నిరుద్యోగ యువకులను కొందరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు : సిఎం రేవంత్రెడ్డి
సృజనక్రాంతి/హైదరాబాద్ : రాష్ట్రంలో నిరుద్యోగ యువకులను కొందరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు హితవు పలికారు. ప్రజా ప్రభుత్వం రైతు, మహిళ, యువతకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ ఒక్కటొక్కటిగా అన్ని సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు వెళుతోందని చెప్పారు. విడతల వారిగా ప్రభుత్వంలోని ఖాళీలన్నీ భర్తీ చేస్తామని పునరుద్ఘాటించారు. నిరుద్యోగ యువకుల కలలను సాకారం చేయడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తుందని హామీ ఇచ్చారు. ప్రజా పాలన – ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా పరకాల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి దాదాపు రూ. 424 కోట్ల మేరకు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ప్రజాప్రభుత్వం అధికారం చేపట్టిన మొదటి ఏడాదిలోనే 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
నిరుద్యోగ యువతకు ప్రభుత్వం తగిన ప్రాధాన్యతనిస్తోందని, ఇటీవలి కాలంలో పోలీసు నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేయడమే కాకుండా వయో పరిమితిని కూడా సడలించామని వివరించారు. విడతల వారిగా నియామకాలు చేపడుతామని, రాబోయే కాలంలో ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. రైతులు, ఆడిబిడ్డలు, నిరుద్యోగ యువకుల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తోందని, ఇలాంటి సమయంలో యువకులు సమయం వృథా చేసుకోవద్దని సూచించారు. వరంగల్ జిల్లాకు చైతన్యం, ఉద్యమ చరిత్ర, పోరాట స్ఫూర్తి ఉందని, స్వాతంత్య్రానంతరం కూడా ఈ జిల్లా నుంచి ప్రజా జీవితంలో సర్వం ఒడ్డిన మహనీయులు ఉన్నాయని గుర్తుచేశారు.
సెప్టెంబర్ నెలలో శాసనసభ సమావేశాలను నిర్వహిస్తామని, అనుభవజ్ఞులైన ప్రతిపక్ష నాయకుడు కె. చంద్రశేఖర్ రావు సభకు హాజరై అభివృద్ధి, సంక్షేమంపై చర్చించి అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో అప్పుల భారం మోస్తూనే ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళుతున్నామని తెలిపారు. బోల్తా కొట్టిన బండిని పట్టాలెక్కించామని, ఇక పరుగెత్తించడమే మిగిలిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, దనసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, బలరాం నాయక్, కడియం కావ్య, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply