Friday, 7 August 2026
తెలంగాణ

22ఏ భూముల పేరిట ఏ ఒక్క అర్హుడికీ అన్యాయం జరగదు

· · 1 నిమిషం చదవండి

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్ : నిషేధిత జాబితా 22ఏ లో ఉన్న భూముల విషయంలో రాష్ట్రంలో ఏ పేదవాడికీ, ఏ నిజమైన భూ హక్కుదారుడికీ అన్యాయం జరగకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అర్హులైన వారి హక్కులను కాపాడటం, ప్రభుత్వ భూములను రక్షించడం లక్ష్యాలతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వకంగా ఒక్క సెంటు భూమిని కూడా 22ఏ నిషేధిత జాబితాలో చేర్చలేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేయాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఎన్నడూ లేదన్నారు. వివాదాలు లేని పైవేట్ భూములను నిషేధిత జాబితాలో చేర్చిందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలోని తన కార్యాలయంలో క్యూర్ పరిధిలోని 22ఏ నిషేధిత భూములకు సంబంధించి వివిధ మాధ్యమాల్లో వచ్చిన కథనాలు, ప్రజల ఫిర్యాదులు, హైకోర్టు ఆదేశాలు, ప్రభుత్వ విధానాలపై మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 22ఏ అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారి ఆలోచనలు, సూచనలు అనుగుణంగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని అధికారులు పూర్తిగా అర్థం చేసుకుని అదే స్ఫూర్తితో పనిచేయాలని ఆదేశించారు. అర్హులైన వ్యక్తికి న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత. అదే సమయంలో ప్రభుత్వ భూములు కాపాడటం కూడా అంతే ముఖ్యమైన బాధ్యత అని అన్నారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములను సమగ్రంగా పరిశీలించి, చట్టబద్ధంగా, నిబంధనల మేరకు అర్హత ఉన్న భూములను గుర్తిస్తూ, ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి కేసును వాస్తవాలు, రికార్డులు, చట్టపరమైన అంశాల ఆధారంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు. 22ఏకు సంబంధించిన దరఖాస్తులు, ఫిర్యాదులు ఏ స్థాయిలో వచ్చినా పెండింగ్‌లో ఉంచకుండా నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములపై అక్రమ లావాదేవీలు, అక్రమ రిజిస్ట్రేషన్లు, ఆక్రమణలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. 22ఏ జాబితాలో ఉన్న భూములపై సమగ్ర పరిశీలన చేసి తుది నిర్ణయం తీసుకునే అధికారం జిల్లా కలెక్టర్లకు ఉందని గుర్తుచేస్తూ, ప్రజల హక్కులు, ప్రభుత్వ ప్రయోజనాలు రెండింటినీ సమతుల్యం చేస్తూ పారదర్శకంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *