– ఓబీసీ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ గణేష్ సింగ్ కి వినతి
హైదరాబాద్ : భారత్‌లో ఓబీసీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఓఎఫ్ఐసీసీఐ సంఘానికి చెందిన కార్యదర్శులు, సభ్యులు ‘ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఓబీసీ సమాఖ్య’ అధ్యక్షులు; మరియు రామ మోహన్ మనమాస, ఎంఆర్ఎం గ్రూప్ సీఎండీ, ఓఎఫ్ఐసీసీఐ చైర్మన్ & వ్యవస్థాపకుడు; ఆధ్వర్యంలో ఈరోజు తాజ్ కృష్ణలో ఓబీసీ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ గణేష్ సింగ్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతపురం ఎంపీ అంబికా జీ లక్ష్మీనారాయణ వాల్మీకి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాణికమ్ ఠాగోర్ ఓఎఫ్ఐసీసీఐ ప్రయత్నాలను అభినందించారు. కలిసిన వారిలో ఓఎఫ్ఐసీసీఐ కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ యాదవ్, జీ శ్రీధర్ తదితర సభ్యులు ఉన్నారు. ఈ వినతి పత్రంలో భారత వాణిజ్య, పరిశ్రమల మండలిలో ఓబీసీ సమాఖ్య తరపున వ్యాపారవేత్తలు ఎదుర్కొంటున్న కొన్ని కీలక సమస్యలను మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నామని తెలిపారు. ఈ సవాళ్లు సమానమైన అవకాశాలు కల్పించడంలోనూ వ్యాపారాలను అభివృద్ధి చేయడంలోనూ జాతీయ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడడంలోనూ ఆటంకంగా ఉన్నాయన్నారు. సమస్యలు పరిష్కరించడానికి తక్షణం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.
ప్రభుత్వ కొనుగోలుకు పారదర్శకమైన పోర్టల్‌గా జీఈఎం (గవర్నమెంట్ ఈ-మార్కెట్‌ప్లేస్) ఉన్నప్పటికి, ఓబీసీ యాజమాన్యంలోని ఎంటర్ప్రైజులు పరిమిత వనరులతో ప్రభుత్వ టెండర్లను సాధించడంలో కష్టాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వ్యాపారవేత్తలకు కల్పించిన ప్రత్యేక రాయితీలకు సరిసమానంగా, జీఈఎం ద్వారా ఓబీసీ యాజమాన్యంలోని ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యత కోటా కల్పించాలని కోరారు. తద్వారా సమానమైన పోటీ ఉంటుందన్నారు. సీజీటీఎంఎస్ఈ (క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజ్స్) కింద ఓబీసీ వ్యాపారవేత్తలకు బ్యాంకులు మద్దతు ఇవ్వాలని ఆదేశించాలన్నారు. రుణాల కోసం ఓబీసీ వ్యాపారవేత్తలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. దీనిపై ఓబీసీల్లో అవగాహన పెంచడానికి బ్యాంకులు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
ఓబీసీ యాజమాన్యంలోని వ్యాపారులకు రుణ ప్రాప్తి ముఖ్య సమస్యగా ఉందన్నారు. ఎంఎస్ఎంఈ రంగానికి ప్రధాన సహకార దారులుగా ఉన్నప్పటికీ, ఓబీసీ వ్యాపారవేత్తలు అధిక వడ్డీ రేట్లు, రుణ మంజూరులో అధికారిక జాప్యాలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈలకు బ్యాంకులు ప్రాధాన్యతా రుణ సదుపాయం కల్పించడానికి మార్గదర్శకాలు సిఫార్సు చేయాలని కోరారు. అభివృద్ధిని సులభతరం చేయడానికి, ఆర్థిక ఒత్తిడిని తగ్గించడానికి తక్కువ వడ్డీ రేట్లతో రుణాలు అందించాలన్నారు. పరిశ్రమల పార్కుల్లో ప్లాట్ల కేటాయింపులో రిజర్వేషన్ కేటాయించాలన్నారు. రాష్ట్ర, కేంద్ర పరిశ్రమల పార్కుల్లో పరిశ్రమల ప్లాట్లు ఎంతో అవసరం అన్నారు. ఓబీసీ వ్యాపారవేత్తలు తీవ్రమైన పోటీ, రిజర్వేషన్ విధానాల లేమితో ప్లాట్లను పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పరిశ్రమల పార్కుల్లో కనీసం 15 శాతం ప్లాట్లను ఓబీసీ వ్యాపారవేత్తల కోసం రిజర్వ్ చేయాలని కమిటీ సిఫార్సు చేయాలని కోరారు. ఇది సమానమైన అవకాశాలు కల్పిస్తుందన్నారు. ఈ సమస్యలను పరిష్కరించడం ద్వారా ఓబీసీ వ్యాపారవేత్తలు భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించగలుగుతారన్నారు. ఇది సమగ్ర వృద్ధికి దారితీస్తుందన్నారు.
