దృశ్యాదృశ్యాల జమిలి ‘మరచిపోకుమా’
సురేంద్ర రొడ్డ తాజా కవితా సంపుటి ‘మరచిపోకుమా’చదువుతున్నప్పుడు—‘ఇంతటి బరువైన కవిత్వాన్ని నా హృదయం ఆస్వాదించగలదా!’ అనే సంశయం కలిగింది. కానీ పేజీలు తిరగేస్తున్న కొద్దీ, నన్ను నేనే మరచి ఆ కవితా సంపుటిలో లీనమైపోయాను.
కరోనా గురించిన విశ్లేషణలో… ‘మరణం మనకు శత్రువేమీ కాదు, మనతోనే పుట్టి నడుస్తున్న తోబుట్టువే’ అనే సాహసోపేతమైన భావనతోనే ఆగిపోక; మహారాష్ట్ర దళిత జీవితాల ఆర్తిని వడబోసి ‘మూతికి ముంత, వీపుకో మట్ట మనకేమీ కొత్తకాదు’ అంటూ అమానవీయ దృశ్యాన్ని సాక్షాత్కరింపజేసి ఆక్షేపించడం—ఎంతో నిబద్ధత, సామాజిక స్పృహ గల ధైర్యశాలి అయిన కవికి మాత్రమే సాధ్యమయ్యే పని అనిపించింది.
చిన్ని పాదాల్లోనే… ‘కూలికొచ్చిన తల్లికి సేపుకొచ్చిన చనుబాలు కారి రవిక తడిసిపోతుంటే’ అనడం ఒక ఆర్ద్రమైన దృశ్య రూపకల్పనే కదా! ఈ ఒక్క కవితా చిత్రంతోనే సురేంద్ర నా దృష్టిలో ‘దృశ్య కవిత్వానికి చిరునామా’గా నిలిచిపోయాడు.
‘కోన అంటుకోక మునుపే కొండలోని మంట ఆర్పేయాలి’ అంటూ మానవత్వంలో మమకారం మసకబారడాన్ని నిరసిస్తూ, ఆలోచింపజేసే దృశ్యాన్ని పండించడం సురేంద్రకే చెల్లింది.
వన్నె తగ్గిన ఒక ముదుసలి వేశ్య దుర్భర స్థితిపై… “కడుపు చేసినవాడు మొగుడు కాక, కడుపున పుట్టినవాడు కొడుకు కాక, సుఖరోగాల పుట్టకు చావు రాక, సుఖనిద్రనిచ్చే ఆరడుగుల నేల కోసం వెతుకులాట” అంటూ అల్లిన ఈ దృశ్య కవిత—‘మరచిపోకుమా’ సంపుటికే నిలువెత్తు చిరునామా కాదా!

జీవితంలో నాన్న పాత్ర ఎంతటిదో రెండు మాటల్లో చెప్పడమెలా అనే సందేహం వస్తే… ‘నాన్న పాలలో వెన్న, కడవరకూ తన కష్టాలను నీకు కనబడనీయక దాచేస్తూ…’ అని ఆర్ద్రంగా పలికితే చాలు అనిపించింది.
శిశిరానికి స్వాగతం పలకాలంటే… ‘ఆనంద భాష్పాలతో నీ పాదాలను అభిషేకించాలనేమో మది వరదలై పారింది’ అన్న భావన చాలదా!
ఈ దేశం ఎదుర్కొంటున్న సామాజిక సంక్షోభం గురించి… “తనో వెర్రివాడో వేదాంతో తెలియదుగానీ, తన సంచిలోని ధర్మాలను ఊరి చివర దించి కుప్పగా పోసి కన్నీరిడుతూ… దింపుడు కళ్లెం ఆశతో… ఓ జవానులా ఎదురు చూస్తుంటాడు” అంటూ ఆర్తిగా వాపోతాడు.
బాధ్యతాయుతమైన ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ కూడా, పీడిత వర్గాలకు బాసటగా నిలవనీయని కఠోరమైన నిర్బంధాన్ని తలచుకుంటూ… “పీడితులు తోడురాక, బిగిసిన పిడికిళ్లను చూపలేక జేబులో దాచుకుంటూ, ఒంటరినై ప్రతిసారీ నేనోడిపోతున్నా” అంటూ తన అంతర్మథనాన్ని, నిస్సహాయతా స్వగతాన్ని ఆవిష్కరిస్తాడు.
“మా బతుకులింతే… మా బతుకు సారాన్ని ఎంత తాగినా, సారా రాకాసి దాహం తీరనే తీరదు” అంటూ ప్రభుత్వాల సారా విధానాలను నిశితంగా దుయ్యబడతాడు.
ప్రేమరాహిత్యంలో కొట్టుకుపోతున్న నేటి సమాజంలో… ‘కొండను పిండిచేసి, అడవిని బుగ్గిచేసి, భూమాత గుండెల్ని కుళ్లబొడిచేసి భూగోళాన్ని బంధించిన మనిషి’ ప్రస్తుతం ‘పంచప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాపాడే దివ్యశక్తి కోసం ఊపిరి బిగబట్టి ఎదురుచూడటాన్ని’ తీవ్రంగా నిరసిస్తాడు.
జీవిత రథాన్ని నడిపిస్తున్నది కేవలం ఉద్యోగం చేసే పురుషుడేనా? లేక నిశ్శబ్దంగా గడియారంలోని సెకను ముల్లులా తిరుగుతూ కుటుంబానికి అనుక్షణం సేవలందించే స్త్రీమూర్తా? అనే ప్రశ్నకు… ‘గడియారంలోని సెకను ముల్లులా జీవిత వృత్తం చుట్టూ తిరుగుతున్న ఇల్లాలు’ అంటూ సమాధానమిస్తూ పాఠకులను మెప్పిస్తాడు.
ఈ సంపుటిని చదివి ముగించాక, మనసును బలంగా తాకిన ఈ కవిత్వంపై నా భావాలను ఇలా నాలుగు మాటల్లో పంచుకోవాలనిపించింది. నిరంతరం వచన రచనకే అలవాటుపడిన నన్ను సైతం ఈ కవితా సంపుటి ఎంతగానో సమ్మోహితం చేసింది, మెప్పించింది.
పుస్తకం కొరకు ఫోన్ నంబర్: 94915 23570లో సంప్రదించవచ్చు. వెల: 200/-
– వంకిరెడ్డి రెడ్డెప్ప రెడ్డి
94400 44922

Leave a Reply