రాయలసీమ అనగానే ఒకప్పుడు కరువు, ఫ్యాక్షనిజం, విద్వేషాల ప్రాంతంగానే ప్రధాన స్రవంతి మీడియా లేదా సాహిత్యం చిత్రించింది. కానీ, ఆ ముఠా కక్షల వెనుక ఉన్న అసలైన సామాజిక కారణాలను, కరువు వెనుక దాగున్న పాలకుల నిర్లక్ష్యాన్ని, అన్నింటికీ మించి ఆ మట్టి మనుషుల ఆకలిని, ఆత్మాభిమానాన్ని అత్యంత ప్రామాణికంగా రికార్డు చేసిన అరుదైన రచయిత సింగమనేని నారాయణ. కథకుడిగా, విమర్శకుడిగా, సంపాదకుడిగా, ఉద్యమకారుడిగా ఆయన తెలుగు సాహిత్యానికి చేసిన సేవ అనన్యసామాన్యం.
____________________
రాయలసీమ కథకు ఒక స్పష్టమైన దిశను, సామాజిక దృక్పథాన్ని ఇచ్చిన అచ్చమైన ‘రైతు పక్షపాతి’ సింగమనేని. సింగమనేని నారాయణ గారిని గురించి రాయాలంటే కేవలం పొగడ్తలతో కాకుండా ఆయన జీవితం, సామాజిక దృక్పథం, రచనల అంతరార్థం ఇవన్నీ కలిపి చూడాలి. అప్పుడు మాత్రమే రచయిత యొక్క అసలు స్థాయి బయటపడుతుంది.
____________________
సింగమనేని నారాయణ 1943, జూన్ 27న అనంతపురం జిల్లా బండమీదపల్లి గ్రామంలో ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. గ్రామీణ వాతావరణం, కరువు రక్కసి కోరల్లో చిక్కుకున్న రైతాంగ జీవితం ఆయనకు చిన్నతనం నుంచే సుపరిచితం. వృత్తిరీత్యా ఆయన ఉపాధ్యాయుడిగా, అధ్యాపకుడిగా పనిచేశారు. 2021 ఫిబ్రవరి 25న ఆయన భౌతికంగా మనల్ని విడిచివెళ్లినా, ఆయన సృష్టించిన సాహిత్యం రాయలసీమ అస్తిత్వానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది.
ఆయన కేవలం చదువుకొని, ఉద్యోగం చేస్తూ రాసిన రచయిత కాదు; మార్క్సిస్ట్ దృక్పథాన్ని, విప్లవ రచయితల సంఘం (విరసం) సిద్ధాంతాలను ఆకళింపు చేసుకుని, సమాజంలో వస్తున్న మార్పులను నిశితంగా గమనిస్తూ కలం పట్టిన సామాజిక శస్త్రచికిత్సకుడు.
సింగమనేని నారాయణ తెలుగు సాహిత్యంలో గ్రామీణ జీవనాన్ని నిజమైన స్వరంతో చిత్రించిన ప్రముఖ కథా రచయితల్లో ఒకరు. ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతం ఆయన రచనలకు నేపథ్యంగా నిలిచింది. అక్కడి పొడి భూమి, కరువు, అప్పులు, రైతుల నిరాశ ఇవన్నీ ఆయనకు కేవలం విషయాలు కావు, జీవించిన అనుభవాలు.
ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగిన ఆయనకు గ్రామ సమాజంతో దగ్గరి అనుబంధం ఉండేది. అందుకే ఆయన కథల్లో కనిపించే జీవితం చూసినది కాదు, అనుభవించినది.
సింగమనేని నారాయణ రచనల్లో అత్యంత ప్రధానమైన వస్తువు రాయలసీమ రైతాంగం. ‘జువ్వి’, ‘సింగమనేని నారాయణ కథలు’ వంటి సంకలనాలు తెలుగు కథా సాహిత్యంలో మైలురాళ్లుగా నిలిచాయి. ఆయన కథల్లో భావోద్వేగాల కంటే వాస్తవికత, ఆవేశం కంటే విశ్లేషణ ఎక్కువగా కనిపిస్తాయి. ఆయన రచనలు చదివితే మనకు కనిపించేది కేవలం కథలు కావు, సమాజపు పుటలు; కేవలం పాత్రలు కావు, నిజ జీవిత మనుషులు; కేవలం సంఘటనలు కావు, వ్యవస్థపై ప్రశ్నలు.
ఆయన రాసిన కొన్ని ముఖ్యమైన రచనలను గమనించినప్పుడు, ‘జూదం’ కథలో రైతు జీవితాన్ని “జూదం”తో పోల్చడం ఎంతో గంభీరమైన ప్రతీకగా కనిపిస్తుంది. పంట వేయడం అనేది రైతుకు ఒక ఆశ కాదు, అదొక ప్రమాదకరమైన పందెం. ఈ కథలో ప్రకృతి, మార్కెట్, అప్పులు ఇవన్నీ రైతుపై ఎలా భారంగా కూర్చుంటాయో రచయిత తీవ్రతతో చూపిస్తారు. ఈ కథ చదివాక మనకు ‘రైతు శ్రమకు విలువ లేని వ్యవస్థలో జీవితం ఎలా న్యాయం అవుతుంది?’ అనే ఒక ప్రశ్న మిగులుతుంది.
అలాగే ‘విపత్తు’ కథలో కరువు అనేది కేవలం ప్రకృతి విపత్తు కాదు, అది సామాజిక విపత్తుగా ఎలా మారుతుందో చూపిస్తారు. రైతు జీవితంలో ఒక సంఘటన ఎలా కుటుంబాన్ని, ఆత్మగౌరవాన్ని కుదించే శక్తిగా మారుతుందో రచయిత ఎంతో లోతుగా చూపిస్తారు.
ఆయన ప్రత్యేకత ఏమిటంటే; ఆవేదనను ఆర్భాటంగా కాకుండా, నిశ్శబ్దంగా మనసులోకి చొప్పించడం. సింగమనేని నారాయణ గారిని అర్థం చేసుకోవాలంటే, ఆయన కథల్ని చదవడం మాత్రమే సరిపోదు, అవి చూపించే జీవితాన్ని మనసులోకి తీసుకోవాలి. అప్పుడు మాత్రమే ఆయన రచనల సంపూర్ణ విలువ తెలుస్తుంది.
రాయలసీమ కరువు భౌతికమైనది మాత్రమే కాదు, అది మనుషుల సంబంధాలను ఎలా దెబ్బతీస్తుందో ఆయన కథలు చెబుతాయి. వర్షాలు పడక, అప్పులు తీరక, చేతిలో ఉన్న భూమిని వదిలిపెట్టి పట్టణాలకు వలస వెళ్లే రైతుల ఆర్తిని ఆయన అత్యంత సహజంగా చిత్రించారు. గంజి కేంద్రాల చుట్టూ తిరిగే బతుకులను, ఆకలి చావులను ఏమాత్రం నాటకీయత లేకుండా యథాతథంగా సాహితీ చరిత్రలో నమోదు చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో సాగే భూస్వామ్య, సాహుకార్ల దోపిడీని ఆయన నిలదీశారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన చిన్నకారు రైతులను, కూలీలను వ్యవస్థ ఎలా పీల్చిపిప్పి చేస్తుందో వివరిస్తూనే, వాళ్ళలో రావాల్సిన చైతన్యాన్ని ప్రబోధించారు. ఆయన కథల్లోని నాయకులు కేవలం బాధితులుగా మిగిలిపోరు, ఒకానొక దశలో వ్యవస్థపై తిరగబడే శక్తులుగా రూపాంతరం చెందుతారు. సినిమాల్లో చూపించే రక్తపాతం, కేకలు, తొడగొట్టడాల ఫ్యాక్షనిజానికి, సింగమనేని చూపిన ఫ్యాక్షనిజానికి నక్కకూ నాగలోకానికీ ఉన్నంత తేడా ఉంది.
ఫ్యాక్షనిజం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్యో, కుటుంబాల మధ్యో ఉండే పగ కాదు; అది భూస్వామ్య పెట్టుబడిదారీ వ్యవస్థ తన ఉనికిని కాపాడుకోవడానికి సృష్టించే ఒక కుట్ర అని ఆయన బల్లగుద్ది చెప్పారు. పేద ప్రజలను తమ స్వార్థం కోసం ఎలా పావులుగా వాడుకుంటారో ‘అనుబంధాలు’ వంటి కథల్లో స్పష్టంగా చూడవచ్చు.
ఒక ఉత్తమ సాహిత్యానికి ఉండాల్సిన అన్ని లక్షణాలు సింగమనేని రచనల్లో పుష్కలంగా కనిపిస్తాయి. ఆయన కథన శైలిలో నిష్పాక్షిక వాస్తవికత (Raw Realism) ప్రముఖంగా కనిపిస్తుంది. ఆయన కథల్లో ఎక్కడా అసందర్భము, అనవసరమైన వర్ణనలు ఉండవు. పాత్రల ప్రవేశం, కథా గమనం అంతా నదీ ప్రవాహంలా సహజంగా సాగుతుంది; కృత్రిమమైన మెరుపులు ఆయనకు నచ్చవు.
రాయలసీమ మాండలికాన్ని, ముఖ్యంగా అనంతపురం ప్రాంతపు అచ్చమైన జనవ్యవహారిక భాషను, సామెతలను, జాతీయాలను ఆయన తన కథల్లో అద్భుతంగా ఉపయోగించారు. ఆ భాషకు ఉన్న ఒక రకమైన పదును, ఆర్ద్రత పాఠకుడిని నేరుగా ఆ మట్టి గ్రామానికి తీసుకెళ్తాయి. దీనితో పాటు సామాజిక విశ్లేషణ ఆయన రచనల ప్రత్యేకత; సింగమనేని కథ కేవలం ఒక సంఘటనను చెప్పి ఆగిపోదు, ఆ సంఘటన వెనుక ఉన్న రాజకీయ, ఆర్థిక కారణాలను పాఠకుడు ఆలోచించేలా చేస్తుంది. మార్క్సిస్టు చారిత్రక భౌతికవాద కోణం ఆయన కథా శిల్పంలో అంతర్లీనంగా ప్రవహిస్తుంది.
సింగమనేని నారాయణ రాసిన నవలల్లో ‘అనంతం’ అత్యంత విశిష్టమైనది. ఇది కేవలం ఒక ప్రాంతపు కథ కాదు, అనంతపురం జిల్లా వందేళ్ల సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిణామాల చరిత్ర. బ్రిటిష్ కాలం నాటి పరిస్థితుల నుంచి ఆధునిక కాలం వరకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎలా చిన్నాభిన్నమైందో, భూస్వామ్యం నుంచి పెట్టుబడిదారీ విధానంలోకి సమాజం ఎలా మారిందో ఈ నవల కళ్లకు కడుతుంది. రాయలసీమ సమాజాన్ని అర్థం చేసుకోవాలనుకునే ఎవరికైనా ఈ నవల ఒక ‘పాఠ్యపుస్తకం’ లాంటిది. ఇందులో పాత్రలు సజీవంగా ఉంటాయి, అవి మాట్లాడే మాటలు ఆయా కాలాల అస్తిత్వ రూపాలుగా నిలుస్తాయి.
___________________
సింగమనేని కేవలం సొంత రచనలకే పరిమితం కాలేదు, రాయలసీమ నుంచి వస్తున్న సరికొత్త సాహిత్యానికి ఆయన పెద్ద దిక్కుగా నిలిచారు. కేతు విశ్వనాథరెడ్డి, సింగమనేని నారాయణ వంటి మహారథులు చేసిన కృషి వల్లే తెలుగు సాహిత్యంలో ‘రాయలసీమ కథ’కు ఒక ప్రత్యేకమైన గౌరవం, స్థానం దక్కాయి.
___________________
ఆయన రాసిన వ్యాసాలు, సాహిత్య విమర్శలు చాలా లోతైనవి. ప్రగతిశీల సాహిత్యానికి ఉండాల్సిన బాధ్యతను ఆయన ఎల్లప్పుడూ గుర్తుచేశారు. కొత్త రచయితలను ప్రోత్సహించడంలో, వారి రచనలను లోపభూయిష్టం కాకుండా సరిదిద్దడంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారు.
సింగమనేని నారాయణ అక్షరం రాయలసీమ మట్టిలాగే నిగర్వి, నిఖార్సైనది. అందులో నగరాల కృత్రిమ పాలిష్ ఉండదు, కేవలం శ్రమజీవి చెమట వాసన, కరువు నేల ఆర్తనాదం, హక్కుల కోసం పోరాడే ప్రజా చైతన్యం మాత్రమే ఉంటాయి. రైతు పక్షపాతాన్ని నరనరాన జీర్ణించుకున్న ఆయన, పాలకుల ప్రజావ్యతిరేక విధానాలను తన కలంతో నిర్భయంగా ఎండగట్టారు.
తెలుగు కథ ఉన్నంతవరకు, రాయలసీమ అస్తిత్వ పోరాటం సాగినంతవరకు సింగమనేని నారాయణ పేరు, ఆయన అందించిన అసలుసిసలైన సాహిత్యం చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆ మట్టి మనుషుల గుండెచప్పుడు ఆయన కథల్లో ఎప్పటికీ మోగుతూనే ఉంటుంది.

-మహాసముద్రం దేవకి
99632 95997
What do you feel about this post?
Like
Love
Happy
Haha
Sad














Leave a Reply