చరిత్ర పొరలు కవితాధారలై…
నది ఒక ప్రాంతపు సంస్కృతికి ప్రతీక. దాని తడి అక్కడి జనజీవనానికి జీవనాడి. తరతరాల చరిత్రకు, నాటి శౌర్యపరాక్రమాల వైభవాలకు అది ప్రత్యక్ష సాక్షీభూతం. అందుకే నది కవిత్వానికి ఎప్పుడూ అత్యంత ప్రియమైన మాధ్యమం. ఈ నేపథ్యంలో నదీమతల్లికి నీరాజనాలు అర్పిస్తూ, తన ప్రాంతపు చారిత్రక విశేషాలను కవితాధారలుగా కురిపిస్తూ వర్తమాన కవి, సంపాదకుడు ఈతకోట సుబ్బారావు వెలువరించిన తాజా దీర్ఘకవిత ‘పెన్నానది’.
నది అంటే ఆహ్లాదం… జీవనానందం. అందుకే నదిపై వచ్చిన కవిత్వం పాఠకుడి మదిలో ఎన్నెన్నో అనుభూతుల అలలతో సరికొత్త ప్రవాహమై సాగుతుంది. మానవ మనుగడలో కీలకపాత్ర పోషించే నదులకు కవిత్వం ఎప్పటికప్పుడు నీరాజనాలు అర్పిస్తూనే ఉంది.
‘నదికొక భాషవుంది/ నదికొక నాగరికత వుంది/ నదికొక బాధ్యతా వుంది’ అంటూ కవి గౌరునాయుడు నది విశిష్టతను చాటితే…‘నది అంటే నడుస్తున్న సంపద/ నీటిని మూటగట్టి/ పొలాల్లో విప్పితే/ అది సీతాకోకచిలుకల గుంపవుతుంది’ అంటూ గొపగాని రవీందర్ నదికి కవిత్వపు సొబగులు అద్దారు.
అస్తిత్వ వేదనను ధ్వనింపజేస్తూ మానవ సంబంధాల్లోని లొసుగులను తన ‘గోదావరి’ దీర్ఘకవితలో ఆ నది ఆత్మ ద్వారానే కవిత్వీకరించారు మద్దూరి నగేష్ బాబు. ఇక రెండు వందల ఏళ్ల క్రితం ఆధిపత్య పోరులో దళితుల ఊచకోతకు వేదికైన కోరేగావ్ రక్తచరిత్రను గుర్తుచేస్తూ౼‘నాకా భీకరయుద్ధం ఇంకా గుర్తుంది / ఇప్పుడు రెండువందల ఏళ్ల తర్వాత / భయంతో నక్కిన ఉరుముల శబ్దం / నా మేఘపు చెవుల్లో మార్మోగుతూనే వుంది’ అంటూ ఆ దుర్ఘటనకు సాక్షిగా నిలిచిన భీమానది చేతనే పలికించారు పుప్పాల శ్రీరాం (‘1818’ దీర్ఘకవితలో).
యానాం వద్ద గోదావరిపై వంతెన నిర్మించిన సందర్భంలో౼‘నది ఎన్నటికీ రహదారి కాదు / సులువుగా దాటే ఉపాయం వెతుక్కోవటానికి / అది నా గతవర్తమానాల్ని కలుపుతూ సాగే ప్రవాహం’ అంటూ కాలాలను అనుసంధానించే నదీప్రవాహాన్ని జీవనయానంతో పోల్చారు ఆకెళ్ల రవిప్రకాష్.
అలాగే౼‘మూసీనది గొంతు తడారింది / భాగ్యాల ఏటి బ్రతుకు మారింది / వలపు పాటలు పాడిన చోట / మురికిపాటలు పాడుతూంది’ అంటూ కవివరేణ్యుడు డా. సి. నారాయణరెడ్డి / జె. బాపురెడ్డి నాటి మూసీనది దుస్థితిని ఆర్ద్రంగా వర్ణించారు.
_____________________
ఇప్పుడు ఈతకోట సుబ్బారావు పెన్నేటి ధారల కవితాప్రవాహంలో తన ప్రాంత చరిత్రనూ, అక్కడి రమణీయ జ్ఞాపకాలనూ ఆవిష్కరిస్తున్నారు. సకల చరాచర జీవులకు ఆయువు పోసే నీటిచుక్క, వేల మైళ్లు ఎగిరివచ్చి సంతానోత్పత్తి చేసే వలసపక్షుల జీవనోత్సవం, గాంధీ మహాత్ముని అంతరంగ దీపకాంతి… గతంలో ఈ కవి వెలువరించిన దీర్ఘకవితలకు వస్తువులయ్యాయి. ప్రస్తుత కావ్యానికి తరతరాల నెల్లూరు సీమ చరిత్రకు నిలువెత్తు సాక్ష్యమైన ‘పెన్నానది’ ప్రధాన వస్తువైంది.
____________________
మొత్తం 16 అధ్యాయాల్లో సాగే ఈ కావ్యాన్ని కవి మన హృదయాల్లో పెన్నేటి ధారలా ప్రవహింపజేశారు. కవులను, కళాకారులను, సినీ దిగ్గజాలను అందించిన సస్యశ్యామల మాగాణాల్లో మనల్ని విహరింపజేస్తూనే, పుణ్యక్షేత్రాల ఆధ్యాత్మిక పరిమళాలను ఆఘ్రాణింపజేస్తారు. ఒక చరిత్రకారుడి దృక్కోణంలో నేల బహుముఖ పార్శ్వాలను స్పృశిస్తూ ప్రాంతీయ చారిత్రక వైభవానికి అక్షరరూపం ఇచ్చారు.
నరసింహకొండతో మొదలయ్యే ఈ చారిత్రక ప్రస్థానం రంగనాయకుల పవళింపుసేవ వరకు సాగుతుంది. సంస్కృతి, భాషా సాహిత్యాల ప్రాభవం, స్వాతంత్ర్య సమరవీరుల త్యాగనిరతి, విభిన్న రంగాల శేముషీధురంధరుల ప్రతిభ… ఇలా ఎన్నో అంశాలు పాఠకుల కళ్లముందు కదలాడతాయి.
‘అదే పెన్న! అదే పెన్న! నిదానించి నడు విదారించునెదన్ వట్టి ఎడారి తమ్ముడూ!’.. అంటూ కవికులతిలకుడు విద్వాన్ విశ్వం తన ‘పెన్నేటిపాట’లో కరవు కోరల్లో చిక్కుకున్న నాటి రాయలసీమ పెన్న దీనస్థితిని వర్ణించగా;
‘సరిగమల నాదం పుట్టింది
జలధారల సడికి
రాళ్లలో సరిగమలాడుతూ…
రాగాల జోల పాడుతూ
ప్రకృతి ఒడిలో పెన్నానది నర్తిస్తోంది’
అంటూ ఈ కవి పెన్నా పరవళ్లను ఆహ్లాదభరితంగా చిత్రించారు.
‘అక్షరాల మొలగొలకుల్ని సాలంకారంగా పండించిన పెన్నానది మాతృక’ అంటూ నెల్లూరు నేల పండించే ప్రసిద్ధ మొలగొలకల బియ్యం విశిష్టతనూ, ఇక్కడి కవితా వైభవాన్నీ ఒకేసారి ధ్వనింపజేశారు.
మమతా సమతా దాతృత్వాలు
పరిఢవిల్లిన నగరి…
వీధివీధినా హృదయాలింగనాలు
విస్తరిల్లిన రహదారి…
మానవతా పరిమళ సౌగంధ
సుధాంబుధుల ప్రహరి
వంటి ఆర్ద్రమైన పదచిత్రాలతో ఈ కవిత్వం సాగుతుంది.
‘సాహితీ సంస్కృతులు విప్పారిన ద్విపింఛ మయూరి’ అంటూ సింహపురిని సాహిత్య-సాంస్కృతిక నెమలిగా కవి అభివర్ణించారు. మహాత్ముని పాదముద్రలతో పునీతమైన ఈ నేల, అమరజీవి పొట్టి శ్రీరాములు సంకల్పానికి ఎలా ఉక్కుపిడికిలిగా మారిందో వివరించారు.
‘మునుల తపస్సులకు ఫలమై
పినాకినీ పేరుతో పుణ్యతీర్థమై
అష్టాదశ పురాణాల సాక్షిగా
పునీతమై పల్లెపల్లెకు పలకరింపు
జీవనాధారంలో పులకరింపు’
అంటూ జనజీవనానికి ఊపిరిగా మారిన పెన్నానది అంతరంగాన్ని వినిపించారు.
‘పెన్న ఒడ్డున ఇసుక తిన్నెల్లోని వీరగాథలు
నీటి సుడిగుండాల్లో వేదనాదాలు
ఇప్పటికీ ఇక్కడి ప్రతిధ్వనులు’
అంటూ నాటి వీరగాథలను కళ్లకు కట్టారు.
‘పెన్న పల్లెల ఊపిరి
రాళ్ల స్నేహితురాలు
ఇసుకల ఆటసఖి
తెలుగునేల గుండెల్లో ఎప్పటికీ పారే జ్ఞాపకం’
అంటూ నది ఇక్కడి ప్రజలతో ఎంతగా పెనవేసుకుపోయిందో ఆవిష్కరించారు.
‘సింహపురి నగరపు తొలిమేలుకొలుపు
తొలి నుడికారానికి ఇంపుసొంపులు
అలతి అలతి పదాల తిక్కనార్యుడు
పదిహేను పర్వాల పగడం’
అంటూ మహాభారతాన్ని ఆంధ్రీకరించి కవితా సామ్రాజ్యాన్ని ఏలిన తిక్కన సోమయాజికి వినమ్రంగా నీరాజనాలు అర్పిస్తూ, పెన్నమ్మ ఒంపుసొంపుల్లోనూ తిక్కన పద్యలయలను దర్శించారు. అలాగే ‘హిందూముస్లిం రాజుల, నవాబుల సర్వమత సహనసారం… మసీదులు, దేవాలయాల కలయికతో గ్రంథాలయంలా అందాలొలుకుతుంది’ అంటూ మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన చారిత్రక ఉదయగిరి దుర్గాన్ని ప్రస్తుతించారు.
పెన్నానదిపై కవికి గల ప్రేమాభిమానాలు అపూర్వమైనవి. ఆ నదిని మానవీకరిస్తూ— కనిపించని పాదాలకు కెరటాల గజ్జెలు కట్టి రాత్రింబవళ్లు నర్తించే ‘రసతరంగిణి’గా, ఊరిని కంటికి రెప్పలా కాపాడే ‘కాపలాదారు’గా, ఆకలి తీర్చే ‘అమ్మ ఒడి’గా, బతుకులు తీర్చిదిద్దే ‘అయ్యవారమ్మ’గా, పూర్వీకుల ఊపిరిగా, కష్టం తెలిసిన ‘కుటుంబ పెద్ద’గా, కన్నీళ్లు తుడిచే ‘ముత్తైదువ’గా బహువిధ రూపాల్లో ఆవిష్కరించారు. రంగనాథుని కొలువులో వేకువన వినిపించే సుప్రభాతంలోనైనా, రాత్రి పవళింపు సేవలోని మంగళాశాసనంలోనైనా పెన్నేటి గానాన్నే దర్శిస్తారు.
‘తూర్పు తీరానికి పయనం కట్టిన
ఒంటరి ప్రేయసి
ప్రియ సరిగమ ఉత్కంఠలో మైమరచి
అడవిజింకలా పరుగులంకించుకునే
ప్రియురాలు’
వంటి ఉపమానాలు ఈ దీర్ఘకవితకు విశేషమైన శోభను చేకూర్చాయి. మొత్తంగా ఈ కావ్యం ఒక ప్రాంతపు చరిత్రను, సాంస్కృతిక బహుముఖ పార్శ్వాలను కవితాత్మకంగా రికార్డు చేసిన విశిష్టమైన సాహిత్య ప్రయత్నం.

-డాక్టర్ కొత్వాలు అమరేంద్ర
91777 32414

Leave a Reply