అనుభూతుల అంతర్వాహినికి అక్షర రూపమే కవిత్వం

కవితో కరచాలనం

జీవన స్రవంతికి సమాంతరంగా నిరంతరం లోలోన ప్రవహించే అనుభూతుల అంతర్వాహినికి అక్షర రూపమే కవిత్వం
సంఘం పురాతన అనుభవశాలి

రేఖాజ్యోతి కవయిత్రి. బాల్యం నుండి వచనకవిత్వమే శ్వాసగా పెరిగారు. రాశిలో తక్కువే అయినా వాసిలో మిన్న. భావ వ్యక్తీకరణలోను మిన్న. అభివ్యక్తిలో తనదైన ముద్ర ఉన్న రచయిత్రిగా విమర్శకులు సంభావిస్తారు. ఈ వారం రేఖాజ్యోతితో ముఖా-ముఖి.

మీ బాల్యము విద్యాభ్యాసం గురించి క్లుప్తంగా చెప్పండి.
పుట్టింది నెల్లూరులో. బాల్యమంతా నెల్లూరు మాండలికపు మాధుర్యంతోనే మొదలైనప్పటికీ కొంత కాలం గుంటూరు ప్రాంతంలో ఉండడం వలన అక్కడి భాష, ఆత్మీయత కూడా పరిచయమైంది. విద్యాభ్యాసం ఎక్కువ శాతం నెల్లూరు జిల్లాలోనే సాగింది. సాంకేతిక విద్య హైదరాబాద్‌ లోనూ, చెన్న్కె లోనూ గడిచింది.
వచన కవిత్వం పై ధ్యాస రావడానికి కారణం?
పుస్తకాలు చదివే అలవాటులో భాగంగా అన్నీ చదువుతూ ఉన్నప్పుడు కవిత్వం అనే ప్రక్రియ గొప్పగా ఆకర్షించింది. 7, 8 తరగతులప్పుడు పట్టుకున్న కష్ణశాస్త్రి గారి కవిత్వం, తిలక్‌ కవిత్వం మరియు ఆయస్కాంతం వంటి చలం వాక్యం ఇటు వైపు చూపుకు పునాదులు. చదువు, ఉద్యోగం వలన సాహిత్యంతో కలిగిన దూరం – సారంగ, ఈ మాట, వాకిలి వంటి అంతర్జాల పత్రికల ద్వారా మాయమై మళ్ళీ కవిత్వం వైపు చూడగలిగాను.
కవిత్వాన్ని నిర్వచించమంటే మీరు చెప్పే మాట?
జీవన స్రవంతికి సమాంతరంగా నిరంతరం లోలోన ప్రవహించే అనుభూతుల అంతర్వాహినికి అక్షర రూపమే కవిత్వం.
మొత్తం సముద్రం అంతా ఒక్క చూపులో దొరకనట్టే కవిత్వానికి నిర్వచనం ఏ ఒక్క మాటకో చిక్కదు. అప్పుడప్పుడూ భావ తరంగాలు గుండెను మోదుకున్న తడి స్పర్శే కవిత్వం.
కవిత్వంతో మీరు సంఘానికి చెప్పాలనుకుంటున్నది ఏమిటి?
సంఘం పురాతన అనుభవశాలి. సంఘానికి చెప్పగలిగినంతటిది ఏమీ లేదు కానీ, నేను కూడా తుమ్మెద పాట విన్నాను, నేనూ సూర్యోదయం చూసి కదిలిపోయాను… ఈ అద్భుత సష్టికి నేనూ స్పందించి నాలుగు అనుభూతులను పోగుచేసుకున్నానని తప్ప చెప్పేందుకు మరేమీ లేదు.
మీ రచనల వివరాలు?
చాలా చిన్న ప్రయాణం నాది. సారంగ, ఈ మాట, వాకిలి వంటి అంతర్జాల పత్రికలలో ప్రచురితమైన 50 వరకూ కవితలు., ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికలలో ప్రచురితమైన కొన్ని కవితలు, 2018 నాటా సావనీర్‌ లో ప్రచురితమైన ‘వరాళి’ అనే సంగీత నేపథ్యపు కథ, ‘సారంగ’ లో ప్రచురితమైన మరో రెండు మూడు కథలు. 2022 లో ప్రచురించిన ‘ఆగిన చోటు నుంచే మళ్ళీ’ అనే కవితా సంపుటి ఒకటి.
సాంఘిక మాధ్యమాలలో కవిత్వం ఎలా ఉంది?
చాలా బాగుంటోంది. కవిత్వపు పరిధులు విశాలమయ్యి విభిన్న విషయాలు కవిత్వీకరించబడుతున్నాయి. ఇదివరకు చర్చించడానికి మొహమాటపడే విషయాలు ఇప్పుడు స్పష్టమైన మొహంతో కవితలుగా వికసిస్తున్నాయి.
కవిత్వం లోకి రావాలనుకుంటున్న వర్థమాన కవులకు రచయిత్రులకు మీరు చెప్పదలచుచున్నది ఏమైనా ఉందా?
కవిత్వంలోకి ప్రత్యేకంగా కావాలనుకొని రాలేము – వద్దనుకొని వెనక్కి వెళ్ళనూలేము. ఎన్నో కళాప్రపంచాల లాగానే ఈ ప్రపంచం కూడా గొప్పది. కవిత్వాన్ని చదవడమూ రాయడము కూడా అప్రయత్నంగా అనుభూతిచెందగలిగితే చాలు!

– డా.టేకుమళ్ళ వెంకటప్పయ్య (9490400858)