సాహిత్యం

బాల్యపు వెన్నెలలో తాత హృదయపు వేడుక — శిఖామణి మనవడి పద్యాలు

· · 1 నిమిషం చదవండి

బాల్యం ఒక అందమైన దృశ్యం. కానీ ఆ దృశ్యాన్ని ప్రేమతో చూసే కళ్లున్నప్పుడు అది కవిత్వమవుతుంది. మనవడి/మనవరాలి నవ్వు తాతకు కేవలం నవ్వు కాదు; అది ఇంటి నిండా వెలుగు. మనవడు పాకితే అది ఇంటి నిశ్శబ్దాన్ని కరిగించే సంగీతం. ఇక ముద్దు మాట తాత గుండెలో కొత్త అక్షరాన్ని మొలకెత్తించే అనుభవం.

సాధారణంగా కవులైన తండ్రి/తాత, మనవడు/మనవరాలి లేత మొలక ప్రేమను కవిత్వీకరించడం సర్వసాధారణం. తెలుగు సాహిత్యంలో ఇదొక ప్రత్యేక వాత్సల్య సంప్రదాయం.

తోటకూర వెంకటనారాయణ, మాకినీడి సూర్యభాస్కర్, జూకంటి జగన్నాథం, అవధానుల మణిబాబు, భగవాన్, ప్రసేన్, రెంటాల శ్రీ వేంకటేశ్వరరావు, కోట్ల వెంకటేశ్వరరెడ్డి, ఓల్గా, కె.ఎల్.వి.ప్రసాద్, యార్లగడ్డ రాఘవేంద్రరావు, కొప్పిశెట్టి ఝాన్సీ వంటి కవులు కూడా తమ మనవల, మనవరాళ్ల చిట్టి చేష్టలలో కవిత్వాన్ని దర్శించారు. శిఖామణి, నున్నా నరేష్, మారాబత్తుల పెద్దన్న వంటి కవులు తమ పిల్లలపై కవిత్వం రాశారు. ఇది యాదృచ్ఛికం కాదు. కవికి బాల్యం ఎప్పుడూ ఒక సృజనాత్మక ప్రేరణ. తన పిల్లల బాల్యాన్ని చూసినప్పుడు తండ్రిగా ఆనందిస్తాడు; మనవల బాల్యాన్ని చూసినప్పుడు తన బాల్యాన్నీ, తన పిల్లల బాల్యాన్నీ, కుటుంబ జ్ఞాపకాలన్నింటినీ ఒకేసారి తిరిగి అనుభవిస్తాడు. అందుకే కవి శిఖామణి తన మనవడు విరాంష్ గుప్తా చిట్టి చేష్టలను కవిత్వంగా మలిచినప్పుడు, మనకు కనిపించేది ఒక చిన్నారితో పాటు — ఆ చిన్నారి చుట్టూ తిరుగుతున్న ఒక ఆనందకోశ సంతోష ప్రపంచం.

_____________________

ఈ కవితల సముదాయానికి “వెన్నెల–వేడుక” అనే పేరు పెట్టడం ఎంతో సముచితం. వెన్నెలకు వెల కొలవలేనట్లే, మనవడి బాల్యానందానికి కొలత లేదు. ఆ ఆనందాన్ని అనుభవించడమే ఒక వేడుక. అన్నమయ్య చెప్పిన “వెన్నెలకు వెల లేదు / వేడుకకు కొల లేదు” అనే భావాన్ని తన అనుభవంలోకి తెచ్చుకున్నానని కవి చెప్పినప్పుడు, అది కేవలం ఒక అలంకార వాక్య చమత్కారమే కాదు; ఒక తాత తన మనవడి బాల్యాన్ని చూసి పొందుతున్న పరవశానికి సహజమైన నిర్వచనం.

____________________

శిఖామణి కవిత్వంలో ముఖ్యంగా కనిపించేది చూసే కవి కన్ను. సాధారణంగా మనం ఒక చిన్నారి నవ్వును చూసి “ఎంత బాగున్నాడో!” అంటాం. కవి మాత్రం అక్కడితో ఆగడు. తెలతెలవారుజామున నిద్రమంచం నుంచి నవ్వుతూ మేల్కొనే మనవడిని ‘శారదాకాశంలోని జాబిల్లి’తో పోలుస్తాడు. అమ్మమ్మ, అమ్మల నులివెచ్చని రగ్గుల మధ్య దోబూచులాడే చిన్నారిని పచ్చని చెట్టుపై ఆకుపచ్చని చిలకను వెతికినట్టుగా వెతుకుతాడు. జామపండులోని రంగును మనవడి ముఖవర్చస్సుతో పోలుస్తాడు. పెదవులను సింహాచలం సంపెంగ పూరేకులతో కొలుస్తాడు — ఈ ఉపమలు కేవలం అందం కోసమా? కావు. కవి తన మనవడిని ప్రకృతిలోని అందమైన వస్తువులన్నింటితో మళ్లీ మళ్లీ పోల్చుకుంటూ, చివరకు ఆ అందాలన్నింటినీ మనవడిలోనే చూస్తున్నాడు. జాబిల్లి, చిలక, జామపండు, సంపెంగ, పారిజాతం, నందివర్ధనం, లేగదూడ, చందనం — ఇవన్నీ కవి దృష్టిలో బాల్యానికి ప్రతిరూపాలు.

“బాలార్కుడు”లో ఈ దృష్టి మరింత విస్తరిస్తుంది. పున్నమి రాత్రి చందమామలోని కుందేలు పిల్లగా కనిపించిన మనవడు, చివరికి ఉదయించే సూర్యుడిగా మారిపోతాడు. ఒకే చిన్నారి ఎన్నో ప్రకృతి రూపాల్లో కవికి కనిపించడం ఈ కవితలలోని ప్రధాన సౌందర్యం. విరాంష్ బాలుడి రూపంలోని చిన్న ప్రకృతి-విశ్వం. ఆ విశ్వంలో ప్రతి కదలిక ఒక రూపకం.

పాకడం మొదలుపెట్టిన మనవడు తల్లి ఆవు చుట్టూ చెంగనాలు వేసే లేగదూడ. చేతిని గాల్లో అటూ ఇటూ తిప్పడం రంగస్థల నటుడి నటన. ఆ కదలికలో కవికి ముత్తాత పాడిన పౌరాణిక పద్యరాగం వినిపిస్తుంది. పొట్టేళ్లు ఢీకొట్టుకోవడం ఎక్కడ చూశాడో తెలియదు గానీ, ఇంటిల్లిపాదినీ నొసటితో ఢీకొట్టే చిన్నారి చేష్టలో వీరబ్రహ్మంగారినే ఆశ్చర్యపరచగల కాలజ్ఞానం కనిపిస్తుంది. అలాగే, బయటకు బయటకు అంటూ చేయి చూపించే మనవడికి, లోపలికి చూసుకోమనే ఎరుక ఏ వీరబ్రహ్మమో తెలియపరచాడంటూ మనసులోనే కాలర్ ఎగరేస్తారు.

ఇది కవి ఊహాశక్తికి మంచి ఉదాహరణ. బాలుడి చేష్టను యథాతథంగా నమోదు చేయకుండా, దాని వెనుక ఒక సాంస్కృతిక జ్ఞాపకాన్ని, ఒక పురాణస్మృతిని, ఒక హాస్యరేఖను జోడించడం శిఖామణి ప్రత్యేకత.

ఈ కవితలలో మరో అందమైన అంశం — బాలుడి మాటలను కవి సాహిత్యంగా కాక, జీవితంగా స్వీకరించడం. “తాత” అని మనవడు పిలిచినప్పుడు తాతకు పదేళ్ల ఆయుష్షు పెరిగినట్టవుతుంది. అందులో అయిదేళ్లు మనవడికే ఇస్తానంటాడు. అమ్మమ్మ అలగడం, తాత సరదాగా స్పందించడం — ఇవి ఇంటింటి దైనందిన జీవితంలోని అతి చిన్న సంఘటనలు. కానీ కవిత్వం వాటిని మేరునగ సదృశం చేస్తుంది.

“వెళ్లొస్తాను” అన్న తాతకు “వుణ్ణు” అని మనవడు చెప్పిన సందర్భం మరింత హృద్యమైనది. ఆ ముద్దు పలుకులోని అర్థాన్ని తాత తన అంతరంగంలో విస్తరించుకుంటాడు — “ఉండడానికే వచ్చానురా; ఎన్ని అక్షరాల మీద నా పేరు ఉంటుందో అన్నాళ్లు ఉంటాను” — కవిత ఒక్కసారిగా బాలుడి దగ్గర నుంచి తాతపైకి తిరుగుతుంది. మనవడి మాట తాతకు తన జీవితం మీదే కొత్త అర్థాన్ని కల్పించింది.

“అక్షరం రాకపోకల రహదారి” అనే భావం ఈ సందర్భంలో విశేషమైనది.

“మనవడి పద్యం”లో సంఖ్యల సంఘటన కూడా ఇదే చమత్కారాన్ని కలిగిస్తుంది. ఇరవై ఐదు నెలలు కూడా నిండని చిన్నారి ఇరవై ఐదు అంకెలను ఇంగ్లీషులో చెప్పేస్తే, తాత తన చిన్ననాటి లెక్కల వైఫల్యాన్ని గుర్తుచేసుకుంటాడు. “కవులకు లెక్కలతో పనేంటి?” అని కూతురు చెప్పడం కుటుంబ సంభాషణకు సహజమైన నవ్వును జోడిస్తుంది.

మనవడి చేతిలో తమలపాకు చిగుర్లు నలిగిపోతాయేమోనని తాత కంగారు పడుతుంటే, “నీ చేతులు కందిపోతాయి నాన్నా” అంటూ ఆ చిగుర్లే మనవడిని వారించినట్టు కవి ఊహించడం మృదువైన బాల్యదృష్టి!

అలాగే “నందివర్ధనం పూలు కనులు తెరవడానికి బద్ధకిస్తుంటే, పారిజాతాల వంటి కనులు విచ్చి గదంతా చక్రభ్రమణం చేస్తున్న మనవడిని చూసి నందివర్ధనం అలిగి పూయడం మానుకుంది” — ఈ ఊహలో ప్రకృతి కూడా చిన్నారిపై అసూయపడేంత అందమైన బాల్యాన్ని కవి సృష్టించాడు. ఇది బాలుడి వర్ణనను మించినది.

“చందనోత్సవం” అనే ముగింపు కూడా ఇలాంటిదే. మనవడి చిలిపి చేష్టల సానరాయిపై తాత–అమ్మమ్మలు గంధపు చెక్కలై అరిగిపోతున్నారు(ట). వారి అలసట కూడా ఆనందమే; వారి శ్రమ కూడా సుగంధమే. అందుకే “మా జీవితాలు చందనోత్సవం కాక మరేమిటి?” అని ప్రశ్నిస్తాడు కవి. ఇదీ — ఈ కవితల మొత్తం తాత్విక సారం. మనవడి వల్ల జీవితం మారదు; జీవితాన్ని చూసే తాత దృష్టి మారుతుంది.

ముఖ్యంగా “మా మనసు మోడు చెట్లకు చిగురుటాకుల పసరికను అద్దుతూ కొమ్మ కొమ్మకు గెంతుతూ మా మనవడు నెమలి” అనే భావన ఉంది చూశారూ — బాలుడి వల్ల వృద్ధ హృదయంలో పునరుజ్జీవనం కలుగుతుందనే సంకేతం అది.

అందుకే ఈ కవితలను కేవలం “మనవడి పద్యాలు” అని పిలవడం చిన్నబుచ్చడమే. ఇవి వాస్తవానికి బాల్యాన్ని చూసి తనలోని బాల్యాన్ని తిరిగి పొందిన కవి హృదయ ప్రతిబింబాలు.

మనవడి/మనవరాలి కవిత్వం వాత్సల్య మాధుర్యం. శిఖామణి ఈ మాధుర్యానుభూతిని పెద్ద పెద్ద పదాలతో చెప్పలేదు. ఇంట్లో జరిగిన చిన్న చిన్న సంఘటనలనే పట్టుకున్నారు. నిద్రలేవడం, పాకడం, చేతులూపడం, నొసటితో ఢీకొట్టడం, మాటలు నేర్చుకోవడం, అంకెలు చెప్పడం, బొమ్మలు సర్దిపెట్టడం, తాతను చూడాలని అడగడం, అమ్మమ్మను ఎంచుకోవడం — ఇవే ఆయన కవితా వస్తువులు. కానీ కవిసూర్యుని చూపు వాటిపై పడగానే అవి సాధారణ సంఘటనలు కాకుండా కుటుంబ జ్ఞాపకాల చందమామలు అయిపోతాయి.

___________________

ఈ చిన్న ముక్తకాల్లో మరో విశేషం — ఇవి చదివేవారికి తమ ఇంటి పిల్లలను గుర్తుకు తెస్తాయి. అదే మంచి వాత్సల్య కవిత్వానికి గుర్తు. “ఇది శిఖామణి మనవడి కథ” అని మొదలుపెట్టి చదివినా, చివరికి “ఇది మన ఇంటి పిల్లాడి కథే కదా!” అనిపిస్తుంది. ఎందుకంటే బాల్యం అందరిదీ ఒకటే; అందరికీ ఒకటే! నవ్వుల భాష అందరిదీ ఒకటే; ముద్దు మాటల వ్యాకరణం అందరికీ ఒకటే!.

___________________

అందుకే “వెన్నెల–వేడుక”లోని వెన్నెల చంద్రునిది కాదు — మనవడి నవ్వుది. వేడుక ఇంట్లో జరిగేది కాదు — తాత హృదయంలో జరిగేది.

విరాంష్ శిఖామణిగారి మనవడు మాత్రమే కాదు; ఆయనే కవిత్వంలో తిరిగి పుట్టిన బాల్యం — మనవడి పద్యాల చిరంతన చింతన.

 

 

-మాకినీడి సూర్యభాస్కర్
94915 04045

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *