‘గురజాడ’ నేడూ అవసరమే…!

‘తెలుగులో నవ్యరీతులకు నూతన ప్రమాణాలకు ప్రయత్నించిన మొదటి కవిని నేనే, నా కావ్య కళా నవీనం. కావ్య ఇతివృత్తాలు భారతీయం. కవితలో నేను ఉత్తమ ప్రయోజనాలను ఉపలక్షించాను. జీవితాన్ని నూతన దృక్పధంతో దర్శించి కథా కవితా రూపంలో దాని తత్వాన్ని అన్వయించడానికి ప్రయత్నించాను’ అని తానే స్వయంగా ఆదిభట్ల నారాయణదాసు గారు రాసిన (1909) ఉత్తరంలో చెప్పుకున్నారు గురజాడ అప్పారావు. ‘భోగం పిల్లలో కూడా మానవత్వాన్ని చూడగలిగిన ‘రచయిత’ గురజాడ.

గురజాడ రచనలు నిత్యనూత్నాలు, వాటికి ‘అక్షరం’ శాశ్వతత్వం కల్పించాయి. అక్షరం వెనుక అన్యన్యమైన మానవతా విలువలు, రాజకీయ, సామాజిక, ఆర్ధిక సంస్కరణల సంస్కర్త హృదయం కనిపిస్తుంది. వర్తమాన సమాజం ‘వస్తువు’లకు ఇస్తున్న ప్రాధాన్యత వ్యక్తులకు ఇవ్వటం లేదు. ‘దేశమంటే మనుషులోయ్’ అనే వ్యాఖ్యానానికి విపరీతార్ధాలు ‘వ్యవస్థ’కు అలవాటయిపోయింది. ‘మంచితనం’ ‘మనిషితనం’ మానవత్వపు విలువలు ‘మానవతావాదం’ అనేవి నిఘంటువుల్లో శబ్దాలుగా మిగిలిపోతున్న వర్తమానంలో గురజాడ రచనలను పరిచయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. కవి, కాలం కన్నా ముందుంటాడు. గురజాడ అప్పారావు (క్రీ.శ 1862 – 1915) తన కాలం కంటే శతాబ్ధం ముందు కాలాన్ని ఉహించిన ‘ద్రష్ట’. ‘సాహిత్య కళకు’ మానవతను సంస్కరణాభిలాషతో అభ్యుదయ పంథాలో అక్షరబద్దం చేసాడు. ఆయన ప్రతీ రచనలో అద్భుతమైన మానవీయ విలువల చిత్రణ కనిపిస్తుంది. సంఘ సంస్కరణ అంటే ‘మనిషి’ని మార్చటం అనేది ఆయన రచనల్లోని అంతస్సూత్రంగా కనిపిస్తుంది. గురజాడ రచించిన ‘ముత్యాల సరాలు’, మొదటి మూడు చరణాలలో 7+7 మాత్రల గణాలలో (14 గణాలు) పంక్తులు, 4వ పాదంలో 9 మాత్రలుంటాయి. వర్ణ వ్యవస్థ అస్పృశ్యతకు వ్యతిరేకంగా వ్రాసిన గేయమది.

మూఢాచారాల ముసుగులో మానవత్వం మంట గలిపిన సంఘటనలు అనేకం నిత్యం చూస్తున్నవే. గుప్త నిధుల కోసం, కాముకత్వం కోసం ఇలా ఎన్నెన్నో ఉదాహరణలు మంచి, సత్యం, ధర్మం, నీతి వంటి వాటిని విస్మరిస్తున్నవే విస్మయ పరుస్తున్నవే. గురజాడ వాటి వెనుక రాసిన అర్ధాన్ని, భావాన్ని అర్ధం చేసుకోలేని వారు నేటికీ ఉన్నారనటంలో అతిశయోక్తి లేదు. ‘తోక చుక్క’ వెనుక అశాస్త్రీయతను కాదని శాస్త్రీయతను విశ్వసించమని చెబుతారు గురజాడ. పాత విషయాలను క్రొత్తగా నేర్చుకోవలసిన ఆవశ్యకతను నొక్కి చెబుతారు. అక్షరాలను ఆయుధాలుగా మలచిన తీరు అద్భుతం. ఈ కవితను చూడండి:

గుత్తునా ముత్యాల సరములు
కూర్చుకొని తేటైన మాటల,
కొత్త పాతల మేలు కలయిక
క్రొమ్మెరుంగులు నమ్మగా

పాత క్రొత్తల మేలు కలయిక సమాజంలో అనివార్యమని చెబుతారు. ‘మంచి గతమున కొంచమేనోయ్” అని పాత వరుసల నిరసనను కాదని, ‘మంచి గతమునా కలదనే’ క్రొత్త పల్లవులు అవసరమని చెబుతారు.
మానవత్వపు నీడను ఏవగించుకొనే ‘విద్య’ ప్రస్తుతం సమాజంలో ఉంది. ‘మనం’ దగ్గర ప్రారంభం కావలసిన వ్యక్తి ‘నాది నేను!. దగ్గరనే ప్రారంభ, ముగింపులను ఆపేస్తున్న వర్తమాన తరానికి కారణం ‘విద్య’, ప్రతీ అంశాన్ని తరచి, తరచి చూడవలసిన విశ్లేషణ చేసుకోవలసిన అవసరం ఉంది. మానవత్వం ‘మనిషి-మనిషిని’ దగ్గర జేర్చాలి, మతాలనన్నీ ఇదే సూత్రాన్ని వివరిస్తున్నాయి. అయినా ఎవరికి వారే, సాటి మనిషి పట్ల కనీసపు జాలి, దయలను విస్మరించటం శోచనీయం. వాటిని వదిలిపెట్టాలని చెబుతాడు గురజాడ.

యెల్లలోకము వోక్కయిల్లై
వర్ణ భేరములెల్ల కలై

మతాల సారం కన్నా మానవత్వపు దూరం నిరసించదగినది, కాని మనిషి స్వార్థంతో ‘మానవీయ విలువలు’ ను వదిలేస్తున్న వ్యవస్థ వర్తమానంలో ఉంది కాని.. జ్ఞానంతో కూడిన చదువు నేర్పితే వర్తమాన భావితరాల వారు మతాలను నిరసించకుండానే మనుషులుగా ఎదిగే అవకాశాలున్నాయి.
మతములన్నియు మాసిపోవును
జ్ఞానమొక్కటే నిలిచి వెలుగును

వర్తమానంలో తల్లిదండ్రుల పట్ల అమానవీయ వైఖరి ప్రదర్శిస్తున్న ‘వ్యక్తుల సమూహం’ను నిత్యం చూస్తూనే ఉంటున్నాం. ఆస్తులకోసం తల్లిదండ్రులను చంపేసినవారు, వారు వృద్ధాప్యంలో ఉంటే సేవ చేయలేని పిల్లలు( స్త్రీ, పురుషులు) వారిని శ్మశానంలో వదిలి పెడుతున్న దైన్య చిత్రాలు మీడియాలో చూస్తున్నాం. మతాలు,మత గ్రంధాలు, మత పెద్దలు, వంటి వారు కూడా ఎంతో మంది ఇదే త్రోవన పోవటం విచారించవలసిన విషయం. దీనిని నిరసించిన గురజాడ తన ‘ముత్యాల సరములు’ లో :

‘కుట్టుకున్నది యేమికానీ
పెట్టి పొయ్యక పోతే, పోనీ,
కని పెంచిన తల్లిదండ్రుల
నైన కనవలదో’
అని నినదిస్తారు.

తల్లిదండ్రులు లేనిదే పిల్లలు లేరనే ఇంగితం మరుస్తున్న యువత పెళ్ళికాగానే తల్లిదండ్రుల బాధ్యతను వదిలించుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు విన్నప్పుడు,చూసినప్పుడు సంఘసంస్కర్తలు నేటికి అవసరమే అనిపిస్తుంది. వ్యవస్థ మారాలంటే వ్యక్తుల్లో మార్పు అనివార్యం, మాటలతో మానవీయ విలువలపై దాడి చేస్తున్న వ్యక్తులు సమూహాలు కూడా కొన్ని ఉన్నాయి. వారి లక్ష్యం ‘మానవతావాదం’ కాదు ‘మనీతత్వం’ సంపదలు వలన సంసారాలు బంధాలు సఖ్యంగా సాగుతాయని భ్రమించే నైజం.

మనుషుల మధ్య సఖ్యతకు ‘ఐక్యత’ అవసరం, సుఖం, శాంతి, ధర్మం, ప్రేమ, నీతి వంటివి ఉపన్యాసాలు వలన రాదు. సృతహాగా నేర్చుకోవాలి, అందరిని కలుపుకు పోవటం వేరు. అందరితో ‘కలిసిపోవటం’ వేరు. కౌగిలింతలు వలన మనసుల్లోని ‘కఠినత్వం’ కరిగిపోరు. అంటరానితనం రూపుమాపమని కొన్ని శతాబ్దాలుగా ‘సామాజిక సమరం’ జరుగుతున్నా, తాత్కాలికమైన ‘మార్పు’ వచ్చినా ‘పరువు హత్యలు’ ఆగిపోయాయా…’అంటరానితనం’ అనేది మనుషులకే కాదు వారి ‘మనసులకు’ కూడా అంటుకుపోయింది. దానిని వదించుకోవాలని ‘కన్యక’, ‘పూర్ణమ్మ’, ‘కాసులు’ వంటి రచనల్లో గురజాడ వారు తన మానవతావాదాన్ని విశ్వరూపాన్ని ప్రదర్శించారు. కవి, రచయిత, కళాకారుడు మనిషి ఆత్మను తీర్చిదిద్దే ‘ఇంజనీరు’ అటువంటి గొప్ప ‘మానవతావాది’ గురజాడ.

నేటికీ గురజాడ మార్గదర్శనీయమే, ఇందుకు శ్రీశ్రీ నాలుగు అంశాలు చెబుతారు. ‘వ్యక్తిగతాభిరుచులకు అతీతమయిన విశేష ప్రరిణామాలను’ విశ్లేషించాడు. ఆ పరిణామాన్ని వేగంగా మాత్రమేకాక సరైన దిశగా సాగించటం. భవిష్యత్ మీద అపారమైన విశ్వాసం. సార్వజనీనత. ఒక్కమాటలో చెప్పాలంటే గురజాడ తనకాలం విధించిన పరిమితుల లోపలి ప్రజాస్వామికవాది. ‘దేశభక్తి’ అవగాహనకు ఈ నాలుగు అంశాలు వర్తమానానికి వర్తిస్తాయి. ‘మతం వేరైతేను యేమోయి’ అని ప్రశ్నిస్తారాయన. ‘మనసులొకటై మనుషులుంటే జాతియన్నది లేచి పెరిగి లోకమున రాణించునోయి’ అని దిశానిర్దేశం చేసాడు.

గురజాడ తిరుగుబాటు తత్వాన్ని..అస్తిత్వ చాటింపుకు వినియోగించి, మేలుకొలుపు చేసిన కవి. ‘పుష్కలమైన, అనంతమైన సంఘటనలతో నిండి ఉన్న ఎంతో గాంభీర్యమూ, వైవిధ్యము గల నేటి జీవితాన్ని వీక్షించకుండా ప్రాచీన కాల్పనిక కథల నుంచి రచయితలు ఇతివృత్తాలను ఎందుకు స్వీకరిస్తున్నారో అర్థంగాక నాకు ఆశ్చర్యం వేసింది. ‘నేను జీవితం నుంచి సమకాలిక ఇతివృత్తాన్ని స్వీకరించాను ‘ అంటారు గురజాడ. ఇది వర్తమాన సాహితీకారులకు గురజాడగా నిలిచిన వాక్యమయింది. లేకుంటే ఇంత వైవిధ్యమైన సాహితీ సృజన వెలువడి ఉండేది కాదు.

వర్తమాన తరంలో ప్రాథమిక స్థాయి నుంచి స్నాతకోత్తర స్థాయి చదువుల వరకు గురజాడ రచలను ‘సిలబస్’లో భాగం చేస్తే… గొప్ప సంఘ సంస్కణకు పునాదులు పడినట్టే… ఆ రోజు కోసం వేచి చూడవలసిందే.

(సెప్టెంబర్ 21,గురజాడ 163వ జయంతి)

 

 

-భమిడిపాటి గౌరీశంకర్
94928 58395