ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది
22-ఏ నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ల అంశంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. ఆస్తులు కలిగిన వారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎటువంటి ఆటంకాలు ఉండకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పారు. రిజిస్ట్రేషన్ల కోసం ఆన్లైన్లో స్లాట్ తీసుకొన్న వారి ఆస్తులు 22-ఏ జాబితాలో ఉంటే, రెవెన్యూ అధికారులు రెండు రోజుల్లో పరిశీలించి, అది ప్రైవేటు భూమి అయితే రిజిస్ట్రేషన్ వెంటనే చేస్తారు. జిల్లా కలెక్టర్లు 22-ఏ జాబితా భూములను క్షుణ్ణంగా పరిశీలించి, శాశ్వత పరిష్కారానికి సరైన జాబితాను రూపొందిస్తారు. అందులో ఎలాంటి తప్పులు లేకుండా చూడాలని, ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలు తమ భూ హక్కుల విషయంలో ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రైవేటు భూములకు సంబంధించి ఒక్క అంగుళం భూమికి కూడా ఇబ్బంది రానివ్వం. 22-ఏ భూముల విషయంలో దళారులు, మధ్యవర్తులను ఆశ్రయించవద్దు. ఎటువంటి పుకార్లు, కట్టు కథలను విశ్వసించవద్దు.

Leave a Reply