హైదరాబాద్ నగరానికే కాదు… యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్న చారిత్రక, ఆధ్యాత్మిక మహా పుణ్యక్షేత్రం బల్కంపేట ఎల్లమ్మ–పోచమ్మ దేవాలయం. శతాబ్దాల చరిత్రను సొంతం చేసుకున్న ఈ ఆలయం ప్రతి ఏడాది బోనాల సందర్భంగా లక్షలాది మంది భక్తులతో కళకళలాడుతుంది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవార్ల ఆశీస్సులు పొందుతుంటారు. ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ సైతం ప్రతి సంవత్సరం ఈ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఈ క్షేత్ర విశిష్టతకు నిదర్శనం.
ఇలాంటి పవిత్ర క్షేత్రంలో అమ్మవార్ల దివ్య ఆశీస్సులతో తన ప్రచార ప్రయాణాన్ని ప్రారంభించింది ప్రముఖ దర్శక నిర్మాత ఎం.ఎస్. రాజు రూపొందించిన అత్యంత ప్రతిష్ఠాత్మక తెలుగు చిత్రం ‘అగధ’. ఈ చిత్రాన్ని శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్ పతాకం పై అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14, 2026న భారీ స్థాయిలో ‘అగధ’ విడుదల కానుంది.
జూలై 26, 2026 (ఆదివారం) నాడు ‘అగధ’ మూవీ టీమ్ బల్కంపేట ఎల్లమ్మ–పోచమ్మ దేవాలయాన్ని సందర్శించి, అమ్మవార్లకు సంప్రదాయబద్ధంగా బోనాలు సమర్పించింది. అనంతరం అక్కడే ‘అగధ’ చిత్ర ప్రచార కార్యక్రమాలను అధికారికంగా ప్రారంభించింది.
కథానాయిక కామాక్షి భాస్కర్ల ఈ బోనాల కోసం ప్రత్యేకంగా అలంకరించుకుని, భక్తి శ్రద్ధలతో అమ్మవార్ల కు బోనాలు సమర్పించారు. దర్శకులు ఎం.ఎస్. రాజు , నిర్మాత కాశీ విశాలాక్షి బలుసు, చిత్ర సమర్పకులు అజయ్ కేఆర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎన్.వి.ఎన్. సుబ్బరాజు, హీరో శ్రవణ్ రెడ్డి, తదితరులు తమ కుటుంబ సభ్యులతో సహా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *