ఘనంగా ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి బోనాలు
దర్శించుకున్న ముఖ్యమంత్రి రేవంత్
సృజనక్రాంతి /హైదరాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. యువతులు, మహిళలు, శివసత్తులతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. హైదరాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం ఉదయమే కుటుంబసమేతంగా అమ్మవారిని దర్శించుకుని తొలిబోనం సమర్పించారు. అమ్మవారికి బోనంతో పాటు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించారు. బోనాలు సమర్పించిన వారిలో మంత్రులు కొండాసురేఖ దనసరి అనసూయ (సీతక్క)లు ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు ముఖ్యమంత్రికి ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తీర్థప్రసాదాలు ఇచ్చి ఆశీర్వచనం ఇచ్చారు.
పలువురు ప్రముఖులతో పాటు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు బోనాలు సమర్పించారు. మాజి గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యులు పద్దిరాజు రవిచంద్ర, ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు, టిపిసిసి అధ్యక్ష్యులు మహేష్ గౌడ్, శాసన సభ్యులు దానం నాగేందర్, తలసాని శ్రీనివాస యాదవ్, నవీన్ యాదవ్, శ్రీగణేష్, మర్రి రాజశేఖర్ రెడ్డి, కెటిఆర్, జగదీష్ కాలేరు వెంకటేష్, మల్లారెడ్డిలతో పాటు సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల, సిపి సజ్జనార్, జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించారు. వీరితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు బోనాలతో పాటు పట్టువస్త్రాలు సమర్పించారు. అధికార యంత్రాంగం భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరిలాలలో ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేశారు. తాగునీటి సౌకర్యాన్ని కల్పించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసు శాఖ పటిష్ట బందో బస్తు ఏర్పాటు చేశారు. ఆలయ ఆవరణలో ఫైర్ ఇంజన్లు, అంబులెన్స్ సిద్ధంగా ఉంచారు. విద్యుత్ అంతరాయం కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. దేవాలయ చైర్మన్ రామేశ్వర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, సికింద్రాబాద్ ఆర్డీఓ సాయిరాం, ఇఓ మనోహర్ రెడ్డిలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. జిహెచ్ హెచ్ మెడికల్, ఫైర్, పోలీస్ తదితర శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షించారు.



Leave a Reply