సాహిత్యం

నింపాదితనం వెనుక నివురుగప్పిన నిప్పు ‘ప్రతీక్ష’

· · 1 నిమిషం చదవండి

ప్రతీక్ష అంటే ఎదురుచూపులు, నిరీక్షణ అని అర్థమట. దేశరాజు తన మూడవ కవిత్వ సంపుటికి ‘ప్రతీక్ష’ అని పేరు పెట్టారు. ఇంతకుముందు ‘ఒకే ఒక్క సామూహిక స్వప్నావిష్కరణ’, ‘దుర్గాపురం రోడ్’ అనే రెండు సెటిల్డ్ (settled) కవిత్వ సంపుటులతో పాఠకులను ఆకర్షించిన, వారి అభిమానాన్ని కొల్లగొట్టిన దేశరాజు తన మూడవ కవిత్వ సంపుటికి ‘ప్రతీక్ష’ అనే ఒక ఆంబిగ్యుయస్ (ambiguous) శీర్షికను ఉంచడం ఒక విశేషం అయితే, అది కూడా ఒక సంస్కృత పదం కావడం మరొక విశేషం. ఆంబిగ్యుయస్ అంటే అస్పష్టత అనో, సందిగ్ధత అనో అర్థం కాదు. నేను ఉద్దేశించినది భావ సందిగ్ధత గురించి.

ఎదురుచూపులలో దేనికోసమో తెలిసి ఎదురుచూడటం ఉంటుంది. దేనికోసమో తెలియకుండా ఎదురుచూడటం ఉంటుంది. తెలియకుండా ఎదురుచూడటం అంటే భగవంతం కోసం కాఫీ హోటల్లో ఎదురుచూడటం లాంటిది. ఈ కవిత్వం చదువుతున్నప్పుడు దేశరాజు తెలిసి, తెలిసీ దేనికోసమో తెలియకుండా ఎదురుచూస్తున్నాడు అనిపిస్తుంది.

__________________

జారిపడే జలపాతం చేయిపట్టుకుని ఆపాలని, సెలయేటి వంకర్లు సవరించాలని, పూలకు కొంచెం పరిమళం అద్దాలని, పచ్చటి పెరడుకు కాస్తంత పత్రహరితం పూయాలని… ఇలా చాలా చాలా దుస్వప్నాలను దేశరాజు కంటూ ఉంటాడు. తలకిందుల లోకంలో సహజాతి సహజమైన విషయాలన్నీ అసహజాలు అయిపోయి, అసహజాలన్నీ సహజాలుగా రూపుమార్చుకుంటున్నప్పుడు ఇలా దుస్వప్నాలు కనీ కనీ చివరాఖరికి “నా కలల సీతాకోకచిలుక పైనుండి బుల్డోజర్ ఒకటి దొర్లుకుంటూ వెళ్ళిపోయింది” అని దుఃఖపడతాడు. ఈ ప్రపంచం ఒక దుస్వప్నం అన్న ఎరుక కలిగివుండి కూడా ప్రతీక్షించడం ఒక విరోధాభాస.
___________________

దేశరాజు మొదటి కవిత్వ సంపుటి 2000లలోనూ, రెండవ కవిత్వ సంపుటి 2019 లోనూ, మూడవ కవిత్వ సంపుటి 2026 లోనూ వచ్చాయి. ఒక్కొక్క కవిత్వ సంపుటి నడుమ చాలా పొడవైన కాలం దేశరాజును దాటుకుని పోయింది. కవిత్వంతో సావాసం అంటే ప్రియురాలితో కాపురం చేయడమే; కవిత్వమూ, ప్రియురాలూ ఎప్పుడూ ఒకరికొకరు పాతబడకూడదు అని చెప్పే దేశరాజు ఇంత సుదీర్ఘ విరామాన్ని తీసుకోవడం వెనుక ఉన్న కారణాలు ఏమై ఉంటాయని ఎప్పుడైనా దేశరాజైనా తర్కించుకున్నాడో లేదో తెలియదు కానీ, మొదటి రెండు కవిత్వ సంపుటాలతో ఈ కవిత్వ సంపుటిని పోల్చి చూసినప్పుడు దేశరాజులో వచ్చిన మార్పు ఏమిటో అర్థమవుతుంది.

“రోజూ ఎన్‌కౌంటర్లు జరుగుతున్నంత మాత్రాన రోజూ కవిత్వం రాయలేం కదా! అలా అని దుఃఖించకుండానూ ఉండలేము రహస్యంగా అయినా!” అని ‘ఫీనిక్స్’లో అన్న దేశరాజు, “Eat N Bomb, Sleep N Bomb, Drink N Bomb” అన్న దేశరాజు ఇవాళ “తెల్లనివన్నీ ఆవులు కావు” అంటున్నాడు. మనం ఇలా మిగలలేం, మరోలానూ మారలేం అంటూ ఒక నైరాశ్యంలోకి కూరుకుపోతున్నాడా? అనే సందేహం వస్తుంది. “ప్రవహించాల్సిన రక్తం నాచులా గడ్డకట్టింది, భృకుటి ముడివేసి నుదుటి రాతలను ప్రశ్నించిన గుప్పెడు మందీ ఎక్కడినుంచో కనుమరుగయ్యారు” అంటున్నప్పుడు కేవలం నైరాశ్యం మాత్రమే ఉన్నదని అనుకుందామా?

అయితే దీన్ని నైరాశ్యమో, మరొకటో అని కూడా మనం భావించనవసరం లేదు. భావావేశాలు నెమ్మదించి, కరకు జీవన వాస్తవికత కళ్ళముందు కనపడి, వెంటాడి, వేధించి, లొంగదీసుకున్నప్పుడు స్థిరమైన కొన్ని అభిప్రాయాలలో అస్థిరంగా సంచరించడం తప్పదు. స్థిరమైన అభిప్రాయాలు ఉన్నప్పుడు అస్థిరంగా సంచరించడం ఎందుకు అంటే అతడు కవి కనుక.

డబ్బుల్లేవంటారు ఆఫీస్ వాళ్ళు
ఖజానా ఖాళీ అంటుంది ప్రభుత్వం
మరి డబ్బులన్నీ ఏమయినట్టు

అని అప్పుడెప్పుడో 2000 సంవత్సరంలో ప్రశ్నించిన దేశరాజు, 2026 లో

ప్రజల శరీరాలను కప్పలేని వస్త్రం
కప్పకుండా తెర మీద వినోదాన్ని
పంచిన వస్త్రం
విలువ వలువ కాలేని వస్త్రం
ఓట్ల కోసం వెంపర్లాడుతోంది

అనే సామాజిక సత్యాన్ని బలంగానే గుర్తించాడు.

కొంచెం జాగ్రత్తగా గమనిస్తే చాలు ఈ ‘ప్రతీక్ష’లో తెలుగు సమాజం దాటివచ్చిన ప్రాచీనావృతులన్నీ బలంగా కనిపిస్తాయి. వస్తువులో మార్పే కాదు దేశరాజు కవిత్వ నిర్మాణంలోనూ చాలా మార్పు వచ్చింది. వాక్యంలో దూకుడు తగ్గి ఒక నింపాదితనం వచ్చి చేరింది. వాక్యంలో దట్టించిన ఆవేశం స్థానంలో తేట నీటి అడుగు చేపపిల్లల్లాంటి ఆలోచన వచ్చి చేరింది.

దేశరాజు తన కవిత్వంలో వ్యంగ్యాన్ని చాలా బలంగా ఉపయోగించుకున్నాడు.

మేధావులు ఎంత మూర్ఖులు,
కాశ్మీర్ బ్రేక్‌డౌన్ అయిందని మొత్తుకుంటారు. దేశం షట్‌డౌన్ అయిందని విస్మరిస్తారు

అంటాడు ‘కపటి – బహువచనం’లో. ఉరిశిక్ష పడిన ఖైదీని ఉరితీసే ముందు ఉరితాడుకు వెన్న రాస్తారట. ఎందుకు అంటే తాడు ఒరుసుకుని మెడ చీరుకుపోకూడదట. ప్రాణం పోతున్నప్పుడు మెడ చీరుకుపోతుంది అని జాలిపడినట్టు, దేశం షట్‌డౌన్ అయిన విషయాన్ని విస్మరించి కాశ్మీర్‌లో బ్రేక్‌డౌన్ చర్చోపచర్చలు చేసే మేధావుల మీద ఇంతకంటే వ్యంగ్యం సాధ్యమా?

“మీ బుర్రలు గురుత్వాకర్షణకు బందీలై గ్రావిటీని ఎప్పుడో కోల్పోయాయి” అంటాడు ‘గ్రావిటీ కోల్పోయిన ప్రశ్నలు’లో. గ్రావిటీ అన్నా గురుత్వాకర్షణ అన్నా ఒకటే కదా అన్న ప్రశ్న వస్తుంది పాఠకుడికి. నిజానికి రెండూ ఒకటే. ఒకటి ఆంగ్లం, ఒకటి తెలుగు. అయితే ఈ పంక్తి భౌతికశాస్త్రం గురించి కాదు. బరువుగా కనిపించే మనసుల్లోంచి బరువు లేని ప్రశ్నలు ఎలా వస్తాయో చెప్పే వ్యంగ్యం. వ్యంగ్యం లాంటి ధ్వని ఇది.

ఒకే వాక్యంలో రెండు పదాలు ఎందుకు పెట్టాడు కవి? గురుత్వాకర్షణ అంటే శాస్త్రీయమైన పేరు, గంభీరమైన పదం. గ్రావిటీ అంటే అనుభవంలో ఉండాల్సిన బరువు. ప్రశ్నకు ఉండాల్సిన నిలకడ మొదటిది ఉంది. ప్రశ్నకు ఉండాల్సిన బలం రెండోది. అది పోయింది. ప్రశ్నలు తేలిపోతున్నాయి. బుర్ర బరువుకు బందీ, ప్రశ్న మాత్రం బరువు లేనిది. ప్రశ్నలు గ్రావిటీ కోల్పోయాయి, ఎందుకంటే అడిగే తలలు గురుత్వాకర్షణకు బందీలయ్యాయి. అంటే బరువైన ఆలోచన వల్లే ప్రశ్న తేలికైపోయింది. అది కవి ప్రతిభ.

“దూకెయ్యాలి, దూకెయ్యాలి, దూకేయ్… అంతే, దొరికినా దొరకకపోయినా ప్రేమ కోసం గాయపడాల్సిందే” అని ‘దుర్గాపురం రోడ్’లో అన్న దేశరాజు ఇప్పుడు “ఒకవైపే కాదు, రెండో వైపూ చూడాలి, అనుకున్న వైపే కాదు, అనువుకాని వైపు కూడా” అంటున్నాడు. అంతేనా కాదు, “చూస్తే ఏముంటాయి?” అనే ప్రశ్న వేసుకుని, “పొద చుట్టూ ముళ్ళే కనిపిస్తాయి” అని జవాబు చెప్పుకుని కూడా నిరీక్షిస్తున్నాడు. దేనికోసం అంటే ఓరిమితో వెతికితే ఆ చాటునే పెద్ద పూలతోట కనిపిస్తుందనే ఒక భరోసా ఏదో తనను కమ్మేస్తుంది అనుకుంటాను.
____________________

మంద్రస్థాయిలో మొదలయి, తారాస్థాయికి వెళ్లి శ్రోతను తనతో పాటు తీసుకుని వెళ్లే నిపుణుడైన సంగీతజ్ఞుడిలా దేశరాజు కూడా తన కవితని చాలా సాధారణంగా మొదలుపెట్టి చివరలో పాఠకుడిని సంభ్రమాశ్చర్యచకితులను చేస్తాడు. “నువ్వెలా ఉంటావో, నీ దేశమూ అలానే ఉంటుంది” అని అతి సాధారణంగా మొదలైన ‘శేషవస్త్రం’ చివరకు “కాస్త ఆలస్యంగా అయినా శేషవస్త్రానికి నిప్పు పెడతారు” అని ముగించడం ద్వారా పాఠకుడితో చేసే జుగల్బందీ పూర్తవుతుంది.
_____________________

దేశరాజు ‘ప్రతీక్ష’ చదవడం ఒక మంచి అనుభవం. నిండు గ్రీష్మంలో ఒయాసిస్సులా సేదతీరుస్తుంది ఈ కవిత్వం. దేశరాజు కేవలం కవి మాత్రమే కాదు మంచి కథకుడు కూడా! ఆ కథన చాతుర్యం ఈ కవిత్వంలో కనిపిస్తుంది. కొన్ని కవితలలో కనిపించే కథానాత్మకత కవిత్వానుభూతితో పాటు మంచి కథను చదివిన ఫీలింగ్‌ను కూడా ఇస్తుంది.

‘ప్రైవసీ’ కవిత చదువుతుంటే కచ్చితంగా అదే ఫీలింగ్ పాఠకుడికి కలుగుతుంది. “కవిత్వం కలలు కనే కళ్ళను కాపాడుకోవాలి” అనే దేశరాజు కళ్ళను కాపాడే విద్యలో మాస్టరీ చేశారు. దేశరాజు కథ, కవిత్వంతో జోడుగుర్రాల స్వారీ చేస్తున్నారు. జోడుగుర్రాల స్వారీ అంటే రెండు గుర్రాలను సమానంగా పరిగెత్తించడం. దేశరాజు కథనీ కవిత్వాన్ని సమానంగా పరిగెత్తిస్తున్నాడా? ఏమో ఆయనే ఆలోచించుకోవాలి.

 

 

౼వంశీకృష్ణ
95734 27422

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *