సాహిత్యం

మౌనపు లోతుల్లోంచి మానవతాన్వేషణ

· · 1 నిమిషం చదవండి

ఒకరి బాధను చదివినప్పుడు అది మన బాధగా అనిపిస్తుంది. ఒకరి జ్ఞాపకం మన జ్ఞాపకాన్ని మేల్కొలుపుతుంది. ఒకరి ప్రశ్న మన ముందే నిలబడుతుంది. ఇదే వ్యక్తిగత అనుభవాన్ని సామూహిక అనుభూతిగా మార్చే కవిత్వ శక్తి.

‘నా కంటే ముందే…’ అనే కవితా సంపుటి శీర్షిక మన గత అస్తిత్వాన్ని, తరతరాలుగా మనకు అందిన జ్ఞాపకాలు, విలువలను తట్టిలేపుతుంది. వ్యక్తిగత పరిధిని దాటిన ఈ మాట వెనుక మునుపటి తరాల శ్రమ, త్యాగాలు, అనుభవాల పునాదులపై నిర్మితమైన వర్తమాన ప్రపంచం కనిపిస్తుంది. అందుకే ఇది వ్యక్తి భావనగా మొదలై, సమస్త మానవాళికి వర్తించే ‘మనకంటే ముందే…’ అనే సామూహిక స్పృహగా రూపాంతరం చెందుతుంది.

చందలూరి నారాయణరావు కవిత్వం గత కాలాన్నే కాక మనుషుల సంబంధాలు, సంఘర్షణలు, ఒంటరితనాన్ని స్పృశిస్తూ సాగే ఒక మానవతాన్వేషణ. ఆయనది కేవలం అలంకార ప్రదర్శన కాదు; జీవితం సంధించిన ప్రశ్నలకు అక్షర రూపం. కొన్నిసార్లు దొరకని సమాధానాలు సైతం పాఠకుడిలో నూతన ఆలోచనలకు బీజం వేస్తాయి.

‘అంతిమ వాక్యం కోసం…’ కవిత జీవితం, మరణం, ఉనికిని తాత్విక కోణంలో స్పృశిస్తూ మనిషి ప్రయాణపు అసలు సారాన్ని ప్రశ్నిస్తుంది. ఇక్కడ ‘అంతిమ వాక్యం’ కేవలం ముగింపు పదం కాదు; జీవించిన తర్వాత మిగిలే అర్థం, ఉనికికి ఇచ్చే నిర్వచనం. మరణాన్ని కేవలం అంతంగా కాక, సంపూర్ణ జీవితాన్ని పునఃసమీక్షించుకునే వేదికగా కవి ఆవిష్కరించారు.

‘ఇదే యుద్ధం’ కవిత బాహ్య సరిహద్దుల పోరాటాన్ని కాక, మనిషి అంతరంగంలో విలువలకు స్వార్థానికి మధ్య జరిగే ఘర్షణను ఆవిష్కరిస్తుంది. బాహ్య ప్రపంచంలో రగిలే యుద్ధాలకు మూలం అంతర్గత సంఘర్షణలేనని గుర్తుచేస్తూ, తనలోని మనిషితనాన్ని నిలుపుకోలేనివాడు సమాజంలో శాంతిని నెలకొల్పలేడనే లోతైన తాత్విక ప్రశ్నను సంధిస్తుంది.

కవిత్వానికి అక్షరం ప్రాణం. అయితే ఆ అక్షరం వెనుక ఒక అనుభవం, ఒక జ్ఞాపకం, ఒక మౌనం ఉంటాయి. ‘ప్రతి అక్షరం రహస్యమే’ అనే కవిత ఈ విషయాన్నే మరో కోణంలో ఆవిష్కరిస్తుంది. అక్షరాన్ని కేవలం భావవ్యక్తీకరణ సాధనంగా కాకుండా, దాని వెనుక దాగిన అనుభూతులకు ఒక వారధిగా కవి చూస్తారు. చెప్పిన మాటకన్నా చెప్పకుండా మిగిలిపోయిన మౌనంలో కొన్నిసార్లు ఎక్కువ అర్థం ఉంటుంది. అలాగే కవితలోని పదాల మధ్య ఖాళీల్లో కూడా పాఠకుడు తన అనుభవాన్ని కనుగొనగలడు. అదే కవిత్వానికి ఉన్న అంతర్గత రహస్యం.

‘ఈత రాని కూనలకు’ శీర్షిక జీవిత ప్రవాహ వేగాన్ని తట్టుకోలేక కొట్టుకుపోయే నిస్సహాయులు, అమాయకులకు బలమైన ప్రతీక. సమాజంలో అందరికీ సమాన అవకాశాలు ఉండవని, కొందరు రక్షణ లేకుండానే జీవన పోరాటంలోకి నెట్టివేయబడతారని ఇది ఎత్తిచూపుతుంది. బలహీనులను, రక్షణ లేనివారిని ఆదుకోవడమే నిజమైన మానవత్వమనే ఆర్ద్రతను ఈ కవిత ఆవిష్కరిస్తుంది.

ప్రేమకు కూడా ఈ సంపుటిలో ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రేమ ఉన్నచోట బాధ ఉంటుంది. అనుబంధం ఉన్నచోట విడిపోవడమనే భయం ఉంటుంది. జ్ఞాపకం ఉన్నచోట గతం ఉంటుంది. ఈ విరుద్ధ అనుభూతుల మధ్యే ప్రేమకు సంపూర్ణత వస్తుంది. అందుకే వ్యక్తిగత అనుభూతిగా మొదలైన ప్రేమ, చివరికి మానవ సంబంధాల విస్తృతమైన చిత్రంగా మారుతుంది.

ప్రకృతిని ఈ కవిత్వంలో కేవలం అందమైన దృశ్యాలుగా చూపలేదు. దాని చిన్న చిన్న కదలికలు మానవ జీవితానికి ప్రతీకలయ్యాయి. వాన, వెలుగు, చీకటి, పువ్వు, గాలి వంటి సహజ దృశ్యాలు భావాలకు అనుగుణంగా ఒదిగాయి. ప్రకృతిని చూస్తూ మనిషిని చదవడం, మనిషిని చూస్తూ ప్రకృతిని గుర్తించడం ఈ కవిత్వంలోని మరో ప్రత్యేకత.

చందలూరి నారాయణరావు కవిత్వంలో సామాజిక స్పృహ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే అది పెద్ద నినాదాల రూపంలో కాకుండా జీవితంలోని చిన్నచిన్న సంఘటనల ద్వారా వ్యక్తమవుతుంది. మారుతున్న విలువలు, కుటుంబ సంబంధాల్లో వస్తున్న మార్పులు, పెరుగుతున్న ఒంటరితనం, బలహీనుల పరిస్థితి, కాలంతో మారుతున్న జీవన విధానం ఇవన్నీ ఆయనకు కవితా వస్తువులయ్యాయి. ఆయన పాఠకుడి ముందు ఉపన్యాసకుడిలా నిలబడరు. ఒక దృశ్యాన్ని చూపిస్తారు, ఒక అనుభూతినిస్తారు, ఒక ప్రశ్నను సంధిస్తారు. ఆ తర్వాత ఆలోచించే బాధ్యతను పాఠకుడికే వదిలేస్తారు.

పుస్తకంలోని కవితలను ఒక్కొక్కటిగా చదివితే ఆయన ప్రయాణం ఒకే భావప్రాంతంలో ఆగిపోలేదని తెలుస్తుంది. జీవితం, ప్రేమ, మరణం, జ్ఞాపకం, ప్రకృతి, కుటుంబం, సమాజం, విలువలు, మానవ సంబంధాలు ఇలా విస్తరించిన అనేక అనుభవాలను తనదైన దృష్టితో పలకరిస్తారు. పలవరిస్తారు. అయితే ఈ వైవిధ్యాన్ని కలిపి ఉంచే అంతర్లీన దారం మాత్రం మనిషి పట్ల ఉన్న అన్వేషణ.

____________________

చందలూరి నారాయణరావు కవిత్వాన్ని ప్రత్యేకంగా నిలబెట్టేది వస్తువైవిధ్యం మాత్రమే కాదు. సాధారణ జీవితంలో అసాధారణమైన అర్థాలను వెతికే చూపు. పెద్ద సంఘటనల కంటే చిన్న అనుభవాలకే ఆయన కవిత్వంలో ఎక్కువ ప్రాధాన్యం కనిపిస్తుంది. ఎందుకంటే మనిషి అసలు జీవితం పెద్ద సంఘటనల్లో కంటే ప్రతిరోజూ ఎదురయ్యే చిన్న చిన్న క్షణాల్లోనే ఎక్కువగా దాగి ఉంటుంది. ఒక మాట, ఒక జ్ఞాపకం, ఒక సంబంధం, ఒక విడిపోవడం, ఒక మౌనం ఇవన్నీ కవితగా మారగలవని ఈ సంపుటి చెబుతుంది. ఇలా కవిత నుంచి కవితకు ప్రయాణిస్తున్నప్పుడు ఆయన చెప్పే విషయాల కంటే, ఆయన మనలో మేల్కొలిపే ఆలోచనలే పెద్దవిగా మారతాయి.

________________________

ఈ సంపుటిలోని కవితలలో వాడిన భాష కూడా గమనించదగ్గది. సులభంగా చదివించగలిగే సరళత ఉన్నప్పటికీ, ఆ సరళత వెనుక ఉన్న భావాలు అంత తేలికైనవి కావు. సులభంగా చదివించడం ఒక నైపుణ్యం, చదివిన తర్వాత ఆలోచింపజేయడం కవిత్వం. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించడానికి చేసిన ప్రయత్నం సంపుటిలో కనిపిస్తుంది. అయితే ప్రతి కవితా ప్రయాణం ఒకే స్థాయిలో ఉండదు. కొన్ని చోట్ల భావోద్వేగం ఆలోచనను మించిపోతుంది. మరికొన్ని కవితల్లో అనుభూతి గాఢత ఉన్నప్పటికీ తాత్విక స్పష్టత మరింత పదునుగా ఉంటే ప్రభావం ఇంకాస్త పెరిగేదనిపిస్తుంది. కానీ ఇవి సంపుటి మొత్తం మీద ఉన్న కవితా స్వరాన్ని తగ్గించే అంశాలు కావు. కొన్ని కవితలు ఆలోచింపజేస్తాయి, కొన్ని కదిలిస్తాయి, మరికొన్ని గాఢమైన ముద్ర వేస్తాయి.

మనకు అందిన ప్రపంచాన్ని తరువాత తరానికి ఎలా అందిస్తున్నాం? మనకంటే ముందున్నవారు ఏం వదిలి వెళ్లారు? మనం ఏం వదిలి వెళ్లబోతున్నాం? అనే ప్రశ్నలు ఈ సంపుటి అంతటా అంతర్లీనంగా వినిపిస్తాయి. అందుకే ఇది ఒక కవితా సంపుటిగా మాత్రమే కాకుండా, కాలంతో సంభాషిస్తూ, గతాన్ని తడుముతూ, వర్తమానాన్ని ప్రశ్నిస్తూ, భవిష్యత్తుపై బాధ్యతను గుర్తుచేసే అక్షర ప్రయాణంగా నిలుస్తుంది. మనిషిని వెతుక్కుంటూ మొదలైన ఈ ప్రయాణం చివరికి పాఠకుడినే అతని అంతరంగం ముందు నిలబెడుతుంది.

నా కంటే ముందే ఒక ప్రపంచం ఉంది. నా తర్వాత కూడా ఒక ప్రపంచం ఉంటుంది. ఈ రెండింటి మధ్య నేను ఎలా జీవించాను అన్నదే నా అసలు ‘వాక్యం’.

 

 

-ఎన్. లహరి
98855 35506

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *