శ్రీలంక అధ్యక్షుడిగా దిసనాయకే ఎన్నిక

కొలంబో: చివరి వరకూ అంతులేని ఉత్కంఠ సృష్టించిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో ప్రజలు గొప్ప తీర్పునిచ్చారు. మార్కిస్ట్‌ జనతా విముక్తి పెరమూన పార్టీ (ఎంజెవిపి) నాయకుడు, నేషనల్‌ పీపుల్స్‌ పవర్‌ (ఎన్‌పిపి) కూటమి అభ్యర్థి అరుణ కుమార దిసనాయకే (54) విజయభేరి మోగించారు. రెండో రౌండ్‌ కౌంటింగ్‌లో ఆయన గెలిచినట్టు శ్రీలంక ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. శనివారం పోలింగ్‌ పూర్తికాగా, ఆ వెంటనే మొదలైన మొదటి రౌండ్‌ కౌంటింగ్‌ ఆదివారం మధ్యాహ్నం వరకూ కొనసాగింది. అయితే, ఏ అభ్యర్థికీ 50 శాతం ఓట్లు రాకపోవడంతో, రెండో రౌండ్‌ కౌంటింగ్‌ అనివార్యమైంది. గతంలో ఎన్నడూ ఈ విధంగా ఎన్నికల ఫలితాలను వెల్లడించడానికి రెండో రౌండ్‌ కౌంటింగ్‌ అవసరం రాలేదు. చారిత్రాత్మకంగా మారిన ఈసారి పోరులో ఎంజెవిపి నాయకుడు దిసనాయకే ఫేవరిట్‌గా బరిలో దిగారు. మొదటి రౌండ్‌ కౌంటింగ్‌లో ఆయన 39.52 శాతం ఓట్లతో అగ్రస్థానాన్ని ఆక్రమించారు. మొత్తం 38 పోటీపడిన ఈ ఎన్నికల్లో, ప్రతిపక్ష నాయకుడు, సమగి జన బలవేగయ (ఎస్‌జెబి) పార్టీ అభ్యర్థి సజిత్‌ ప్రేమదాస 34.28 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. శ్రీలంక ఎన్నికల నిబంధనలను అనుసరించి, కనీసం 50 శాతం ఓట్లు వచ్చిన వారే అధ్యక్షుడిగా ఎన్నికవుతారు. ఒకవేళ అభ్యర్థుల్లో ఎవరికీ నిర్ణయించిన శాతం ఓట్లు రాకపోతే, ద్వితీయ, తృతీయ ప్రిఫరెన్స్‌ ఓట్లను పరిగణలోకి తీసుకుంటారు. దిసనాయకే, ప్రేమదాస మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో, సెకండ్‌ కౌంటింగ్‌ అనివార్యమైంది. ఆ క్రమంలో, ప్రస్తుత అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘెతోసహా మిగతా అభ్యర్థుల పేర్లను రెండోరౌండ్‌ కౌంటింగ్‌కు పరిగణించలేదు. ఈ కౌంటింగ్‌ పూర్తయిన తర్వాత, రెండో ప్రాధాన్యతా ఓట్లలో దిసనాయకే ఆధిక్యాన్ని సంపాదించారని శ్రీలంక ఎన్నికల సంఘం చైర్మన్‌ ఆర్‌ఎంఎఎల్‌ రత్ననాయకే ప్రకటించారు. ఆయన విజయం ఖాయమైంది కాబట్టి, థర్డ్‌ రౌండ్‌ కౌటింగ్‌ అవసరం లేకపోయిందని ఆయన స్పష్టం చేశారు.

What do you feel about this post?

0%
like

Like

0%
love

Love

0%
happy

Happy

0%
haha

Haha

0%
sad

Sad

0%
angry

Angry