స్థలకాలాల ఐక్యత ‘భూమిపుత్రుడు’

శ్రీ ఎమ్మార్వీ సత్యనారాయణమూర్తి విస్తృతమైన జీవితానుభవాలు కలిగినవారు. ప్రవృత్తి మార్గంలో నిరంతర అధ్యయనశీలి. సాహిత్య కృషీవలుడు. రచనా వ్యాసంగంలో వివిధ ప్రక్రియల్లో ముక్కారు పంటలు పండించినవారు. 60 పుస్తకాల రచయిత. సత్కారాలు, సన్మానాలూ, పురస్కారాలూ అన్నీ ప్రతిష్ఠాత్మక సంస్థల నుండి గౌరవంగా అందినవి. ఎమ్మార్వీ చేసిన సాహిత్య కృషిలో అపూర్వమైనవి-పశ్చిమ గోదావరి జిల్లా స్వాతంత్రోద్యమ చరిత్ర, శతాధికమైన కథలతో బృహత్ సంకలనం తెలుగు కథామందారాలు వంటివి తెలుగు సాహితీలోకం ఆదరణనీ, అభినందనల్నీ బహుళంగా అందుకొన్నవి. ఎమ్మార్వీ సాధించిన అనన్య సామాన్యమైన విజయాలు అవి. అలాగే, ‘మా పెనుగొండ కథలు’ ఆ ఊరి విలక్షణమైన, విశేషమైన సాంస్కృతిక ఔన్నత్యానికి దర్పణంగా వెలువడినవి. ఎమ్మార్వీ ఈనాటి ప్రచురణ ‘భూమిపుత్రుడు’ నవల. ‘సహరి’ అంతర్జాల మాసపత్రికలో ప్రచురితం.

‘భూమిపుత్రుడు’ నవల- ఈ మనుషులూ, ఈ సమాజమూ ఎలా వుంటే అందంగా, ఆనందంగా, విశ్వశ్రేయోదాయకంగా బాగుంటుందో ఆ దృశ్యాన్ని అమిత గాఢతతో అక్షరీకరించింది. ఇటీవలి కాలంలో వచ్చిన నవలల్లో ఇతివృత్తంలో ఇంత ‘పాజిటివ్’ దృక్పథం కలిగినవి బహుతక్కువ.

‘భూమిపుత్రుడు’ వస్తుపరంగా ఉత్తమ వ్యావసాయికమైన నవల. ఇతివృత్తపరంగా ఉన్నతమైన మానవ సంబంధాల పరిరక్షణను ప్రోదిచేస్తున్న నవల. స్థూలంగా కథని చెప్పుకోవాలంటే ఇది ఇలా వుంది. లక్ష్మీపతి -వసుధమ్మ దంపతులు. ఆయన స్కూల్ టీచరే అయినా, వ్యవసాయదారుడు, కష్టజీవి. భేషజాలకు పోడు. గ్రామంలో మంచి గౌరవాస్పదుడు.

లక్ష్మీపతికి ముగ్గురు మగపిల్లలు. సుబ్రహ్మణ్యం, చంద్రశేఖర్, శ్రీకాంత్, ఇద్దరు ఆడపిల్లలు. వెంకటలక్ష్మి, సీతాలక్ష్మి, పెద్దకొడుకు తర్వాత ఇద్దరు ఆడపిల్లలు. తర్వాత మళ్ళీ ఇద్దరు మొగపిల్లలు.

సుబ్రహ్మణ్యం, అమలాపురం కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. వెంకటలక్ష్మి పదవ తరగతి, సీతాలక్ష్మి తొమ్మిదో తరగతి చదువుతున్నారు. చంద్రశేఖర్ ఐదో తరగతి. శ్రీకాంత్ నాల్గవ తరగతి చదువుతున్నారు. మామిడిపల్లిలో హైస్కూల్ లేదు. ఆడపిల్లలు ఇద్దరూ ముక్తేశ్వరం హైస్కూల్లో చదువుతున్నారు. మామిడిపల్లికి- ముక్తేశ్వరం మూడు కిలోమీటర్ల దూరం.

సుబ్రహ్మణ్యం పీజి అయింది. లెక్చరర్ ఉద్యోగం వచ్చింది. దూరపు బంధువు కొండలరావుగారి కూతురు రమణితో పెళ్లి అయింది. చంద్రశేఖర్ డిగ్రీ అయింది. ఒకరోజు రాత్రి లక్ష్మీపతి హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయాడు. చంద్రశేఖర్ కుటుంబ బాధ్యతల్ని తాను తీసుకున్నాడు. వ్యవసాయంలోకి దిగాడు.

ఇక్కడి నుండి నవలంతా ఈ ప్రధానపాత్ర చంద్రశేఖర్ చుట్టూ తిరుగుతుంది. అతనికి అమృతవర్షిణి అనుకూలవతి అయిన భార్యగా వస్తుంది. గ్రామంలో ఏ సమస్య వచ్చినా చంద్రశేఖర్ సామరస్య పూర్వకంగా పరిష్కరించటం మొదలెట్టాడు. రైతు సహకార సంఘం అతని పూనికతో వచ్చింది. ఎరువుల సమస్య తీరింది. ఇతర వస్తు విక్రయాలు జరుగసాగాయి. ఊరందరికీ తలలో నాలుకగా మెలగుతూ చంద్రశేఖర్ వ్యావసాయికంగా ఆ ఊరికి పేరుతెస్తాడు. కుటుంబపరంగా పిల్లలు లేని అన్నావదినలకు తన తొలి సంతానం ఆడపిల్లని ఇచ్చి ఆనందింపజేస్తాడు.

ఇలా.. చాలా ఆహ్లాదకర సంఘటనలు కథాత్మకమైనాయి. చివరికి చంద్రశేఖర్ మరణం. అతని కొడుకు లక్ష్మీపతి తండ్రి బాధ్యతల నిర్వహణకి పూనుకోవటంతో నవల ముగుస్తుంది.

నవల ఇతివృత్త నిర్వహణలో ఎమ్మార్వీ రచనా నైపుణ్యం ప్రతి అధ్యాయంలో తొణికిసలాడింది. సంఘటనలన్నీ క్రమపద్ధతితో, సక్రమవికాసంతో ‘జరుగుతూ’ వుంటాయి.
_________________

నవలకు చదివించే గుణాన్ని సంతరించి పెట్టిన మొట్టమొదటి మెరుపు ఇది.రెండవది- ఎమ్మార్వీ శైలి. సహజసుందరమైన తెలుగు నుడీ, పలుకుబడీ జాల్వారి నవలని ఉన్నతీకరించాయి. ఇంతకు ఇంతగా – ప్రత్యేక ప్రశంసని పొందవలసిన అంశం- నవలలో ప్రతి పేజీలోనూ కనిపించే ‘స్థానీయత’. ఉభయగోదావరి జిల్లాల్లోని గ్రామాల్లో ఇతివృత్తానికి సంబంధం వున్న ఊళ్లన్నీ అవసరమైన మేరకు వర్ణించబడటం-ఎమ్మార్వీ గ్రామాభిమానానికి ప్రత్యేక ఉదాహరణ. అలాంటి విశేషమే- ఈ స్థలాల ప్రాధాన్యాన్ని ఇనుమడింప జేస్తున్న కాలస్పృహ. సంఘటనలన్నీ కాల పరిణామ హేలతో స్పష్టంగా సంభవిస్తాయి.
___________________

ఈ స్థలకాలాల ఐక్యత-ఈ నవల సాధించిన అతి ముఖ్యమైన విజయం. రచయిత సృజనశక్తికి తోడు శిల్ప నిర్వహణా నైపుణ్యం ‘భూమిపుత్రుడు’ నవలని మేటి రచనగా మనముందుకు తెచ్చింది. నవలా ప్రియులు తప్పక కొని, చదివి ఆనందించవలసిన రచన. ఎమ్మార్వీకి అభినందనలు.

 

 

-విహారి
98480 25600