ఆధునిక మలయాళ కవిత్వానికి నాయకుడని చెప్పదగిన కె. సచ్చిదానందన్ మే 28,1946న జన్మించారు. ఆయన దాదాపు పాతిక సంవత్సరాలు ఇంగ్లీషు ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆయన తొలి కవితా సంపుటి “అంజుసూర్యన్” 1970లో వెలువడింది. అప్పట్లో మలయాళ సాహిత్య ప్రపంచంలో అది ఒక గొప్ప ప్రభంజనం సృష్టించింది.
_____________________
సచ్చిదానందన్ దాదాపు 20 కవితా సంపుటాలు వెలువరించారు. ఆయన సాహితీ వ్యక్తిత్వం బహుముఖాలుగా విస్తరించింది. ఆయన ఒక మంచి అనువాదకుడు కూడా. ప్రపంచ కవులపై ఉన్న విస్తృత అధ్యయనం ఆయనను కవిగానే కాక అనువాదకుడిగానూ తీర్చిదిద్దింది. ఆయన అనువాద రచనలే 15 సంపుటాలుగా వెలువడ్డాయంటే, ఆయన అనువాద కృషిని మనం అంచనా వేయవచ్చు.
_____________________
పాబ్లో నెరుడా, బషీర్ అన్వర్ ల కవిత్వాన్ని; బ్రెచ్ట్, ఇలియెట్స్ ల ప్రసిద్ధ నాటకాలను ఆయన మలయాళంలోకి అనువదించారు. కవిగా, అనువాదకునిగానే కాకుండా, సచ్చిదానందన్ ఒక మంచి విమర్శకుడిగానూ మలయాళ సాహిత్యంలో గుర్తింపు పొందారు. వివిధ కాలాలలో విభిన్న అంశాలపై ఆయన రాసిన విమర్శనాత్మక గ్రంథాలు 17 సంపుటాలుగా అచ్చయ్యాయి. ఆయన అనేక గ్రంథాలకు సంపాదకత్వం వహించారు. సచ్చిదానందన్ కవితలు దాదాపు అన్ని భారతీయ భాషల్లోకి అనువదించబడటమే గాక అనేక ప్రపంచ భాషల్లోకి అనువాదమైంది. ఆయన రెండు యాత్రా గ్రంథాలను కూడా రచించారు.
సచ్చిదానందన్ గ్రామీణ నేపథ్యం ఉన్న వ్యవసాయ కుటుంబం నుండి వచ్చినవారు. అందుకే ఆయన కవితల్లోనూ ఆ పల్లెటూరి అమాయకత్వం, ఆ మట్టి వాసన, ఆ భాషా మాధుర్యం స్పష్టంగా కనిపిస్తాయి. సచ్చిదానందన్ ప్రగతిశీల భావాలను, మరీ ముఖ్యంగా మార్క్సిజాన్ని తన కవితా సిద్ధాంతాలుగా ఎంచుకున్నారు. మార్క్సిస్టు శిబిరాలకు సన్నిహితంగా ఉన్నప్పటికీ, కవితా వస్తువు మీద ఎన్నడూ తనకు తాను ఆంక్షలు విధించుకోకుండా, నిత్యం పరిణామం చెందుతూ, అనంతమైన వస్తు విస్తృతినీ, వైవిధ్యాన్నీ సాధించారు.
సచ్చిదానందన్ ‘పూర్తికాని కవిత’లో కవిత్వం గురించి ఇలా అంటాడు:
పూర్తి కాని కవిత
కాగితానికి జీవితానికి మధ్య
దోబూచులాడుతుంది
వీధిలో మనుషులతో నడిచి కవిత
మానవత్వపు వాసన వేస్తోంది
ఇతర కవితలు దాన్ని
గుంపులో చేర్చుకోలేదు
అని కవిత నేలమీద నడవాలని, నేలమీది మనుషులతో కలిసి జీవించాలని కవి సూచిస్తాడు.
“అయినా అప్పుడప్పుడూ/ శుద్ధ కవితల మధ్య/ తల ఎత్తి చూస్తోంది./ కొద్దిగా స్వేదం చిందిస్తోంది./ కొద్దిగా నెత్తురు వాసన కొడుతోంది./ వీధి మనుషుల్లాగే/ కాస్త నవ్వుతోంది కాస్త ఏడుస్తోంది./ అప్పుడప్పుడూ ప్రార్థిస్తుంది కూడా” అని కవితకు సామాన్య మానవులతోటిదే సహజీవనమని; చెమట, రక్తం కవితకు ఆయువులని కవి ఉద్దేశం.
‘కవిత ఒక మతం’ అనే కవితలో:
“కవితని నమ్మేవారు గుమిగూడడం లేదు/ మతం మార్పిడులు చేయడం లేదు/ విగ్రహాల గురించిన కలహాలు లేవు/ విషం మింగుతున్నారు/ ఒక్కొక్కరిగా శృంఖలాల్లో బందీ అవుతున్నారు/ కొరడా దెబ్బలు తింటున్నారు/ కటకటాలు, ఉరికొయ్యలు, మరణ వాయువులు/ విద్యుత్ కుర్చీలు వాళ్ళకే సొంతం/ ఎందుకంటే ప్రపంచం కోసం ప్రార్థించారు వాళ్ళు.” అని కవులు ప్రజల పక్షమని, ప్రపంచం కోసం ప్రార్థిస్తారని, అవసరమైతే దానికోసం జైళ్ళకు, ఉరికంబాలకు సిద్ధపడతారని కవుల బాధ్యతాయుతమైన జీవితాలను, త్యాగాలను సచ్చిదానందన్ ఈ కవితలో ప్రస్తావించారు. “కవిత నా మతం, మతం లేని వాడి మతం” అని నిర్ధ్వంధ్వంగా ప్రకటించారు.
ఆయన రాసిన ‘సులేఖ’ కవిత స్త్రీ దృష్టికోణం నుండి రాయబడింది.
ఇన్ని రెక్కలతో, సులేఖా
నువ్విక్కడ ఏం చేస్తున్నావ్!
బలిపీఠాలు పెంచిన పుత్రికవు నీవు
పుష్పించిన వసంతాల సుగంధం నీవు
పగలటం ఖాయమని ఎరిగిన
స్పటికపు మందహాసం నీది
అని ఆమె లాలిత్యాన్ని వర్ణిస్తాడు కవి. హరిత వృక్షాలు దాటి, జ్ఞాపకాల సరిహద్దులు దాటి నువ్వు వస్తున్నావని; నా పగటి వేళకు, కవితలకు మధ్య తుమ్మచెట్టులా ఎదుగుతున్నావని; చనిపోయిన నీ ముంగురులలో తన పసిడి వేలు పోనిచ్చి చితి నీ చెవిలో మంత్రించినదేమిటని ప్రశ్నిస్తాడు. సూర్యకాంతికి కూడా కోరలు, గోళ్ళు ఉన్న ఈ కాలంలో నువ్వు పుట్టవలసినదానివి కావు అంటాడు. అయినా ఏదో ఒకరోజు నీవు పుట్టాలని, నీపై నుండి దూసుకుపోయే బుజ్జిపిట్టను నేను కావాలని భావిస్తాడు.
కవులకు ఇష్టమైన మరొక ఇతివృత్తం వాన. సచ్చిదానందన్ వ్యవసాయ కుటుంబం నుండి వచ్చినవాడు కనుక ఆయన తన కవితల్లో వానను గొప్పగా బంధించాడు. ‘వానకు నానార్థాలు’ కవితలో వానకు ఉండే అనేక పార్శ్వాలను ఆయన ఆవిష్కరించిన తీరు అబ్బురపరుస్తుంది.
నదిలో కురిసి పరుగులు తీసే వాన
మామిడి తోటల్లో
పరుగులు తీసే నా బుజ్జితల్లి
నీరెండలోని వాన
పెదవి విప్పక వీడుకోలు పలికి
అత్తింటికెళ్ళే పల్లె పడుచు
అని వివిధ స్థలకాలాలలో కురిసే వానను గొప్ప గొప్ప ఉపమానాలతో పోల్చి చెబుతాడు.
“తాటాకు కప్పులపైన/ గుర్రపు డెక్కల సవ్వడి శ్రావ్యం/ వాన వెలిశాక గుర్రపు అడుగులు/ ఇంటి గుమ్మం వద్ద దర్శనమిస్తాయి/ విస్మయమే/ కోతిలాంటి గాలి కొమ్మలను దులగొడితే రాలే పండ్లలాంటి వాన/ నేరేడు పళ్ళు తిన్న పిల్లవాడు నత్తిగా మాట్లాడే వాన/ అపనిందల్ని ప్రచారం చేసే పొరుగింటావిడలాంటి వాన/ నవ్వుతూనే బండబూతులు తిట్టే కోయంబత్తూరు చెట్టీయమ్మలాంటి వాన”
ఇలా కవి బోలెడు వానలను గుర్తిస్తాడు. ఈ కవిత చదువుతుంటే కుందుర్తి ‘నగరంలో వాన’ కవిత గుర్తుకు వస్తుంది. అయితే ఇన్ని వానల్లోనూ కవికి బాగా నచ్చేది తొలకరి వాన. దానికి కారణం ఇలా చెబుతున్నాడు: “నాకు బాగా ఇష్టమైన వాన ఇప్పుడు కురిసే కొత్తవాన. ఎందుకంటే ఈ వానలోనే ఉంది… వెల్లుల్లిలోలా, యూకలిప్టస్‌లోలా… కొత్త దనం. ఇది ఈ కొత్త వానకే సాధ్యం.” ప్రాంతం ఏదైనా, భాష ఏదైనా తొలకరిలో కురిసే వర్షం, ఆ వర్షానికి నేల నుండి వీచే మట్టి పరిమళాన్ని మన చేత ఆఘ్రాణింపజేస్తుంది.
సచ్చిదానందన్ నత్తివాడి మీద ఒక కవిత రాశాడు. నత్తి అనే లోపాన్ని ఎంతో కవితాత్మకంగా, మానవీయ దృక్పథంతో చెబుతాడు.
నత్తి లోపం కాదు
ఒక మాటల విధానం
మాటలకూ అర్థాలకూ
మధ్యవచ్చే మౌనాన్ని
మనం నత్తి అని చెబుతున్నాం.
అని గొప్ప విశ్లేషణ చేస్తారు. ఒక సమాజానికి ఒకేసారి నత్తి వస్తే వాళ్ళ మాతృభాష నత్తే అవుతుందని తీర్మానిస్తాడు. తెలుగు కవి పఠాభి తన ‘పన్ చాం గం’ లో ‘నత్తివానికి నా వందనాలు’ అని చమత్కరించారు.
కవిత్వంలో ఎలిజీలకు (స్మృతి కవితలకు) ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. తెలుగు సాహిత్యంలో ‘స్మృతి కవితలు’ పేరుతో ఒక ప్రత్యేక కవితా శాఖ ఏర్పడింది. విప్లవ సాహిత్యంలో అమరులైన యోధుల గురించి ఎన్నో విలువైన స్మృతి కవితలు, గేయాలు వెలువడ్డాయి.
సచ్చిదానందన్ తన మిత్రుడు, విప్లవకవి యు.పి. జయరాజన్ కోసం ‘ప్రారంభం’ అనే ఎలిజీ రాశాడు. “నీ అస్తమయం/ ప్రపంచం అస్తమించడం లేదు/ నేను నీ శిల్పం చెక్కాలి. ఇనుముతోనో,/ స్పటికంతోనో, అగ్నితోనో, నీటితోనో/ ఆఖరికి మాటలతోనో/ నీ శిల్పం చెక్కాలి/ నువ్వు ఒక గడియారంగా మారావు/ సమయ సూచన చేసేందుకు.”
___________________
సచ్చిదానందన్ కవిగా మొదలై విస్తరించి, పరిణతి చెంది, ఇతివృత్తాలకు ఎటువంటి ఆంక్షలు విధించుకోకుండా కాలంతో పాటు నడుస్తూ, ఆ మాటకు వస్తే కాలం కంటే ముందు నడుస్తూ మలయాళ కవితాసీమను సుసంపన్నం చేశారు.
___________________
‘కవితానువాదం’ కవితలో “కవిత్వాన్ని అనువదించడం/ ఒక గూడును వదిలి మరో గూడు చేరడమే” అంటారు. సచ్చిదానందన్ కవిత్వాన్ని ఎల్. ఆర్. స్వామి తెలుగులోకి ‘శరీరం ఒక నగరం’, ‘కొన్ని చిన్ని చిన్ని వస్తువులు’ పేర్లతో అనువాదం చేసినట్లుగానే, మన తెలుగు కవులు ఎన్. గోపి, శివారెడ్డి, పాపినేని శివశంకర్, శిఖామణి, దాట్ల దేవదానం రాజు గార్ల కవిత్వాలను; గురజాడ, చాసో, కేతు విశ్వనాథరెడ్డి వంటి ప్రముఖ రచయితల కథలను కూడా మలయాళంలోకి అనువాదం చేశారు.
(జూలై 29న ప్రతిష్టాత్మక ‘డా. సినారె విశ్వంభర సాహితీ పురస్కారం’ ప్రముఖ మలయాళ కవి డా. కె. సచ్చిదానందన్ అందుకుంటున్న సందర్భంగా…)
-డా. శిఖామణి
98482 02526



Leave a Reply