సాహిత్యం

ప్రతీకల తటిల్లతలు

· · 1 నిమిషం చదవండి

కవిత్వంలో ప్రతీక ఒక నిశ్శబ్దపు అల. అది పాఠకుడి మనసులో వందలాది కొత్త ఆలోచనల తలుపులను తెరుస్తుంది. ఈ ప్రతీకలు నేరుగా కవితో మాట్లాడవు; ఊహతో రహస్య సంభాషణ చేస్తాయి. అలా చేయడం వెనుక దాగిన శక్తిని ఆవిష్కరించాలంటే పాఠకుడే పనిగట్టుకొని శ్రమించాలి. ఆ శ్రమ సౌందర్యాన్ని కన్నులతో కాకుండా గుండె చప్పుడుతో మేళవించి అనుభూతి చెందిన కవితాపదాలు అరుదైనవి అనుకుంటే, ఆ సాహిత్యం ఔన్నత్యానికి నిలయంగా నిలుస్తుంది.

సాహిత్యంలో ‘ధ్వని సిద్ధాంతాన్ని’ ప్రతిపాదించింది ఆనందవర్ధనుడు. ఆయన తన ‘ధ్వన్యాలోకం’లో “ధ్వనిరేవాత్మా కావ్యస్య” (ధ్వనియే కావ్యానికి ఆత్మ) అని ప్రకటించి ధ్వని సిద్ధాంతానికి సంపూర్ణ ప్రాచుర్యం కల్పించారు.
_____________________

సాహిత్య ప్రవాహంలో భాగంగా కవిత్వంలోకి అనేక ప్రక్రియల చొరబాటు పెరిగి, కొత్త రూపాలు ఏర్పడ్డాయి. దీనికి కాలం కూడా ఒక కారణమని చెప్పవచ్చు. ఎందుకంటే ఆధునిక పోకడలన్నీ సాంకేతిక ప్రభావంతోనే ముడిపడి ఉన్నాయి. ఈ స్థితిలో పుస్తకాలు చదివే ఓపిక మనిషికి నశించిందని అనడంకంటే ఆవశ్యకత తగ్గిందని చెప్పడం సమంజసం. ఇలాంటి సమయంలో కావ్య సంపదను చదివి తరించే వారు ఎందరున్నారు? కాబట్టి కవిత్వం కుదింపునకు లోనైంది. నవల నుండి మినీ కవిత్వం దాకా అరుదైన ఘట్టాలను తన చరిత్రలో నిలుపుకుంది. ఆ పరిణామ క్రమం నుంచే ‘మెరుపు కవిత్వం’ పురుడు పోసుకుంది.
_____________________

సామాజిక దృక్పథం పుష్కలంగా ఉన్న సాహిత్య స్వాప్నికుడు, మానవసంబంధాల అభిలాషి అయిన కె. ఆనందాచారి ఇటీవల లఘు కవితా ప్రక్రియలో చేసిన ప్రయోగమే ‘తటిల్లతలు’ (FLASH POETRY).

ఈ సంపుటికి పి. శ్రీనివాస్ గౌడ్ చేసిన ఆంగ్లానువాదం ‘ది సౌండ్ ఆఫ్ లైట్’ కూడా అనుబంధ పుస్తకంగా రూపొందింది. ‘తటిల్లతలు’లోని 105 మెరుపు కవితలు సున్నితమైన ధ్వనితో పాఠకుల మనసును తట్టి లేపుతాయి. జీవిత తాత్వికత, మానసిక సంవేదనలు, దుఃఖపు చిరునామాలు, కవిత్వ ధ్వనులు, ఆశావాహ దృక్పథం, కాలం మిగిల్చిన జ్ఞాపకాలు, రైతు క్షోభ వంటి ప్రత్యేక అంశాలు నిండిన ఈ సంపుటిలో ఆనందాచారి ప్రతిధ్వనుల చాటింపుకర్తగా, నిగూఢ రూపంలో పాఠకులకు దర్శనమిస్తాడు.

కాలపు సముద్రంలో నిరంతర నావికుణ్ణి కలల అలలపై కైదువునై ఎగురుతాను కాలాన్ని వెనక్కి నెట్టి నేనెప్పుడూ ముందుకే (99)

ఈ కవితను చదివితే ఆనందాచారి నిత్య స్వాప్నికుడైన వ్యక్తిత్వంతో కనిపిస్తాడు. ఇక్కడ కలలు అంటే ఆశలు; కైదువు అంటే ఆయుధం. ఆత్మవిశ్వాసమే నావగా కాలమనే సముద్రంలో మనిషి విజయం వైపు ఎలా సాగిపోవాలో చెప్పే స్ఫూర్తిదాయక హృదయ కవిత్వమిది. ఈ ఒక్క కవిత చాలు కవి వ్యక్తిత్వాన్ని, ఆయన ఆశించే సామాజిక తత్వాన్ని అంచనా వేయడానికి! ఈ గొప్ప ఆత్మవిశ్వాసానికి మూలం ఏమిటి? అంటే ‘జీవితమే’ అని నిశ్శబ్దంగా సంభాషిస్తాడు. ఈ అంతర్లీన శబ్దం పాఠక హృదయాల్లో మెరుపులై మెరుస్తుంది కదా!

గాయాలకు భయపడే వాళ్లమా మట్టి పాయల్లో కాయాన్ని నాటుకున్నవాళ్లం (58)

మొలకెత్తడం ప్రకృతి ధర్మం; అణచివేతకు గురయ్యేచోట తిరుగుబాటుతనం ఉండడం సహజం. ఎదుగుదలకు ఎన్ని ప్రతిబంధకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో నెగ్గడమే కొసమెరుపు. ఈ అంశాన్ని శబ్ద ప్రతీకగా ఒక మెరుపులో పొందుపరిచారు. ఇలాంటి కవితలు చదివినప్పుడు మనసు ఇంకేదాని కోసమూ వెతకదు; ఆ భావగర్భిత నిశ్శబ్దం నిరంతరం గుండె చప్పుడుగా ధ్వనిస్తూనే ఉంటుంది.

నేడు విశ్వవ్యాప్తమై వున్నది
ఒక్క దుఃఖ రసమే కవీ…
ఆ కన్నీళ్లను కొన్ని అక్షరాలపై నించి చూడు
అవి ప్రవహించి వెల్లువెత్తి
కావ్యమౌతాయి కరుణమౌతాయి (17)

ఇక్కడ కవి ఆవేదనా స్వరం చూడండి! శోకం నుండి శ్లోకం పుట్టినట్లు, వాల్మీకి హృదయ చింతనను ప్రతీకగా తీసుకొని ఆనందాచారి తన అంతరంగాన్ని కవిగా, సామాజికవేత్తగా స్వానుభవంతో వ్యక్తీకరించాడు. పీడిత వర్గం పక్షాన నిలిచి కవిత్వం చెప్పడం వల్లే ఇది శాశ్వత ధ్వనిగా మిగులుతుంది.

మరణం నిష్క్రమణం కాదు కొన్ని
ఆలోచనలు అంటించి వెళ్లాక (7)

సైద్ధాంతిక కార్యాచరణకు మరణం ఎన్నటికీ ఉండదు. ‘అంటించి వెళ్లాక’ అనే ప్రతీకను గమనిస్తే చీకటికి వెలుగు ప్రసవించిన శిశువులాంటిది. అలాగే చైతన్య పథంలో ఆలోచిస్తే చీకటి శకలాలను శాశ్వతంగా పారద్రోలడం, ఒక మంటగా వెలుగును సంతరించుకొని మరిన్ని దీపాలను వెలిగించడం ఒక మెరుపే! ఒక వ్యక్తి భౌతిక నిష్క్రమణ శాశ్వత సమాప్తి కాదంటాడు ఆనందాచారి. ఎంతటి తాత్విక గాంభీర్యాన్ని ఒడిసిపట్టారో కదా!

కాలుష్యమవుతున్న వాటిలో
మనసు కూడా ఉంది
కవిత్వ రక్షణ కవచాన్ని తొడుగుతున్నా!

చూడండి, ఈ అంతర్వర్తన మెరుపు ఎంతటి ఔచిత్యాన్ని సంతరించుకుందో! కలుషితమైన సమాజానికి కవిత్వం ఒక దివ్యౌషధంలా పనిచేస్తుందన్న అనుభవపూర్వక నివేదనను ఈ చిన్న వాక్యాల్లో ఎలా నిక్షిప్తం చేశారో అర్థమవుతుంది. ఇక్కడ కవి తన సామాజిక యాత్రలో మానవత్వం కోసం పరితపించే మనసును కేంద్రంగా చేసుకొని, ఒక ప్రత్యూషంలా తళుక్కున మెరుస్తాడు.

నేనింకా యుద్ధం చేయాల్సి ఉంది
అబద్ధపు ప్రచారాలపై
సత్యాల నిషేధాలపై (88)

అసత్యం రాజ్యమేలుతున్న ఈ కాలంలో సత్యం కోసం కవి చైతన్య స్వరమై ఆత్మవిశ్వాస ప్రకటన చేస్తున్నాడు. ఈ కవితలో ఆయన శత్రువూ, సమాజ శత్రువూ ఒక్కటే! ఆ విపరిణామాన్ని నిలువరించడం కోసం, కాలుష్యం లేని సమాజం కోసం యుద్ధం చేస్తానని ప్రతినబూనుతున్నాడు.

భూమికి శ్రమనల్లిన కలనేత ఇతడు
కలల పంటపై చితిగా మారుతున్నాడు (48)

ఈ కవితలో శ్రమజీవి అయిన రైతు ప్రపంచానికి వెన్నెముకగా నిలిచాడు. అయితే అదే శ్రమతో నిత్యం కొట్టుమిట్టాడుతూ, చివరకు తన ఆశల పొలంలోనే పాడె కట్టెల చితిగా మారిపోతున్నాడన్న ఆవేదనను కవి కళ్లకు కట్టాడు. ఇందులో ‘కలనేత’ అనే పదాన్ని విశిష్ట ప్రతీకగా ప్రయోగించారు. శ్రమను నేత పనితో పోల్చారు. నేతగాడు నూలుపోగులతో వస్త్రాన్ని నేసినట్లు, రైతు తన చెమటను భూమిపై పరిచి పంటను పండిస్తాడు. ఇలాంటి ప్రతీకలతో ఆలోచనలను రేకెత్తించే ప్రయత్నం చేశారు ఆనందాచారి. రూపకాలంకార విన్యాసాన్ని ఈ ‘తటిల్లతలు’లో అడుగడుగునా మేళవించారు.

“మనిషి తాత్విక జీవితంలోకి దిగినప్పుడు జీవితం గురించి వినూత్నంగా మాట్లాడడం, జీవితాన్ని తరచూ వేదిక మీదికి ఆటలాగా వస్తూపోయే పాత్రలా భావించే ఆలోచనలు సరైన ఉపమానాలుగా అందివస్తాయి.” — ఈ మాటలు ఈ గ్రంథానికి ఏనుగు నరసింహారెడ్డి గారు రాసిన ముందుమాటలోనివి. నిజంగానే ఆనందాచారి తన సాహిత్య ప్రయాణంలో గతానికి భిన్నంగా ఎంచుకున్న ఈ లఘు కవితా రీతి సామాన్యమైనది కాదు.

ఈ సంపుటిలో పి. శ్రీనివాస్ గౌడ్ ఆంగ్లంలోకి అనువదించిన కవితలు కొన్నింటిలో తెలుగు మూలంలో కంటే ఆంగ్లంలోనే మెరుపు (స్పార్క్) ఎక్కువగా వ్యక్తమైనట్లు అనిపిస్తుంది. “At times the goddess of justice unveils her blindfold – Beware!” (అప్పుడప్పుడు న్యాయదేవత కళ్లగంతలు విప్పుతుంది జాగ్రత్త!) వంటివి ఇందుకు నిదర్శనంగా చూడవచ్చు. నానీలు, హైకూలు, మినీ కవితలు ప్రాచుర్యంలో ఉన్న తరుణంలో ‘ఫ్లాష్ పొయెట్రీ’ రీతిలో ‘తటిల్లతలు’ కూర్చడం గొప్ప సాహసమే!

ఈ కవితలను ఒక్కసారి పైపైన చదివితే వాటి మాధుర్యం, వాటిలోని నిగూఢార్థం మనసుకు త్వరగా పట్టుబడవు. లోతుగా తరచి చూసినప్పుడే ఆ భావం ఒక ప్రతిధ్వనిలా హృదయంలో నాటుకుపోతుంది. ఆనందాచారి గారు చేపట్టిన ఈ నూతన ప్రయోగం ఫలవంతం కావాలని ఆశిస్తూ, సామాజిక చైతన్యమే పరమావధిగా సాగుతున్న ఆయన కవిత్వ లక్ష్యం సంపూర్ణ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తున్నాను.

 

 

-గన్నోజు ప్రసాద్
9491617161

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *