‘నక్షత్ర బాట’లో సాగిన మహిళా దీప్తి

నక్షత్ర బాటలో నడిచిన అనేక నక్షత్రాలలో ఒక నక్షత్రపు కథ యీ నవల. ఈ నక్షత్రపు ప్రత్యేకత యేమిటంటే..యీ తార విప్లవోద్యపు మొదటి తరం తార.ఈ తారకు రచయిత కల్పించిన పేరు శైల భూదేవి. శ్రీకాకుళోద్యమంలో ప్రభవించిన యీ తార విప్లవ యోధుడు పాణిగ్రాహి కళ్ల ముందు ఎదిగి ఆయన దళంలోనే సభ్యురాలై, ఆ దళం ఎన్ కౌంటర్ అయిపోయినపుడు బతికి పోయిన ఒకే ఒకతి. ఆ అమానుషానికి ప్రత్యక్ష సాక్షి. ఆమె కుటుంబ నేపథ్యాన్ని, ఉద్యమ నేపథ్యాన్ని, ఆమె చేసిన యుద్ధాన్ని చిత్రించిన యీ రచన ముగింపును మన ఊహకే వదిలేసాడు రచయిత.

_____________

అట్టాడ అప్పల్నాయుడి కథనం, కథల్లోనైనా, నవలల్లోనైనా అలవోకగా చదివిస్తుంది.కఠినమైన వాస్తవికతను కల్పనతో పుటం బెట్టుకొని కత్తి మీద సాములా రాస్తాడు అట్టాడ. అప్పల్నాయుడి కథల్లాగానే యీ నవల కూడా ఒక ఉత్తరాంధ్ర డాక్యుమెంట్. మనం వాస్తవ జీవితమే చదువుతున్నామా అనిపిస్తుంది. చరిత్రలోని సజీవ పాత్రలు నవలలో పాత్రలవడం దానికి కారణం. ఇంకొన్ని వాస్తవ సంఘటనలకు పాత్రల్ని కల్పించుకోవడమూ యీ నవల్లో జరిగింది. శ్రీకాకుళోద్యమంలో మహిళా కామ్రేడ్ల క్రియాశీలతను చారిత్రక ఆధారాలు నుంచి యితివృత్తంగా మలుచుకోవడం జరిగింది.

_____________

ఒక వైపు చరిత్రలాగా అనిపించే పూర్తిస్థాయి కల్పనను అల్లడంలో రచయిత చాలా జాగురూకత పాటించాడు. ఈ కథలో నిజ వ్యక్తులూ వున్నారు. వాళ్లకున్న చారిత్రక నిజ నామాలతోనే వున్నారు. ఇంకొందరు నిజ వ్యక్తులకు నకలు పాత్రలూ వున్నారు.నిజ వ్యక్తుల్ని కథకు ఎంతమేరకు వుపయోగించుకోవాలో, ఆధారాలతో సృష్టించుకున్న పాత్రల్ని ఎంత దూరం తీసుకెళ్లాలో రచయితకు యీ జాగరూకత వల్లే సాధ్యమై వుంటుంది. ఇటీవల కాలంలో వచ్చిన యీ నక్షత్ర బాట, బండి నారాయణ స్వామి రాసిన ‘శప్తభూమి’ నవలా యీ కోణంలో పరిశీలించాల్సిన నవలలుగా కన్పిస్తున్నాయి.

ఈ నవల కథాకాలం 1960-74 మధ్యది.1969 డిసెంబర్ లో మహేంద్రగిరి మీద జరిగిన ఎన్ కౌంటర్ లో పాణిగ్రాహి తన సహచరులతో పాటు అమరుడవడాన్ని ప్రత్యక్ష సాక్షిగా చెప్తూ యీ కథలోని కథానాయకురాలు పదహారేళ్ల వయసులో ఆ ఎన్ కౌంటర్ నుంచి బయటపడి తిరిగి ఉద్యమాన్ని చేరుతుంది. ఆ తర్వాత యింకో ఆరేళ్ల పాటు తనదైన యుద్ధం చేస్తూ పోలీసులకు దొరికిపోతుంది.పోలీసు హింస పంటిబిగువు మీద భరిస్తూ, యీ కథను గుర్తు చేసుకుంటుంది.పదహారేళ్లకే సాయుధమయ్యింది గానీ వాళ్ల కుటుంబానికున్న ఉద్యమ చరిత్ర వల్ల పాణిగ్రాహితో ఆమె తండ్రికున్న అనుబంధం వల్లా ఏడేమిదేళ్ల నుండే ఆమె జీవితం నవలలోకి వచ్చింది. బాల్యం నుంచి దళంలోకి వెళ్లేంత దాకా ఆమె కథనూ, వాళ్ల కుటుంబ కథనూ, వాళ్ల ఊరి కథనూ, సోంపేట, బోడిపాడు, మందసా చుట్టుపక్కల ప్రాంతాల కథనూ వుద్విగ్నభరితంగా, ప్రతిభతో అల్లాడు రచయిత.

వెంపటాపు సత్యం, పాణిగ్రాహి, చాగంటి భాస్కర్, పంచాది నిర్మల లాంటి చారిత్రక వ్యక్తులు, వాళ్ల అనుచరులుగా కొందరు కాల్పనిక వ్యక్తులూ వాళ్లను చుట్టుముట్టిన శ్రీకాకుళ ప్రాంతపు జనజీవితాన్ని 1960-74 మధ్య జరిగిన సంఘటనల ఆధారంగా నవల చేసాడు రచయిత.

నక్షత్ర బాటలో నడుస్తున్న ఓ నక్షత్రం ఆమె. అదొక వెలిగే నక్షత్ర బాట. వెలిగే నక్షత్రం రాలిపోతే మరో నక్షత్రం వెలగడం ప్రారంభిస్తుంది. ఒకరు రాలిపోయినా ప్రయాణం ఆపని విప్లవోద్యమ బాటకు ప్రతీకగా యీ పేరు పెట్టాడు. నక్షత్రాలై వెలిగిన అనేక మంది వీర మహిళలకు ప్రతీకగా భూదేవి పాత్రను మలుచుకున్నాడు రచయిత. అప్పటి గ్రామాల్లో వుండే పరిస్థితులు (భూస్వామ్య వ్యవస్థ వ్యవహరించే దుర్మార్గం, దోపిడీ, పీడన) కు వ్యతిరేకంగా చైతన్యం ప్రోదిచేసే శక్తులు వుంటే వారి వెంట (తాము ఎదుర్కొంటున్న దోపిడీ పీడనలకు బదులు చెప్పేందుకు ప్రతిఘటనను నిర్మించేందుకు) నడవడానికి సామాన్యులు చాలా మంది తయారవుతారు.

అట్లా శ్రీకాకుళోద్యమం వెంట నడిచిన మొదటి తరం వీరులలో మహిళలు కూడా వున్నారు. అనేక కారణాల వల్ల విప్లవోద్యమంలో మహిళల కథ పెద్దగా సాహిత్యంలోకి రాలేదు. అసలు మహిళలు ఎలా వుద్యమంలోకి వచ్చారో, యే కారణాలు అందుకు పురికొల్పాయో చూడడానికీ, దాన్ని సాహిత్యంగా మలచడానికి చాలా శ్రమ పడాలి. ఆ ప్రయత్నమే యీ నవల. కొన్ని బహుజన కుటుంబాల కథ. తండ్రి విప్లవోద్యమంలో వుండడం వల్ల భూదేవి మూడు నాలుగు తరగతులు చదివే వయసు నుంచే ఆమెలో వస్తున్న చైతన్యాన్ని చిత్రిస్తూ ఒక నమ్మదగిన భూమికను నిర్మాణం చేసుకున్నాడు రచయిత.

విప్లవోద్యమాన్ని చిత్రించే నవలల్లో లాగానే యీ నవలలో కూడా గ్రామాల్లో వుండే ఫ్యూడల్ దౌష్ట్యమే ఆ గ్రామంలో మిలిటెన్సీ పుట్టడానికి కారణం.గ్రామాల్లో మిలిటెన్సీగా తయారైన వారి స్వీయ మానసిక ధోరణి ఆ ప్రాంతపు ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. ఉద్యమ ప్రయాణాన్ని కూడా నిర్ణయిస్తుంది. దాని వల్ల తలెత్తే పరిణామాలనూ ఎదుర్కోవలసి వుంటుంది.

ఈ నవలలో ఆ గ్రామంలోని ఉద్యమ భాగస్వాములు (మిలిటెంట్స్) ఒక నిర్ణయంతో వర్గశత్రు నిర్మూలన చేస్తారు. దాంతో నిర్బంధం పెరుగుతుంది. వర్గశత్రు నిర్మూలనకు మొదట ఎంచుకోవల్సింది ఎవరిని అనేది కూడా యీ నవలలో చర్చకు వచ్చింది. ఈ నవలలోని గ్రామంలో చందన నాయుడు భూస్వామి. ప్రజలు యితడి చేతిలో ఎక్కువ బాధలు పడుతుంటారు. అయితే గ్రామంలో అందరు అగ్రకులాలు వారికి వాళ్ల పీడనకీ నాయకుడు ఆ గ్రామ మునసబు గోవర్ధన నాయుడు. ఆధిపత్య శక్తులకు కేంద్రం యితనే. ఇతడ్ని వదిలేసి గ్రామ మిలిటెంట్లు చందన నాయుడ్ని చంపుతారు. కథా గమనంలో ఒక పాత్ర ‘చందన నాయుడ్ని చంపారు మీరు, చంపాల్సింది గోవర్ధన నాయుడ్ని కదా’ (పార్టీ స్ట్రాటజిక్ గా తప్పు చేసిందనే అర్థంలో) అంటాడు. ఈ నవలలో యీ విషయాన్ని సుతిమెత్తగా రచయిత అడగడంతో పాటు, దళ చర్యల వల్ల రాజ్య నిర్బంధం పెరుగుతుంది. దాని బదులు దళ చర్యలు ప్రజల్ని కూడగడుతూ పార్టీని విస్తరణ మీద దృష్టి పెట్టాలి అనే కోణంలో రాస్తాడు. భూదేవి తన సహచరుడు పోలీసుల చేతిలో హత్యకు గురైనా, దాని మీద ప్రతీకారం తీసుకోవడం కన్నా కొత్త ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రయత్నిస్తుంది. ఇదే రచయితకున్న అభిప్రాయం.ఇక్కడే మిగతా విప్లవోద్యమ సమర్థకులు విభేదించవచ్చు. చర్చ చేయవచ్చు.

ఈ నవల 1974కు ముందు కాలానిదే అయినప్పటికీ, రచయిత ఆ కాలానికి ముందుటి సమాజ పోకడలను కథలోకి తీసుకొని రావడంతో పాటు, ఆ కాలానికి ఆ సమాజం బయట ప్రాంతాల్లో వున్న ఉద్యమ పోకడలను కూడా పరిగణిస్తూ నవలను నడిపాడు. చాలా సందర్భాల్లో భారత దేశానికి సిద్ధించిన స్వాతంత్ర్యం అగ్ర కులాలకేననీ అణగారిన కింది కులాలకు కాదనీ చెప్తూ ఆ ప్రాంతంలోని మోతుబరులు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నందుకు పొందిన ఫలితాలేమిటో, వాళ్ల అనుచరులై వాస్తవంలో యిబ్బందులు పడ్డ కింది కులాల వారు పోగొట్టుకున్నదేమిటో వివరిస్తుంటాడు.

అప్పల్నాయుడి నవలల్లో యీ స్వాతంత్ర్యోద్యమ, తదనంతర పరిణామాల వ్యాఖ్యానం ప్రస్పుటంగా కనిపిస్తుంది. ఇంకో వైపు, భారత విప్లవోద్యమం కూడా అప్పుడప్పుడు పుట్టిందే, అది విస్తరణ వైపు దృష్టి పెట్టకుండా దళ చర్యల వల్ల హింసా నిర్బంధానికి గురైందని కూడా చెప్తాడు. భూదేవి పోలీసులను తప్పించుకునే ఎత్తుగడలో రైల్లో మద్రాసు వెళ్తుంది. బెంగుళూరు వెళ్తుంది.మద్రాసు చుట్టు పక్కల గ్రామాలలో తిరుగుతుంది. అక్కడ యే ఉద్యమ ప్రభావం లేకపోవడాన్ని గమనిస్తుంది. తిరిగి దళంలోకి చేరిన తర్వాత ప్రతిహింసా చర్యలు తీసుకోవడానికి మిగిలిన సభ్యులు సంసిద్ధతతో వున్నా, ఆ మార్గం వద్దని పార్టీ విస్తరణకు మొగ్గు చూపుతుంది.

______________

శ్రీకాకుళోద్యమం తెలుగు నేల మీద మొదటి విప్లవోద్యమం. అది చాలా తక్కువ కాలంలోనే ముగిసిపోయింది. అలా ముగిసిపోవడానికి పార్టీ విస్తరణ మీద దృష్టి పెట్టకుండా రాజ్య నిర్బంధ వలలో పడిందనీ, అలా కాకుండా వుండాల్సిందనే విషయం ప్రతిపాదించడానికి రచయిత యీ భూదేవి వుదంతాన్ని వుపయోగించుకున్నాడేమో అనిపిస్తుంది.

_______________

నవల ముగింపును కూడా అప్పల నాయుడు ఓపెన్ ఎండెడ్ గా ముగించాడు. ఆమె పోలీసులకు దొరికాక వాళ్లు అడిగే యే ప్రశ్నకూ సమాధానమివ్వదు. పేరడిగితే నక్సలైట్ అని చెప్పడం. ఊరడిగితే భాతద్దేశమనడం. వాళ్లు కొడితే భరించడం. మహేంద్రగిరికి తీసుకెళ్ళి ఎన్ కౌంటర్ చేసేయండి, అనడం. ఆమె స్పృహలో వున్నప్పుడు ‘కత్తులు దూసుకుపోయినా నెత్తుటేరులు పారినా..ఎత్తిన జెండా దించకోయ్, మన అరుణ పతాకకు జై’ అని పాడుకోవడం. ఆమె పిడికిలి బిగించిన దృశ్యంలోనే నవలను నిలిపేసాడు రచయిత. ఆ తర్వాత ఆమె బతికి, తెలుగునేలపై నడిచిన అనేక ఉద్యమాలలో పాల్గొనే వుండవచ్చు అనే సూచన ఆ విప్లవ గీతం ద్వారా మనకు వదిలాడేమో మరి.

-జి.వెంకటకృష్ణ

89850 34894

What do you feel about this post?

0%
like

Like

0%
love

Love

0%
happy

Happy

0%
haha

Haha

0%
sad

Sad

0%
angry

Angry