“ఆమె గబగబా అడుగులు వేస్తూ వంటగదిలోకి వెళ్ళింది. అగ్గిపెట్టె కుడి అరచేతిలోకి కనపడకుండా గట్టిగా గుప్పిట మూసివేసి ముందు గది తలుపు తెరచుకుని, ఇంటి వెనుక ఖాళీ స్థలంలోకి వెళ్ళింది. చీకటి వంక కళ్ళు విప్పార్చుకుని తేరిపార చూసింది. తనకంటూ ఒక మనిషైనా లేకపోవడం అనే విషాదపూరిత ఆలోచన ఆమె హృదయంలో కదలాడింది. ఒక్కసారిగా కిరోసిన్ తన మీదకు గుమ్మరించుకుంది. ఆమె తనకై తాను నియంత్రించ లేని ఒక బలమైన శక్తి గుప్పిట్లో వుంది. చుట్టూ చూసింది. ఏ చిన్న అలికిడీ ఆమె చెవిని సోకలేదు. ఆ క్షణం బంధాలు, బాంధవ్యాలు, జ్ఞాపకాలు, స్పర్శ ఏవీ తనని ఇక బాధించబోవని తలచింది ఆమె. ఒక జాగృదావస్థ నుండి మైకంలోకి వెళ్ళిపోయింది ఆమె” ఆ తరువాత ఏం జరిగింది? తెలుసుకోవాలి అంటే ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ బుకర్స్ ప్రైజ్ అందుకున్న భాను ముష్టాక్ ‘హార్ట్ లాంప్’ చదవాలి.
బుకర్ ప్రైజ్ అందుకున్న తొలి భారతీయ మహిళ అరుంధతీ రాయ్. ఆమె 1997లో తన ‘గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’ నవలకి అందుకున్నారు. కిరణ్ దేశాయ్ 2006లో తన ‘లాస్ ఆఫ్ ఇన్ హెరిటెన్స్’ కి, 2022లో గీతాంజలిశ్రీ ‘టూంబ్ ఆఫ్ సాండ్’ కి బుకర్ ప్రైజ్ అందుకున్నారు. అరుంధతీరాయ్, కిరణ్ దేశాయ్ ఆంగ్లంలో రచన చేస్తే, గీతాంజలిశ్రీ హిందీలోనూ, భానూ ముష్టాక్ కన్నడంలోనూ రచనలు చేసారు. గీతాంజలీశ్రీ ది నవల. భానుది చిన్న కథల సంపుటి.
‘హార్ట్ లాంప్’ మొత్తం 12 కథల సంపుటి. 1990 నుండి 2023 వరకు ఆమె రాసిన అనేక కథలలో నుండి పన్నెండు కథలను ఎంపిక చేసుకుని దీపాబస్తి ఆంగ్లంలోకి అనువాదం చేశారు. భాను ముష్టాక్ పై కన్నడ నేల మీద 1970-1980 మధ్య ఉధృతంగా వీచిన బందయి సాహిత్య ఉద్యమ ప్రభావం బలంగా వుంది. స్వయంగా న్యాయవాది అయిన భాను ముష్టాక్ తన చుట్టూ వున్న ప్రపంచంలోని ముస్లిం స్త్రీలు పడుతున్న కడగండ్లను ప్రతిభావంతంగా చిత్రించింది. ఇవి కన్నడ నేల నుండి వచ్చాయి కనుక వీటిని సౌలభ్యం కోసం కన్నడ కథలు అంటున్నాము కానీ ఒక్కసారి ఈ పుస్తకంలోకి, ఆ ముస్లిం జీవితాల్లోకి వెళ్లి చూస్తే ఇవి స్థలాతీతం అని అనిపిస్తుంది. ఈ కథలు చదువుతున్నప్పుడు మన తెలుగులో గీతాంజలి రాసిన “పహేచాన్’ స్కైబాబా రాసిన “అధూరె” కథలు గుర్తుకు వచ్చాయి.
మొదటి కథ “Stone Slabs for Shaista Mahal” అప్పుడే జీవితంలోకి అడుగుపెట్టి ఇంకా పిల్లలు కలుగని కొత్త జంట ముజాహిద్-జీనత్, పెళ్ళై ఆరుగురు పిల్లలు ఉండీ మరొక బిడ్డను మోస్తున్న ఇఫ్తికార్-శయిస్తాల చుట్టూ తిరుగుతుంది. శయిస్తా పట్ల తనకు అంతులేని ప్రేమ అనీ, తన ప్రేమను నిరూపించుకోవడానికి తాజ్ మహల్ లాంటి శయిస్తా మహల్ కట్టడానికి అయినా సిద్దమే అని ఇఫ్తికార్ అంటూ ఉంటాడు. పెద్ద పిల్ల అసిఫా తండ్రి వద్దు అన్నాడని హైస్కూల్ తోనే చదువు ఆపేసి తమ్ముళ్లు, చెల్లెళ్ళ ఆలనా పాలనా చూసుకుంటూ ఉంటుంది. అసిఫా కేమో డిగ్రీ చదవాలి అని కోరిక. అసిఫా పడే కష్టం చూస్తూ శయిస్తా అసిఫా తన పెద్ద కూతురు కాదు తనకు తల్లి అంటుంది. ఏడో బిడ్దను కన్నాక శయిస్తా అనారోగ్య కారణాల చేత చనిపోతే నలభయ్యవ రోజు ఫాతెహా అయిన మర్నాడే పిల్లల కోసం అంటూ మరొక స్త్రీని ఇఫ్తికార్ పెళ్లి చేసుకుంటాడు. పడక గదిలో కొత్త భార్యతో ఇఫ్తికార్ సరసాలాడుతుంటే అసిఫా బయట నెలన్నర పసిగుడ్డును ఆడిస్తూ ఉంటుంది.
“ఈ కథను ప్రారంభించడమే భాను ముష్టాక్ భలే కుదుపుతో ప్రారంభించింది. జీనత్ తన భర్త ముజాహిద్ ను పాఠకుడికి ఏమని పరిచయం చేయాలి అనే విచికిత్సలో పడిపోతుంది. Mujahid is my yajaman అని పరిచయం చేయాలా? అలా పరిచయం చేస్తే అతడు యజమాని అయితే నేనేమవుతాను? అతడికి సేవకురాలినా? పశువులకు, కుక్కలకు కూడా యజమానులు వుంటారు. నేను అలా కాదు కదా! నేను చదువుకున్నాను, డిగ్రీ తీసుకున్నాను.అతడు నాకు యజమాని ఎలా అవుతాడు? పోనీ పతి అని పరిచయం చేయనా? అయినా ఈ పదం చాలా పాతది. పతి అంటే వెంటనే పతి దేవుడు అనాలి అంటే మనిషిని దేవుడితో సమానం చేయటం కదా! వద్దు”
ముస్లిం స్త్రీకి పైన అల్లాహ్, కింద భర్త మాత్రమే దేవుళ్ళు. ఇలా రాయడం వెనుక వున్న భానుముష్టాక్ దృక్పథం ఏమిటో మనకు చాలా తేలికగా అర్ధం అవుతుంది. ఈ భావన పైన కొరడాదెబ్బలు వేయడమే అది.
_______________
ప్రధాన కథ ‘హార్ట్ లాంప్’ (హృదయ దీపం) పెళ్లయి పిల్లలు ఉన్న మెహారూన్ అనే స్త్రీ కథ. మెహారూన్ భర్త ఇనాయత్ దృష్టిలో ఆమెకు పెద్ద విలువలేదు. పిల్లలు పుట్టాక ఆమె శరీరం ఆకర్షణ కోల్పోయింది అని మరొక స్త్రీతో సంబంధం పెట్టుకుంటాడు. ఇనాయత్ పెట్టే హింస భరించలేని మెహారూన్ పుట్టింటికి తిరిగి వస్తుంది. అన్నలు తనతో పాటు వచ్చి అతడికి కాస్త బుద్ధి చెపుతారేమో అని. కానీ వచ్చిన మరుక్షణమే పెళ్లైన స్త్రీకి పుట్టింట్లో స్థానమే లేదని అన్నలు, కారు మాట్లాడి ఆమెను మళ్ళీ భర్త దగ్గరికే తీసుకుని వెళతారు. పుట్టింట్లో ఆమె కనీసం పచ్చి గంగ కూడా ముట్టదు. పుట్టింటికీ, మెట్టినింటికి భారమైన తానూ బతకడం ఎందుకు అని కిరోసిన్ పోసుకుని చనిపోదామనుకుని అగ్గిపుల్ల వెలిగిస్తున్నప్పుడు కూతురు సల్మా చిన్న తమ్ముడిని ఎత్తుకుని వచ్చి ఆమె కాళ్ళను చుట్టేసుకుని “just because you have lost one person, you will throw all of us at that woman’s mercy? You are ready to die for Abba, but is it not possible for you to live for our sakes? How can you make us all orphans. Ammi we want you” అని అంటుంది. సల్మా చెప్పిన ఈ మాటలకంటే ఆమె స్పర్శ మెహారూన్ ని కదిలించింది అని రాస్తుంది భాను ముష్టాక్.
________________
సహజంగానే అత్తా కోడళ్ల మధ్య ఒక వైరం ఉంటుంది. అది Tom and Jerry లాగా ఉంటే ఫరవాలేదు ఎలాగోలా సర్దుకుని పోవచ్చు. కానీ అది శృతి మించి రాగాన పడితే, భార్య భర్తకు జన్మ ఇచ్చిన తల్లిని, స్వయానా తన అత్తను తనకు సవతిగా భావిస్తే, సర్దుకు పోవడం సాధ్యమేనా?
“A Decision of the Heart” లో యూసఫ్ కి అదే స్థితి ఎదురయింది. యూసఫ్ ని భర్త పోయిన తరువాత అల్లారుముద్దుగా పెంచుకుని పెద్ద చేస్తుంది మెహబూబ్ బీ. తరువాత అఖిలను ఇచ్చి పెళ్లి చేస్తుంది. అఖిలకి మెహబూబ్ బీ పొడ గిట్టదు. భర్త తనతో సమానంగా తల్లిని చూడటం సహించదు. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటే గొడవలు పడుతున్నారని యూసఫ్ ఇంటిని రెండుగా మార్చి తల్లిని ఒక పోర్షన్ లో, భార్యను ఒక పోర్షన్ లో ఉంచుతాడు. ఏది కొనుక్కుని వచ్చినా రెండు కొనుక్కుని వస్తాడు. అయినా ఇద్దరి మధ్యా స్పర్ధ ఆగదు. మెహబూబ్ బీ మౌనంగా వున్నా అఖిల ఊరుకోదు. గిల్లి గిచ్చి పంచాయితీ పెట్టుకుంటుంది. ఈ బాధ పడలేక యాభయ్ ఏళ్ళ వయసు ఉన్న తల్లికి మళ్ళీ పెళ్లి చేయాలనీ అనుకుంటాడు యూసఫ్. తల్లికి చెప్పకుండానే సంబంధాలు చూసి నిఖా పక్కా చేస్తాడు. రేపు పెళ్లి అనగా ఈ రోజు రెండు మేకలను తెచ్చి ఇంటి ముందు కట్టేస్తాడు. అప్పుడు యూసఫ్ తల్లికి రెండో పెళ్లి చేస్తున్నాడని గ్రహించిన అఖిల- పెద్ద మనుషులను పిలిచి పంచాయితీ పెడుతుంది. పదిమంది ముందు కొడుకు పరువు పోవడం ఇష్టం లేక కొంత,ఈ సమస్యకు అదే పరిష్కారం అని కొంత భావించి మెహబూబ్ బీ పెళ్ళికి ఒప్పుకుంటుంది.
ఏడుగురు పిల్లల్ని కన్నా..ఇఫ్తికార్ భార్య పోయిన వెంటనే ఫాతెహా అయిన వెంటనే మరో పెళ్లి చేసుకుంటే వరుసగా ముగ్గురు ఆడపిల్లలని కన్నదని, తప్పంతా భార్య అష్రాఫ్ దే అని భర్త యాకుబ్ మరో పెళ్లి చేసుకుంటాడు Block Cobras లా. మసీదులో న్యాయం చేయమని ముతావలి ఖాదర్ కి ఎన్నో విన్నపాలు చేసుకున్న మీదట తప్పనిసరి పరిస్థితులలో ఖాదర్ మసీదులో పంచాయితీ పెట్టిస్తాడు. నిజానికి యాకూబ్ ముతావలి అండ చూసుకునే మరొక పెళ్లి చేసుకుంటాడు. చలిలో చంటి బిడ్డను తీసుకుని మసీద్ కి వచ్చిన అష్రాఫ్ ని యాకూబ్ కొట్టి, మెట్లమీద నుండి నెట్టేస్తాడు. పసిపాప తల పగిలి చనిపోతుంది. పాప శవ యాత్రలో ముతావలి ఖాదర్ ను భార్యతో సహా అందరూ నరకంలో అతడిని నల్ల నాగులు కాటేసి చంపాలని శాపనార్ధాలు పెడతారు.
ఈ సృష్టిని ఎంతో వైవిధ్యభరితంగా ఎన్నెన్నో అందాలతో, అద్భుతమైన సౌందర్యంతో సృష్టించిన ఆ దేవదేవుడు స్త్రీ ని సృష్టించి ఆమెకు అన్నీ కష్టాలు, కన్నీళ్లే కానుకగా ఇచ్చాడు. అజ్ఞానం, అణచివేత, అవిద్య అన్నీ స్త్రీ కి ఇచ్చిన సృష్టికర్త మళ్ళీ ప్రళయానంతరం ఈ సృష్టిని కొత్తగా సృష్టించాలి అనుకుంటే అనుభవం లేని కుమ్మరిలా కాక ఒక స్త్రీ లాగా సృష్టించాలి. అలా సృష్టించాలి అంటే ఆ దేవుడు స్త్రీలా ఒక్కసారైనా మారాలి అని చెప్పే కథ ‘Be A Woman Once Oh Lord’.ఈ సంపుటిలో చివరి కథ.
ఈ కథలన్నీ చదివాకా ముస్లిం స్త్రీల జీవితాల గురించి ఏమీ తెలియని వాళ్లకు ఒక వెలుగు కనిపిస్తుంది. ఒక రచయిత నిజాయితీగా నిబద్దతతో రాయగలిగితే ప్రతి సమూహంలోనూ లోపల ఎంత చీకటి ఉన్నదో, దాన్ని బయటకు తీసుకు రావడానికి ఇంకా ఎంత కష్టపడాలో అర్ధం అవుతుంది. నిజానికి ఇవన్నీ గొప్ప కథలు కావు. కానీ జీవితంలోని దుఃఖానికి మాటను ఇచ్చిన కథలు. దుఃఖం లోలోపల సుడులు తిరుగుతూ ఉండలు చుట్టుకునిపోయి, గొంతు పూడుకుపోతున్నప్పడు బలహీనంగా అయినా సరే కాస్త బలంగా వేసిన పెనుకేకలు ఈ కథలు. రోజువారీ జీవితంలో ఏ ప్రత్యేకతా ఉండదు. అలా ప్రత్యేకంగా లేకపోవడంలోనే జీవితం ఉంటుంది.
_______________
పండగో, పబ్బమో వస్తే అప్పు చేసైనా సరే మంచి భోజనం చేయాలి అనుకుంటారు మామూలు మనుషులు. పండుగ రోజు గడిపే జీవితం వాళ్ళ దైనందిన జీవితం కాదు. అది వాళ్ళు అనుభవించాలి అని తాపత్రయపడే జీవితం. రోజువారీ జీవితమే అనుభవిస్తున్న జీవితం. ఆ జీవితాన్ని పొదివి పట్టుకున్న కథలు ఈ హృదయ దీపం. Writing is like breathing అంటుంది భాను ముష్టాక్. శ్వాస పీల్చినంత సహజంగా ఆమె ఈ లోపలి దుఃఖానికి మాటను ఇచ్చింది.
________________
దీపాబస్తి అనువాదం సరళంగా ఉంది. చాలా ఉర్దూ పదాలను ఆంగ్లంలో కూడా అలాగే ఉంచడం బావుంది.
ఈ కథలన్నీ చదివాక నాకు అనిపించింది ఏమిటంటే, మన వేంపల్లె షరీఫ్, మన గీతాంజలి, మన ఖదీర్ బాబు,అఫ్సర్ రాసిన కథలు వీటికంటే ఒక మెట్టుపైనే వుంటాయని. కాకపోతే మనవి ఆంగ్లంలోకి వెళ్ళలేదు. భాను ముష్టాక్ కథలు వెళ్లాయి అంతే తేడా!
2025వ సంవత్సరానికి ప్రతిష్టాత్మక బుకర్ బహుమతి గెలుచుకున్న భానుముష్టాక్ కు శుభాకాంక్షలు.

-వంశీకృష్ణ
95734 27422
What do you feel about this post?
Like
Love
Happy
Haha
Sad











