బాలల భవిత ‘ఆన్‌లైన్‌’లో ఆవిరి

ఎడిటోరియల్ హోమ్

ఫోన్‌గేమ్‌ యాప్‌ల కౌగిలిలో నలిగిపోతున్న పిల్లలు
సహజ ఆలోచన శక్తిని కోల్పోయి శారీరక, మానసిక సమస్యల్లో చిక్కుకుంటున్న చిన్నారులు
నిర్ధాక్షిణ్యంగా కట్టడి చేయాలి
నిర్లక్ష్యం చేస్తే ‘చనిపోయిన మొక్కలకు నీళ్లు పోసినట్లే’
చిగురించక మురిగిపోనున్న భవిష్యత్‌ తరం

~~~~~~
విస్తృత రూపంలో సమాజమే, సూక్ష్మ రూపంలో బడి. ఆ తరగతి గది రేపటి పరిపూర్ణ వ్యక్తిత్వం గల పౌర సమాజాన్ని తయారుచేసే విజ్ఞాన కర్మాగారం. ఇల్లు-బడి బాల్యానికి బంగారు భవిష్యత్తును అందించే కేంద్రాలు. ఇంట్లో, బడిలో, సమాజంలో ఆధునిక పరికరాల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఇలా ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం అతిగా చూస్తున్న అమెరికా, స్వీడన్ బాలలు మేధో పరిజ్ఞానంలో వెనుకబడి ఉన్నారు. అలాగే పుస్తక పఠనం మీద అధికంగా ఆధారపడిన ఇటలీ, హంగరీ దేశాల బాలల ప్రజ్ఞ చాలా మెరుగ్గా ఉందంటున్నారు ప్రొఫెసర్ మోనిక రోజన్. నూతన టెక్నాలజీ రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. సద్వినియోగం చేసుకోవచ్చు, దుర్వినియోగమూ చేసుకోవచ్చు. పిల్లలు మొబైల్ ఫోన్ల మాయ(వల)లో పడి తమ విలువైన కాలాన్ని, సహజ మేధస్సుతో ఆలోచించే స్పృహను కోల్పోతున్నారు. అంతేకాదు? యువత, పెద్దలు, ఆడ, మగ, వృద్ధులు అనే తేడా లేకుండా ఈ ఆధునిక పరికరాల వినియోగం శృతి మించడంతో సమాజం మానసిక సమస్యలతో అనారోగ్యం పాలవుతుంది.
పిల్లలను చదువు నుండి, కుటుంబం నుండి దూరం చేస్తున్న ఆన్లైన్ గేమింగ్ యాప్ లను కట్టడి చేయకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ తర్వాత “చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టే” అవుతుంది..

నేటి తరం పిల్లల విద్యార్థుల పరిస్థితి..
పిల్లలు ఫోన్ ఉంటేనే అన్నం తింటారు. చెప్పిన మాట వింటారు, దాన్ని చూస్తూనే తింటారు. ఆన్లైన్ లో ఆడుతూనే గంటలకు గంటలు గడిపేస్తుంటారు. లేదంటే ఏడుస్తుంటారు. చివరికి ఆ ఏడుపు ఆపాలన్నా ఫోను తోనే సాధ్యం అనే స్థాయికి నేటి పిల్లల పరిస్థితి దిగజారింది. చదువుతో సంబంధం లేకుండా అందరూ దీని బాధ్యులే, బాధితులే. ఈ ఆధునిక మానసిక దౌర్భాగ్యంతో పిల్లలు సహజ మేధస్సుతో ఆలోచించే సృజనాత్మకత, వినూత్నత కోల్పోతున్నారు. పిల్లలు ఫోనే లోకం, ఆన్లైన్ ఆట లేనిదే పూట గడువదనేలా తయారయ్యారు. ఆన్లైన్ గేములలో తుపాకులతో కాల్చేసే విధ్వంసకరమైనవే ఎక్కువగా ఉంటున్నాయి. కొట్టుకోవడం, చంపుకోవడమే లక్ష్యంగా ఉండే ఆటల మూలంగా ఆ చిన్నారుల మనసులు ప్రతికూల ఆలోచనలతో నిండిపోతున్నాయి. పబ్జీ, బ్లూవెల్ లాంటివైతే మరణాలకు కారణం అవుతున్నాయి. ఇలా ఫోన్లకు బానిసైన పిల్లల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నది. మితి మీరి ఫోన్లకు బానిసలైన వారంతా పెద్దయ్యాక బెట్టింగు, ఇతర చెడు వ్యసనాలకు లోనవుతారనే నిపుణుల సూచనలను తల్లిదండ్రులు, ప్రభుత్వాలు పట్టించుకొని తక్షణమే ఆన్లైన్ గేమింగ్ వ్యవహారానికి అడ్డుకట్ట వేయాలి. దీనికి బానిసలుగా పిల్లలు, యువకులు, పెద్దలు, వృద్ధులు అనే తేడా లేకుండా ఫోన్ వినియోగం పెరిగిపోయి సమాజం గాడి తప్పుతుంది. చదువుకున్న(రాని)వారు అనే తేడా లేనే లేదు, ఫోన్ అతిగా వాడడం వల్ల జరిగే దుష్పరిణామాలు తెలిసిన వారు కూడా ఈ ఆన్లైన్ గేమింగ్ వేధింపుల నుండి పిల్లల్ని దూరం చేయలేకపోతున్నారు. విపరీతమైన ఫోన్ వాడకంతో రేపటి భావితరం “మానసిక, శారీరక సమస్యల పౌర సమాజం”గా పరిణమించనుంది. ఇలా పిల్లల భవిష్యత్తుతో ఆటాడేస్తున్న ఆన్లైన్ గేమ్ లను సమూలంగా కట్టడి చేయాలి. ఈ ఆన్లైన్ గేమింగ్ నియంత్రణపై అధ్యయనం చేసి పొంచి ఉన్న తీవ్ర పరిణామాల నుండి బయటపడేయటానికి మన దేశంలోని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఒక అధికారిక కమిటీని నియమించింది. ఈ కమిటీలో సభ్యులుగా ప్రభుత్వ విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్, ప్రొఫెసర్లను నియమించింది. తమిళనాడు ఆన్లైన్ గేమింగ్ అథారిటీ (టీఎన్ఓజీఏ)ఈ సంస్థ దీని ప్రభావం ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని రాష్ట్రాన్ని అప్రమత్తం చేసింది, కట్టడి చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. దీని ద్వారా ఆన్లైన్ గేమింగ్ మీద నియంత్రణ కోసం పోరాడుతుంది. పలు దేశాలు ఈ వ్యసనాన్ని చాలా తీవ్రంగా తీసుకున్నాయి. చైనా, జపాన్ లాంటి దేశాల్లో ఆన్లైన్ గేమింగ్ వ్యవస్థను నిషేధించినట్లు తెలుస్తోంది. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంస్థ చేసిన ప్రాథమిక సర్వేలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. పాఠశాలలు, కళాశాలలలో చదువుతున్న దాదాపు 2 లక్షల మంది విద్యార్థులపై సర్వే నిర్వహించగా వారిలో 20 శాతం మంది ఆన్లైన్ గేములకు, సామాజిక మాధ్యమాలకు బానిసలు అయ్యారని తెలిసింది. సర్వే కోసం పాఠశాల ఉపాధ్యాయులు, కళాశాల అధ్యాపకులు, యాజమాన్యాల సహకారం తీసుకున్నారు. ఆన్లైన్ గేములు ఎక్కువగా ఆడుతున్న విద్యార్థులకు కంటిచూపు సమస్యలు వచ్చాయని 67 శాతం మంది ఉపాధ్యాయు(అధ్యాపకు)లు చెప్పారు. బానిసైన విద్యార్థుల తెలివితేటలు, చురుగ్గా ఆలోచించడం బాగా తగ్గిందని 74 శాతం మంది వెల్లడించారు. ఈ అధికారులు నిర్వహించిన సర్వేలో ప్రత్యేకించి ఆన్లైన్ గేమింగ్ వ్యసనం విద్యార్థుల్లో గత ఐదు ఏళ్లుగా ఎక్కువవుతూ వస్తోందని, ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులో లేకపోతే పిల్లల మానసిక స్థితి ఆందోళనకరంగా మారుతుందని చెప్తున్నారు.

తల్లిదండ్రుల, ప్రభుత్వాల బాధ్యత.. విద్యార్థుల్లో ఆన్లైన్ గేమింగ్ వ్యసనం విచ్చల విడిగా పెరిగిపోతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. వారి ప్రస్తుత దినచర్యపై ప్రత్యేక పర్యవేక్షణ చాలా అవసరం. విద్యార్థుల ప్రవర్తనలో మార్పులు వచ్చేందుకు ప్రత్యేక ప్రణాళిక చేపట్టాల్సి వుంది. విద్యార్థులకు మంచి అలవాట్లు అలవడేలా మనస్తత్వ శాస్త్ర నిపుణులు, మానసిక వైద్యుల సహాయాన్ని తీసుకొని కౌన్సిలింగ్ చేయించాల్సిన అవసరం ఎంతో ఉంది. మన రాష్ట్రంలో అనుమతి లేని ఆన్లైన్ గేమింగ్ యాప్ లను రద్దు లేదా నియంత్రించాలి. ప్రభుత్వం ఆమోదించిన గేమ్ లే మార్కెట్లోకి వచ్చేలా చూడాలి. ఎక్కడైనా అతిక్రమించినట్లు కనిపిస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ ఆన్లైన్ గేమింగ్ సమస్యలు, ఆన్లైన్ వ్యాపారాల మూలంగా రాష్ట్రంలో దేశంలో పిల్లలు, యువత ప్రాణాలు కోల్పోతున్న దుష్పరిణామాలను చూస్తున్నాము. ఈ పెను ముప్పు నంచి బాల్యాన్ని కాపాడుకోవడం కోసం.. చైనా, జపాన్ తరహాలో తక్షణమే స్పందించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టి బాధ్యతతో వెంటనే నియంత్రణా చర్యలు చేపట్టాలి. ఆధునిక టెక్నాలజీ పిల్లలకు ఉపయోగపడే విధంగా విద్యార్థుల్లో వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో చారిత్రక, పౌరాణిక అంశాలలో నైపుణ్యాలు పెంచుకోవడానికి కొన్ని గేమింగ్ సంస్థలు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిని పిల్లలు చూడరు. తల్లిదండ్రులకు అది చూపించేంత సమయం లేదు. అంతే కాదు! పిల్లల మానసిక శక్తి సామర్థ్యాలు పెంచే ఆటలు ఎన్నో ఉన్నాయి. వాటిని ఆడరు, అలాంటి వాటిని ఈ సమాజం ఎన్నడో మర్చిపోయి కాలగర్భంలో కలిపేశారు. సోషల్ మీడియాలో అంతా ఫేక్.. డీప్ ఫేక్.. ఏఐ ఫేక్.. ఆన్లైన్లో ఫేకులదే పెత్తనం అవడంతో దేన్ని విశ్వసించాలో తెలియడం లేదు. “నిజాన్ని, జ్ఞానాన్ని కమ్మేసిన ఫేకుల”ను వ్యాపారం చేసుకునే విధానాలతో, ఫోన్లో ఎన్నో ఆన్లైన్ గేమింగుల ద్వారా భావోద్వేగాలకు గురి చేసే ఫేక్ వ్యవహారాలతో రేపటి తరం నష్టపోయినాక ఏడ్చినా లాభలేదు. “చనిపోయిన మొక్కలకు నీళ్లు పోసినట్లే రేపటి తరం భవిష్యత్తు”.విద్యార్థుల మానసిక భద్రత, భరోసా కోసం తల్లిదండ్రులు, ప్రభుత్వాలు సామాజిక, మానసిక నిపుణుల సూచనలు పాటిస్తూ రేపటి ఆరోగ్యవంతమైన సమాజం కోసం నేటి పిల్లల్లో ఆన్లైన్ గేమింగ్, ఫేక్ వ్యవహారాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతో ఉంది.

 

మేకిరి దామోదర్,
సోషల్ అనలిస్ట్, కీర్తి పురస్కార గ్రహీత,
తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ హోల్డర్.
9573666650.