తుళ్ళి పడుతున్న యవ్వనం వీధుల్లో కుప్పబోసినట్లు నగరం మిడిసి మిడిసి పడుతోంది’ అన్నారు. ఇక అక్కడి నుంచి ప్రతి పది,పదిహేను వాక్యాలకొక వాక్యం జీవ చైతన్యంతో తొణికిసలాడటం ఈ నవలలో మనం గమనించవచ్చు. ఇది కదా! నవల లక్షణం అనిపిస్తుంది.
______________
వర్ణన, వివరణ దాటిన పైమెట్టు మీంచి, ఒక సంఘటనను కళ్ళకు కట్టేలా చూపించి, పంచేంద్రియాలను సమీపించగల వాక్య సృష్టితో ఉండే నవల, పాఠకులను అభిమానులుగా చేసుకుంటుంది.
ఈ రచయిత చదివిన పరిశీలనా గ్రంథాలు ఆయన గమనింపులోకి వచ్చిన చారిత్రక సత్యాలు. ‘తొమ్మిది అంతస్తుల మాడి’, భవనాల గోడలపై చిత్రించబడ్డ బొమ్మలు- శిల్పాలు..ఇలాంటివి ఆ కాలపు నిర్మాణ వివరాలను తెలియజేశాయి. కూచిపూడి భాగవతుల ప్రదర్శనలో సామాజిక శ్రేయస్సును కోరే కళా ప్రయోజనం కనబడుతుంది. దొమ్మరాటలో, శారీరక విన్యాసాలు చేస్తూ, ఆ కళాకారులు చూపించే లాఘవం, దేవాలయ ప్రాంగణంలో కోలాటం చేసే సమూహాలు, రాజసేవకులుగా వందల కొలది పరిచారికలు, కొజ్జాలు ఉండడం.. ఇవన్నీ అలనాటి జీవన చిత్రాన్ని పట్టిచ్చే సునిశితమైన అంశాలు. తురకవాడలో గోవధను అనుమతించడం, ప్రార్థన చేసుకునేందుకు సమ్మతించి,తద్వారా మహమ్మదీయులను కూడగట్టుకునేందుకు అప్పటి విజయనగర రాజుల ఆలోచన అక్బర్ పాదుషా హిందువులతో సహనంతో మెలగిన వైనాన్ని గుర్తుచేస్తుంది.రాజాస్థానంలో పరిపాలనా యంత్రాంగపు దర్పం, రాజకీయపు ఎత్తుగడల్లో వ్యూహాత్మకత, అంతఃపుర వర్ణనతోపాటు రాణివాస స్త్రీల పరిస్థితి..వంటివి క్లుప్తంగా, స్పష్టంగా చెప్పగలగడం రచయిత నేర్పు. ‘బయటకు కనిపించే అంతఃపుర వైభవం వెనుక కన్నీరు’ ఉన్నట్టు కథానాయకుడు గ్రహించి మనకు సవివరంగా చెబితే, ఏ కాలంలోనైనా స్త్రీ అనుభవించినది దాస్యమే అని తెలుసుకుని ఎద కలుక్కుమంటుంది.
యుద్ధం అనివార్యమైనది. రెండు మతాలు, వేర్వేరు సమూహాలు కలిసిమెలిసి జీవించే సంఘ సంస్కృతి మానవాళికి ఎప్పుడూ అరుదే! ఎంత దురదృష్టకరమైన విషయం ఇది! కానీ ఇదే సత్యం. మనిషికి అహంభావం,రాజుకు రాజ్యకాంక్ష, అందరికీ సంపదపై మోహం, అధికారమే అంతిమ లక్ష్యంగా వ్యక్తిగత కారణాల కోసం పాలకులు చేసే యుద్ధాలు ఇవన్నీ సామాన్యుల జీవితాన్ని ఘోరంగా దెబ్బతీస్తాయి.ఈ నవలలో సంఘర్షణ (Conflict) వ్యక్తి- సమాజం, రాజరికం -మత వైరుధ్యం, అధికారకాంక్ష- నమ్మకద్రోహం అనే మూడు తలాల(planes)లో కనిపిస్తుంది.
రచయిత ముక్కు సూటిగా నిజాన్ని చెబుతూ, తాను చేసిన పరిశోధన సాక్షిగా ఒక్కో ఉపరితలంలోని గతాన్ని మన ముందు ఆవిష్కరించారు. ఇది ఈ నవలలో ముఖ్యమైన అంశం. ఎటూ వీగిపోకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పగల నిజాయితీ చారిత్రక నవలకు బలం. ఆ సంయమనం పది కాలాల పాటు నవల పాఠకుని మనసులో ముద్ర వేసేలా చేస్తుంది. నాటకీయమైన మలుపులు, కృత్రిమమైన ఉపకథలు ఇందులో లేవు. ‘వలంది’ అనే స్త్రీ పాత్ర యుధ్ధభూమిలో సైనికుల ప్రాణాలతోపాటు సమాంతరంగా విధ్వంసానికి గురయ్యే ఆడవాళ్ళ బలి గురించిన అనేక వివరాలు పాఠక హృదయాన్ని మెలిపెడుతూ చెబుతుంది. యుధ్ధమనే ప్రక్రియలో, సైన్యమనే వ్యవస్థలో దాగిఉన్న మానవ పతనాన్ని చూపిస్తుంది.
‘కాల్పనిక నవల’ అని ప్రకటించినా కథను వాస్తవికతకు దగ్గరగా నడిపిన విధానం చాలా బాగుంది.నిజానికి కథనం అనేది ప్రతిసారీ ఉద్విగ్న భరితం కానక్కర్లేదు.ఉదాత్త భావాలను కలిగిస్తే చాలు.అదే పదివేలు. ఒకానొక ఆనందభారంతో ఆఖరి పుట ముగిసాక కూడా కథలో పాత్రల మాటలు, దృక్పథం మన చుట్టూ ఒక సూక్ష్మ ప్రపంచం నిర్మించాలి.నిజ జీవితంలో కాస్త స్పృహ పెరగాలి.ఇదే మంచి రచన తెచ్చే మార్పు.
నవలలో 9వ అధ్యాయం మొత్తం యుద్ధ బీభత్సాన్ని,యుద్ధానంతరం సామాన్య పౌరులపై జరిగే దారుణ హింసాకాండనీ తెలియజేసింది.చదివే వారిలో కరుణ రసాన్ని చిలుకుతుంది.నా దృష్టిలో, కరుణను పండించలేని బీభత్సం సంఘ విద్రోహక శక్తి. హింస ఎక్కువ పాళ్లలో చిత్రించడం వలన ఒరిగేదేమీ లేదు. ఆ ‘నెగిటివిటీ’ లేని ఆరోగ్యకరమైన కథనం ఈ రచయిత యొక్క ‘హాల్ మార్క్’.
______________
‘ప్రణయ హంపీ’ అని పేరు పెట్టి రచయిత చెప్పిన ప్రేమ కథ కూడా, ఇలాగే ఎక్కడా సంయమనం కోల్పోక శృంగారం -పరస్పర గౌరవం- నిరీక్షణ – సమాగమం -కర్తవ్య నిర్వహణ – ఎడబాటు- పునస్సంధానం…అనే సప్త స్వరాల సుమధుర గీతమై అలరించింది. ‘యుద్ధం చేయకుండానే శత్రువును లొంగదీసుకోవడమే అత్యున్నతమైన యుద్ధ కళ’ అన్నారు రచయిత. యుద్ధమే లేని,అది ఉండకూడని మానవ సమాజాన్ని ఊహించుకునే ‘అతి’ ఆదర్శవాదం నుంచి దురాశ, పరపీడనతో ఊగిపోతున్న మానవ సమూహాలను ఈ వాక్యంతో రచయిత మారుతి గారు సంస్కరించే ప్రయత్నం చేశారు.
______________
“ప్రేమ ద్వారా చేదు అంతా తీపి అవుతుంది. రాగి అంతా బంగారం అవుతుంది. బాధ ఔషధంగా మారుతుంది. ఆ ప్రేమను ఈ ప్రపంచానికి పంచండి”, ఈ వాక్యాలను మరో మతానికి చెందిన వ్యక్తి చేత సోదరుని ఆశీస్సుగా అందించిన రచయిత ఆంతర్యం ‘ప్రణయ హంపీ’ నవల లోని ప్రణయాన్ని ప్రేమగా విస్తృత పరిచి, వ్యక్తి శ్రేయస్సు నుంచి సామాజిక శ్రేయస్సు దిశగా పాఠకుల్ని ఉత్తేజపరుస్తుంది. నవలా రచయిత మారుతీ పౌరోహితం గారికి అభినందనలు.
కొన్ని స్కెచెస్ పెట్టి ఉంటే బాగుండేది. అలానే అప్పటి, ఇప్పటి దేశపటం బొమ్మలు ఇస్తే బాగుండేది.ఒక మంచి పఠనానుభూతి ఇచ్చిన నవల ‘ప్రణయ హంపీ’.
-డా.కాళ్ళకూరి శైలజ.
98854 01882.