వెతలకు వెలుతురు చూపిన “మూడు గుడిసెల పల్లె” కథలు

సాహిత్యం

ప్రముఖ కవి, రచయిత డా. సిద్దెంకి యాదగిరి రచించిన కథల సంపుటి ‘మూడు గుడిసెల పల్లె.’ ఊరితో విడదీయలేని అనుబంధం, కరోనా తెచ్చిన అవస్థలు, స్ఫూర్తివంతమైన అంబేద్కర్ జీవితం, ఆదర్శ ఉపాధ్యాయుడి జీవితం, సామాజిక, రాజకీయ చైతన్యం, దళిత స్పృహతో అస్తిత్వ చైతన్యంతో రాసిన పదిహేను కథల సమాహారమిది. ఈ కథలన్నీ సిద్దిపేట ప్రాంతంలోని గ్రామాల ప్రజలు మాట్లాడే భాషని, వారి జీవన విధానాన్ని, పేద ప్రజల సమస్యల్ని ప్రత్యక్షంగా చూసిన అనుభవంతో రాసిన కథలుగా దర్శనమిస్తాయి. కష్టాలు, కన్నీళ్లు, బంధాలు, అనుబంధాలు, ఆత్మీయతలు, బాధలు, అవమానాలు, కలలు, ఆశయాలు, ఆకాంక్షలు చూపిస్తూ, సామాజిక స్పృహతో, పేద ప్రజలు ఎదుర్కొంటున్న సంఘర్షణలతో తనదైన కోణంలో విభిన్నస్వరంతో వినిపించిన కథలివి.

తెలంగాణ జన జీవన సంస్కృతిలో బతుకమ్మ పండుగ సందర్భంగా కింది కులాల వారికి ఎదురవుతున్న అవమానాల నుంచి ఆత్మగౌరవం వైపు నడిపించే కథ ‘అంటరాని బతుకమ్మ’. దొరల, పటేల్ల, భూస్వాముల ఇండ్లల్లో కింది కులాలవారు పూలు సేకరిస్తారు. అనాదిగా పూలు సేకరిస్తూ కష్టపడినప్పటికీ ఆ పూలతోనే అల్లిన బతుకమ్మ దగ్గర మాత్రం తగిన చోటు సంపాదించుకోలేని తనాన్ని నిరసించి, కొత్త ఆలోచనల వైపు మళ్ళిస్తుందీ కథ. అంబేద్కర్ స్ఫూర్తితో ఇద్దరు గ్రామ యువకులు గోదావరి నీళ్ళు తెస్తారు. గ్రామంలో జరిగిన చిన్న సంఘటనల వలన దళితులు కొందరిలో అనుమానాలు సందేహాలు వస్తాయి. అయినా అన్నింటినీ పక్కకు పెట్టి చివరికి దళిత కుటుంబాల వాళ్ళు అందరూ కలిసి కమ్యూనిటీ హాల్ వద్ద ఆత్మ గౌరవ ప్రతీకలుగా బతుకమ్మను ఆడుతారు. ఈ కథలో అంటరాని బతుకమ్మగా ముద్ర పడి, బతుకమ్మ ఆటకు దూరంగా ఉన్న దళితులకు మనోధైర్యం పెంచిన కథ ఇది. అనివార్యంగా అంబేద్కర్ ఆలోచనా తత్వాన్ని దళితుల్లో పెంచే దిశగా కథను మలిచి కథకుడు విజయవంతమయ్యారు.

స్వంత ఊరితో విడదీయలేని అనుబంధాన్ని ఎంతో ఆర్ధ్రతతో చెప్పిన కథ ‘ఆఖరి కోరిక.’ ఈ కథలో..ప్రాజెక్టులో ఊరు మునుగుతుందని తెలిసి బడికి రాని ఆరవ తరగతి విద్యార్థిని కోసం వెంకటయ్య సార్ ఊర్లోకి వెళ్తాడు. ఊరిలో బద్ధి పోషవ్వ అనే ముసలవ్వ వెంకటయ్య సార్ కి ఒడవని ముచ్చటోలే చెప్పుకున్న తీరని ఆవేదనే ఈ కథ. తక్కువ పాత్రలతో హృదయవిదారకంగా సాగుతూ కంటతడి పెట్టిస్తుంది. ఊరంటే గుంపు అనీ, సబ్బండ కులాల సమూహమనీ, పోషవ్వ స్పృహ కల్పిస్తుంది. మాదిగోళ్లు లేకుంటే పీనుగ లేవదీ, పీరి లేవది. ఈ ఊరిలోనే అన్ని కులాల వారు, అన్ని మతాలవారు అన్నదమ్ములోలె కలిసి బతికారనీ, తన తొంబై ఏండ్ల జ్ఞాపకాలను తీరని బాధతో గుర్తు చేస్తుంది. తన ఊరు మాయమైతుందంటే తట్టుకోలేక పోతుంది. తాను ఎక్కడ చచ్చినా కూడా ఈ ఊరిలోనే పాతి పెట్టమని అంటుంది. అది తప్పు కాదని అంటుంది. తన ఊరంటే ఎంత వల్లమాలిన ప్రేమ చూపిస్తుందో పోషవ్వ అమాయకపు మాటలకి కన్నీళ్ళను ఆపుకోలేము.

‘లందస్నానం’ కథలో అనేక మలుపులు ఉన్నాయి. ఉత్కంఠ ఉన్నది. ఈ కథలో కమలయ్య తన గ్రామంలో, తన మాదిగ కులంలో చిన్న చిన్న పొరపాట్లు జరిగాయని, తన వల్ల జరిగిన దోషానికి బాధ పడుతున్నానంటూ, మనమందరం విడిపోకుండా అన్నదమ్ముల వలె కలిసి ఉందామని, తన కులస్తులందరినీ వేడుకుంటాడు. ఇట్లా చెప్పడంతో తన కులస్తులందరిలో ఆకాశమంత సంబరం కనబడుతది. “ఆ వాతావరణాన్ని చూపిస్తూ అందరి మనుసులు లందస్నానం చేసిన తోలులా శుద్ధీకరించబడి స్వచ్ఛంగా నిగనిగలాడుతున్నయి. మా ఊరి వాగు పెద్దగుండు మీది నుంచి పారినట్లు వచ్చిన శబ్దంలా చప్పట్లు, కేకలు కరతాళ ధ్వనులు. ఆనందానికి హద్దుల్లేని సంతోషాలు. వంద డప్పులు ఒక్కసారి గంతేసి కొట్టినట్లు వేడుక. ఇదే అసలైన దసరా. ఇదే అసలైన బతుకమ్మ. అలాయి బలాయిలు, ఆలింగనాలు, కరచాలనాలు, తీరొక్క రంగులు పూచిన పూలతోటలా కమ్యూనిటీ హాల్లో పేర్చిన బతుకమ్మలా మనసులు కొత్త శోభను సంతరించుకున్నాయి”. ఈ ముగింపు కథకుడి సమర్థతకు, స్పష్టతకు నిలువెత్తు నిదర్శనం.
_____________
గ్రామ రాజకీయాలలో దళితుల పరిస్థితి ఎట్లా ఉంటుందో చూపించే కథ ‘మూడు గుడిసెల పల్లె’ ఈ కథలో ఆ గ్రామ సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేయాలనే రాజకీయ కుట్రతో తెలివైన, దళిత మహిళ సరితను సర్పంచ్ పదవికి ఎన్నిక కాకుండా అడ్డుకొని దూరం చేయాలనే ఉద్దేశంతో పటేల్ చేసిన మోసం, ఆడిన నాటకం కథలో చూస్తాము. పటేల్ కి భజన చేసిన వ్యక్తులే ఆ పదవికి ఎన్నికవుతారు. ఆ పదవినే పటేళ్లు తమ పదవిగా మార్చుకొని అధికారాన్ని చలాయిస్తుంటారు. సామాజిక చైతన్యం, దళిత చైతన్యం మెండుగా ఉన్న దళితులను రాజకీయ పదవులను అనుభవించకుండా అడ్డుకునే పటేళ్ల పితలాటకాన్ని బయటపెట్టిన కథ ఇది.
_____________

చదువు ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ, అన్ని సమస్యలకు పరిష్కారం చూపించేది అసలైన విద్య అని, జీవితంలో ఎదురయ్యే అనేక కష్టనష్టాలను చదువుతోనే జయించవచ్చని నిరూపించే చక్కని కథ ‘గెలుపు గీతం’.ఈ కథలో చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన ఓదయ్య సార్ ఉపాసముండి, కన్నీళ్లు మింగి, అనేక కష్టాలెదుర్కొని, కన్న కలలు తీర్చుకుని ఈరోజు ఉద్యోగం చేస్తున్నాడని, కష్టాల కొలిమిలో కాలినోల్లే సొక్కం బంగారమైతరని, అందుకు ప్రేరణగా ఓదయ్య సార్ ఎందరికో ఆదర్శంగా నిలిచారని హెడ్మాష్టర్ విద్యార్థులకు హిత బోధ చేస్తాడు.

కులమతాల చర్చ వచ్చినప్పుడు నిన్ను కోస్తే రక్తం, నన్ను కోస్తే పాలు వస్తాయా? మనుషులందరికి రక్తమే వస్తది. మనుషులంతా ఒక్కటే. కులాలు మనం పెట్టుకున్నం అని బెస్త నరసయ్య మామ చెప్తుంటాడు. ఆయన చనిపోయినప్పుడు కుల మతాలకతీతంగా అందరి చేత కన్నీళ్లు తెప్పించిన ‘బెస్త నరసయ్య మామ’ కథ మనసులను కదిలిస్తుంది.

దళితులకు కిరాయి ఇల్లు ఇవ్వడానికి ఇతర కులాల్లో కొందరు వెనకా ముందు ఆలోచిస్తారన్న విషయం అందరికీ తెలుసు. కానీ ‘పుండకోరు’ కథ ద్వారా దళితులు కూడా ఇతరులకు కిరాయికి ఇల్లు ఇవ్వరనే కొత్త విషయాన్ని ప్రతిపాదిస్తున్నాడు. ఈ కథల్లో ఉపయోగించిన భాష, సామెతలు, పలుకుబడులు, పోలికలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచినవి.

కరోనా వచ్చిన వ్యక్తి పట్ల సొంత మనుసులే ఎంత అమానవీయంగా ప్రవర్తించారో నిరూపించిన ‘రుణం’ కథ. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో సామాన్యుల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో, వాళ్ళ కష్టాలు ఎట్లా ఉంటాయో చిత్రించిన ‘పిడుగు’ కథ. అంబేద్కర్ జీవితంలో నుండి ఉపాధ్యాయులు ఏ స్ఫూర్తి పొందాలో తెలియజేస్తూ అంబేద్కర్ చెప్పిన సూత్రాలను ఆచరణలో పెట్టిన ఉపాధ్యాయుడి కథ ‘ఆచరణ’. కరోనా వచ్చినపుడు గ్రామ సమస్యలు పరిష్కరించలేని ‘తీర్మానం’ కథ.

ఎవరికి సమాజం నుండి తీవ్ర సంఘర్షణ ఎదురవుతుందో, ఎవరి హృదయాలు గాయపడుతాయో, ఎవరి మనసులు కలిచివేస్తాయో అట్లా ఈ రచయితకు అనేకానేక స్వీయ అనుభవాల్లోంచి ఒడువని ముచ్చటగా వచ్చిన కథలివి. మన బాధలు మనమే రాసుకోవాలి. మన గాథలు మనమే చెప్పుకోవాలి అన్నట్లు సిద్దెంకి తన గ్రామం, జీవితం, భాష, ప్రాంతం, కులం, గ్రామీణ కళలు, అస్తిత్వాన్ని కలగలిపి చుట్టూ ఉన్న పల్లె వెతలను పట్టి చూపిన ఉత్తమ కథల సంపుటి ‘మూడు గుడిసెల పల్లె’. దళితుల బాధలే కాదు తెలంగాణ పల్లె సమాజం బాధలూ ఉన్నాయి.

ఈ సంపుటిలోని కథలు చదువుతున్నపుడు మనం ఆ పల్లెల్లో తిరుగుతున్నట్లే అనిపిస్తది. బాధపడుతున్న మనిషి ఎదురుగా కూర్చుని బాధలు వింటూ మాట్లాడుతున్నట్టే ఉంటది. ఇందులో పల్లె జీవన సౌందర్యం, శ్రామిక సంస్కృతి, బాధలు, వర్తమాన స్తితిగతులు, అస్తిత్వమై మాట్లాడుతాయి. ముచ్చెట పెడుతాయి. ఈ కథల్లో సగానికి ఎక్కువగా వివిధ జాతీయ, అంతర్జాతీయ స్థాయి కథల పోటీలలో బహుమతులు గెలుచుకున్నవే ఉన్నాయి. అంటే ఈ కథలన్నీ కథనంలో, వస్తువులో, శిల్పంలో, ఎంత బలమైనవో చూడవచ్చు. అందుకే తప్పకుండా చదవాల్సిన కథలివి.

‘మూడు గుడిసెల పల్లె’ కథలు. పేజీలు : 152. ప్రతుల కొరకు: 9441244773 సంప్రదించవచ్చు.

-డా. మండల స్వామి

91776 07603

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *