సమాజాన్ని మేల్కొల్పిన కళలు, ఆలోచింపజేసిన కవిత్వం ఆయా కాలాల్లో జీవం పోసుకున్న అద్భుత సృజనలు. ఒక కవి అన్నట్లు, ‘కష్టాలు, కన్నీళ్లు ఉంటే అది కవిత్వమే’. నిజమే, బతుకును, బతుకు సంవేదనలను సరళంగా, సున్నితంగా, స్పష్టంగా, సాంద్రంగా, లోతైన భావోద్వేగాల సమ్మిళితంగా అభివ్యక్తీకరించేదే కళాత్మక సృజన. ఇంకొంచెం లోతుగా చూస్తే, ‘భావోద్వేగాల అభివ్యక్తి స్వేచ్ఛా ప్రవాహమే కవిత్వం’ అంటారు విలియం వర్డ్స్‌వర్త్ (William Wordsworth). మరికాస్త లోతుగా పరిశీలిస్తే, ఇది శక్తివంతమైన, ఉప్పొంగే భావాల సహజ ప్రవాహం. ప్రశాంత స్థితిలో నెమరువేసుకున్న భావోద్వేగాల నుండి ఇది ఉద్భవిస్తుంది.
____________________
కవిత్వమేమీ బ్రహ్మ పదార్థం కాదు, అర్థం చేసుకునే మనసుకు అర్థం కాకపోవడానికి. ఇది గద్యంలా కాకుండా భిన్నమైన నడకతో, అభివ్యక్తితో సాగుతుంది. కవిత్వం అనేది పాతబడిన పడికట్టు పదాలకు, అరిగిపోయిన భావనలకు (Cliches) పూర్తి భిన్నం. అయితే, కవిత్వమంతా ఒకేలా ఉండదు. మరో పార్శ్వం నుంచి చూస్తే కవిత్వం నిత్యనూతన ప్రవాహ ప్రక్రియ. అదే కవిత్వం యొక్క విశిష్ట లక్షణం.
____________________
ప్రాఙ్నన్నయ కాలం నుండి తెలుగులో కవిత్వం బతుకుతున్నా, ఆయా కాలాల్లో దాని ప్రవర్తన, పరివర్తన, సొగసు భిన్న సమయాల్లో విభిన్నంగా ఉంటుంది. వివిధ రీతుల్లో సామాజిక వేదికపై రాణించే నాట్యమే కవిత్వం ప్రత్యేకత. వచన కవిత్వంలో ప్రాకృతిక, సామాజిక అంశాలు, మానవీయ కోణాలు, బతుకు దారుల వెంట ఎత్తిన అక్షర జెండాలెన్నో!
కవిత్వం మనసులోకి దూరి చూస్తే…
భాష యొక్క సౌందర్య, లయ, అలంకారిక లక్షణాలను ఉపయోగించి లోతైన భావోద్వేగాలను రేకెత్తించడానికి, స్పష్టమైన చిత్రాలను ఆవిష్కరించడానికి, అలాగే సంక్లిష్టమైన ఆలోచనలను అన్వేషించడానికి ఉపయోగపడే ఒక సాహిత్య కళారూపమే కవిత్వం. ‘పొయెసిస్’ (Poiesis) అనే గ్రీకు పదం నుండి వచ్చిన ఈ పదానికి ‘తయారు చేయడం’ లేదా ‘సృష్టించడం’ అని అర్థం. ఇది సాధారణ పదాలను అసాధారణమైన భావ వ్యక్తీకరణలుగా మార్చే స్వభావాన్ని కలిగి ఉంటుంది.
కవిత్వంలోని ప్రధాన అంశాలు ‘ధ్వని’ మరియు ‘లయ’. గద్య రచనకు భిన్నంగా, పద్య రచనలు ఒక సంగీత గుణాన్ని సృష్టించడానికి తరచుగా ఛందస్సు, లయ, ప్రాసలపై ఆధారపడతాయి. ఇక బింబకల్పన (Imagery) ద్వారా కవులు కేవలం భావోద్వేగాలను చదివించడమే కాకుండా, పాఠకుడు దానిని స్వయంగా అనుభవించేలా చేస్తారు. ఇందుకోసం చూపు, శబ్దం, వాసన, రుచి, స్పర్శ వంటి ఇంద్రియ సంబంధిత (Sensory perceptions) అనుభవాలను ఉపయోగిస్తారు. అక్షరార్థానికి మించి నిగూఢ అర్థాలను, సంక్లిష్ట సత్యాలను తెలిపేందుకు ఉపయోగించే రూపకాలు, ఉపమానాలు, చిహ్నాలే అలంకారిక భాష.
వివిధ సాధారణ రూపాలు, శైలులతో అలరించేదే కవిత్వం. అందులో ముఖ్యమైనవి:
సొనెట్లు (Sonnets): సాంప్రదాయకంగా ప్రేమ, తత్వశాస్త్రం వంటి ఇతివృత్తాలను అన్వేషించే కఠిన ప్రాస నియమాలతో కూడిన పద్యాలు.
హైకు (Haiku): ప్రకృతిపై ఎక్కువగా దృష్టి పెట్టే ప్రాసరహితమైన ఒక చిన్న కవితా రూపం.
స్వేచ్ఛా కవిత్వం(Free Verse):ఎలాంటి కఠినమైన నియమాలూ లేని కవిత్వం.
అక్రోస్టిక్ (Acrostic) & లిమరిక్స్
(Limericks): స్పష్టమైన లయ, నిర్మాణ పరిమితులతో కూడిన తేలికైన, తరచుగా హాస్యభరితమైన శైలులు.
ఛందస్సు, లయ లేదా ప్రాస అనేవి కవి తన సొంత నిర్మాణాన్ని సృష్టించుకోవడానికి ఉపయోగపడే అదనపు ఆయుధాలు. స్థూలంగా ఒక కవితను తెలిపే ముఖ్య లక్షణం దాని సాంద్రత (Density). గరిష్ట భావోద్వేగ ప్రభావాన్ని కలిగించేలా అల్లబడిన, జాగ్రత్తగా ఎంచుకున్న, ప్రత్యామ్నాయం లేని పదాలను ఉపయోగించే కవి అనుభవాన్ని, ఊహాత్మక అవగాహనను ఇది తెలుపుతుంది. కవిత్వం వేట కాదు, ఒక ఆట. అది అక్షరాల, భావోద్వేగాల అల్లికల విరాట్ స్వరూపం. అందులో పండిన మహాకవుల నుంచి నేటి వర్తమాన, వర్ధమాన కవుల దాకా తమ శక్తిమేరకు కవిత్వాన్ని చిత్రించారు. కవిత్వం ఎలా ఒప్పిదంగా, నింపాదిగా రూపుదిద్దుకుంటుందో, ఏయే లక్షణాలు మాటలను, వాక్యాలను కవిత్వమయం చేస్తాయో దగ్గరగా చూద్దాం.
కొన్ని కవితలపై విహంగ వీక్షణం చేస్తే, వాటిలో కూర్చబడిన భావోద్వేగ నిర్మాణ లక్షణాలు కవిత్వ సేద్యం బాగా పండిన పొలంలా అందంగా, సుందరంగా ప్రతిబింబించి మానసికోల్లాసాన్ని కలిగిస్తాయి. అందుకే కవిత్వంలో, మరీ ముఖ్యంగా వచన కవిత్వంలో అద్భుత, అర్థవంతమైన సృజనను సంగ్రహించవచ్చు.
ఆంగ్ల కవి బెన్ జాన్సన్ కవిత్వం గురించి మాట్లాడుతూ, అది “మానవ వాక్కు స్థాయిని మించిన ఏదో ఒక భావనను వ్యక్తం చేస్తుంది” అని అన్నారు. ఒకవేళ పాఠకులకు పద్యాలను వచన రూపంలో (గద్యంలా) ముద్రించి చూపించినట్లయితే, వారు తరచుగా వాటిని వచనంగానే చదువుతారు. కారణం అవి చూడటానికి అలాగే కనిపిస్తాయి. దాన్ని చదివేటప్పుడు శ్వాస లయకు అనుగుణంగా ఉండే పంక్తుల మార్పులు, వాక్య నిర్మాణం (పదాల కూర్పు) వంటి అంశాలు వారి పఠన విధానాన్ని ఇకపై ప్రభావితం చేయవని దీని అర్థం. గద్యానికి, పద్యానికి మధ్య ఉన్న కొన్ని స్పష్టమైన, శక్తివంతమైన వ్యత్యాసాలను ఒక పోలిక ద్వారా ప్రదర్శించడం వల్ల మరింత స్పష్టత కలుగుతుంది.
ఒక గద్య రచయిత, ఒక కవి ఒకే విషయం గురించి ఇలా చెప్పడం ఒక మంచి ఉదాహరణ. శీర్షిక: ‘వయసు పైబడటం’పైన… గద్యంలో ఇలా రాయవచ్చు: “30 నుండి 90 సంవత్సరాల మధ్య వయసులో, మన కండరాల బరువు 30 శాతం తగ్గుతుంది, అలాగే మనం ప్రయోగించగల శక్తి కూడా తగ్గుతుంది…. నాడీ కాండంలోని నాడీ పోగుల సంఖ్య పావు వంతు తగ్గుతుంది. కణాలు చనిపోయి, వాటి స్థానంలో కొత్తవి ఏర్పడకపోవడం వల్ల మన మెదడు బరువు సగటున 3.03 పౌండ్ల నుండి 2.27 పౌండ్లకు పడిపోతుంది. (గోర్డాన్ రాట్రే టేలర్, ది బయోలాజికల్ టైమ్ బాంబ్, 1968).
అదే భావనను వచన కవిత్వంలో ఇలా రాయవచ్చు: “వయసు పైబడటానికి దాచి ఉంచిన/వరాలను నేను వెల్లడిస్తాను/మీ జీవితకాల కృషికి కిరీటం పెట్టడానికి. మొదట, నశించిపోతున్న/ ఇంద్రియాల చల్లని ఘర్షణ/మాయ చేయకుండా,/ఏ వాగ్దానమూ ఇవ్వకుండా/ కానీ నీడ ఫలం యొక్క చేదు రుచిలేనితనం/శరీరం, ఆత్మ విడిపోవడం మొదలైనప్పుడు/ రెండవది,/మానవ మూర్ఖత్వం పట్ల కలిగే/ ఆగ్రహం యొక్క స్పృహతో కూడిన/ నిస్సహాయత,/మరియు వినోదాన్ని అందించడం/ మానేసిన దానిపై/నవ్వడం వల్ల కలిగే గాయం.”
ఇటీవల వచ్చిన కవితలలో కవిత్వ తీరుతెన్నుల పరిశీలన చూసినప్పుడు: జ్ఞానం ఏ మూల నుండైనా ప్రభావితం చేయవచ్చు అనే ఉద్దేశ్యం ఎర్రోజు వెంకటేశ్వర్లు ‘బ్లాక్ బోర్డు’ కవిత్వ సంపుటిలోని ‘పునాది రాళ్ళు’ కవితలోని ఈ క్రింది కవితా వాక్యాలలో మూల అంశం పరిశీలిస్తే:
‘వయ్యి(పుస్తకం)చేతిలో వుంటే
వెయ్యి ఏనుగుల బలం’
అనే కవితాత్మక వాక్యాలలో చదువు పరమార్థాన్ని, దాని విలువను లోకోక్తిగా చెప్పడం, అందులోనూ ‘ఏనుగు బలం’ అనే అలంకార స్పర్శతో ఇది ఒక విశ్వజనీన కవితగా రూపుదిద్దుకుంది.
పై కవితా సంపుటిలోనే ‘పొగ మబ్బుల్లో సూరీళ్ళు’ కవితలో: ‘తూర్పు కొండల్లోంచి వచ్చే వెలుతురు ముద్ద/రెండు రోజులు కనిపించకున్నా/పెద్ద ముప్పేమీ రాదు/పొగ సూరీళ్ళు మాత్రం అరగంట/ ఆలస్యమైనా/ కాల గడియారం గతి తప్పుతుంది.’ ఇది వంట గది కవిత్వం. పొయ్యి వెలగకుంటే కాలచక్రం అస్తవ్యస్తం అవుతుందనే భావోద్వేగం, లౌకికమైన చర్య. ఇక్కడ సూర్యుని రూపకం, ఉపమానం చక్కగా కవిత్వమయింది.
“మౌనం మాట్లాడింది” కవితా సంపుటిలోని ‘వృత్తి ధర్మం’కవితలో: ‘నీదేమి కులమని/ నిన్ను అడగను/నీ మతమేమో/ నాకు అవసరం లేదు/నీ బాధలు ఏమని మాత్రం ప్రశ్నిస్తా.’ ఈ కవితాత్మక వాక్యాలలో వృత్తి ధర్మంలోని విలువల లౌకికత్వాన్ని కవిత్వీకరించిన తీరు చాలా గొప్పగా ఉంది. సరళమైన మాటలతో.. అల్లిక, శైలి, లయ, భావోద్వేగాల పదనిసలు ఇందులో స్పష్టంగా కనిపిస్తాయి.
డా.నాళేశ్వరం శంకరం “దూదిమేడ” లోని ‘ఎముకలు విరిగిన నీడ’ కవితలో… ‘ఆమె/భర్త గుహను ధ్వంసం చేసేలోపునే/ ఇనుప చువ్వల చూపుల్ని నాటే ప్రేమ/ చక్షువులు కూడా/మృగ పాదాల్ని మోపి తొలగిపోతాయి/ఆమె ఇప్పుడు కాలగడియారం మీద/కొట్టుకునే ముల్లు మాత్రమే!.’ ఈ వాక్యాలలో భర్తను ‘గుహ’ అనే మెటాఫర్‌తో కవిత్వీకరించి స్త్రీ బందీఖానాను చెప్పడం కనిపిస్తుంది. ఇనుప చువ్వల్లా ఖైదు చేసే ప్రేమ చూపులు, మృగ పాదాలు (మగవాడి అడుగులు) తొలగడంతో ఆమె స్వేచ్ఛా జీవి అవుతుంది. కాలం గడియారం మీద ఆడే ముల్లులా మారుతుంది. స్త్రీపై మగవాడి పెత్తనాన్ని బందీఖానా అనడం, అది తొలగిన మరుక్షణం ఆమె స్వతంత్ర జీవిగా గడియారం ముల్లుగా మారుతుందనడంలోని గొప్ప భావుకత, కవిత్వ రచనకు ఎంచుకున్న పదజాలం ఇక్కడ జీవసూచిగా నిలుస్తాయి.
***
ఇటీవల నేను చదివిన కొన్ని పుస్తకాలు మీటే కవిత్వ వాసనలు ఇవి. వివిధ రూపాల లయ, శైలి, అలంకార లక్షణాలతో కూడిన కవిత్వ పొరలివి. “కాదేదీ కవితకనర్హం” – నిజమే, ప్రతి వస్తువూ కవితామయమే. దానిని మలచగలిగే ఒడుపు, నేర్పు సృజనకారుని ప్రతిభ.
అయితే, వివిధ కవిత్వ సీమల వైపు తొంగిచూడడమే భావితరాలకు ఒక పెద్ద బాలశిక్షగా ఉపయోగపడవచ్చు; కొత్త వెలుగును ప్రసరింపజేయవచ్చు; గమ్యాన్ని చేర్చవచ్చనేది నా ఆలోచన.

– డా. టి. రాధాకృష్ణమాచార్యులు
98493 05871
What do you feel about this post?
Like
Love
Happy
Haha
Sad













Leave a Reply