Sunday, 16 August 2026
సాహిత్యం

సౌజన్య (ప్రసాద) మూర్తి పలవరింతే “సగంపిట్ట” కథలు

· · 1 నిమిషం చదవండి

“జీవిత తత్వాన్నీ దాని కీలకాల్నీ అర్థం చేసుకున్న ఆలోచనాపరుడి కథలివి. ఈ దుర్మార్గ సమాజంలో కుల, మత, లింగ, వర్గ భేదాలతో ముక్కలై గ్లోబలీకరించబడిన ఈనాటి జీవితంలో ఒక్కొక్క బతుకు ముక్క ఒక్కొక్క రూపంలో కనిపించే వాస్తవాన్ని బలంగా పట్టుకున్న కథలివి. జీవితాన్ని ముందుకు నడిపించే చైతన్యాన్ని నిరాడంబరంగా వ్యక్తీకరించిన కథలివి.” అంటారు ప్రసాదమూర్తి కథల సంపుటి ‘సగంపిట్ట’ ముందుమాటలో – జి. లక్ష్మీనరసయ్య గారు.
___________________

కవిత్వంలో వస్తువేదైనా దానికి అనుగుణమైన భావాన్ని అద్భుతంగా పొదగగల నైపుణ్యం, చదువరులకు హత్తుకునేలా సమకాలీన సమస్యలనూ కవితామయం చేయగల కవిగానే ఇన్నాళ్ళూ ప్రసాదమూర్తి కనిపించారు. తన చిన్నప్పటి ఊరి గురించి రాసినా, కురిసిన వాన గురించి రాసినా పసివాడిలా పలవరిస్తాడు. తర్వాత రోజుల్లో నివసించిన నగర జీవితం అతడిలోని సున్నితత్వాన్ని, భావుకతనూ, సౌకుమార్యాన్ని కబళించలేదు అనేది అతడి ప్రతి కవితలోనూ సుస్పష్టమవుతూనే ఉంటుంది.
_____________________

ప్రసాదమూర్తికి సమాజం వేరు, కవిత్వం వేరు కాదు. కవితా దృష్టి, సామాజిక చైతన్యం రెండూ ఒకదానిలో ఒకటి అంతర్లీనంగా సాగేదే అతని కవిత్వం.
ఇలా ఇంతకాలం ఒక ‘కలనేత’ కవిగానే చూసి, ‘పూలండోయ్ పూలు’ అంటూ అందించిన అతని బుట్టెడు కవిత్వ పరిమళాల్నీ హత్తుకున్నాను. దాంతోపాటూ కంటిచూపుకి తగిలి చురుక్కుమనిపించిన ఘాటైన పొగలకూ ఉక్కిరిబిక్కిరి అయ్యాను.

‘సగంపిట్ట’ మా లైబ్రరీలోకి వచ్చి ఎప్పుడు దూరిందో కానీ ఇటీవలే నా చేతిలో వాలింది. ఇదేమిటండీ బాబూ! ‘సగంపిట్ట’ కాదు, మనల్ని ‘పూర్తి పిట్టల్ని’ చేసి ప్రకృతి ఆవరణాల్లోకో, సమాజం మూలాల్లోకో, లేకుంటే మనలోకి మనల్నో నెట్టేసి ఆలోచనల్నీ, మన జీవితాల్నీ తడుముకునేలా చేసేస్తాడు ఈ రచయిత. అందుకే ఇవి “పూర్తి పిట్ట” రాసిన కథలు.

మరందుకే ‘ప్రకృతిపట్ల అపార ప్రేమతో, ఘనీభవించిన మానవుడిపట్ల తీవ్ర నిరసనతో, కవి హృదయంలో మొలకెత్తిన ఈ కథలు చదువరుల గుండెల్లో పుష్పిస్తాయి. భుజాన చెయ్యెయ్యడంతో ప్రారంభమై ధడేల్ ధడేల్మని మన తలుపుల్ని తెరిచి కానీ వదలవు. సరళంగా సూటిగా స్నేహభాషణలా సాగే కథనం – మరచిపోయిన మన లోపలి ప్రాంతంలో మనల్ని సుకుమారంగా వదిలేసి వీడ్కోలు తీసుకుంటుంది’ అని రమణజీవి అన్నారనుకుంటాను.

మొదటి కథ ‘అనామక మరణం’ చదివేటప్పటికే గుండె పట్టేస్తుంది. నిజమే, ప్రతీ మనిషిలోనూ ఒక అనామకుడు దాగే ఉంటాడు. ప్రతీరోజూ పసిపిల్లలను రక్తసిక్తం చేస్తున్న వార్తలో, యుద్ధాలలో అమాయక పసిప్రాణాల్ని, గర్భస్థ శిశువుల్ని బలిగొన్న వార్తల్నో, గోధ్రా సంఘటనల వంటి కడుపులో పేగుల్ని నులిమేసే వార్తల్నో వింటూనే ఉంటాం. అల్జిమర్స్ వచ్చినవాళ్ళలా మర్చిపోవడానికి ప్రయత్నాలు చేస్తాం. మర్చిపోలేం… మనలోని మనిషి మరణిస్తే తప్ప. అదెప్పుడు జరుగుతుంది? ఈ ద్వైదీభావాన్నే ప్రసాదమూర్తి తన కథలో, రచయిత రాయాలనుకున్న కథలో అద్భుతంగా చిత్రించారు. ప్రపంచంలో జరిగే ప్రతీ విషయాన్నీ తనకు సంబంధించిన దానిగా తనలో ఆవాహన చేసుకుని మానవీయ సంబంధాల్లోంచే చూసే సౌజన్యమూర్తి ప్రసాదమూర్తి. మనిషి సంఘజీవి అని నమ్మిన కథకుడు సమాజంలో జరుగుతున్న దుర్ఘటనలకు కదిలిపోతాడు. నిజానికి ఈ కథ దీర్ఘ కవిత్వంలా సాగుతుంది.

పల్లెలో పనులు లేక నగరబాట పట్టిన “బంగారమ్మ” చాలాకాలానికి సంక్రాంతి పండుగకి పల్లెటూరికి వస్తుంది. తమ అరెకరం పొలాన్ని కళ్ళారా చూసుకోవాలని బయలుదేరిన బంగారమ్మతో పాఠకులు కూడా నడుస్తారు. దారిపొడవునా కలలో నడుస్తున్నట్లు నడుస్తూ గతాన్ని పునశ్చరణ చేసుకుంటున్న బంగారమ్మతోబాటూ పాఠకులూ ఆ దృశ్యాల్ని కలగంటారు. తన అరెకరం పొలం కోసం వెతుక్కుంటూ వెతుక్కుంటూ, చేపల చెరువులోనే అదృశ్యమై మర్నాడు పైకి తేలిన బంగారమ్మ కథగా చెప్పినా… పైకి తేలని బతుకులెన్నో ఆ పంక్తులలో పాఠకులకు దర్శనమిస్తాయి. ప్రకృతిని ప్రేమించే భావుకుడైన ప్రసాదమూర్తి ప్రతీ వాక్యాన్ని హృదయభాషలో రాశాడనిపిస్తుంది.

చేపలూ, రొయ్యలతో పసరెక్కిపోయి చెరువులైపోయిన పొలాల్నీ, చేపల కోసం వస్తున్న పిట్టల్ని తరమడానికి పేల్చే తుపాకీ శబ్దాల్ని పాఠకులూ వింటారు.

పల్లెల్లో సైతం గడ్డి లేక ఎండిపోతున్న పశువులకు గడ్డి, చెరువులు లేక మంచినీళ్ళనూ బయట నుండి కొనుక్కొని రావలసిన దుస్థితి, విధ్వంసమైపోతున్న పల్లెల ముఖచిత్రాన్ని ఈ కథలోని పంక్తులు దృశ్యీకరణ చేస్తాయి.

పరుగులు తీస్తున్న కాలంతో పాటూ పరుగులు తీస్తున్న మనిషికి పక్కనే ఉన్నవారిని పట్టించుకునే తీరికా లేదు, మనసూ లేదు. తన చుట్టూ తానే పరిధులు గీసుకుని బతుకుతున్న మనుషుల మధ్య గోడలు పెరిగిపోతున్నాయి. ఆ దృశ్యమే ఈ “పక్కన కూర్చున్న వ్యక్తి” కథ.

రైల్వే స్టేషన్‌లో ఓ మూల రెండు ముసలి బొమ్మలు ఎడమచేతుల్ని చాచి ఉండటం కథకుడు ప్రతీరోజూ గమనిస్తాడు. ఆ చాచిన చేతులు అందుకొని పిల్లలు తమని తీసుకువెళ్తారనేమో అనుకుంటాడు. వాళ్ళకు కొంత డబ్బు సేకరించి ఇచ్చి భరోసా కల్పించాలనుకుంటాడు.

కథకుడు నివసించే కమ్యూనిటీలో రామారావు దంపతులు పిల్లల ఫోన్ కాల్స్ కోసం అడుక్కుంటున్న ముసలి బొమ్మలు; సుందరం దంపతులు పిల్లల నుంచి కాసింత సమయాన్ని అడుక్కుంటున్న ముసలి బొమ్మలు. ఇబ్బడిముబ్బడిగా డబ్బు ఉన్నా ఏటీఎంకు పోయి డబ్బు తెచ్చుకోలేని ఎన్నో ముసలి బొమ్మలు. ఇవన్నీ చదువుతుంటే దేశమే ఒక వృద్ధాశ్రమంగా మారిన దుస్థితి గుర్తుకువస్తుంది. అందరినీ సంప్రదించి డబ్బు సేకరించి స్టేషన్‌లోని ముసలి బొమ్మలకు ఇవ్వాలనే తమ ఉద్దేశం చెప్పకుండా, వాళ్ళు చూసేందుకు చాలా ముసలి బొమ్మలు రాబోతున్నాయని చెప్పేసరికి… స్టేషన్‌లోని ముసలి బొమ్మలు తమకు స్థానభ్రంశం కలిగిస్తారేమోనని ముందే వెళ్ళిపోతారు. అనేక విధాలుగా ఒంటరి వృద్ధాప్యాన్ని రచయిత కవితాత్మకంగా చెప్పాడు.

ఆంధ్రా-తెలంగాణ విభజన నేపథ్యంలోని కథ ‘జన్మభూమి’. ఏ ప్రాంతమైనా దోచుకునేవారు ఎవరైనా, దోపిడీకి గురైనవారు మాత్రం ఎప్పుడూ ప్రజలే. అందుకే ఒకప్పుడు వలసపక్షుల రాకతో ప్రత్యేకత కలిగిన కొల్లేరు సరస్సు ఈనాడు నామరూపాలు లేకుండా విధ్వంసానికి గురైంది. వివక్షలూ అలాగే ఊరి చివరనే యథాతథంగా ఉండిపోతూనే ఉన్నాయి.

వంద రెక్కలు ఉన్నా సరే, స్త్రీ తనకు తానుగా ఎగిరిపోవాలనే ఆలోచనే రాకుండా పిల్లలు, కుటుంబం, బాధ్యతలు ఆ రెక్కల కిందనే భద్రంగా దాచుకుంటూనే ఉంటుంది. మనసు గాయపడినప్పుడో, ఒంటరిగా మిగిలిపోయినప్పుడో ఒక్కొక్క రెక్కే విరుచుకోవాలనుకుంటుంది.

‘కాలాతీత వ్యక్తులు’ నవలలో ఇందిర “రెక్కలున్నాయనుకుని ఎగరడానికి ప్రయత్నిస్తాం. రెక్కలు లేవు మనకు. ఉన్నా అవి తడిసిపోయాయి. నా రెక్కల్ని బీదరికం తడిపేసింది. నీ రెక్కల్ని మితిమీరిన డబ్బు తడిపేసింది” అంటుంది.

ఈ కథలో కూడా ఎగిరిపోతుందేమోననే అనుమానంతో అమ్మకు ఒక తోడు కోసం సహకరించాలనుకున్న పిల్లలకు… “ఒకసారి పెళ్ళి చేసుకుని అనుభవించినదానిని, మళ్ళీ ఆ రొంపిలోకి వెళ్ళాలనుకోవడం లేదు” అంటుంది. స్త్రీ దృష్టికోణంలో స్త్రీ మనసులోని ఆలోచనలను ఒడిసిపట్టి రాసిన కథ ‘వంద రెక్కల స్త్రీ’.

బసమ్మ చెవిపోగులే కాదు, చెమటతో తడిచిన తాళిబొట్లని సైతం కుదువబెట్టుకుని బడుగు వర్గాల స్త్రీ పురుషుల జీవితాల్ని మత్తులో ముంచేసే కల్లు కాంపౌండ్లకు అదుపు ఎక్కడ?

గుజరాత్‌లో మతకల్లోలాల మారణహోమం సాగిన రోజులవి. గోధ్రా రైలు దుర్ఘటన తర్వాత గుజరాత్‌లో జరిగిన హింసాత్మక అల్లర్లు, కుటుంబంతో “రైలు ప్రయాణం” చేస్తున్న కథకుడికి ఒక్కటొక్కటే గుర్తుకురావడం ప్రారంభమైంది.

చెప్పులూ, సామానే కాదు… పిల్లల్ని ఎత్తుకుపోవడంలో ఎత్తుకు పైఎత్తులు వేసేవాళ్ళకి రైలుబళ్ళు నిలయాలు. కంటిమీద కునుకు పట్టని కథకుడికి ఆ పెట్టెలోకి ఎక్కిన ముస్లిం యువజంటని చూసేసరికి ఉగ్రవాదులేమోనని గుండె దడదడలాడుతుంది. చివరికి ఏమీ జరగకుండా ప్రయాణం పూర్తవుతుంది. కుల, మత, జెండర్, ప్రాంతీయ వివక్షలతో పక్కనే ఉన్న వ్యక్తిని అనుమానిస్తూ భయపడేలా చేసింది ఈ వ్యవస్థే అనే ఎరుక కలిగించే కథ ఇది.

ఇలా ప్రసాదమూర్తి రాసిన కథలన్నింటిలో కొన్నిచోట్ల పేరాలకు పేరాలు కవితాత్మకంగా పాఠకుల్ని ఆకట్టుకుంటాయి. కవి సున్నిత హృదయం ప్రతీ కథలోనూ కనిపిస్తుంది. మానవ తప్పిదాల వలన విధ్వంసమైపోతున్న ప్రకృతి దృశ్యాలు, అనేక విధాలుగా మానవ స్వార్థంతోనే కాలుష్యభరితమైపోతున్న పర్యావరణం, దాంతోపాటుగా మారిపోతున్న జీవన విధానాలూ… తప్పని పరిస్థితుల్లో యాంత్రికంగా మారుతున్న మనిషిని చూసి ఆవేదన చెందుతాడు. ఏమీ చేయలేని అసహాయతతో ఆక్రోశం చెందుతాడు. సమాజంలో పసిపిల్లల మీదా, స్త్రీల మీదా జరుగుతున్న లైంగిక దాడులకు తల్లడిల్లుతాడు, జాతిమత వివక్షలకు బలి అయిపోతున్న అసహాయులను చూసి కుంగిపోతాడు.

ఇదిగో ఇవన్నీ దృశ్యాలు దృశ్యాలుగా చిత్రించి ఈ కథలన్నింటా పేర్చాడు. ఇవన్నీ చూస్తూ కూడా మనం పరిధులు చుట్టుకుని, అల్జిమర్స్ వచ్చినవారిలా ఏమీ కానట్టుగా మర్చిపోయి ఎలా బతకగలుగుతున్నామని వాపోతాడు రచయిత.

మరి అందుకే పాఠకులు కూడా ఒక్కొక్క కథా చదువుతూ “ఇంకా మనం మనుషులుగానే ఉన్నామా?” అని అనుమానపడతారు.
____________________

‘పూలండోయ్ పూలు’లో మనుషులంతా పూలైపోవాలని కలవరించిన రచయిత కనుకే ‘సువర్ణ గన్నేరు పూలు’ లాంటి కథ రాయగలిగాడు. ప్రకృతి ఏదీ తిరిగి ఆశించదనే సత్యాన్ని అన్వేషించినవాడై, చెట్టే చేతులు పట్టుకుని తీసుకెళ్ళినట్లుగా అనాథాశ్రమంలో ప్రవేశిస్తాడు. ఫాల్గుణ మాసం మొదలైందంటే ఆ దంపతుల గుండెల్లోనూ పూలు విచ్చుకున్న చప్పుళ్ళు వినబడతాయి.
______________________

కథలన్నింటా కథకుడు ఎలా కలవరించాడో చదివిన తర్వాత… వెంటాడుతున్న ఈ కథలన్నీ ఛానెల్స్‌లోనూ, వార్తాపత్రికలలోనూ తిరిగి తిరిగి కనబడుతుంటే, పాఠకులు కూడా కొండలు, గుట్టలు, అడవులు ధ్వంసం చేసి కట్టిన హైరేంజ్ అంతస్తులలోని కృత్రిమ వనాల్లో పూర్తి పిట్టలై ఎగరలేక సగంపిట్టలై పలవరిస్తారు, తమ అసహాయతకు సిగ్గుపడతారు. మానవ సంబంధాల్నీ, మనిషి బతుకునీ ఉన్నతీకరించడంపై కథకుడికి గల అమితమైన శ్రద్ధ వలననే పూలతోనో, చేలతోనో, చెట్లతోనో, పిట్టలతోనో మనిషికి పాఠం చెప్పిస్తాడు.

చాలావరకూ ఉత్తమ పురుషలోనే రాసిన “సగంపిట్ట” కథలు… ప్రసాదమూర్తి సాత్వికుడైన కవి కావడం వలన కావచ్చు, సున్నితంగా, సరళమైన శైలిలోనే రాసినా ನಿజానికి ఆ పాఠాలు పాఠకుల హృదయాలను కూడా పట్టి కుదుపుతాయి.

-శీలా సుభద్రాదేవి
81068 83099

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *