సవాళ్లను ఎదుర్కొంటాం

ఆంధ్రప్రదేశ్

ఆర్‌పిసిసి సమావేశంలో డిజిపి హరీష్‌కుమార్‌ గుప్తా
ప్రస్తుతం పోలీసు యంత్రాంగం దక్షణ భారతదేశంలో ఎదుర్కొంటున్న సవాళ్ళను సంఘటితంగా ఎదుర్కొంటామని ఆంధ్రప్రదేశ్‌ డిజిపి హరీష్‌కుమార్‌ గుప్తా పేర్కొన్నారు. తిరుపతిలో శుక్రవారం ప్రాంతీయ పోలీసు సమన్వయ కమిటి (ఆర్‌పిసిసి) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దక్షిణ రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళ, కర్ణాటక,తెలంగాణలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలైన అండమాన్‌ నికోబార్‌, లక్షద్వీప్‌, పుదుచ్చేరి లకు సంబంధించిన పోలీసు అధికారులు పాల్గొన్నారు. వీరితో పాటు కీలక విభాగాలైన కేంద్ర ప్రభుత్వ సంస్థలైన బిఎస్‌ఎఫ్‌, సిఆర్‌పిఎఫ్‌, సిఐఎస్‌ఎఫ్‌, సిబిఐ, ఎన్‌ఐఎ, ఎన్‌సిబి, ఇడి, ఎఫ్‌ఆర్‌ఆర్‌ఒ, ఐబి, డిఆర్‌ఐలకు సంబంధించిన పోలీసు అధికారులు కూడా పాల్గొన్నారు.ఈ సమావేశానికి అధ్యత వహించిన హరీష్‌కుమార్‌ గుప్తా మాట్లాడుతూ..దక్షిణ భారతదేశంలో పోలీసులు ఎదుర్కొంటున్న సవాళ్లను అన్ని రాష్ట్రాల అధికారులతో కలిసి చర్యలు తీసుకుని ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. 2015న ప్రధాని అధ్యక్షతన అన్ని రాష్ట్రాల డిజిపిల సమావేశం ఢిల్లీలో జరిగిందని, ఆ సమావేశంలో ఆర్‌పిసిసి సమావేశాల ప్రాముఖ్యత గురించి చెప్పారన్నారు. ఈ మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేసి నేరాల విషయంలో ఆయా రాష్ట్రాలు సంయుక్తంగా పనిచేసి నిందితులను అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ నుంచి అదనపు డిజి అనీల్‌కుమార్‌, సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఎస్‌పి హర్షవర్దన్‌లు పాల్గొన్నారు.ఈ సమావేశంలో అధికారులు ఈ క్రింది నిర్ణయాలు తీసుకున్నారు.
– చట్ట అమలులో అధునాతన సాంకేతిక అనుసంధానం మరియు విజ్ఞాన సామర్థ్యాలు.
– సైబర్‌ మరియు ఆర్థిక మోసాలను ఎదుర్కోవడానికి ప్రత్యేక విధానం.
– మాదకద్రవ్యాలు, పారిపోయిన వ్యక్తులు మరియు స్మగ్లింగ్‌కు వ్యతిరేకంగా పోరాటాన్ని తీవ్రతరం చేయడం.
– కీలకమైన మౌలిక సదుపాయాలు మరియు తీరప్రాంత భద్రతను బలోపేతం చేయడం.
– శిక్షణ మరియు సంక్షేమ సంస్కరణల ద్వారా మానవ వనరుల అభివృద్ధి.