రైతులకు విత్తనాల సరఫరా నుంచి పంట ఉత్పత్తుల కొనుగోళ్ల వరకు సమగ్ర ప్రణాళికతో నిర్దిష్ట కార్యాచరణ అమలు

రైతులకు విత్తనాల సరఫరా నుంచి పండించిన పంట ఉత్పత్తుల కొనుగోళ్ల వరకు సమగ్ర ప్రణాళికతో పాటు నిర్దిష్ట కార్యాచరణ అమలు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అధికారులను అదేశించారు. పంట వేసినప్పటి నుంచే రైతులు, పంటల వివరాల రికార్డులు, దిగుబడి అంచనాలు, ధాన్యం కొనుగోళ్ల వరకు ప్రతి దశలో వ్యవసాయ శాఖకు పూర్తి అవగాహన ఉండాలని స్పష్టం చేశారు. వర్షాలు, వ్యవసాయ సీజన్, తీసుకోవలసిన చర్యలపై ముఖ్యమంత్రి ఎంసీఆర్ హెచ్ఆర్‌డి బోధి పెవిలియన్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. ధాన్యం కొనుగోళ్లలో ఇప్పటివరకు ఉన్న అనుభవాలు, రైతులు ఇబ్బంది పడకుండా చేపట్టాల్సిన చర్యలపై రైతు కమిషన్‌, అగ్రికల్చర్‌ యూనివర్సిటీ, వ్యవసాయ నిపుణులు ఇచ్చిన సలహాలు, సూచనలపై సమావేశంలో చర్చించారు. రైతులు ఎక్కడా ఇబ్బంది పడకుండా వచ్చే సీజన్‌ నుంచే కొనుగోళ్లు సాఫీగా జరిగేలా ఇప్పుడే ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులను అదేశించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో పనిచేసే ఈ కమిటీలో వ్యవసాయ శాఖ డైరెక్టర్, పౌర సరఫరాల శాఖ ఎండీ, ప్రణాళికా విభాగం కార్యదర్శి సభ్యులుగా ఉంటారు.

విత్తనాల పంపిణీ మొదలు పంట వేసినప్పటి నుంచే అన్ని గ్రామాల్లో రైతులు, పంటల వివరాల నమోదు, రికార్డులు, పంట ఉత్పత్తుల అంచనాలు, ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యే వరకు వివిధ దశల్లో చేపట్టాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ కమిటీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడంతో పాటు ఈ ప్రక్రియకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తుంది. ఏ రైతు ఏ పంట వేశాడు, ఏ గ్రామంలో ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయనే వివరాలు కచ్చితంగా క్షేత్ర స్థాయి పరిశీలనతో నమోదు చేయాలని చెప్పారు. కనీస మద్దతు ధరలు, కేంద్రం నిర్దేశించిన కోటాలను అనుసరించి రాష్ట్రంలో పంట ఉత్పత్తుల కొనుగోళ్లు సాఫీగా జరిగేలా అన్ని చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ధాన్యం కొనుగోళ్ల సమయంలో అకాల వర్షాలు, తూకం, రవాణా, నిల్వ, మార్కెటింగ్‌ వంటి అంశాలపై ముందుగానే కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. సన్న వడ్లు పండించే రైతులకు బోనస్‌ ఇస్తున్న నేపథ్యంలో 7 రకాల సన్న వడ్ల విత్తనాలను అందుబాటులో ఉంచాలి. ఈ విత్తనాలను సబ్సిడీపై రైతులకు ఇవ్వాలి. రైతు వేదికల్లోనే సన్న వడ్ల విత్తనాలు అందుబాటులో ఉంచాలి. సన్న వడ్లు పండించే రైతుల పూర్తి డేటా సేకరించాలి. ధాన్యం దిగుబడిపై వ్యవసాయ శాఖకు సంపూర్ణ అవగాహన ఉండాలి అని ఆదేశించారు. రైతు వేదికలను ఇకపై రైతులకు ఉపయోగపడే కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రైతులు అక్కడే తమ వివరాలు నమోదు చేసుకొని విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేలా అన్ని ఏర్పాట్లు చేయాలి. ప్రతి రైతు వేదిక వద్ద వ్యవసాయ శాఖతో పాటు రెవెన్యూ, పోలీస్‌ విభాగాల నుంచి ఒక్కో అధికారి అందుబాటులో ఉండాలి. జిల్లాల్లో వీటి నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను అదనపు కలెక్టర్లకు అప్పగించాలని ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడం జిల్లా దమ్మపేట మండలంలో ప్రారంభించిన ఏఐ పైలట్‌ ప్రాజెక్ట్‌ ఫలితాలు అధ్యయనం చేసి వ్యవసాయ శాఖలలో ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని చెప్పారు.

ఎరువుల పంపిణీలో పారదర్శకత, వేగం పెంచేందుకు అన్ని రకాల ఫెర్టిలైజర్లను యాప్‌ ద్వారా బుక్ చేసే విధానం తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. యాప్‌ ద్వారా రైతులు బుక్‌ చేసుకున్న యూరియాను రైతు వేదికల ద్వారా పంపిణీ చేయాలని చెప్పారు. యూరియా పంపిణీ బాధ్యతను జిల్లా అదనపు కలెక్టర్లకు అప్పగించాలన్నారు. ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన యూరియా, ఇతర ఎరువుల కేటాయింపులపై ఎప్పటికప్పుడు కేంద్రానికి లేఖలు రాయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి సూచించారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే ఎరువులు అత్యధికంగా తెలంగాణకే కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పారు. రాష్ట్రంలో ఎరువుల పరిస్థితిపై అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించి, వాస్తవ పరిస్థితిని వివరించాలని సూచించారు. అవసరమైతే మంత్రులు, ఎంపీల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని చెప్పారు.

మార్క్‌ఫెడ్‌ నష్టాలను తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యాపారులకు తలొగ్గకుండా ఈ సారి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించిన కారణంగా మొక్కజొన్న కొనుగోళ్లతో వచ్చే నష్టం తగ్గించగలిగామని పేర్కొన్నారు. గతంలో రూ. 13 వేలకు టన్ను అమ్మిన పరిస్థితి ఉందని, ఈసారి దాదాపు రూ. 21 వేలకు పైగా టెండర్ రేట్ వచ్చిందని చెప్పారు. ఆయిల్‌ఫెడ్‌ను మరింత బలోపేతం చేసి లాభాల దిశలో నడిపించాలని అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వ డైరీని మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సకాలంలో పాల రైతులకు చెల్లింపులు జరపాలని సూచించారు.

What do you feel about this post?

0%
like

Like

0%
love

Love

0%
happy

Happy

0%
haha

Haha

0%
sad

Sad

0%
angry

Angry

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *