Sunday, 9 August 2026
సాహిత్యం

నిర్వేదపు నదిని దాటిన కవిత్వం ‘చిగురించే పేజీలు’

· · 1 నిమిషం చదవండి

కవిత్వం కేవలం పదాల సమాహారం ఎంతమాత్రం కాదని, కవిత్వమంటే అది మనసును తాకే ఒక గొప్ప అనుభూతి అంశమని, జీవితాన్ని అన్ని కోణాల్లో అర్థం చేసుకునే తాత్విక దృక్కోణమని కవిత్వ తత్వాన్ని సంతృప్తిగా అధ్యయనం చేసిన కవయిత్రి నాగజ్యోతిశేఖర్. నిత్యం కవిత్వం కోసం తపించే తత్వం ఆమెది. కవిత్వం గురించి ప్రతిక్షణం, శ్వాస ఆమెతో మాట్లాడుతుంది. శబ్దం చేస్తున్న లోపలి గుండె, తన నుండి ప్రవహించే రక్తంలో అక్షరాల నీడల కోసం వెతుకుతూ ఉంటుంది. కంటిరెప్పలను చీల్చి ఎక్కడో ఎదురుచూస్తున్న ఖాళీలను కవితలతో పూరించమని, నిద్రపోనివ్వని చీకటి రోజూ ఆదేశాలను జారీ చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యం నుంచి నాగజ్యోతిశేఖర్ వెలువరించిన సాహిత్య రూపమే ‘చిగురించే పేజీలు’ కవితా సంపుటి.

______________________

రాత్రి గడిచేలోగా వెలుతురు పిట్టలను చేసి దిగంతాల ఆవలికి ఎగరేసుకుపోయే ఒక స్వాప్నికుడి గురించి ప్రస్తావించిన ‘స్వాప్నికుడు’ కవితలోని పదాలన్నీ మామూలు పదాలు కావు. మట్టిపొరల్లో అతడు చీమై దూరి నిర్మించిన సైకత కుటీరాల నుండి బయలుదేరిన ఒక శక్తివంతమైన రూపాలవి. ఒక భ్రమర గీతాన్ని రచిస్తున్న అతని ఏకాంతాన్ని భగ్నం చేయవద్దంటూ కవితలోని పదాలు కాపలా కాస్తున్నాయి.
_______________________

వెన్నెల్లో ఆకాశం వైపు చూస్తే చంద్రునిలో నదిలా ప్రవహిస్తున్న అతని చిరునామా, చనువుగా మన దగ్గరికి వచ్చి మన కళ్లకు వేకువ కాటుకను దిద్ది, స్వాప్నికుడి జగత్తులోని శాశ్వత బంధానికి ఆహ్వానాలు పలుకుతోంది. అతడు పచ్చటి కలలను పండించుకోవడానికి కాసింత స్థలాన్ని చదును చేసి పెట్టమని సూచిస్తున్న కవయిత్రి భావాలన్నీ ఓ కొండశిఖరం నుంచి విసిరేసిన వెలుగు బంతుల్లా మన ముందు గెంతుతూ ఆడుకుంటున్నాయి.

‘ఇంకా రాస్తావా?’ అంటూ అసహనంగా అడిగిన ఓ కరుకుతనానికి, పడకగదిలో కాళ్లు విరిగిన స్వప్నాలు, మంచం కోళ్లకు వేలాడుతున్న దృశ్యాల మధ్య నిలబడి ‘ఏం రాయవద్దా?’ అంటూ నిశ్చలంగా అడిగిన ఆమె మాటలకు అరల్లో దాచుకున్న పుస్తకాలు ఎర్రబడ్డ కళ్లతో చప్పట్లు కొడుతున్నాయి. ఆ ప్రోత్సాహానికి దుప్పటి మడతల్లో విలపించిన ఆమె చేతివేళ్ల నుంచి కారుతున్న సిరాచుక్కలు అక్షరాలై, కలం, కాగితాన్ని ఆమె అందుకునేలా చేస్తున్నాయి.

‘ఒక అసంపూర్ణ సంభాషణ’ కవితలో కవిత్వీకరించిన ఈ పద ప్రయోగాలన్నీ ఉన్నతస్థాయి యోగ్యతాపత్రాలను సగౌరవంగా అందుకునే స్థాయిలో ఉన్నాయి. ‘కాళ్ల కింద అంతా తవ్వేసుకున్నాక / పైపైకి రావాలంటే / నిచ్చెనేసేది ఎవరు / ప్రకృతిని హత్య చేశాక / పడే ఉరిశిక్షను / రద్దు చేసేదెవరు…’ అంటూ ‘శిథిలాల అడుగున’ కవితలో, మానవ తప్పిదాలు చేసిన ఘోర ప్రమాదాల ఫలితాలను ప్రకటిస్తున్న ఈ కవయిత్రి, చీకట్లో రాలిపోతున్న చుక్కలను ఏరుకుంటూ, బోరుబావిలో పాతేసిన మట్టి పాడే పాట కోసం చెమటపట్టిన రాత్రుల తోడుగా అన్వేషణ సాగిస్తున్న ఒక శోధన మనతో స్నేహానికి దరఖాస్తు చేసుకుంటోంది.

సామ్రాజ్యవాదుల బాంబుల పక్షి ప్రపంచపటంపై అమాయక దేశాలను ముక్కున కరుచుకుని ఎగిరిపోతున్న క్రూర దృశ్యాలను ‘సామాన్యీకరణ’ కవితలో చిత్రీకరిస్తూ… ‘రేపో మాపో మన పెరట్లోనూ / యుద్ధ విమానమొకటి వాలుతుంది / అప్పుడక్కడ మొలిచే సెమిట్రీలపై / పూలుంచేందుకు చేతులేవీ / మిగలకపోవచ్చు / ఎంత ఏడ్చినా గతాన్ని తవ్వేందుకు / భవిష్యత్తు ఉండకపోవచ్చు…’ అంటూ చిన్నారుల గాజుకళ్లపై పేరుకున్న క్షిపణి ధూళికణాలను చూపిస్తూ కవయిత్రి పలికిన ఈ మాటల నేపథ్యంలో, ప్రపంచం పొడవునా ఓ రక్తపు నది శవాలను మోస్తూ దీనంగా ప్రవహిస్తోంది.

‘ఇంకెవరికి…’ కవితలో మాతృమూర్తి స్వరూప స్వభావాలను మరోసారి సారవంతంగా ఆవిష్కరిస్తూ… ‘దుఃఖాన్ని పూడ్చిపెట్టి / నవ్వుగా మొలకెత్తడం / ఆమెకు తప్ప ఎవరికి సాధ్యం…’ అంటూ కవయిత్రి చేసిన తీర్మానానికి, తన కొమ్మల మీద వాలిన పిట్టలన్నీ ఎగిరిపోయాక, గూళ్లు చెప్పే కథలను వింటున్న ఓ ఒంటరి చెట్టు, దుమ్ముపట్టిన తన చిరునామా పలకను తుడుచుకుంటూ ఈ కవితలో దర్శనమిస్తోంది.

కవిత్వపు దారుల్లో కురిసి కురిసి మేఘాల మధ్య తానూ ఒక అందమైన హరివిల్లుగా మారిపోవడం, చదివి చదివి పుస్తకంలోని పేరాలను స్వరాలుగా మార్చుకుని పాటగా వినిపించడం, నడిచిపోయిన నిన్నటికి, నడుస్తున్న నేటికి… ఈ రెండింటి మధ్య కవిత్వంగా ప్రవహించడం తన దినచర్యగా మార్చుకున్న ఈ కవయిత్రి భావాలన్నీ మరో నూతన ఉదయానికి స్వాగతం పలుకుతున్నాయి. ‘ప్రయాణం / ఉదయాన్నే మొదలు పెడతాను / మరు ఉదయానికి గాని / రావాల్సిన వాక్యం రాదు…’ అంటూ ‘పట్టాలు తప్పిన రాత్రి’ కవితలో తన సాహిత్య ప్రయాణాన్ని ప్రస్తావించిన కవయిత్రి, తనలాగే తీరని బరువును గుండెలపై మోస్తున్న పట్టాలతో రోజూ ఆమె సంభాషిస్తుంది. ఆమె ఈ ప్రయాణంలో పట్టాలు తప్పిన రాత్రిని ఒక స్టేషన్‌లో వదిలేస్తుంది. ఒంటరితనాన్ని మరచిపోవాలనుకుంటూ ఉదయపు బుగ్గలపై సిరాచుక్క పెట్టగానే ఆకుపచ్చ అక్షరాల సిగ్నల్ తలెత్తుతుంది. ఆ వెంటనే కవిత్వం తన వేగానికి సంకేతాలను అందజేస్తుంది. ‘అప్పటికి గాని నిద్ర / కనుపాపల బెర్తు పై వాలదు / నే తీసుకున్న టికెట్ ఖరీదు / కవిత్వం…’ అంటూ చివరలో చాలా గమ్మత్తుగా తన తలుపులను మూసుకున్న ఈ కవిత, మన జ్ఞాపకాల పట్టాల మీద ఎప్పటికీ ప్రయాణిస్తూనే ఉంటుంది.

‘సూరీడుతో ఆటలాడుతూ / గాలి కుంచె గీసిన నీడ గీతల్ని / నేలపై పరుస్తున్న ఆకులు / పిట్ట పాటకు నాట్యం చేస్తూ…’ అంటూ ఓ అద్భుత దృశ్యానికి సొంతదారుని పట్టాను అందించిన ‘మూడవ ప్రపంచం’ కవిత, పులకరించిన పుడమి నవ్విన పచ్చదనాన్ని మన కోసం గాఢంగా నమోదు చేస్తోంది. అదే సందర్భంలో గూడు చెదిరిన పక్షి, గుండె చెదిరిన చెట్టూ కలిసి పాడిన పాట, స్వరాలు కోల్పోయి, చరణాలు తెగిపోయి, చివరకు ఖండాంతరాలలో కన్నీరై ప్రవహిస్తోంది. ఆ తడిని మోస్తున్న అక్షరాలు గుప్పెడు శాంతి కోసం కవిత్వాన్ని ఆశ్రయిస్తున్నాయంటారు కవయిత్రి.

ఈ సంపుటిలో తీవ్రంగా ఆలోచింపజేసిన కవిత ‘బర్త్ మార్క్’. ఇక్కడ ‘బర్త్ మార్క్’ అనేది శరీరంపై ఉండే పుట్టుమచ్చ మాత్రమే కాదు; పుట్టుకతోనే సమాజం మోపిన కులముద్ర కూడా. ఈ కవితలో ‘అతడు ఖాళీ కంచాన్ని కడుపులో పెట్టుకుని తిరుగుతుంటాడు’ అనే వాక్యం అతని ఆకలిని, నిరంతరం బాధిస్తున్న పేదరికాన్ని తెలియజేస్తోంది. జీవితమంతా ఆకలితో అల్లాడుతున్నా, అతనికి ఈ సమాజంలో న్యాయం జరిగే అవకాశం ఎప్పటికీ రాదనే భావం ‘అతని టోకెన్ నెంబరు ఎప్పటికీ రాదు’ అనే ప్రతీక ద్వారా గొప్పగా వ్యక్తమవుతోంది. ‘మురికి కాల్వల చివరే కావ్యాలు రాస్తుంటాడు’ అనే భావవ్యక్తీకరణ ఒక అద్భుతమైన రూపకం. అందరిలాగే జన్మమెత్తినా సరే తాను మాత్రం అత్యంత దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నాడు. బాధతో కార్చిన కన్నీళ్లే అక్షరాలై కావ్యాలుగా మారుతున్న దృశ్యాన్ని ఈ కవిత ఆవిష్కరిస్తోంది. ‘పాదాల నుండి పుట్టానని రాసిన బర్త్ సర్టిఫికెట్ / ఇంకా తగులబెట్టడు ఎందుకో?’ అంటూ ఉన్న ఈ కవితలోని చివరి పాదాలు పురుషసూక్తంలోని వర్ణవ్యవస్థను గుర్తుచేస్తున్నాయి. ఈ కవిత కేవలం ఒక మనిషి బాధను వర్ణించడానికే పరిమితం కాలేదు. ఆ బాధకు కారణంగా నిలిచిన సామాజిక నిర్మాణాన్ని నిలదీసి నిలువునా కడిగేసిన కవిత ఇది.

నాగజ్యోతిశేఖర్ కవిత్వంలో ప్రపంచాన్ని గొంతెత్తి పిలిచే ఒక ధ్వని ఉంది. ఆమ్లవర్షాలు కురుస్తున్నా ప్రవహించడం మానని నదిలా తన కవిత్వ ప్రవాహాన్ని కొనసాగించగల సత్తువ ఆమె కలంలో ఉంది. కవిత్వమనే నది నుంచి నిత్యం పదాలను వెలికితీయాలన్న తపన, కవిత్వాన్ని నిత్యం ఒక తపస్సులా కొనసాగించగల కోరిక… ఇవన్నీ ఆమెలో గాఢంగా ఉన్నాయి.
___________________

దారి పక్కన చెల్లాచెదురుగా ఉన్న స్వప్నాలను తన గుండెలోకి ఆహ్వానించి, వాటిని కవితలుగా తర్జుమా చేయగల ఆసక్తిని తన ఖాతాలో మెండుగా నింపుకోగల నేర్పరి ఈమె. రాయక తప్పని వాక్యాల కోసం సమయాన్ని తన సొంత ఖాతాలోకి అదనంగా జమ చేసుకోగల సమయస్ఫూర్తి గల తత్వం ఆమెది.
____________________

కవిత్వాన్ని రాస్తున్నప్పుడు అందులో ఆర్ద్రత, గాఢత, సంక్షిప్తత, వైవిధ్యంగా సాగే భావవ్యక్తీకరణ, కవిత్వ భావాలను పొరలు పొరలుగా పేర్చగల నేర్పరితనం, స్పర్శను కోల్పోతున్న మెదళ్లను కదిలించగల శక్తి, పచ్చని కలలను వెంటేసుకుని పలకరించగలిగిన గుండె సవ్వడి, భ్రమించే భూగోళంపై చిన్నదిగా కనిపించే జీవితానికి తగిన నిర్వచనాన్ని అందించగల ఆలోచన, అవసరమైతే సూర్యుడి నుంచి కొన్ని కిరణాలను దోచుకుని కవిత్వ దారుల్లో దీపాలుగా వెలిగించగలిగే సాహిత్యపు గడుసుతనం, నది పాడుతున్న పాటలోని చరణాలను తన కవిత్వానికి అన్వయించుకునే చనువు… ఇలా ఈ అంశాలు కవిత్వ నిర్మాణానికి సహకరించినప్పుడు, ఆ కవిత కాలంతో పాటు నిలిచే చిరునామాలను తన సొంతం చేసుకోగలుగుతుంది.

ఈ సాహిత్య సూత్రాలను ఎంతో ఇష్టంగా ఉగ్గుపాలుగా స్వీకరించి, మంచి స్థాయి కవిత్వాన్ని ఈ సంపుటి ద్వారా అందించిన నాగజ్యోతిశేఖర్ ఎంతైనా అభినందనీయురాలు.

 

 

-సాహిత్య ప్రపూర్ణ డాక్టర్ కె.జి. వేణు
98480 70084

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *