Monday, 3 August 2026
తెలంగాణ

పెట్టుబడులు కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతున్నాం

· · 1 నిమిషం చదవండి

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

సృజనక్రాంతి /హైదరాబాద్ : తెలంగాణ రూపురేఖలను మారుస్తూ ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతున్నామని డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బీఆర్ పాలనలో విచ్చినమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయమే పునాదిగా సాగుతున్న తెలంగాణ పునర్నిర్మాణంలో విదేశాల్లో ఉన్న తెలుగు ఎన్ ఐఓసీ ప్రతినిధులు భాగస్వాములు కావాలన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ఆదివారం అమెరికాలో జరిగిన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (ఐఒసి) ప్రతినిధుల సమావేశంలో భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విప్లవాత్మక అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తు ప్రణాళికలను విదేశీ ప్రతినిధులకు, ఎన్ వివరించారు. తెలంగాణను 2047 నాటికి రూ 3 ట్రిలియన్ డాలర్లు, రాబోయే ఐదేళ్లలో 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా ‘తెలంగాణ రైజింగ్ 2047’విజన్ తమ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తోడుగా ముచ్చర్ల ప్రాంతంలో కాలుష్య రహిత నెట్-జీరో ప్రమాణాలతో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ని నాలుగో మహానగరంగా నిర్మిస్తున్నామని వివరించారు. రాష్ట్రాన్ని కోర్ అర్బన్ (క్యూర్), పెరి-అర్బన్ (ప్యూర్ ), రూరల్ అగ్రి (రేర్ ) అని మూడు ఆర్థిక మండలాలుగా వర్గీకరించి ,వాటిని వేగంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని నెలకొల్పామని, ప్రతి నియోజకవర్గంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నామన్నారు. టాటా గ్రూప్ భాగస్వామ్యంతో రూ. 2,100 కోట్లతో ప్రభుత్వ ఐటీఐలను హైటెక్ డిజిటల్ శిక్షణా కేంద్రాలుగా మారుస్తున్నామన్నారు. హైదరాబాద్ మహానగరంలో చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలకు చెక్ పెట్టేందుకే ‘హైడ్రా’ వ్యవస్థను తీసుకొచ్చామని అన్నారు. ప్రకృతి వనరులను కాపాడేందుకు కఠిన చర్యలు చేపడుతున్నామన్నారు. తమ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కఠినమైన ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ, విచ్ఛిన్నమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిందన్నారు. ఇప్పుడు ప్రతి నెలా 1వ తేదీనే ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలు జమ చేస్తున్నామని, దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు రూ. 1.20 కోట్ల ఉచిత ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ‘ఆరు గ్యారెంటీలను ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యతా క్రమంలో వేగంగా అమలు చేస్తోందని భట్టి విక్రమార్క అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *