Saturday, 8 August 2026
సాహిత్యం

ఆధునిక రైతు అసలు రూపం చూపే మాధవరావు కవిత్వం

· · 1 నిమిషం చదవండి

బండ్ల మాధవరావు గారి కవిత్వ సంపుటి ‘పొలం గట్ల వెంట’ చదువుతుంటే చాలా చోట్ల మనసూ, మెదడూ ఏకకాలంలో స్పందిస్తాయి. రసాత్మక వాక్యం రాస్తూనే చదివే వారి మేధను సునిశితమైన అభివ్యక్తితో చైతన్యపరచడం ఈ కవిత్వం యొక్క ‘హాల్ మార్క్’ అని చెప్పవచ్చు. 50 కవితలతో వచ్చిన ఈ సంపుటి చదువుకోవడానికి ఎంతో వీలుగా ఉంది. ఈ అత్యాధునిక యుగంలో ఛిద్రమైన మానవ జీవన శకలాలను జాగ్రత్తగా, ఎరుకతో కవిత్వ కాన్వాసుపై పరచిన స్పష్టత ఇందులో ఉంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే మార్గంలో సరళంగా, ఎన్నో రోజులు గుర్తుండేలా చెప్పగలది కవిత్వ ప్రక్రియ అని నా నమ్మకం. అలాంటి కవితలే మనల్ని మరింత మానవీయంగా మారుస్తాయి.
_____________________

ఈ సంపుటిలోని 50 కవితల్లో, ప్రతి కవితలోనూ గుండెను తాకే వాక్యం ఒకటి చొప్పున ఉంది. ఆ వాక్యం దగ్గర ఆగి, ఆలోచించి, ఒక నక్షత్రం (*), ఒక చుక్క (•), ఒక టిక్ మార్క్ పెట్టుకుంటూ చదివించేలా చేయడమే కవి సాధించిన విజయం. వందకు వంద శాతం ఈ సంపుటి ప్రత్యేక లక్షణం ఇదే. పొలం గట్టు, నేల, మట్టి, చెట్లు, రెమ్మలు, కొత్త చిగుళ్లు… రాత్రి, చుక్కలు, ఆరుబయట పారబోసిన వెన్నెల, గడ్డిపూల శబ్దం లాంటి తేట పదాలతో వివిధ సందర్భాల్లో ఏకసూత్రత కలిగిన మానసిక సంవేదనలను మాధవరావు ఈ సంపుటిలో నిక్షిప్తం చేశారు.
______________________

‘కరిగిపోయిన కొమ్మలకు వేలాడుతూ,/కొత్త చిగుళ్ల దేహాలను నాలోకి/ వొంపుకుంటున్నాను’ అన్న ఈ కవి, తనలోంచి ‘ప్రవహిస్తున్న ఒక నది గురించి ప్రస్తావించేందుకు’ (27వ పేజీ) ఎంత మమేకమయ్యారో! ఆ ‘పొలం గట్ల వెంట’, ‘తీగల దుఃఖ పరిమళాల పక్కన నిలబడి’ (40వ పేజీ) ఎంత సమయాన్ని పరిశీలించారో!

ఈ కవితల్లోని వస్తువు కవి హృదయార్తిలో నలిగి, నాని, ఎర్రమన్ను వివిధ టెర్రకోటా కళాకృతులుగా రూపాంతరం చెందినట్లు (మెటామార్పాసిస్) అనిపిస్తుంది. కొండలు, నదులు, సముద్రాలు, అడవులు వంటివన్నీ చూడటానికే తప్ప ప్రవేశించడానికి కష్టసాధ్యమైనవి. కానీ, వాటిని ఆధునిక యాంత్రికత బాంబులతో పగులగొట్టి, బుల్డోజర్లతో కురచ చేసి ఆక్రమించింది. పర్యవసానంగా భూ ఉపరితలంపై ఉన్న అత్యద్భుతమైన ఎకోసిస్టమ్ ధ్వంసమైంది. మనిషి స్వార్థం తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కునే మూర్ఖత్వంగా పరిణమించింది; ఇదే మహా విషాదం. దీన్ని తేటగా, పదాల పటాటోపం లేకుండా, మార్మిక ఇనప తెరల వెనుక దాచేయకుండా సూటిగా వర్ణించిన తీరు పాఠకుడిని ప్రభావితం చేస్తుంది.

ఈ సంపుటిలో ‘ఆమె నడుస్తూనే ఉంది’ అనే కవిత (61వ పేజీ) కొన్నాళ్ల పాటు వెంటాడే కవిత. ఇది ఎంతటి అత్యున్నత ప్రశంసకైనా అర్హమైనది.

“పొలం గట్ల మీంచి రోడ్డున పడి నడుస్తోంది/ సద్దన్నంలో ఇంత పచ్చడి కలుపుకుని/ ఇన్ని మజ్జిగ నీళ్లు పోసుకుని తాగిన రోజుల నుంచీ/ అలవాటైన నడకే అయినా/ ఇప్పుడు మళ్లీ కొత్తగా నడుస్తోంది/ ఎకరాల పొలాలు గజాలుగా మారాక/ మట్టిని, తనని తవ్వుకుపోతున్న/ సరికొత్త రాక్షస మూకల్ని ఎదుర్కోవడానికి/ అపర కాళికలా మళ్లీ నడుస్తోంది… / …రంగు మార్చిన రాక్షసుల నిర్బంధాల నడుమ/ వేసే ప్రతి అడుగూ బలంగా/ రేపటిలోకే పడుతోంది…/ …కుట్రల్ని, కులాల కంపుల్ని, ముళ్ల కంపల్ని దాటుకుంటూ/ ఒకే లక్ష్యంతో నడుస్తున్న నడక/ జనం కోసం నడక/ జనంతో నడక”

ఈ కవితలో—ఒకనాడు ఒద్దికగా కొంగు చుట్టి, తలపై అన్నం గిన్నె మోసుకెళ్లి, పొలం పనులు చేసి, పశువులను ప్రేమతో సాకిన రైతు భార్య ఏ పరిస్థితుల్లో పొలం గట్ల వెంట రహదారులు దాటి ఉద్యమ బాట పట్టిందో ఆ వైనం తెలుస్తోంది. సాగినంత మేర ఆమె పాదాల ప్రతి కదలిక, అడుగడుగునా పోటెత్తే భావపరంపరల వాచ్య, అర్థ రెండింటిలోనూ గతి, గమన లయలను కవి సాధించారు. ఈ కవిత ఒక ఉద్యమ గీతంలా మనసులో ముద్రవేసుకుంటుంది; కళ్లెదుట మహిళా రైతు సజీవంగా కనిపిస్తుంది.

మరోచోట, కవి నిష్ఠుర నిజాలను ఇలా బహిర్గతం చేశారు: “వాగ్దానాల ప్రపంచం/ నిరంతరం చుక్కల్ని కోసి/ మూసిన గుప్పెళ్లతో పంచి పెడుతూనే ఉంటుంది/ తెరిచిన గుప్పెళ్లలోని శూన్యం తరచూ నిన్ను వెక్కిరిస్తూ ఉంటుంది” (93వ పేజీ)

“మాట బయటకు రాకుండానే/ అక్షరాలు కత్తెర్లకు బలవుతున్నాయి/……అబద్ధపు గాడ్పులు వాసంత సమీరాలనుకోవడమే/ అతి పెద్ద విషాదం” (69వ పేజీ)

నేడు జరుగుతున్న రాజకీయ చర్చలు, సమావేశాలు, వరాల వర్షాలు ఎంతవరకు నిజమో తెలియని దుస్థితి ఏర్పడింది. దీనిని ఎత్తిచూపే వాక్యాలివి. “నీరింకిపోవాల్సిన చోట మనిషింకిపోవడమే విషాదం”.

ఛత్తీస్‌గఢ్, వాయనాడ్ వంటి చోట్ల వచ్చిన లాండ్‌స్లైడ్స్, వరద ఉధృతి, బీభత్సం విశృంఖల మానవ నాగరిక వ్యాప్తి ఫలితమే కదా?! ఆ సమస్త జీవరాశి నష్టాన్ని ఒకే ఒక్క వాక్యంలో నిలిపిన కవి అభినందనీయుడు.
_____________________

మాధవరావు గారి కవిత్వంలో తెలుగు భాష తనను తాను అద్దంలో చూసుకుని మురిసే మురిపాల బిడ్డలా తోస్తుంది. భాషా నిబద్ధత, ప్రతి కవితనూ చెక్కిన నిర్మాణపరమైన శ్రద్ధ ఇందులో కనిపిస్తాయి.
_____________________

అండమాన్ సముద్రతీరం సాక్షిగా కవి చూసిన ఉదయాస్తమయాలను— “ఎర్రటి మేఘావరణంలో/ కళ్లకింపైన సింధూరం ముద్ద / అలా అలా సముద్రపు గొంతులోకి దిగిపోతుంటే/ ఓ వింతైన అనుభూతి (పే.117) “మెరుస్తున్న వెండి తీరాల్ని/ మాటిమాటికి ముద్దాడుతున్న/ నీటి అలలు/ ….గొడ్డలి ఆయుధం కనుమరుగైన చోట/చెట్లకు పెరగటం ఒక్కటే కళ” (పే.118) అంటూ పలవరించారు.

గిట్టుబాటు ధర దొరకని రైతు బాధ, మాధవరావు గారి కవితలో—
కాటాలకెక్కిన పంట బరువు
ఎప్పుడు రెండో వైపుకే వంగిపోతుంది
బేరన్లలో బంగారు వర్ణానికి తిరిగిన
పొగాకు బ్రోకర్ చేతుల్లో
నలుపుకు తిరిగి, చూర్ణమైపోతుంది
విరిగిన వెన్నెముక ఎప్పటికీ అతకదు
స్వేద భూముల్లో మొలకెత్తే మొక్కలు
కాలిపోయి కవురు కంపు వెదజల్లుతాయి” (పే.120),
చూర్ణమైపోతున్న బతుకులు
ఆకు తీసిన ఈనెల్లా
చెత్త కుప్పలు చేరుతున్నాయి” (పే.131) అంటూ రోదిస్తుంది.

అంతా బాగానే ఉంది, ‘దేశం వెలిగిపోతోంది’ వంటి భ్రమల ఇనప తెరల్ని ఖండించి… పొలం గట్ల వెంట పయనించి బాధ్యతగల పౌరుల హృదయాల్లోకి చేరిన విషాద మధుర కవిత్వంగా మలచిన మంచి కవి మాధవరావు గారికి శుభాకాంక్షలు, అభినందనలు.

 

 

– డా.కాళ్ళకూరి శైలజ
98854 01882

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *