రైతుల ప్రయోజనాల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం
హైదరాబాద్:ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతుల ప్రయోజనాల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ‘జిల్లా నీటిపారుదల సలహా మండళ్ల’ను తక్షణమే పునరుద్ధరించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో శనివారం నుంచే నీటిపారుదల సలహా మండళ్ల సమావేశాలు నిర్వహించాలని, సలహా మండళ్లు కేవలం నీటి విడుదలలపై నిర్ణయాలు తీసుకునే వేదికలుగా కాకుండా, రైతులు ఏ పంట వేస్తే భవిష్యత్తులో నష్టపోకుండా ఉంటారో ముందుగానే తెలియజేసే బాధ్యతాయుతమైన వ్యవస్థగా పనిచేయాలని జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు. హైదరాబాద్ సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి,సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నీటిపారుదల, వ్యవసాయ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర సంబంధిత వర్గాలతో కూడిన జిల్లా నీటిపారుదల సలహా మండళ్లు ప్రతి పంట కాలానికి ముందు, పంట సీజన్లో తప్పనిసరిగా సమావేశమవ్వాలని సూచించారు. జలాశయాల నీటి నిల్వలు, ఆశించదగిన నీటి ప్రవాహాలు, స్థానిక వర్షపాతం, తాగునీటి అవసరాలు, కమాండ్ ఏరియాల్లోని సాగు పరిస్థితులను సమగ్రంగా సమీక్షించి రైతులకు శాస్త్రీయమైన, విశ్వసనీయమైన మార్గదర్శకాలు ఇవ్వాలని ఆదేశించారు. ప్రస్తుత జలాశయాల నీటి నిల్వలు, రుతుపవనాల మిగిలిన కాలంలో వర్షపాతం అంచనాలను పరిశీలిస్తే అత్యంత జాగ్రత్తతో పంటల ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
ఆశించిన స్థాయిలో చేరని నీటి మట్టాలు..
ముఖ్యంగా నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు ఇంకా ఆశించిన స్థాయికి చేరుకోలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాజెక్టుల కింద రైతులు వరి వంటి అధిక నీటి అవసరమున్న పంటలను సాగు చేయవద్దని స్పష్టం చేశారు. ఆగస్టు తొలి వారంలో కురిసిన వర్షాలతో కొంత ఉపశమనం లభించినప్పటికీ, ఆ వర్షాల ఆధారంగా రైతులు వరి సాగుకు వెళ్లడం సముచితం కాదని సూచించారు. ప్రతి కమాండ్ ఏరియాలో ఎంత మేరకు సాగునీరు అందించగలమో, ఎక్కడ పరిమితులు ఉన్నాయో జిల్లా కలెక్టర్లు, నీటిపారుదల ఇంజినీర్లు, వ్యవసాయ అధికారులు రైతులకు అధికారికంగా తెలియజేయాలన్నారు. వచ్చే వేసవిలో రాష్ట్రంలో తాగునీటి సంక్షోభం తలెత్తకుండా ఇప్పటి నుంచే అవసరమైన నీటి నిల్వలను పరిరక్షించాలని గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. స్థానిక లేదా రాజకీయ ఒత్తిళ్లకు లోనై విచక్షణరహితంగా నీటిని విడుదల చేయరాదని హెచ్చరించారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ ఇంజినీర్-ఇన్-చీఫ్, నీటిపారుదల శాఖ ఇంజినీర్-ఇన్-చీఫ్ (జనరల్) ఓ.వి. రమేష్ బాబుతో సమన్వయం చేసుకుని భవిష్యత్తు తాగునీటి అవసరాలకు తప్పనిసరిగా ఎంత నీటిని నిల్వ ఉంచాలనే అంశాన్ని నిర్ణయించాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా పౌర సరఫరాల శాఖ పనితీరుపైన కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షించారు. ఎన్నో సంవత్సరాల తర్వాత అర్హులైన కొత్త లబ్ధిదారులను ప్రజాపంపిణీ వ్యవస్థలో చేర్చి,వారికి రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేస్తున్నామన్నారు.

Leave a Reply