తెలుగు కథా, నవలా సాహిత్యంలో రాయలసీమ ప్రాంతీయ అస్తిత్వాన్ని, ముఖ్యంగా దళిత జీవన సంఘర్షణలను అత్యంత ప్రామాణికంగా, వాస్తవికంగా చిత్రించిన లబ్దప్రతిష్ఠులైన రచయిత చిలుకూరి దేవపుత్ర. సాహిత్య రంగంలో ఊహాజనిత శైలికి, కల్పిత ఆడంబరాలకు దూరంగా ఉంటూ, సమాజంలో తాను కళ్లారా చూసిన నిఖార్సైన నిజాలను, శ్రమజీవుల ఆవేదనలను తన కలం ద్వారా ప్రపంచానికి పరిచయం చేసిన అద్భుత సృజనకారుడాయన.
దేవపుత్ర 1952 ఏప్రిల్ 24న అనంతపురం జిల్లా, బెలుగుప్ప మండలంలోని కాల్వపల్లె అనే ఒక చిన్న గ్రామంలో నిరుపేద దళిత కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు సరోజమ్మ, ఆశీర్వాదం. గ్రామీణ ప్రాంతంలో కరువు రక్కసి కోరల నడుమ, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే తన ప్రాథమిక, ఉన్నత విద్యాభ్యాసాన్ని కొనసాగించారు.
బతుకుతెరువు కోసం కష్టపడుతూనే, చదువుపై ఉన్న ఆసక్తితో ఉన్నత విద్యను అభ్యసించారు. అనంతరం 1983లో జైళ్ల శాఖలో ప్రభుత్వ ఉద్యోగిగా తన వృత్తిని ప్రారంభించారు. తదనంతరం రెవెన్యూ శాఖకు మారి, అక్కడ వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించి, డిప్యూటీ తహసీల్దారుగా పదవీ విరమణ చేశారు.
నిరంతరం ప్రజలతో, వారి దైనందిన సమస్యలతో ముడిపడి ఉన్న రెవెన్యూ శాఖలో సుదీర్ఘకాలం పని చేయడం వల్ల సమాజంలోని అట్టడుగు పొరల్లోని వాస్తవాలు, కులవివక్ష రూపాలు, అధికార యంత్రాంగం వైఖరి ఆయనకు చాలా దగ్గరగా అవగతమయ్యాయి.
ఒకవైపు ప్రభుత్వ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తూనే, మరోవైపు సమాజం పట్ల ఉన్న సామాజిక బాధ్యతతో ఆయన తన కలానికి పదును పెట్టారు. ఆ ఉద్యోగ అనుభవాలే ఆయన సాహిత్యానికి అత్యంత బలమైన ముడిసరుకుగా మారాయి.
____________________
దేవపుత్ర 1977లో రాసిన ‘మానవత్వం’ అనే తొలి కథతో తన సాహిత్య ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఈ కథ అప్పట్లో ‘ప్రజాశక్తి’ దినపత్రికలో ప్రచురితమై, పాఠకుల, విమర్శకుల దృష్టిని ఆకర్షించింది. రాయలసీమ అనంతపురం మాండలికం (యాస), అక్కడి కరువు బతుకులు, ఫ్యాక్షనిజం సృష్టించే సామాజిక విధ్వంసం, భూస్వామ్య వ్యవస్థలో నలిగిపోయే దళితుల ఆత్మగౌరవ పోరాటాలు ఆయన రచనల్లోని ప్రధాన వస్తువులు. శైలిలో ఎక్కడా కృతకత్వం లేకుండా, పాత్రల నోట సహజమైన సీమ భాషను పలికించడం ఆయన ప్రత్యేకత.
____________________
ఆయన సృష్టించిన నవలలు.. సంఖ్య పరంగా తక్కువైనా, వస్తుతీవ్రత పరంగా తెలుగు నవలా సాహిత్యంలో చెరగని ముద్ర వేశారు. ఆయన మొత్తం నాలుగు నవలలు రాశారు.
దళితుడిగా పుట్టి, దళితుడిగా కష్టాల్లో జీవించి, ఆ బాధలోంచి, ఆవేదనలోంచి, ఆ అనుభవంలోంచి ఆవిష్కరించిన దళిత జీవన పరిణామమే ‘పంచమం’ నవల. దళిత జీవితం ఎంత సంఘర్షణకు లోనవుతోందో ప్రతి చిన్న కదలికతో సహా పట్టి మనకు అందించారు దేవపుత్ర. ఇది చిలుకూరి దేవపుత్ర గారి సృజనాత్మకతకు మకుటాయమానంగా నిలిచిన ‘మాస్టర్ పీస్’. తెలుగులో సంపూర్ణ దళిత స్పృహతో, ఆత్మాభిమాన పతాకగా వచ్చిన తొలి తరం నవలల్లో ఇది అత్యంత ప్రముఖమైనది. కుల వ్యవస్థలోని అమానుషత్వాన్ని, దళితులపై జరిగే సామాజిక-ఆర్థిక వివక్షను, విద్యావంతుడైన ఒక దళిత యువకుడి అంతర్మథనాన్ని ఇందులో హృదయవిదారకంగా చిత్రించారు. గ్రామీణ ప్రాంతాల్లో అంతర్లీనంగా సాగే అణచివేతకు భయపడకుండా, తార్కికంగా బద్దలు కొట్టిన నవల ఇది. ‘ఆటా’ నవలల పోటీలో (1998) బహుమతి పొందిన ఈ నవల విశిష్టతను గుర్తించి, 2001లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, 2005లో ఆంధ్రా యూనివర్సిటీ వారు తమ ఎం.ఎ. తెలుగు సిలబస్‌లో చేర్చి గౌరవించారు. ఈ నవల ‘ఉండేల విజ్ఞాన కళా పీఠం’ అవార్డును కూడా గెలుచుకుంది.
రాయలసీమను దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న ఫ్యాక్షన్ రాజకీయాలు, వాటి వెనుక నలిగిపోయే సామాన్య అమాయక ప్రజల జీవితాల చుట్టూ ‘కక్షశిల’ నవల సాగుతుంది. అధికార దాహం ఎంతటి ప్రాణనష్టానికి, సామాజిక దారిద్ర్యానికి దారితీస్తుందో ఇందులో కళ్లకు కట్టించారు.
‘అద్దంలో చందమామ’ నవల మారుతున్న సామాజిక ఆచారాలు, మానవ సంబంధాల మధ్య వచ్చే నైతిక ఘర్షణలు, మనుషుల అంతర్గత మనస్తత్వాల చుట్టూ సాగుతుంది.
సమాజంలో అట్టడుగున ఉంటూ, కనీస గుర్తింపునకు కూడా నోచుకోని అమాయక జీవితాల వెతలను, వారి ఆశలను ‘చీకటి పూలు’ నవల ప్రతిబింబిస్తుంది. బాలనేరస్థుల కష్టాలను, బాధలను హృదయవిదారకంగా ఆవిష్కరించిన నవల ఇది.
______________________
కథారచయితగా దేవపుత్రకు తెలుగు సాహితీ లోకంలో విశేషమైన ఖ్యాతి, గౌరవం ఉన్నాయి. సమాజంలో ఏ మూల అన్యాయం జరిగినా ఆయన కథా రూపంలో స్పందించేవారు. ఆయన వందకు పైగా కథలు రాశారు. సమాజంలోని కుళ్లును కడిగేస్తూ, మానవత్వాన్ని మేల్కొల్పేలా ఆయన కథలు సాగుతాయి. ఆయన కథలన్నీ ముఖ్యంగా ఐదు కథా సంపుటాలుగా వెలువడ్డాయి.
______________________
‘ఆరుగ్లాసులు’ సంపుటిలోని కథలు సమాజంలో ఉన్న అస్పృశ్యతను, టీ కొట్టుల్లో దళితులకు వేరే గ్లాసులు పెట్టే అమానుష విధానాన్ని ప్రశ్నిస్తూ సాగే కథల సంపుటి. ఇది తెలుగు సాహిత్యంలో తీవ్రమైన చర్చకు దారితీసింది.
‘ఏకాకి నౌక చప్పుడు’ సంపుటిలోని కథలు మనుషుల ఒంటరితనం, ఆధునిక సమాజంలో మారుతున్న మానవ సంబంధాల నేపథ్యంలో సాగే కథలు ఇందులో ఉన్నాయి.
‘వంకర టింకర ఓ!’ సంపుటిలోని కథలు గ్రామీణ జీవితంలో, అధికార యంత్రాంగంలో ఉండే వంకర పోకడలను వ్యంగ్యంగా, వాస్తవికంగా ఆవిష్కరిస్థాయి.
‘చివరి మనుషులు’ సంపుటిలోని కథలు సమాజంలో అట్టడుగున పడి ఉన్న ఉత్పత్తి కులాల జీవన పోరాటాన్ని ప్రతిబింబించే కథలు. ‘బందీ’ సంపుటిలో- వ్యవస్థకు, పరిస్థితులకు బందీలవుతున్న మనుషుల అంతరంగ చిత్రణ ఈ కథల ప్రత్యేకత.
‘మమకారం’ అనే ఆయన ప్రసిద్ధ కథను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరో తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో చేర్చడం విశేషం. అలాగే ‘సమిధలు’, ‘ఆయుధం’, ‘ఊడలమర్రి’, ‘విలోమం’, ‘అవిభాజ్యం’ వంటి కథలు ఆయనకు కథకుడిగా ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టాయి.
ఆయన రాసిన కథల్లో ‘ఆరుగ్లాసులు’, ‘ఊడలమర్రి’ వంటి కథలు గ్రామీణ జీవితాల్లోని కుల వ్యవస్థ సంక్లిష్టతలను, ఆధునికత వస్తున్నప్పటికీ మారకుండా ఉండిపోయిన మనుషుల సంకుచిత మనస్తత్వాలను ఎంతో లోతుగా విశ్లేషించాయి. మానవతా దృక్పథం, సామాజిక వాస్తవికత సమ్మిళితమైన ఆయన కథలు కేవలం తెలుగు పాఠకులకే పరిమితం కాలేదు. వీటిలోని సార్వజనీనత (Universal appeal), వస్తు బలం కారణంగా ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, కన్నడ, తమిళం, ఒరియా వంటి అనేక ఇతర భారతీయ భాషల్లోకి అనువాదమై జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నాయి.
దేవపుత్ర గారి సాహిత్య సేవను గుర్తించి నూతలపాటి గంగాధరం (1990 – ‘ఆరుగ్లాసులు’), హిమబిందు (1996 – ‘ఏకాకి నౌక చప్పుడు’), ఆటా తృతీయ బహుమతి (1996 – ‘పంచమం’), ఉండేల సాహితీ సత్కారం (1996 – ‘పంచమం:), పొట్టి శ్రీరాములు ధర్మనిధి (2000), చాసో స్ఫూర్తి (2001), విశాలాంధ్ర స్వర్ణోత్సవ (2003) పురస్కారాలతో పాటు మధురాంతకం కథా కోకిల, రాచకొండ పురస్కారాలెన్నో ఆయనను వరించాయి. ఇవన్నీ ఆయన వ్యక్తిగత కీర్తికే కాక, అణగారిన వర్గాల తరఫున ఆయన వినిపించిన గొంతుకకు దక్కిన గౌరవాలు.
చిలుకూరి దేవపుత్ర గారు తన జీవితాంతం నిబద్ధత గల ప్రజా రచయితగా, విలువలకు కట్టుబడిన వ్యక్తిగా జీవించారు. ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగ హోదాలో ఉంటూనే, సమాజం పట్ల బాధ్యతను మరువకుండా అణగారిన వర్గాల వాణిగా తన కలాన్ని నడిపారు. రాయలసీమ కరువు క్షేత్రం నుండి దళిత చేతనను, మానవీయ విలువలను, ప్రాంతీయ అస్తిత్వాన్ని ప్రపంచ సాహితీ వేదికపై నిలిపిన ఆయన, 2016 అక్టోబర్ 18న అనంతపురంలో కన్నుమూశారు.
ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన సృష్టించిన ‘పంచమం’ వంటి అద్భుత నవలలు, శతాబ్దాల సామాజిక చరిత్రను చాటే కథలు తెలుగు సాహితీవనంలో ఎప్పటికీ సజీవంగా, దిక్సూచిగా నిలిచి ఉంటాయి. నిబద్ధత, నిజాయితీ గల రచయితగా చిలుకూరి దేవపుత్ర గారి పేరు చిరస్థాయిగా వెలుగుతూనే ఉంటుంది.
-మహాసముద్రం దేవకి
99632 95997



Leave a Reply