తెలంగాణ

పెట్టుబడిదారులను ప్రోత్సహించే స్వర్గధామం తెలంగాణ

· · 1 నిమిషం చదవండి

క్లీన్ ఎనర్జీ మ్యానుఫాక్చరింగ్ హబ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం : డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్: తెలంగాణను క్లీన్ ఎనర్జీ మ్యానుఫాక్చరింగ్ హబ్ తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలు, శాస్త్రవేత్తలు, సిఈఓలకు తెలంగాణ ఆహ్వానం పలుకుతోందని తెలిపారు. ప్రభుత్వం, ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతోనే ఇంధన విప్లవాన్ని సాధించగలమని, తెలంగాణతో కలిసి పనిచేయాలని పారిశ్రామికవేత్తలకు ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ హైటెక్స్ నోవాటెల్ రెండు రోజుల పాటు నిర్వహించే ‘ఇండియా ఎనర్జీ సమ్మిట్ ఎక్స్ మంగళవారం డిప్యూటీ సిఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టివిక్రమార్క మాట్లాడుతూ తెలంగాణ అన్ని రకాల పెట్టుబడిదారులను ప్రోత్సహించే స్వర్గధామమని అన్నారు. క్లీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, రాష్ట్ర సమృద్ధిని పెట్టుబడిదారులతో పంచుకుంటూ కలిసి ఎదగడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఇంధన రంగంలో మార్పు అంటే కేవలం విద్యుత్ ఉత్పత్తి వనరులను మార్చడం మాత్రమే కాదని, సమగ్ర ఆర్థిక వ్యవస్థను మార్చే విప్లవాత్మక ప్రక్రియ అని అన్నారు. తెలంగాణను స్వచ్ఛమైన ఇంధనాన్ని వినియోగించే రాష్ట్రంగా మాత్రమే కాకుండా, ప్రపంచ క్లీన్ ఎనర్జీ రంగానికి అవసరమైన సాంకేతికతలను తయారు చేసే ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించిందని చెప్పారు. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ తీర్చడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. 2030 నాటికి 20 వేల మెగావాట్లు, 2035 నాటికి 26 వేల మెగావాట్లకు పైగా సోలార్ విద్యుత్ సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. పునరుత్పాదక ఇంధన రంగంలో కీలకమైన విద్యుత్ నిల్వ సామర్థ్యాన్ని కూడా భారీగా పెంచనున్నట్లు డిప్యూటీ సిఎం తెలిపారు. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ద్వారా 2030 నాటికి 3,800 మెగావాట్లు, 2035 నాటికి 8,000 మెగావాట్ల విద్యుత్ నిల్వ సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.హైదరాబాద్ ఐటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యాలను వినియోగించుకుని భవిష్యత్ విద్యుత్ గ్రిడ్ డిజిటల్ నెట్ అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో ఏర్పాటు చేయనున్న ఎఐ డేటా సెంటర్ కోసం ప్రత్యేకంగా 100 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్లాంట్ అనుసంధానిస్తున్నట్లు తెలిపారు. 2030 నాటికి ఏటా 4 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, 2035 నాటికి 12 వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని భట్టి విక్రమార్క తెలిపారు. సోలార్, విండ్, బ్యాటరీ ఉత్పత్తి పరిశ్రమలను తెలంగాణలో ఏర్పాటు చేసే సంస్థలకు మూలధన సాయం, ఎస్ రీయింబర్స్ విద్యుత్ సుంకం మినహాయింపులతో పాటు టిజి-ఐపాస్ ద్వారా వేగవంతమైన అనుమతులు అందిస్తున్నామని వివరించారు. అనంతరం సమ్మిట్ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను ఆయన సందర్శించారు. కార్యక్రమంలో ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *