సాహిత్యం

బాల్య స్మృతుల సమాహారం ‘కుమ్మరికుంటోని కథలు’

· · 1 నిమిషం చదవండి

50 ఏళ్ల క్రితం నాటి తెలంగాణ పల్లెల స్వరూపాలు ఎట్లా ఉండేవో, నాటి బాల్యం గడిచిన తీరు, అప్పటి సౌకర్యాలు, ఇరుగుపొరుగు వారితో ఉండే మానవ సంబంధాలు, శ్రమజీవన సౌందర్యం, పిల్లల చదువులు, సాంప్రదాయిక పండుగలు, విభిన్నమైన ఆహారపు అలవాట్లు, ప్రయాణ అనుభవాలు, ఒకరికొకరు సహకరించుకోవడం, ఊరి ప్రజల ఆత్మీయ సంభాషణలు, రాత్రుల్లో జరిగే దొంగతనాలు, బాల్యంలోని ఆటల గురించి తెలుసుకోవాలంటే డా.చెమన్ కథల సంపుటి ‘కుమ్మరికుంటోని కథలు’ చదవాల్సిందే. ఇది ఒక్క చెమన్ బాల్యమే అనుకోవద్దు; ఆనాటి తరానికి ప్రతినిధిగా చెప్పిన సజీవ కథలివి. ఒక ఆత్మకథలా సాగిపోయే కథనమిది. పల్లెల్లోని ప్రజల సామూహిక జీవనానికి ఈ 42 కథలు మచ్చుతునకలుగా నిలుస్తాయి.

___________________

సుప్రసిద్ధ కవిగా చెమన్ మనందరికీ సుపరిచితుడు. ‘ఎడారి స్వప్నం మధ్య’, ‘ఆవిష్కరించని దృశ్యం’ కవితా సంపుటాలను ఇప్పటికే ప్రచురించారు. వివిధ పత్రికల్లో సాహిత్య, వైద్య సంబంధిత వ్యాసాలను రాస్తుంటారు. ఎలక్ట్రో హోమియోపతి అనే కొత్త వైద్య విధానాన్ని దేశవ్యాప్తంగా పరిచయం చేస్తున్న రీసెర్చ్ గ్రూపులో పనిచేస్తున్నారు. గతంలో ప్రజా చైతన్యం కోసం కొంతకాలం పాటు జర్నలిజాన్ని వృత్తిగా స్వీకరించి ‘సత్యసాగరం’ పక్షపత్రికకు ఎడిటర్‌గా పనిచేశారు. ఆయన వృత్తి నిబద్ధతకు నిదర్శనంగా ఉత్తమ ఎడిటర్ అవార్డును కూడా అందుకున్నారు. విద్యార్థి దశ నుంచే వామపక్ష ఉద్యమాల పట్ల ఆకర్షితులై ప్రజా పోరాటాల వైపు నిలబడ్డారు.
____________________

చెమన్ బాల్యంలోని అనుభవాలే ఆయనను మానవీయ మూర్తిగా తీర్చిదిద్దాయి. 1970 నుంచి 1985 వరకు సాగిన ఆయన బాల్య జీవితానికి ఈ కథలే అచ్చమైన ప్రతీకలు. తెలంగాణ పల్లెల్లోని చైతన్యానికి ప్రత్యక్ష సాక్షి చెమన్. ఈ ఆత్మకథాత్మక కథనాల్లో చిత్రీకరించిన అనేక అంశాలు మనల్ని ఆకట్టుకుంటాయి. ఆడబిడ్డకు పెళ్లయిన తర్వాత అత్తగారిల్లే సొంత ఊరు. అట్లాంటిది భర్తతో కలిసి జీవించాల్సిన ఆమె భరించరాని బాధలతో పుట్టింటికి చేరితే, అక్కున చేర్చుకున్న గొప్ప మనసున్న తల్లి కథ ‘అమ్మమ్మ ఏడ్పు’. అప్పటినుండి తల్లిగారి ఊరే తన ఊరు అనుకున్నది చెమన్ గారి అమ్మ. ఆమెతోనే తన బాల్యం మొత్తం ఈ కుమ్మరికుంట గ్రామం కేంద్రంగా సాగిన తీరును ఈ కథల ద్వారా తెలుసుకుంటాం.

తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లల జీవితాల్లోని సుఖదుఃఖాలు ఈ కథల ద్వారా మనకు అవగతమవుతాయి. ముఖ్యంగా ఆ రోజుల్లో ప్రాథమిక విద్య పిల్లలకు బోధించిన విధానాన్ని మనం తెలుసుకుంటాం. అమ్మమ్మ గారి గ్రామంలో ఐదవ తరగతి వరకే ఉండటంతో, 10వ తరగతి వరకు చదవాలంటే పది కిలోమీటర్ల దూరంలో ఉన్న జూలపల్లి గ్రామానికి వెళ్లాల్సి వచ్చేది. నడిచి వెళ్లడం తప్ప మరో మార్గం అప్పట్లో ఉండేది కాదు. పిల్లలు జట్లు జట్లుగా ఆ బాట వెంట నడుస్తూ చెప్పుకునే ముచ్చట్లు ఇప్పుడు తలుచుకున్నా ఎంతో బాగుంటాయి.

పాఠశాలలో చదువుకున్న ఆ రోజుల్లోని అవస్థలను నేడు గుర్తుచేసుకున్నా నాటి విద్యార్థులకు సంతోషమే కలుగుతుంది. ‘వలీ మహమ్మద్ ప్రేమ’, ‘చెట్టు మీద సత్తిగాడు’, ‘కనిగిర్ బడి’, ‘దెబ్బకు జ్వరం’, ‘బాపు లేడు’, ‘పీటీ సార్ పనిష్మెంట్’, ‘తెలుగు సార్ కవితలు’, ‘అరటిపండ్ల దావత్’ కథల్లో నాటి పాఠశాలల్లోని చదువులు, ఉపాధ్యాయుల ఆప్యాయతల గురించి మక్కువతో వర్ణించారు. తనతో చదువుకునే రమాదేవి వాళ్ళ బాపు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే హఠాత్తుగా గుండెపోటుతో మరణిస్తాడు. చిన్ననాటి ఆ సంఘటనను గుర్తుచేసుకుంటూ… ‘బాపు లేకపోతే మన పనులన్నీ మనమే చేసుకోవాలె. ఇప్పుడు నా లెక్కనే రమాదేవి కూడా బాపు లేకుండానే అన్ని పనులు చేసుకోవాలె. బాపు లేకపోతే పైసలు ఉండయి. ఎటైనా పోవాలంటే ఒక్కలమే పోవాలె. నేను ఆరో తరగతిలో చేరినప్పుడు జూలపల్లికి ఒక్కన్నే నడుచుకుంటా పోయి.. బాగా వాన కొడితే మేదరోళ్ళ చూరు కింద నిలబడి భయపడి ఏడ్చింది యాదికచ్చింది. మా బాపు ఉంటే నన్ను ఎంట బెట్టుకపోయి బల్లె చేర్పించేది. పాపం రమాదేవికి కూడా ఇప్పుడు బాపు లేడు’ అంటూ రాసిన వాక్యాలు హృదయాన్ని ద్రవింపజేస్తాయి. ఇట్లాంటి మానవీయ కోణంతో కూడిన కథనాలు మనల్ని కదిలిస్తాయి. ఎదుర్కొన్న అనుభవాలను మరొకరితో నిజాయితీగా పంచుకోవడమే ముఖ్యం. అందుకు రచనా మార్గం అత్యుత్తమమైనది. కల్లాకపటం లేని బాల్యపు జ్ఞాపకాలను సహజాతి సహజంగా ఈ కథల్లో నిక్షిప్తం చేశారు.

బాల్య దశలో మనల్ని బాగా ఆకట్టుకునేవి ఆటలు. ఇప్పుడంటే సాంకేతిక విప్లవం వల్ల అరచేతిలో ఇమిడిపోయే సెల్ ఫోన్ స్క్రీన్ మీదే పిల్లలు అన్ని ఆటలూ ఆడేస్తున్నారు. టీవీలు, ఫోన్లు లేని ఆ రోజుల్లో వెన్నెల రాత్రుల్లోనూ, చీకటి రాత్రుల్లోనూ అలసిపోయేదాకా పిల్లలు రకరకాల ఆటలు ఆడేవాళ్లు. ఎండాకాలం సెలవుల్లో వివిధ ఆటలు ఆడుకునేవారు. ఆ అనుభవాలను, అనుభూతులను గుర్తుచేసుకుంటూ ‘ఇస్పాక్ ఆటలు’ కథను రాశారు. ఎంతో గమ్మత్తైన ముచ్చట్లను ఇష్టంగా గుర్తుచేసుకుంటారు. సమయంతో పనే ఉండేది కాదు. రకరకాల కొంటె పనులు కూడా చేసేవాళ్ళు. పెద్దవాళ్ళతో తిట్లు తినేవాళ్ళు.

ఈ కథా సంపుటిలో ముఖ్యంగా చెప్పుకోదగింది నాటకాల గురించి. పొద్దంతా పనిచేసి రాత్రయితే చాలు, కొంతమంది కలిసి నాటకాలను రిహార్సల్ చేసేవారు. వాటిని చూడడమంటే చెమన్‌కు ఎంతో ఇష్టం. తను కూడా నాటకాల్లో పాల్గొనాలని చిన్నచిన్న పాత్రల కోసం ప్రయత్నించిన తీరును ‘చిరుతల రామాయణం’ కథ ద్వారా తెలుసుకుంటాం. సైకిల్ నేర్చుకోవడం అందరికీ ఇష్టమైన పనే. ఆ క్రమంలో సైకిల్ పైనుంచి పడడం, ఎదురుగా వస్తున్న వాళ్ళను ఢీకొట్టడం సర్వసాధారణం. దెబ్బలు తగిలినప్పుడు వాళ్ళు తిట్ల దండకం అందుకునేవారు. అట్లాంటి సంఘటనలను కళ్ళకు కట్టినట్లు చిత్రించిన కథ ‘సైకిల్ ఎక్కితే శిక్ష’. ఇప్పుడంటే మనకు వంట గ్యాస్ సిలిండర్ సహాయంతో స్టవ్ మీద వంట సులువుగా పూర్తవుతున్నది. కానీ ఒకప్పుడు అందరి ఇళ్లలోనూ కట్టెల పొయ్యిలే ఉండేవి. వాటికి కట్టెలు కావాలంటే పల్లెలను ఆనుకుని ఉన్న అడవికి ఎండాకాలంలో వెళ్లి కొట్టి తెచ్చుకునేవారు. ఆనాటి ఇబ్బందులకు అద్దం పట్టిన కథ ‘తంగేడు పొరక – ఒర్రెల తిండి’.

పల్లె అనేది సామూహిక జీవనానికి ఒక వేదిక. అన్ని కులాల ప్రజలు కలిసిమెలిసి జీవిస్తారు. ఆర్థిక అసమానతలు ఉన్నప్పటికీ, కొందరి మధ్య పట్టింపులు ఉన్నప్పటికీ మానవ సంబంధాలు మాత్రం సజీవంగా ఉంటాయి. ఒక్కరికి బాధ వచ్చినా అది ఊరందరి బాధగా భావిస్తారు. పద్మశాలి, తెనుగు, గౌడ, కుమ్మరి, కమ్మరి, షావుకారులు, గొల్ల, కాపు, రెడ్డి, రావుల వంటి పెద్దల, మిత్రుల పేర్లను ఇందులో నమోదు చేశారు. ఈ కథనాల్లో ఊహాజనిత పాత్రలు కాకుండా, సజీవంగా మన మధ్య తిరిగే మనుషులే కనిపిస్తారు. ఉత్తర తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో వస్తున్న మార్పులను కూడా ఈ కథల ద్వారా తెలుసుకుంటాం.

___________________

సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తీరు, కనీస రోడ్డు సౌకర్యం లేకపోతే ప్రజలంతా శ్రమదానంతో నిర్మించుకున్న వైనం, అప్పుడప్పుడే గ్రామాల్లో ప్రవేశిస్తున్న నూతన పోకడలు మనల్ని ఆలోచింపజేస్తాయి. ప్రజల్ని విజ్ఞానవంతులుగా, చైతన్యవంతులుగా తీర్చిదిద్దడానికి కొత్త తరం యువకులు తమను తాము సన్నద్ధం చేసుకుంటూ నిర్మించిన పోరాట మార్గాలను కొన్ని కథల్లో కళ్ళకు కట్టినట్లు వర్ణించారు. ఇవి చెమన్ ఒక్కరి వ్యక్తిగత అనుభవాలు మాత్రమే కావు; నాటి సామాజిక చరిత్రను రికార్డు చేసిన సజీవ కథనాలు.
____________________

ఈ కథల సంపుటికి ప్రసిద్ధ విప్లవ రచయిత అల్లం రాజయ్య, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ నందిని సిధారెడ్డి గార్లు విశ్లేషణాత్మకమైన ముందుమాటలను అందించారు. ఈ కథా సంపుటిని ఆస్వాదించడానికి అవసరమైన అర్థవంతమైన నేపథ్యాలను వారు వివరించారు. ఈ కథనాల్లో వాడిన సరళమైన భాష చదువరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. పఠనానికి ఎలాంటి ఇబ్బందీ కలగదు. నిజానికి ఇదొక నవలలా సాగిపోతుంది; మధ్యమధ్యలో చిన్నచిన్న భాగాలుగా విభజించి శీర్షికలు పెట్టినట్లుగా అనిపిస్తుంది. సాహిత్య పరిశోధకులకు ఇది తెలంగాణ సాంఘిక చరిత్రను పరిచయం చేస్తుంది. నడిచొచ్చిన తొవ్వలను మరచిపోకుండా, ఈ కథల ద్వారా పాఠకులకు మరింత చేరువైన చెమన్ గారికి హృదయపూర్వక అభినందనలు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన ఉత్తమ కథల సంపుటి ఇది.

 

– గోపగాని రవీందర్
94409 79882

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *